సాక్షి, హైదరాబాద్: గత ఏడేళ్లుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఏడేళ్ల వైఫల్యాలపై ‘చార్జిషీట్’విడుదల చేయాలని టీపీసీసీ ముఖ్య నేతల సమావేశం నిర్ణయించింది. ఈనెల 17న గజ్వేల్‌లో నిర్వహించనున్న దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభలో ఈ చార్జిషీట్‌ను ప్రజల ముందుంచాలని సమావేశంలో పాల్గొన్న నేతలు తీర్మానించారు.
ప్రతి శనివారం జరిగే కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం ఈసారి జూమ్ యాప్ ద్వారా జరిగింది. టీపీసీసీ చీఫ్ ఎ.రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్, ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాసకృష్ణన్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు మహేశ్‌కుమార్‌గౌడ్, గీతారెడ్డి, అంజన్‌కుమార్‌యాదవ్‌లు హాజరయ్యారు.
గజ్వేల్ సభ ఎజెండాగా సాగిన ఈ సమావేశంలో సభ నిర్వహించాల్సిన తీరుపైనే ప్రధానంగా చర్చించినట్లు పార్టీ వర్గాల సమాచారం. ఈ సభకు అతిథు లను ఆహ్వానించే బాధ్యతలను సీఎల్పీ నేత భట్టి, మధుయాష్కీలకు అప్పగించినట్టు తెలుస్తోంది. రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ గజ్వేల్ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, సమష్టి కృషి ద్వారా సభను విజయవంతం చేయాలని కోరారు. ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాసకృష్ణన్ ఈ సమావేశంలో హుజూరాబాద్ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపిక అంశాన్ని ప్రస్తావించగా, గజ్వేల్ సభ ముగిసిన వెంటనే హుజూరాబాద్‌పై దృష్టి పెడదామని నిర్ణయించినట్టు సమాచారం.
జగ్గారెడ్డి గైర్హాజరు
కాగా, టీపీసీసీ నాయకత్వం తీరు పట్ల అసంతృప్తిగా ఉన్న సంగారెడ్డి ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి జూమ్ సమావేశానికి హాజరు కాలేదని తెలిసింది. సాధారణ ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉన్నా, హుజూరాబాద్ ఎన్నిక కీలకమైందని, ఇప్పటివరకు అక్కడ అభ్యర్థిని ఎంపిక చేయకపోవడం స రైంది కాదనే భావనతో ఆయన ఉన్నట్టు స మాచారం.
దీంతో పాటు ప్రతి శనివారం జరి గే సమావేశానికి ప్రస్తుత కార్యవర్గ సభ్యు లతో పాటు పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు, ఐదుగురు ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతల ను కూడా ఆహ్వానించాలని ఆయన గతంలో రేవంత్‌కు లేఖ రాశారు. కానీ, ఆ లేఖకు స్పందన లేకపోవడం కూడా జగ్గారెడ్డి అసంతృప్తికి మరో కారణమని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment