గ్రామాల్లో ‘స్థానిక’ సందడి షురూ | Local Elections In Villages Are Started | Sakshi
Sakshi News home page

గ్రామాల్లో ‘స్థానిక’ సందడి షురూ

Published Thu, Mar 7 2019 10:04 AM | Last Updated on Thu, Mar 7 2019 10:06 AM

Local Elections In Villages Are Started - Sakshi

సాక్షి, కథలాపూర్‌: ముందస్తు అసెంబ్లీ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గత ఐదు నెలలుగా గ్రామాల్లో రాజకీయాలు వెడేక్కి.. ప్రశాంతంగా ముగియడంతో నాయకులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఈ క్రమంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల రిజర్వేషన్లు ఖరారు చేయడంతో గ్రామాల్లో రాజకీయాలు మరోమారు వెడేక్కాయి. రిజర్వేషన్లు అనుకూలంగా వచ్చాయని కొందరు నాయకులు తమకు రిజర్వేషన్లు కలిసిరాలేదని మరికొందరు తమ అనుచరవర్గాలతో రాజకీయ భవితవ్యంపై చర్చల్లో మునిగితేలుతున్నారు. మరోవైపు ఏ నాయకుడిని గెలిపిస్తే మంచిపాలన అందిస్తారనే విషయంలో ప్రజలు సైతం కూడళ్ల వద్ద చర్చించుకోవడం విశేషం. 
 

బీసీలకే కథలాపూర్‌ ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలు....
ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాల రిజర్వేషన్ల ప్రక్రియ జిల్లాస్థాయిలో జరగడంతో కథలాపూర్‌ మండల ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానం బీసీలకే రిజర్వ్‌ అయ్యాయి. కథలాపూర్‌ మండలంలో 19 గ్రామాలుండగా.. 13 ఎంపీటీసీ స్థానాలుగా నిర్ణయించారు.  ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లను మండలస్థాయి యూనిట్‌గా ఖరారు చేయనుండటంతో అందరిలో ఉత్కంఠ నెలకొంది. ఆయా గ్రామాల్లో ఇటివలే జరిగిన సర్పంచ్‌ ఎన్నికలకు వర్తించే రిజర్వేషన్లు ఎంపీటీసీ స్థానాలకు దగ్గరగా ఉంటాయని ఆయా గ్రామాల్లో ఆశావహులు ఇప్పటికే అనుచరవర్గంతో ప్రచారాలు ప్రారంభించడం గమనార్హం. సర్పంచ్‌ ఎన్నికల్లో ఓటమిపాలైన  పలువురి నాయకులకు ప్రజాతీర్పు కోరుకునేందుకు ఎంపీటీసీ ఎన్నికల రూపంలో మరోచాన్స్‌ వచ్చినట్లయిందని.. గెలుపుకోసం ఏమి చేయాలనే వ్యుహాలు రచించుకుంటున్నారు. 
 

మండలంలో 32,712 మంది ఓటర్లు..
కథలాపూర్‌ మండలంలో 19 గ్రామాలకు గాను 13 ఎంపీటీసీ స్థానాలుండగా.. 32,712 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో మహిళ ఓటర్లు 17,354 మంది, పురుషులు 15,358 మంది ఓటర్లు ఉన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో యువత ఉపాధి నిమిత్తం గల్ఫ్‌బాట పట్టినవారే ఉండటంతో మహిళ ఓటర్లు  ఎక్కువగా వినియోగించుకునే అవకావం ఉంది. ఆయా గ్రామాల్లో గెలుపు ఓటములకు మహిళ ఓటర్లు కీలకం కానున్నారని  పార్టీల నాయకులు భావిస్తున్నారు. 


కథలాపూర్‌కు మరోసారి జెడ్పీ చైర్మన్‌ పోస్టు దక్కేనా..?
2014 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో కథలాపూర్‌ జెడ్పీటీసీగా గెలుపొందిన తుల ఉమ జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. జిల్లాల పునర్విభజన జరగడంతో ప్రస్తుతం కథలాపూర్‌ మండలం జగిత్యాల జిల్లా పరిధిలోకి వచ్చింది. జిల్లాలో 18 జెడ్పీటీసీ స్థానాలుండటంతో ఏ పార్టీ అధిక స్థానాలు గెలుచుకుంటే ఆ పార్టీ జెడ్పీ చైర్మన్‌ సీటు కైవసం చేసుకునే అవకాశాలున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ నుంచి జెడ్పీటీసీగా బరిలో ఉండే నాయకులు సైతం జిల్లాస్థాయిలో ప్రభావం చూపాలని అప్పుడే ఉన్నతస్థాయిలో పార్టీ నేతలో చర్చలు జరుపుతుండటం విశేషం. మరోసారి కథలాపూర్‌ జెడ్పీటీసీగా గెలుపొందినవారు జెడ్పీ చైర్మన్‌ సీటు దక్కించుకుంటారా లేదా అనేది రాజకీయ నాయకుల్లో ఆసక్తి రేపుతోంది. ఏదేమైనా గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికల సందడి నెలకొంది. ఏప్పుడేమి పరిణామాలు చోటుచేసుకుంటాయోనని రాజకీయనాయకులతోపాటు ప్రజల్లో రోజురోజుకు ఉత్కంఠ నెలకొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement