ఓటరు గుర్తింపు కార్డు తప్పనిసరి కాదు
ప్రత్యామ్నాయ ఫొటో గుర్తింపు కార్డులుంటే ఓటేయవచ్చు
ఎపిక్ కార్డులో స్వల్ప తేడాలున్నా పర్వాలేదు
ఎపిక్‌తో గుర్తింపు ధ్రువీకరణ కాకుంటే.. ప్రత్యామ్నాయ గుర్తింపు తప్పనిసరి
ఓటరు ఇన్‌ఫర్మేషన్ స్లిప్పును గుర్తింపుగా పరిగణించరు
స్పష్టం చేస్తున్న ఈసీ మార్గదర్శకాలు
సాక్షి, హైదరాబాద్: ఓటరు గుర్తింపు కార్డు (ఎపిక్) లోని వివరాల్లో స్వల్ప తేడాలున్నా, ఓటరు గుర్తింపు నిర్థారణైతే చాలని, ఓటు హక్కు కల్పించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. వేరే నియోజకవర్గానికి సంబంధించిన ఎలక్టరోల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్(ఈఆర్వో) జారీ చేసిన ఓటరు గుర్తింపు కార్డును గుర్తింపునకు ఆధారంగా చూపి, మరో నియోజకవర్గం పరిధిలోని పోలింగ్ కేంద్రంలో ఉన్న ఓటు హక్కును వినియోగించుకోవచ్చని స్పష్టం చేసింది. అయితే, ఆ పోలింగ్ కేంద్రం ఓటర్ల జాబితాలో పేరు ఉంటేనే ఈ సదుపాయం కల్పిస్తామని పేర్కొంది. ఓటరు గుర్తింపు నిర్థారణకు ఇటీవల కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.
ఎపిక్‌లో లోపాలుంటే వేరే గుర్తింపు తప్పనిసరి..
ఓటరు గుర్తింపు కార్డులో ఫొటోలు తారుమారు కావడం, ఇతర లోపాలతో ఓటరు గుర్తింపు ధ్రువీకరణ సాధ్యం కానప్పుడు, కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన జాబితాలోని ప్రత్యామ్నాయ ఫొటో గుర్తింపు పత్రాల్లో(కింద జాబితాలో చూడవచ్చు) ఏదైనా ఒకదానిని ఆధారంగా చూపాల్సి ఉంటుందని ఈసీ స్పష్టం చేసింది.
ప్రవాస భారత ఓటర్లు తమ పాస్‌పోర్టును తప్పనిసరిగా చూపాల్సి ఉంటుందని తెలిపింది. అయితే పోలింగ్ ఇన్‌ఫర్మేషన్ స్లిప్పులు.. ఓటరు గుర్తింపుగా పరిగణించలేమని స్పష్టం చేసింది. ఓటరు గుర్తింపు కార్డు లేనిపక్షంలో.. ఉన్నా గుర్తింపు ధ్రువీకరణ సాధ్యం కానిపక్షంలో పోలింగ్ రోజు ఈ కింది జాబితాలోని ప్రత్యామ్నాయ ఫొటో ధ్రువీకరణ పత్రాలను తీసుకువస్తే ఓటు హక్కు కల్పించాలని ఆదేశించింది.
» ఆధార్ కార్డు
» ఉపాధి హామీ జాబ్‌కార్డు, బ్యాంకు/తపాల కార్యాలయం జారీ చేసిన ఫోటోతో కూడిన పాస్‌బుక్,
» కేంద్ర కార్మికశాఖ పథకం కింద జారీ చేసిన ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్‌కార్డు
» రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సెస్ కమిషనర్, ఇండియా(ఆర్జీఐ), నేషనల్ పాపులేషన్ రిజిస్ట్రర్ (ఎన్పీఆర్) కింద జారీ చేసిన స్మార్ట్ కార్డు
» భారతీయ పాస్‌పోర్టు
» ఫొటో గల పెన్షన్ పత్రాలు
» కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలు/పీఎస్‌యూలు/ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు జారీ చేసిన ఉద్యోగ గుర్తింపు కార్డులు
»ఎంపీలు/ఎమ్మెల్యేలు/ఎమ్మెల్సీలకు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డులు
» కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖ జారీ చేసిన యూనిక్ డిజెబిలిటీ గుర్తింపు కార్డు(యూడీఐడీ)
చాలెంజ్ ఓటు అంటే?
ఓటేసేందుకు వచ్చిన వ్యక్తి గుర్తింపును అభ్యర్థుల పోలింగ్ ఏజెంట్లు రూ.2 చెల్లించి సవాలు చేయవచ్చు. ఓటరు గుర్తింపును నిర్థారించడానికి ప్రిసైడింగ్ అధికారి విచారణ జరుపుతారు. ఓటరు గుర్తింపు నిర్థారణ జరిగితే ఓటేసేందుకు అవకాశం కల్పిస్తారు. దొంగ ఓటరు అని నిర్థారణ అయితే సదురు వ్యక్తిని ప్రిసైడింగ్ అధికారి పోలీసులకు అప్పగించి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది.
ఓటర్ హెల్ప్ లైన్ యాప్‌తో ఎన్నో సదుపాయాలు..
ఓటర్స్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా ఓటర్లకు ఎన్నో సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. ఓటర్ల నమోదుకు దరఖాస్తు చేసుకోవడం, ఓటర్ల జాబితాలో పేరు వెతకడం, పోలింగ్ కేంద్రం వివరాలు తెలుసుకోవడం, బీఎల్‌ఓ/ఈఆర్వోతో అనుసంధానం కావడం, ఈ– ఎపిక్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవడం వంటి సేవలను పొందవచ్చు.
పోలింగ్ సమయం ముగిసినా లైన్లో ఉంటే ఓటేయవచ్చు
రాష్ట్రంలోని 13 వామపక్ష ప్రభావిత ప్రాంతాల్లోని నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మిగిలిన 106 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు.
పోలింగ్ సమయం ముగిసిన తర్వాత కూడా పోలింగ్ కేంద్రం ముందు లైనులో నిలబడిన వారికి ఓటేసేందుకు అవకాశం కల్పించనున్నారు. పోలింగ్ సమయం ముగిసిన వెంటనే లైనులో ఉన్న వారికి పోలింగ్ అధికారులు టోకెన్లు ఇస్తారు.
పోలింగ్ కేంద్రంలో సెల్‌ఫోన్లపై నిషేధం!
పోలింగ్ కేంద్రంలో మొబైల్ ఫోన్లు, కార్డ్ లెస్ ఫోన్లు, వైర్ లెస్ సెట్లతో ప్రవేశంపై నిషేధం ఉంది. పోలింగ్ కేంద్రానికి చుట్టూ 100 మీటర్ల పరిసరాల పరిధిలోకి ఇలాంటి పరికరాలు తీసుకెళ్లకూడదు. పోలింగ్ బూత్‌లో ఓటు వేస్తూ సెల్ఫీలు తీసుకోవడానికి సైతం వీలు లేదు. కేవలం ఎన్నికల పరిశీలకులు, సూక్ష్మ పరిశీలకులు, ప్రిసైడింగ్ అధికారులు, భద్రత అధికారులు మాత్రమే ఎన్నికల కేంద్రంలో మొబైల్ ఫోన్స్ తీసుకెళ్లవచ్చు. అయితే వాటిని సైలెంట్ మోడ్‌లో ఉంచాల్సిందే.
మీ ఓటును వేరే వాళ్లు వేసేశారా? అయితే.. టెండర్ ఓటేయవచ్చు!
ఎన్నికల్లో ఓటేసేందుకు పోలింగ్ కేంద్రానికి వెళ్లే సరికి మీ ఓటు వేరేవాళ్లు వేసేశారా? అయితే దిగులుపడాల్సిన అవసరం లేదు. మీకు టెండర్ ఓటు వేసే హక్కును ఎన్నికల సంఘం కల్పించింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెíషీన్(ఈవీఎం) ద్వారా కాకుండా పేపర్ బ్యాలెట్ ద్వారా ఓటేసే అవకాశం కల్పిస్తారు. టెండర్ బ్యాలెట్ ఓటర్ల వివరాలను ప్రిసైడింగ్ అధికారులు ఫారం–17బీలో రికార్డు చేస్తారు.
ఈ ఫారంలోని 5వ కాలమ్‌లో ఓటరు సంతకం/వేలి ముద్ర తీసుకున్న తర్వాత వారికి బ్యాలెట్ పత్రాన్ని అందజేస్తారు. ప్రత్యేక ఓటింగ్ కంపార్ట్‌మెంట్‌లోకి ఓటరు బ్యాలెట్ పత్రాన్ని తీసుకెళ్లి తాము ఓటేయదల్చిన అభ్యర్థికి చెందిన ఎన్నికల గుర్తుపై స్వస్తిక్ ముద్రను వేయాల్సి ఉంటుంది. ఓటెవరికి వేశారో బయటికి కనబడని విధంగా బ్యాలెట్ పత్రాన్ని మడిచి కంపార్ట్‌మెంట్ బయటకి వచ్చి ప్రిసైడింగ్ అధికారికి అందజేయాలి. ఆ బ్యాలెట్ పత్రాన్ని టెండర్ ఓటుగా ప్రిసైడింగ్ అధికారి మార్క్ చేసి ప్రత్యేక ఎన్వలప్‌లో వేరుగా ఉంచుతారు.
జాబితాలో పేరు ఉందా? లేదా? ఎలా తెలుసుకోవాలి?
» ఎన్నికల సంఘం వెబ్‌సైట్https://electoralsearch.eci. gov. in కి లాగిన్ కావాలి.
» మీ వివరాలు/ ఓటరు గుర్తింపు కార్డు(ఎపిక్)/ మొబైల్ నంబర్ ఆధారంగా జాబితాలో పేరును సెర్చ్ చేయడానికి ఈ పోర్టల్ అవకాశం కల్పిస్తోంది. మొబైల్ ఫోన్ నంబర్, ఎపిక్ కార్డు నంబర్ ఆధారంగా జాబితాలో పేరు సెర్చ్ చేయడం చాలా సులు వు. గతంలో ఆన్‌లైన్ ద్వారా రిజిస్ట్రర్ చేసుకున్న వారు మాత్రమే మొబైల్ ఫోన్ నంబర్ ఆధారంగా పేరును సెర్చ్ చేసేందుకు వీలుంటుంది. ఓటరు పేరు, తండ్రి పేరు/ వయస్సు ఇతర వివరాలను కీ వర్డ్స్‌గా వినియోగించి సెర్చ్ చేసినప్పుడు అక్షరాల్లో స్వల్ప తేడాలున్నా జాబితాలో పేరు కనిపించదు.
» ఓటర్ హెల్ప్ లైన్ 1950కి కాల్ చేసి తెలుసుకోవచ్చు.(మీ ఏరియా ఎస్టీడీ కోడ్ ముందు యాడ్ చేయాలి).
» 1950 నంబర్‌కి మీ ఎపిక్ నంబర్‌ను ఎస్‌ఎంఎస్ చేసి తెలుసు కోవచ్చు. (ఎస్‌ఎంఎస్ ఫార్మాట్: ‘ఉఇఐ ఎపిక్ నంబర్’. ఈసీఐ, ఎపిక్ నంబర్ మధ్య స్పేస్ ఉండాలి).
పోలింగ్ కేంద్రం ఎక్కడ ఉందో..ఎలా తెలుసుకోవాలి?
రాష్ట్రంలోని ఓటర్లందరికీ ఎన్నికల సంఘం ఫొటో ఓటర్ ఇన్‌ఫర్మేషన్ స్లిప్పులను జారీ చేసింది. ఈ ఓటర్ స్లిప్పుల వెనకభాగంలో తొలిసారిగా పోలింగ్ కేంద్రం రూటు మ్యాప్‌ను పొందుపరిచింది. ఈ రూట్ మ్యాప్‌తో సులువుగా పోలింగ్ కేంద్రానికి చేరుకోవచ్చు.
అనుచితంగా ప్రవర్తిస్తే పోలింగ్ బూత్ నుంచి గెంటివేతే
పోలింగ్ సమయంలో పోలింగ్ కేంద్రంలో అనుచితంగా ప్రవర్తించిన లేదా చట్టపర ఆజ్ఞలను పాటించడంలో విఫలమైన వ్యక్తులను ప్రిసైడింగ్ అధికారి బయటకు పంపించవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 132 కింద ఈ మేరకు అధికారాలు ప్రిసైడింగ్ అధికారికి ఉన్నాయని పేర్కొంది.
మద్యం సేవించి పోలింగ్ కేంద్రానికి వచ్చే వ్యక్తుల ఓటు హక్కును నిరాకరించడం సాధ్యం కాదని అధికారులు అంటున్నారు. మద్యం లేదా మాదక ద్రవ్యాల మత్తులో విచక్షణ కోల్పోయి పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ ప్రక్రియకు ఆటంకం కలిగించే వ్యక్తులను మాత్రం పోలీసుల సాయంతో బయటకు పంపించేందుకు నిబంధనలు అనుమతిస్తాయని అధికారవర్గాలు పేర్కొన్నాయి.
ఓటరు జాబితాలో పేరు తొలగించినా ఓటేయవచ్చు..
అన్ని పోలింగ్ కేంద్రాల వారీగా ప్రత్యేకంగా అబ్సెంటీ, షిఫ్టెడ్, డెడ్(ఏఎస్డీ) ఓటర్ల జాబితాను రూపొందించి సంబంధిత పోలింగ్ కేంద్రం ప్రిసైడింగ్ అధికారికి అందజేస్తారు. ఓటేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చే వ్యక్తి పేరు ఓటరు జాబితాలో లేకుంటే, ఆ వ్యక్తి పేరును ఏఎస్డీ ఓటర్ల జాబితాలో వెతకాల్సి ఉంటుంది. ఏఎస్డీ ఓటర్ల జాబితాలో ఆ వ్యక్తి పేరుంటే ఓటరు గుర్తింపు కార్డు/ లేదా ఇతర గుర్తింపు కార్డుల ఆధారంగా ఆ వ్యక్తి గుర్తింపును ప్రిసైడింగ్ అధికారి ముందుగా నిర్థారించుకుంటారు.
అనంతరం ఈ వ్యక్తి పేరును ఫారం 17ఏలో నమోదు చేసి సంతకంతో పాటు వేలిముద్ర సైతం తీసుకుంటారు. ఈ క్రమంలో తొలి పోలింగ్ అధికారి సదరు ఏఎస్డీ ఓటరు పేరును పోలింగ్ ఏజెంట్లకు గట్టిగా వినిపిస్తారు. సదరు ఓటరు నుంచి నిర్దిష్ట ఫార్మాట్‌లో డిక్లరేషన్ సైతం తీసుకోవడంతో పాటు ఫొటో, వీడియో సైతం తీసుకుంటారు. అనంతరం ఆ వ్యక్తికి ఓటు వేసే అవకాశం కల్పిస్తారు.
13న వేతనంతో కూడిన సెలవు
సెలవు ఇవ్వకుంటే కఠిన చర్యలకు ఈసీ ఆదేశంరాష్ట్రంలోని 17లోక్‌సభ స్థానాలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఈ నెల 13న పోలింగ్ జరగనుండడంతో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థల ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవును రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్ యాక్ట్ 1881 కింద ఈ మేరకు సెలవు ప్రకటిస్తూ మార్చి 19న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
తెలంగాణ ఫ్యాక్టరీస్ అండ్ ఎస్లాబ్లిష్‌మెంట్ యాక్ట్–1974 కింద ఫ్యాక్టరీలు, షాపులు, ఇండస్ట్రియల్ అండర్ టేకింగ్స్, ఎస్లాబ్లిష్‌మెంట్స్‌లలో పనిచేస్తున్న ఉద్యోగులకు పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు ప్రకటిస్తూ మార్చి 22న రాష్ట్ర కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణికుముదిని ఉత్తర్వులు జారీ చేశారు. ప్రైవేటు సంస్థలు తమ ఉద్యోగులకు సెలవు ఇవ్వని పక్షంలో కార్మిక, ఎన్నికల చట్టాల కింద కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) వికాస్‌రాజ్ శనివారం మీడియాకు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment