Jagithyala
-
అప్పు తీసుకున్న వ్యక్తి తల్లిని బంధించి..
జగిత్యాల: తీసుకున్న అప్పుపై వడ్డీ కట్టక జాప్యం చేస్తుండడంతో రుణం ఇచ్చిన వ్యక్తి కనీస మానవత్వం మరచి.. దాష్టీకం ప్రదర్శించిన ఘటన జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలోని ఆత్మకూర్ గ్రామంలో చోటుచేసుకుంది. పుప్పాల సందీప్ అదే గ్రామానికి చెందిన ఏశవేని గణేశ్‌కు జరుపుల సాగర్ అనే వ్యక్తి నుంచి రూ.1,12,000ను గత మార్చిలో అప్పుగా ఇప్పించాడు. అప్పు పత్రం గణేశ్‌కు బదులు సందీప్ పేరు మీద రాసుకున్నాడు. ప్రతినెలా వడ్డీ కడుతూ వస్తున్న గణేశ్ రెండునెలల నుంచి చెల్లించడం లేదు. దీంతో ఆగ్రహంతో సాగర్ ఆదివారం సందీప్ ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో ఇంట్లో సందీప్ తల్లి ఒక్కరే ఉన్నారు. ఆమెను చంపుతానని బెదిరించి, బూతులు తిట్టి ఇంట్లో బంధించి తాళం వేశాడు. గమనించిన స్థానిక మహిళ మీరా సాగర్‌ను మందలించి తాళం తీసి బాధితురాలిని బయటకు తీసుకొచ్చింది. సందీప్ ఫిర్యాదుపై పోలీసులు విచారణ చేస్తున్నారు. -
గుండుపిన్నుపై మట్టి గణపతి విగ్రహాన్ని తయారుచేసిన దయాకర్
-
చనిపోయిన వ్యక్తిని బతికిస్తానంటూ పూజలు
-
Fathers Day: ‘నాన్నే రియల్ హీరో అంటున్న పిల్లలు’
అమ్మ ఊపిరిపోస్తే.. జీవితాన్ని ఇస్తాడు నాన్న.. తన గుండెలపై నడక నేర్పిస్తాడు నాన్న..ఊహతెలిసే వయసులో మొదటి స్నేహితుడు నాన్న..ఎంత కష్టమైనా కన్నీళ్లు రాకుండా చూసుకుంటాడు నాన్న.. పిల్లలు ఎదిగిన కొద్ది మొదట గర్వించేది నాన్న..బిడ్డల భవిష్యత్‌కోసం కొవ్వొత్తిలా కరిగేది నాన్న..ఆపదలో ఆత్మరక్షణగా నిలిచేది నాన్న..ప్రాణాపాయంలో ఊపిరిపోసేది నాన్న.. అందుకే నాన్న.. ఎవ్రీడే వారియర్ .. ప్రతీ మనిషి నిండు జీవితానికి దిక్సూచి నాన్న. బిడ్డ వేలు పట్టి నడిపించడమే కాదు, వెన్ను తట్టి జీవన యానానికి ప్రోత్సహించడమూ తండ్రికే చెల్లింది. కరోనా లాంటి మహమ్మారి తన బిడ్డలను మింగేయాలని చూసిన తరుణంలో కూడా చెదరని ఆత్మవిశ్వాసంతో బిడ్డల రక్షణ కోసం వ్యయ, ప్రయాసాలకు ఓర్చిన త్యాగమూర్తులు ఎందరో. కుటుంబం మొత్తం పాజిటివ్ వచ్చినా.. పిల్లలు క్లిష్టపరిస్థితిలో ఉన్నా ధైర్యం కోల్పోకుండా కొత్త ఊపిరిపోశారు. కరోనా కాటుకు కొడుకు, బిడ్డలను కోల్పోయి వారి పిల్లల బాధ్యత తీసుకుని తాతే.. తండ్రైన సంఘటనలూ అనేకం. ఇంటి పెద్దగా.. కుటుంబానికి రక్షణ వలయంగా తండ్రి సేవ మరువలేనిది. అందుకే ఏ కొడుకుకైనా.. కూతురుకైనా.. తమ జీవితంలో రియల్ హీరో నాన్న అంటారు. నేడు అంతర్జాతీయ ఫాదర్స్‌డే సందర్భంగా కథనం.. కొడుకు పోయిండు.. కుర్చే మిగిలింది.. సాక్షి, జగిత్యాల: పక్క ఫొటోలో కటింగ్ చేస్తున్న పెద్దాయన కోరుట్లకు చెందిన సాయన్న. ఇద్దరు కొడుకులు ధనుంజయ్, సురేశ్ (34), కూతురు ఉంది. చిన్న కొడుకు సురేశ్‌తో కలిసి కటింగ్షాపును నిర్వహిస్తుండేవాడు. సాఫీగా సాగుతున్న వీరి కుటుంబంలో కరోనా కల్లోలం సృష్టించింది. సురేశ్ మే మూడోవారంలో కరోనా బారిన పడ్డాడు.హోం క్వారంటైన్లో ఉన్న కొడుకుకు సాయన్ననే అన్నీ తానై సేవలు చేశాడు. ఆరో రోజు శ్వాస ఇబ్బందులు వచ్చాయి. కరీంనగర్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. తదుపరి సాయన్న, అతని భార్య దేవక్క, తమ్ముడు దిలీప్, సురేశ్ భార్య సునీత కరోనాబారిన పడి హోం క్వారంటైన్లో ఉండగా.. వారి బంధువులు సురేశ్ దగ్గర ఉండిపోయారు. చికిత్స పొందుతున్న సురేశ్ మే 26న చనిపోయాడు. అతన్ని కాపాడుకునేందుకు సాయన్న రూ.5లక్షలు ఖర్చు చేశాడు. అదే సమయంలో సాయన్న ఆరోగ్యం సైతం విషమించింది. జగిత్యాలలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చేరాడు. సురేశ్ చని పోయిన విషయాన్ని సాయన్నకు ఎవరూ చెప్పలేదు. రెండు రోజుల తర్వాత చెప్పడంతో కుమిలిపోయాడు. అదేబాధలోనే వారం రోజులకు సాయన్న, అతని కుటుంబసభ్యులందరూ కోలుకున్నారు. వీరందరికి కలిపి మరో లక్ష ఖర్చయింది. అటు కుటుంబ పోషణ, ఇప్పుడు అప్పుల భారం నుంచి బయటపడేందుకు సాయన్న రోజూ మళ్లీ సెలూన్ తీసి పనిచేస్తున్నాడు. కానీ.. పక్కనే ఖాళీగా కనిపిస్తున్న కుర్చీని చూస్తూ నిత్యం తన కొడుకునే గుర్తు తెచ్చుకుంటున్నాడు. మనవళ్లలో కొడుకును చూసుకుంటూ.. రామగిరి మండలం బేగంపేట గ్రామానికి చెందిన కుడికాల మల్లేశ్ సింగరేణి రిటైర్డ్ కార్మికుడు. భార్య మల్లమ్మ, ముగ్గురు కొడుకులు, కూతురు ఉన్నారు. మూడో కొడుకు మల్లేశ్ 13 ఏళ్లుగా ముత్తారం మండలం అడవిశ్రీరాంపూర్ గ్రామంలో మెడికల్‌షాపు నిర్వహిస్తూ.. భార్య సృజన, కొడుకులు శ్రీచరణ్, మణిదీప్లను పోషిస్తున్నాడు. గత మే నెలలో మల్లేశ్(కొడుకు) కరోనా బారిన పడ్డాడు. నాలుగురోజులకు శ్వాస తీసుకోవడం కష్టంగా మారడంతో కరీంనగర్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చేరాడు. భర్త బాగోగులు చూసుకుంటున్న క్రమంలో సృజన కూడా వైరస్‌బారిన పడి అదే ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యింది. ఇద్దరికి వైద్యానికి తల్లిదండ్రులు సుమారు రూ.12లక్షలు అప్పుచేసి ఖర్చు చేశారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో గత నెల 26న మల్లేశ్, 27న సృజన మృతిచెందారు. అప్పటి నుంచి ఇద్దరు చిన్నారులను నానమ్మ, తాతయ్య మల్లేశ్, మల్లమ్మ చేరదీశారు. కరోనాతో దూరమైన కొడుకు కోడలును చిన్నారుల్లో చూసుకుంటూ.. నిత్యం బాధపడుతున్నారు. ‘పోయిన కొడుకు కోడలును మనవళ్ల ముఖంలో చూసుకుంటాం. ఎలాంటి ఇబ్బందులు రాకుండా పోషించుకుంటాం. ఉన్నతంగా చదివించి మంచి భవిష్యత్ అందిస్తామని’ మల్లేశ్ చెబుతున్నాడు. అనుక్షణం.. ఒక నరకం మెట్పల్లి పట్టణానికి చెందిన సత్యనారాయణ కిరాణాషాపు నిర్వహిస్తుంటాడు. భార్య భవాని, కూతుళ్లు నందిని(15), ప్రజ్ఞ(7) ఉన్నారు. సెకండ్‌వేవ్ మొదట్లో సత్యనారాయణతో పాటు భార్యాపిల్లలకు పాజిటివ్ వచ్చింది. దంపతులకు సమస్య లేకపోయినప్పటికీ.. పిల్లలిద్దరు పదిరోజుల పాటు ఆహారం తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు. బలహీనులయ్యారు. కంగారుపడిన సత్యనారాయణ ఏదైనా ప్రయివేటు ఆస్పత్రికి పిల్లలను తీసుకెళ్లాలని అనుకున్నాడు. ఇంట్లో ఉంటేనే ఉత్తమం అని స్నేహితులు ఇచ్చిన సలహాతో హోం ఐసోలేషన్‌లోనే ఉంచుతూ.. నిత్యం ధైర్యం చెబుతూ చిన్నారులను చూసుకున్నాడు. పదిరోజులకు కొంత కోలుకున్నారు. తరువాత మంచి ఆహారం అందించడంతో నిత్యం వారి పరిస్థితిని గమనించడం, డాక్టర్ సలహాలు తీసుకోవడంతో 20 రోజులకు కోలుకున్నారు. తరువాత కుటుంబం మొత్తం పరీక్ష చేయించుకోగా.. నెగెటివ్ వచ్చింది. ఇప్పడు సంతోషంగా వారి పనులు చేసుకుంటున్నారు. ‘పిల్లలే నా ప్రపంచం. వారికి పాజిటివ్ వచ్చిన సమయంలో ఒక్కరోజు అన్నం తినకుంటే నాకు నిద్ర పట్టేది కాదు. ప్రతీక్షణం యుగంగా గడిచింది. దేవుడికి మొక్కని రోజులేదు. నేను ధైర్యంగా ఉంటూ.. పిల్లలకు భయం లేకుండా చేశాను. ఫలితంగా కుటుంబం మొత్తం కరోనాను జయించాం.’ అని సత్యనారాయణ సంతోషం వ్యక్తం చేశాడు. పిల్లలను మిస్ అయ్యాను కరోనా ప్రారంభమైనప్పటి నుంచి కుటుంబాన్ని చాలా వరకు మిస్ అవుతున్నా. నా భార్య రాధిక, కొడుకు రాజశేఖర్‌రెడ్డి, కూతురు దీపక హైదరాబాద్‌లో ఉంటారు. చాలా సార్లు కుటుంబంతో గడపాలని ఉన్నా.. విపత్కర పరిస్థితుల్లో అన్ని ప్రాంతాలు సంచరిస్తూ అందరినీ కలుస్తుంటాం కాబట్టి పిల్లలను చూడాలనిపించినప్పుడు వీడియో కాల్ మాట్లాడేవాన్ని. కరోనా పరిస్థితుల్లో ప్రతిరోజూ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పా. వాళ్లు కూడా నా శ్రేయస్సు గురించి చెప్పేవారు. – వీబీ. కమలాసన్‌రెడ్డి, కరీంనగర్ సీపీ తండ్రి ధైర్యం.. బిడ్డ సేఫ్ సిరిసిల్లకు చెందిన బోనాల సత్యం స్థానికంగా ల్యాబ్ టెక్నీషియన్. భార్య పద్మశ్రీ ప్ర భుత్వ ఉపాధ్యాయురాలు. కొడుకు రాజేశ్ డాక్టర్. కూతురు స్వాతి, మనవరాలు రుచిత కలిసే ఉంటారు. గత ఆగస్టు 13న ఓ పెళ్లికి వెళ్లి వచ్చిన సత్యం కరోనా బారిన పడ్డారు. రెండు, మూడు రోజుల్లో ఇంటిల్లిపాదికి వైరస్ సోకింది. డాక్టర్‌గా పనిచేస్తున్న కొడుకు రాజేశ్ సూచనతో ఆస్పత్రిలో చేరాలని అనుకున్నారు. అప్పటికే కూతురు స్వాతి గర్భిణికాగా.. డెలివరీ టైమ్ కూడా. పాజిటివ్ ఉన్న స్వాతికి ప్రస వం చేసేందుకు స్థానిక డాక్టర్లు ధైర్యం చేయలేదు. తండ్రి ధైర్యంచేసి స్వాతిని కారులో హైదరాబాద్ తీసుకెళ్లాడు. ఓ ఆస్పత్రిలో డెలివరీ అయిన తరువాత ఐదు రోజుల్లో డిశ్చార్జ్ చేశారు. తిరిగి సిరిసిల్లకు వచ్చాక కొడుకుతో కలిసి సత్యం ప్రభుత్వాసుపత్రిలో ఐసోలేషన్‌లో చేరారు. పక్షం రోజుల్లో అంతా మామూలు స్థితికి చేరుకున్నారు. ‘కొడుకు నేను పక్కపక్క బెడ్లలోనే చికిత్స తీసుకున్నాం. ఆ రోజు లు మళ్లీ రావొద్దని కోరుకుంటున్నా. ఇప్పుడు క్షేమంగా ఉన్నాం’ అని సత్యం పేర్కొన్నాడు. కొడుకు కోసం విదేశాల నుంచి.. బుగ్గారం మండలం సిరికొండకు చెందిన వంచిత ధర్మరాజుకు తల్లి మల్లవ్వ, భార్య గంగవ్వ, కొడుకులు రాహుల్, శ్రీయాన్స్ ఉన్నారు. ధర్మరాజు ఉపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్తుంటాడు. సెకండ్‌వేవ్‌లో రాహుల్ కరోనా బారిన పడ్డాడు. ఇల్లు చిన్నదికావడంతో తెలిసినవాళ్ల గొర్రెలషెడ్డులో క్వారంటైన్లో ఉంచారు. కొద్దిరోజులకు ధర్మరాజు తల్లి మల్లవ్వ కూడా వైరస్ బారిన పడింది. ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రిలో చేర్పించారు. చిన్నకొడుకుకు వైరస్ సోకకుండా ఉండేందుకు గంగవ్వ పుట్టింటికి వెళ్లింది. రాహుల్, మల్లవ్వల బాగోగులను సమీప బంధువులు చూసుకోసాగారు. గల్ఫ్‌లో ఉన్న ధర్మరాజు ఇక్కడి పరిస్థితి చూసి చలించిపోయాడు. కొడుకుల కన్నా ఏదీ ముఖ్యం కాదనుకున్నాడు. వెంటనే గల్ఫ్ నుంచి అతికష్టంమీద వచ్చేశాడు. అందరి బాగోగులు దగ్గరుండి చూసుకున్నాడు. మంచి ఆహారం ఇచ్చి వైరస్‌నుంచి బయటపడేలా చేశాడు. ప్రస్తుతం స్థానికంగానే ఉంటున్నాడు. ‘పిల్లల కన్నా ఏదీ ముఖ్యం కాదు. నేను వచ్చాకే మా వాళ్లకు ధైర్యం వచ్చింది’ అని ధర్మరాజు చెప్పాడు. -
కరోనా లేని ఊరు
-
రూ.10 వేలు ఇస్తేనే చితి దిగుతా! చివరికి
జగిత్యాల : వ్యక్తి చనిపోయిన బాధలో కుటుంబం ఉంటే.. కాటికాపరులు డబ్బుల కోసం వేధించిన సంఘటన జగిత్యాల మండలం లక్ష్మీపూర్‌లో చోటుచేసుకుంది.దీంతో గ్రామస్తులే చొరవ తీసుకుని, అంత్యక్రియలను ముగించిన వైనం వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన మిట్టపెల్లి బాపురెడ్డి ఆదివారం చనిపోయాడు. కుటుంబ సభ్యులు మృతదేహాన్ని అంత్యక్రియల కోసం శ్మశాన వాటికకు తీసుకెళ్లగా.. కాటికాపరులు వచ్చి చితిపై కూర్చుని అంతిమ సంస్కారాలను అడ్డుకున్నారు. రూ.10 వేలు ఇస్తేనే చితి మీది నుంచి దిగుతామని భీష్మిం చారు. గ్రామస్తులు మాట్లాడి రూ.వెయ్యి వరకు ఇస్తామని చెప్పినా ఒప్పుకోలేదు. దీంతో గ్రామస్తులందకూ కలిసి చితిపై ఉన్న కాటి కాపరులను పక్కకు తోసి అంతిమ సంస్కారాలు చేయాల్సి వచ్చింది. -
జగిత్యాల జిల్లా పెద్దాపూర్ లో వైభవంగా మల్లన్న బోనాల జాతర
-
జగిత్యాల,ధర్మపురిలో టీఆర్ఎస్ కైవసం
-
మున్సిపల్ ఎన్నికల్లో రెబల్ ‘సింహం’!
సాక్షి, కరీంనగర్: జాతీయ నాయకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 1939లో కాంగ్రెస్‌లో విలీనమైంది. కాగా దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఆయన సోదరుడు శరత్ చంద్రబోస్, చిత్త బసులు పశ్చిమబెంగాల్లో ఈ పార్టీని ఏర్పాటు చేసి, వామపక్ష సిద్ధాంతాలతో ముందుకు తీసుకెళ్లారు. పశ్చిమ బెంగాల్లో వామపక్ష కూటమి ప్రభుత్వంలో ఫార్వర్డ్ బ్లాక్ కీలకంగా వ్యవహరించింది. ఈ పార్టీ ఎన్నికల గుర్తు సింహం. ఈ గుర్తుకు ప్రస్తుతం తెలంగాణలో ఎక్కడ లేని డిమాండ్ వచ్చిపడింది. 1996 పార్లమెంటు ఎన్నికల్లో లక్ష్మీపార్వతి నేతృత్వంలోని ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ఈ సింహం గుర్తు మీదే పోటీ చేయగా, పాతపట్నం నియోజకవర్గం నుంచి లక్ష్మీపార్వతి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తరువాత 2018లో రామగుండం నుంచి మళ్లీ కోరుకంటి చందర్ కూడా ఇదే గుర్తు మీద పోటీ చేసి విజయం సాధించారు. చందర్ విజయంతో సింహానికి మరింత క్రేజీ వచ్చింది. కరీంనగర్‌కు చెందిన బండ సురేందర్‌రెడ్డి ఈ పార్టీకి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తూ అధికార పార్టీ నుంచి టికెట్లు రాని నాయకులతో సింహగర్జన చేయిస్తున్నారు. టీఆర్ఎస్ టికెట్టు ఆశించి భంగపడ్డ వందలాది మంది అభ్యర్థులు రాష్ట్రంలోని పలు మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో ఏఐఎఫ్బీ నుంచి అభ్యర్థులుగా పోటీలో ఉన్నారు. రామగుండంలో విజయంతో రాష్ట్రంలో డిమాండ్ 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రామగుండం టీఆర్ఎస్ టికెట్టు ఆశించి భంగపడ్డ కోరుకంటి చందర్ ‘సింహం’ గుర్తు మీద పోటీ చేశారు. మొదటిసారి ఓటమి చెందిననప్పటికీ, రెండోసారి ఘన విజయం సాధించారు. భూపాలపల్లి నుంచి పోటీ చేసిన గండ్ర సత్యనారాయణరావు స్వల్ప తేడాతో ఓడిపోయారు. దీంతో సింహం గుర్తు కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో పాపులర్ అయింది. ఇదే ఊపుతో ఆ పార్టీ అధ్యక్షుడు జిల్లా పరిషత్ ఎన్నికల్లో అభ్యర్థులను నిలిపారు. పలు చోట్ల పోటీ చేసినప్పటికీ భూపాలపల్లి జిల్లా పరిధిలోని ఘనపురం, రంగారెడ్డి జిల్లా పరిధిలోని తలకొండపల్లిలో ఈ సింహం గుర్తు అభ్యర్థులే విజయం సాధించారు. దీంతో పార్టీ సింబల్‌కు ఎక్కడ లేని డిమాండ్ పెరిగింది. ఈసారి టీఆర్ఎస్ నుంచి టికెట్టు ఆశించి నామినేషన్లు దాఖలు చేసిన వారిలో అధిక శాతం ముందస్తు జాగ్రత్తగా ఫార్వర్డ్‌బ్లాక్ నుంచి కూడా మరో సెట్ వేశారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా తరువాత పాలమూరు, వరంగల్ రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సింహం గుర్తుమీదే గెలవడంతో కోల్‌బెల్ట్ ఏరియాలో ఈ గుర్తుకు బహుళ ప్రాచుర్యం లభించించింది. దీంతో ఈసారి రామగుండం కార్పొరేషన్‌లోని 50 డివిజన్లలో 45 చోట్ల ఫార్వర్డ్‌బ్లాక్ నుంచి అభ్యర్థులు బరిలో నిలిచారు. కరీంనగర్ కార్పొరేషన్లో 24 మందికి బీఫారాలు ఇచ్చినట్లు ఆ పార్టీ అధ్యక్షుడు సురేందర్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కొల్లాపూర్, అమన్‌గల్, ఐజ, ఆలంపూర్ మునిసిపాలిటీల్లో జెడ్పీటీసీ వెంకటేశ్ ఆధ్వర్యంలో అభ్యర్థులను బరిలో నిలుపుతున్నట్లు తెలిపారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మొదలుకొని నిజామాబాద్, కోరుట్ల, రాయికల్, పెద్దపల్లి, సుల్తానాబాద్ వంటి మునిసిపాలిటీల్లో కూడా అభ్యర్థులను నిలిపారు. అన్ని జిల్లాలకు విస్తరిస్తాం ఆల్ఇండియా ఫార్వర్డ్ బ్లాక్‌ను రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు విస్తరిస్తాం. మా పార్టీ నుంచే రామగుండం ఎమ్మెల్యేగా కోరుకంటి చందర్ గెలిచారు. జెడ్పీటీసీ ఎన్నికల్లో రెండు చోట్ల గెలిచి సత్తా చాటాం. గెలిచిన వాళ్లు మాతోనే ఉన్నారు. ఈసారి మునిసిపాలిటీల్లో విజయాన్ని సాధించడం ద్వారా ఫార్వర్డ్‌బ్లాక్‌ను రాష్ట్రంలో విస్తరిస్తాం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి క్రియాశీలక శక్తిగా ఎదుగుతాం. – బండ సురేందర్‌రెడ్డి, ఏఐఎఫ్బీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
మున్సి‘పోరు’లో రె‘బెల్స్’!
సాక్షి, జగిత్యాల: జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల పరిధిలో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. దీంతో గులాబీ పార్టీ ఎమ్మెల్యేల గుండెల్లో రె‘బెల్స్’ మొదలయ్యాయి. ఆయా పార్టీలు తమ అభ్యర్థులకు బీ ఫారాలు అందజేయకున్నా ఆశావహులు నామినేషన్లు వేశారు. ప్రధానంగా అన్ని మున్సిపాలిటీల్లోనూ అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక్కోవార్డుకు కనీసం ముగ్గురు నుంచి ఆరుగురి వరకు నామినేషన్లు దాఖలయ్యాయి. ఇంటిపోరును తప్పించుకునేందుకు అధికార టీఆర్ఎస్ పార్టీ రెబల్స్ విషయంలో కఠిన వైఖరి అవలంబించాలని నిర్ణయించినప్పటికీ, వీరిలో ఎంతమంది తప్పుకుంటారోనన్నది ఆసక్తిగా మారింది. సొంత పార్టీనుంచి బరిలో నిలిచిన వారిని బుజ్జగించి, తమ అభ్యర్థుల గెలుపుకోసం వారిని పనిచేసేలా చూడాల్సిన బాధ్యత ఆ పార్టీ ఎమ్మెల్యేలపై పడింది. దీంతో నిన్నటివరకు కొనసాగిన నామినేషన్ల అంకానికి తెరపడి, ఇక బుజ్జగింపుల పర్వం మొదలుకానుంది. బీ ఫారాలపైనే ఉత్కంఠ.. టీఆర్ఎస్ పార్టీలో ఎన్నికల్లో పోటీచేయాలనుకునే ఆశావహుల లిస్టు భారీగా ఉండగా, వీరిలో చాలామంది ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేశారు. ఒక్కో వార్డులో కనీసం ముగ్గురు నుంచి ఆరుగురు వరకు ఆపార్టీ వారే పోటీలో ఉన్నారు. మిగతా కాంగ్రెస్, బీజేపీ పార్టీల నుంచి ఒకరిద్దరు మాత్రమే బరిలో ఉంటున్నారు. దీంతో టీఆర్ఎస్ నుంచి పోటీలో ఉన్న తిరుగుబాటుదారులతో పార్టీ అభ్యర్థులు నష్టపోయే అవకాశం ఉంటుందని ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. వారిని గెలిపించుకునే బాధ్యత స్థానిక ఎమ్మెల్యేలదే కావడంతో అసంతృప్తుల వ్యవహారంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇందుకోసమే పార్టీ బీ ఫారాలు వెంటనే అందజేయకుండా చివరి వరకు వేచిచూసే ధోరణి అవలంబించే అవకాశం ఉంది. నామినేషన్ల ఉపసంహరణకు జనవరి 14 సాయంత్రం వరకు అవకాశం ఉండటంతో అంతకు కొన్ని క్షణాల ముందే తమ అభ్యర్థులకు బీఫారాలు ఇచ్చేందుకు ఎమ్మెల్యేలు మొగ్గు చూపుతున్నారు. దీంతో అభ్యర్థులకు ప్రచారం చేసుకునేందుకు తక్కువ సమయం ఉండనుంది. బీ ఫారాలు అందిన తర్వాత అభ్యర్థి పూర్తిస్థాయిలో పార్టీ శ్రేణులతో ప్రచారం నిర్వహించుకునేందుకు అవకాశం ఉంటుంది. అన్ని మున్సిపాలిటీల్లోనూ ఇదే తీరు.. జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, రాయికల్, ధర్మపురి మున్సిపాలిటీల్లో అధికార టీఆర్ఎస్ పార్టీలోనే అధిక సంఖ్యలో రెబల్స్‌గా నామినేషన్ వేశారు. ఈ సారి ఎన్నికల్లో రెబల్స్ వల్ల నష్టాన్ని తగ్గించుకునేందుకు వారిపై కఠినంగా వ్యవహరించాలని ఇటీవల సీఎం కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలకు స్పష్టం చేశారు. బరిలో ఉన్న సొంత పార్టీ నేతలు పార్టీ జెండా, గుర్తులు వాడుకోకుండా వేటు వేయాలని ఆదేశించారు. అయితే ఇవన్నీ లెక్కచేయకుండా నామినేషన్లకు చివరిరోజైన శుక్రవారం ఒక్క జగిత్యాల మున్సిపాలిటీలోనే 191 మంది టీఆర్ఎస్ నేతలు నామినేషన్లు వేశారు. జగిత్యాలలో 2,5,6,14,21,37,48 వార్డుల్లో ఆరుగురి నుంచి ఎనిమిది మంది వరకు టీఆర్ఎస్ పార్టీ నాయకులు నామినేషన్లు వేశారు. మెట్పల్లి, కోరుట్ల, రాయికల్ మున్సిపాలిటీల్లోనూ ఒక్కో వార్డులో ముగ్గురికి మించి టీఆర్ఎస్ నేతలు బరిలో నిలిచారు. ధర్మపురి మున్సిపాలిటీలో రెబెల్స్ బెడద కాస్త తక్కువగా ఉన్నప్పటికీ కొన్ని వార్డుల్లో సొంత పోటీ ఎక్కువగానే ఉంది. వీరిలో ఎంతమంది పార్టీ అధిష్టానం, ఎమ్మెల్యేల బుజ్జగింపులకు తలొగ్గి ఉపసంహరించుకుంటారోన్నది ఆసక్తిగా మారింది. సమన్వయం సాధించేనా.. నామినేషన్లు ముగియడంతో శనివారం అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన కొనసాగనుంది. ఆదివారం అభ్యంతరాలు స్వీకరణ అనంతరం ఈనెల 13న అభ్యంతరాలపై అప్పీల్‌కు అవకాశం ఇస్తారు. ఈనెల 14 సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్ల విత్‌డ్రాకు అవకాశం ఉండగా.. ఈలోపు రెబల్స్ తమ నామినేషన్లు వెనక్కు తీసుకునేలా ఎమ్మెల్యేలు బుజ్జగింపులకు దిగుతున్నారు. మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో పాటు ఎమ్మెల్యే డా.సంజయ్‌కుమార్ జగిత్యాల, రాయికల్ మున్సిపాలిటీలు, ఎమ్మెల్యే కె. విద్యాసాగర్‌రావు కోరుట్ల, మెట్పల్లి మున్సిపాలిటీల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు బాధ్యతలను ఎత్తుకున్నారు. నామినేషన్ల అంకం ముగియడంతోనే బరిలో ఉన్న సొంత పార్టీ నేతలను గుర్తించి పార్టీ పదవులు, కార్పొరేషన్ పదవుల ఆశతో బుజ్జగించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. -
కుటుంబాన్ని పగబట్టిన విధి
సాక్షి, జగిత్యాలక్రైం: ఆనందంగా సాగుతున్న కుటుంబంపై విధి పగబట్టింది. ఏడాదిలో ఒకే కుటుంబంలో ముగ్గురు మృతిచెందడం గ్రామస్తులను కన్నీరుపెట్టించింది. ఈ సంఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా..జగిత్యాల మండలం తాటిపల్లి గ్రామానికి చెందిన సుందరగిరి కిషన్ ఆటోడ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఇతడికి భార్య, కూతురు, కుమారుడు కాగా ఏడాది క్రితం వరకూ కుటుంబ జీవనం ఆనందంగా సాగుతూ వచ్చింది. ఏడాదిక్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో కుమారుడు రఘు మృతిచెందడంతో విషాదం మొదలైంది. కుమారుడి మరణాన్ని తట్టుకోలేక కిషన్ భార్య ఉమ పది నెలలక్రితం ఆత్మహత్య చేసుకుంది. కిషన్, అతడి కూతురు సుందరగిరి మేఘన (22) మాత్రమే కుటుంబంలో మిగిలారు. తమ్ముడు, తల్లి మృతిని తట్టుకోలేకపోయిన సుందరగిరి మేఘన మనస్తాపంతో బాధపడుతోంది. గురువారం రఘు జయంతిరావడంతో మేఘన తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం ఇంట్లో తండ్రి లేని సమయంలో రేకులషెడ్డులో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఏడాదిలో ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందడం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. కూతురు మేఘన చితికి నిప్పం టించిన కిషన్ రోదనలు మిన్నంటాయి. గ్రామస్తులను కంటతడిపెట్టించాయి. కిషన్‌ను ఓదార్చే వారు లేకపోవడం..మేఘన మృతి సంఘటన విషాదం నింపింది. -
‘పల్లె కల్లు.. పట్నం దాకా’
సాక్షి, జగిత్యాల: గ్రామాల్లో ఈత, తాటి కల్లును అమ్ముకుని, ఆయా గ్రామాల్లోని గీత కార్మికులు జీవనం సాగిస్తుంటారు. కాని ప్రస్తుతం గ్రామాల్లో ఈత, తాటి చెట్లు తగ్గుతుండటంతో, పాటుగా కొన్ని రకాల తెగుళ్లు వ్యాపించి ఉన్న చెట్లు సైతం కల్లుగీతకు పనికి రాకుండా పోతున్నాయి. దీంతో, గీత కార్మికులకు ఉపాధి దొరకక రోడ్డున పడే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కల్లుగీతపైనే ఆధారపడిన గ్రామాల్లో గీత కార్మికుల సంఘాల తరుపున భూములు కొనుగోలు చేయడం లేదా ప్రభుత్వ భూములను లీజు ప్రతిపాదికన తీసుకుంటున్నారు. ఇందులో ప్రభుత్వ సహాకారంతో వినూత్న పద్ధతిలో ఈత వనాలు పెంచేందుకు ప్రయత్నిస్తూ విజయవంతమవుతున్నారు. జిల్లాలో తొలుత నాగులపేట సంఘం జగిత్యాల జిల్లాలో తొలుత కోరుట్ల మండలంలోని నాగులపేట గీత కార్మిక సంఘం ఈత వనాల పెంపకంలో ఇతర గ్రామాల గీత కార్మికులకు ఆదర్శంగా మారారు. ఆ గ్రామంలో 70 మంది గీత కార్మికులు కల్లుగీతపైనే ఆధారపడతారు. ఈత వనాల సంఖ్య తగ్గిపోవడంతో, గ్రామంలో ఓ 20 ఎకరాల వరకు కొనుగోలు చేసి, ఈత వనాన్ని ఓ పద్ధతి ప్రకారం మూడేళ్లుగా పెంచి, నాలుగవ ఏడాది నుంచి కల్లు గీస్తూ ఉపాధి పొందుతున్నారు. మొక్కల నర్సరీ నుంచి మంచి నాణ్యమైన ఈత మొక్కలను తీసుకుని 4 5 పద్ధతిలో నాటారు. నాటే ముందు డీఏపీ వంటి ఎరువులను వాడారు. ఎప్పటికప్పుడు కింది కొమ్మలను కత్తిరించి, ప్రతీ ఏటా ఎరువులు వేస్తూ కల్లు దిగుబడిని తీస్తున్నారు. మొక్కలను పెట్టిన సమయంలో నీటి ఎద్దడికి గురికాకుండా ఓ కూలీ మనిషిని పెట్టి విజయవంతంగా ఈతవనాన్ని పోషించి సక్సెస్ అయ్యారు. ప్రస్తుతం ఇందులో 2500 వరకు ఈత చెట్లు ఉన్నాయి. రెండో గ్రామంగా అంతర్గాం సంఘం ఆదర్శం జగిత్యాల మండలంలోని అంతర్గాం గీత కార్మికులు మాజీ జెడ్పీటీసీ జితేందర్‌రావు నేతృత్వంలో నాగులపేట ఈతవనాన్ని సందర్శించి, మూడేళ్ల క్రితం వీరు సైతం ఈత వనాన్ని పెంచారు. వీరు మరింత ముందడుగు వేసి డ్రిప్ ద్వారా సాగు నీటితో పాటు ఎరువులను కూడా అందిస్తున్నారు. దాదాపు 100 మంది సంఘ సభ్యులు, దాదాపు 5వేల మొక్కలను, 9‘‘9 పద్ధతిలో 8 ఎకరాల్లో నాటారు. ఒక్కో మొక్కకు రూ.25 చొప్పున సంగారెడ్డిలోని నర్సరీల నుంచి కొనుగోలు చేసి తీసుకొచ్చారు. దాదాపు మూడేళ్ల క్రితం ఈత మొక్కలను నాటగా, ప్రస్తుతం ఏపుగా పెరిగాయి. మరో ఏడాదిలో కల్లు గీతకు వచ్చే అవకాశం ఉంది. పక్కకు చెరుకు కట్ట ఉండగా, ఆ కట్టకు సైతం ఈత మొక్కలను నాటారు. నాటేందుకు ముందు కోళ్ల ఎరువును వేయగా, యూరియా, పొటాష్‌ను డ్రిప్ ద్వారా నేరుగా మొక్కల మొదళ్ల దగ్గర పడేలా చేశారు. అలాగే ఈత వనంలో కలుపు మొక్కలు పెరగకుండా ట్రాక్టర్‌తో అంతర కృషి చేస్తున్నారు. పలువురు ప్రముఖుల సందర్శన అంతర్గాం గీత కార్మికులు పెంచిన ఈతవనాన్ని ఇప్పటికే అప్పటి రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు, వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ పరిశీలించి, ఇతర గ్రామాల్లో సైతం డ్రిప్ ద్వారా ఈత వనం పెంచేందుకు చర్యలు తీసుకుంటామని ప్రకటించడం విశేషం. అలాగే ఉద్యానశాఖ కమిషనర్ వెంకట్రామిరెడ్డితో పాటు మంత్రి హరీష్‌రావు సూచన మేరకు సిద్దిపేట నియోజకవర్గంలోని గీత కార్మికులు సైతం అంతర్గాంలోని ఈతవనాన్ని పరిశీలించి వెళ్లారు. ఈ రెండు గ్రామాల్లోని ఈత వనాలను చూసిన గీతకార్మికులు, జగిత్యాల మండలంలోని మోతె, జగిత్యాల, అంతర్గాం, అంబారిపేట గీత కార్మికులు ఈతవనాన్ని పెంచేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టడం గమనార్హం. పల్లె కల్లు పట్నం కోసం.. ఈత చెట్ల నుంచి వచ్చే కల్లును మార్కెటింగ్ చేసేందుకు కూడా గీతకార్మికులు ఇప్పటి నుంచి ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు. ఇక అమ్మగా, మిగిలిపోయిన ఈత కల్లును పట్నం పంపించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు ఒక్కో ఈత చెట్టుకు కనీసం 5 లీటర్ల కల్లు వస్తుంది, 5వేల ఈత చెట్లకు 25వేల లీటర్ల కల్లు వస్తుంది. ఇంత కల్లు గ్రామంలో కాని, సమీప పట్టణ ప్రాంతాల్లో కాని అమ్ముడు పోదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ సహాకారంతో అంతర్గాం కల్లు హైద్రాబాద్ పట్నానికి పంపేలా సైతం ప్రభుత్వ ప్రతినిధులతో చర్చలు చేస్తున్నారు. దీనివల్ల గీత కార్మికులకు మంచి అదాయం రావడమే కాకుండా, రుచికరమైన నాణ్యమైన ఈత కల్లు ఈత కల్లు తాగే ప్రియులకు వరంగా మారనుంది. కార్యక్రమం వల్ల ఇరువర్గాలకు సైతం లాభం చేకూరనుంది. మా ఈత వనాన్ని చూసి వెళ్లారు కొన్నేళ్లుగా మా సంఘం భూమి వృథాగా ఉండటంతో, మూడేళ్ల క్రితం ఈత వనాన్ని పెంచాం. ఈత వనాన్ని పెంచడం వల్ల మా సంఘంలోని 100 మంది సభ్యులకు ఉపాధి దొరికే అవకాశం ఏర్పడింది. మా ఈత వనాన్ని చూసి చాలామంది గౌడ కులస్తులు మా బాటలో ఈత మొక్కలను పెంచేందుకు ముందుకు వస్తుండటం చాలా సంతోషంగా ఉంది. – గొడిసెల శంకర్ గౌడ్ , గౌడ సంఘం నాయకుడు, అంతర్గాం -
ప్రాణం ఉండగానే పాడి కట్టేందుకు ఏర్పాట్లు
-
కవిత ఓటమికి కారణమదే: జీవన్ రెడ్డి
సాక్షి, జగిత్యాల: స్థానిక ఎమ్మెల్యేల అసమర్థత, నిర్లక్ష్యమే టీఆర్ఎస్ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి కవిత ఓటమికి కారణమని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విశ్లేషించారు. గత ఎన్నికల సమయంలో ఆమె ఇచ్చిన హామీలను విస్మరించడం కూడా ఓటమికి కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. నిన్న వెలువడిన లోక్‌సభ ఫలితాల్లో నిజామాబాద్ సిట్టింగ్ ఎంపీ కవిత దారుణఓటమికి గురైన విషయం తెలిసిందే. అయితే కవిత ఓటమికి బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కే కారణమని టీఆర్ఎస్ పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలపై జీవన్ రెడ్డి స్పందించారు. వారి వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ కుమ్మకైతే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు వచ్చిన ఓటుబ్యాంక్ ఎటుపోయిందని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. టీఆర్ఎస్ నేతల అసమర్థతే కవిత ఓటమికి కారణమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతృత్వ ధోరణి పార్లమెంట్ ఎన్నికలపై పూర్తి ప్రభావం చూపిందని ఆయన పేర్కొన్నారు. ఓటమిని జీర్ణించుకోలేని ఆ పార్టీ నేతలు తమపై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ప్రజాక్షేత్రంలో ప్రజా ప్రతినిధిగా కాకపోయిన.. ప్రజాసేవకురాలిగా కవితకు మంచి భవిష్యత్ ఉందని అన్నారు. నిజామబాద్ ఎంపీగా విజయం సాధించిన ధర్మపురి అరవింద్ ఇచ్చిన హామీలు దిశగా కార్యచరణ చేపట్టాలని సూచించారు. -
పట్టభద్రులు ఎటువైపు..?
సాక్షి, జగిత్యాల: పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలకు కౌంట్‌డౌన్ మొదలైంది. ఈనెల 22న జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. జిల్లాలో ఎన్నికలకు అవసరమైన పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. జిల్లాలో మొత్తం పట్టభద్రులైన ఓటర్లు 16,098 మంది ఉండగా వారిలో 11,178 మంది పురుషులు, 4920 మంది మహిళా ఓటర్లున్నారు. అలాగే ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఓటర్లు జిల్లాలో 1329 మంది ఉండగా వారిలో పురుషులు 993 మంది కాగా 336 మంది మహిళలు ఉన్నారు. ప్రధాన పార్టీల నుంచి అభ్యర్థుల అసలైన పోరు నడుస్తోంది. జిల్లాలోని పట్టభద్రుల, టీచర్ల ఎమ్మెల్సీ ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపనున్నారోననేది ఆసక్తి నెలకొంది. ప్రచార హోరు.. జిల్లాలో యువతే లక్ష్యంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులు ప్రచార పర్వం సాగిస్తున్నారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజా మాబాద్, మెదక్ జిల్లాల పరిధి పట్టభద్రుల నియోజకవర్గ వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలతో తనదైన శైలిలోప్రచారం సాగిస్తున్నారు. ఆయా జిల్లాలోని నియోజకవర్గాల వారీగా పార్టీ శ్రేణులను కలుపుకొని ప్రచార పర్వాన్ని కొనసా గిస్తున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులు తమతమ సంఘాల నెట్‌వర్క్‌తో బలాన్ని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. యువతకు గాలం.. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులు ప్రధానంగా యువతను లక్ష్యం చేసుకుని ముమ్మర ప్రచారం సాగిస్తున్నారు. డిగ్రీ పూర్తి చేసుకుని మూడేళ్లు దాటిన పట్టభద్రులు ఈసారి పెద్ద ఎత్తున ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా సుమారు 80వేల వరకు పట్టభద్రులుండగా వారిలో జిల్లానుంచి 16వేల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో నిరుద్యోగుల సంఖ్య కూడా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు జిల్లాలో నియోజకవర్గాల స్థాయిల్లో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. యువతను లక్ష్యం చేసుకుని, పార్టీ శ్రేణుల సమీకరణతో జిల్లాకేంద్రంతో పాటు నియోజకవర్గాల స్థాయిలో మీటింగ్‌లను నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే తాటిపర్తి జీవన్‌రెడ్డి ప్రభుత్వంపై ప్రశ్నించే గొంతుకనవుతానంటూ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. బీజేపీ నుంచి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పొల్సాని సుగుణాకర్‌రావు యువతపైనే గంపెడాశలు పెట్టుకున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీ మద్దతుదారు మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్ పార్టీ బలాన్ని నమ్ముకుని విస్త్రృతంగా ప్రచారాన్ని సాగిస్తున్నారు. ప్రచారానికి మరో మూడు రోజుల గడువు మాత్రమే మిగిలి ఉంది. ప్రస్తుతం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్లు ఎవరికి పట్టం కట్టనున్నారోననే సర్వత్రా చర్చ సాగుతోంది. -
అంగన్వాడీల్లో ‘స్మార్ట్’ సేవలు
సాక్షి, కోరుట్ల (జగిత్యాల): పూర్వ ప్రాథమిక విద్య బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అంగన్వాడీ సెంటర్లలో గ్రామాల్లోని చిన్నారులకు, బాలింతలకు, గర్భిణులకు, కిషోర బాలికలకు అందించే పౌష్టికాహార వివరాలతో పాటు బాలింతలు, గర్భిణుల వివరాలను అంగన్వాడీ కార్యకర్తలు ఎప్పటికప్పుడు వివిధ రికార్డుల్లో నమోదు చేయాల్సి ఉంటుంది. పలు సందర్భాల్లో అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహించిన కార్యక్రమాల వివరాలను సైతం రికార్డుల్లో నమోదు చేయాలి. ఈ విధంగా నమోదు చేయడానికే కార్యకర్తలకు ఎక్కువ సమయం సరిపోతుంది. దీంతో కార్యకర్తల సమయం వృథా కాకుండా ఉండేందుకు వారు చేపట్టే ప్రతి పనిని త్వరగా పూర్తి చేసేందుకు ఆన్లైన్లో వివరాలను నమోదు చేయడానికి ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలకు స్మార్ట్ఫోన్లు పంపిణీ చేసేందుకు వచ్చే నెల నుంచి కార్యాచరణ చేపట్టనున్నట్లు అధికారులు చెబుతున్నారు. చిన్నారులు, బాలింతలు, గర్భిణీల వివరాలు స్మార్ట్‌ఫోన్‌లో ఆన్లైన్లో నమోదు చేసేందుకు, వాటి వల్ల చేకూరే ప్రయోజనాలను ఐటి అధికారులు కార్యకర్తలకు శిక్షణ ఇవ్వనున్నారు. మండలంలోని వివరాలు మండలంలో అయిలాపూర్, మోహన్‌రావుపేట రెండు సెక్టార్లు ఉన్నాయి. వీటి పరిధిలోని 15 గ్రామపంచాయతీల్లో 41 అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి. వీటిలో 40 మంది అంగన్వాడీ కార్యకర్తలు, 36 మంది ఆయాలు పనిచేస్తున్నారు. ఇందులో 6 నెలల నుండి 3 సంవత్సరాల లోపు 1213 మంది పిల్లలు అర్హులు కాగా 1147 మంది పిల్లలు నమోదు చేసుకోగా 1130 మంది పిల్లలు హాజరవుతున్నారు. 3ఏళ్ల నుంచి 6ఏళ్ల లోపు పిల్లలు 644 మందికి 564 మంది హాజరవుతున్నారు. గర్భిణులు 327కు 286, బాలింతలు 324కు 282 మంది హాజరవుతున్నారు. వీరికి సంబందించిన సమాచారం రికార్డుల్లో ఎప్పటికప్పుడు నమోదు చేస్తున్నారు. దీంతో వారికి సమయం వృథా కావడంతో వేరే పనులపై దృష్టి సారించలేకపోతున్నారు. స్మార్ట్ఫోన్లు పంపిణీ చేసినట్లయితే ప్రతి రోజు లబ్ధిదారుల ఇంటింటికి వెళ్ళి ఆన్లైన్లోనే వారి వివరాలు నమోదు చేసేందుకు అవకాశం ఉంటుంది. దీంతో రికార్డులు తిరగేసే పనిలేకుండా ఒక్క క్లిక్‌తో పని సులభంగా అయిపోవడం, సమయంతో పాటు ఇతర పనులు చేసుకోవచ్చు. ఇంటర్నెట్తో సమస్యలు అంగన్వాడీ కార్యకర్తలకు పనిభారం తగ్గించి వివరాల నమోదు ప్రక్రియ వేగవంతం అయ్యేందుకు ప్రభుత్వం అందించే స్మార్ట్ఫోన్లకు గ్రామాల్లో ఇంటర్నెట్ సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రతి పనికి సంబంధించిన వివరాలు ఆన్లైన్లో నమోదు చేసేందుకు నెట్ వినియోగం అత్యవసరం. కాగా గ్రామాల్లో వివిధ సెల్ఫోన్ల కంపనీల ఇంటర్నెట్ సేవలు ఒక్కోరకంగా ఉంటాయి. సిగ్నల్ లేనిచోట మాత్రం స్మార్ట్ఫోన్ల వినియోగం సమస్యగా మారే అవకాశం ఉంది. స్మార్ట్ ఫోన్లతో పనులు సులభతరం కానున్నాయి. స్మార్ట్ఫోన్లతో సమయం ఆదా చిన్నారులు, బాలింతలు, గర్భిణుల వివరాలు రికార్డుల్లో రాసే బదులు స్మార్ట్ఫోన్ల వినియోగంతో సమయం ఆదా అవడమే కాకా పని ఒత్తిడి తగ్గి పనులు వేగవంతం అవుతాయి. ఆన్లైన్ సేవలు కొనసాగడం వల్ల ప్రతి అంగన్వాడీ సెంటర్ పనితీరు పరిశీలించే వీలుంది. – సమీమ్ సుల్తానా, సూపర్వైజర్ సద్వినియోగం చేసుకుంటాం చిన్నారులు, బాలింతలు, గర్భిణుల వివరాలను 14 రికార్డుల్లో నమోదు చేయాలంటే ఇబ్బందులు పడేవాళ్లం. ప్రభుత్వం అందించే స్మార్ట్ ఫోన్లను సద్వినియోగం చేసుకుంటాం. దీంతో పనులు వేగవంతం కావడమే కాకా సమయం ఆదా అవుతుంది. – ఎన్. భాగ్యలక్ష్మీ, అంగన్వాడీ టీచర్ పనిభారం తగ్గుతుంది ప్రభుత్వం సూచించిన పనులు చేయడానికి కార్యకర్తలకు సమయం దొరకడం లేదు. దీంతో చిన్నారులకు విద్యాబోధన, ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావడంతో అంగన్వాడీ కార్యకర్తలకు పనిభారం పెరిగింది. ఆన్లైన్ నమోదుతో పనులు వేగవంతం అవుతాయి. – జి. సుజాత,అంగన్వాడీ టీచర్ -
గ్రామాల్లో ‘స్థానిక’ సందడి షురూ
సాక్షి, కథలాపూర్: ముందస్తు అసెంబ్లీ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గత ఐదు నెలలుగా గ్రామాల్లో రాజకీయాలు వెడేక్కి.. ప్రశాంతంగా ముగియడంతో నాయకులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఈ క్రమంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల రిజర్వేషన్లు ఖరారు చేయడంతో గ్రామాల్లో రాజకీయాలు మరోమారు వెడేక్కాయి. రిజర్వేషన్లు అనుకూలంగా వచ్చాయని కొందరు నాయకులు తమకు రిజర్వేషన్లు కలిసిరాలేదని మరికొందరు తమ అనుచరవర్గాలతో రాజకీయ భవితవ్యంపై చర్చల్లో మునిగితేలుతున్నారు. మరోవైపు ఏ నాయకుడిని గెలిపిస్తే మంచిపాలన అందిస్తారనే విషయంలో ప్రజలు సైతం కూడళ్ల వద్ద చర్చించుకోవడం విశేషం. బీసీలకే కథలాపూర్ ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలు.... ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాల రిజర్వేషన్ల ప్రక్రియ జిల్లాస్థాయిలో జరగడంతో కథలాపూర్ మండల ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానం బీసీలకే రిజర్వ్ అయ్యాయి. కథలాపూర్ మండలంలో 19 గ్రామాలుండగా.. 13 ఎంపీటీసీ స్థానాలుగా నిర్ణయించారు. ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లను మండలస్థాయి యూనిట్‌గా ఖరారు చేయనుండటంతో అందరిలో ఉత్కంఠ నెలకొంది. ఆయా గ్రామాల్లో ఇటివలే జరిగిన సర్పంచ్ ఎన్నికలకు వర్తించే రిజర్వేషన్లు ఎంపీటీసీ స్థానాలకు దగ్గరగా ఉంటాయని ఆయా గ్రామాల్లో ఆశావహులు ఇప్పటికే అనుచరవర్గంతో ప్రచారాలు ప్రారంభించడం గమనార్హం. సర్పంచ్ ఎన్నికల్లో ఓటమిపాలైన పలువురి నాయకులకు ప్రజాతీర్పు కోరుకునేందుకు ఎంపీటీసీ ఎన్నికల రూపంలో మరోచాన్స్ వచ్చినట్లయిందని.. గెలుపుకోసం ఏమి చేయాలనే వ్యుహాలు రచించుకుంటున్నారు. మండలంలో 32,712 మంది ఓటర్లు.. కథలాపూర్ మండలంలో 19 గ్రామాలకు గాను 13 ఎంపీటీసీ స్థానాలుండగా.. 32,712 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో మహిళ ఓటర్లు 17,354 మంది, పురుషులు 15,358 మంది ఓటర్లు ఉన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో యువత ఉపాధి నిమిత్తం గల్ఫ్‌బాట పట్టినవారే ఉండటంతో మహిళ ఓటర్లు ఎక్కువగా వినియోగించుకునే అవకావం ఉంది. ఆయా గ్రామాల్లో గెలుపు ఓటములకు మహిళ ఓటర్లు కీలకం కానున్నారని పార్టీల నాయకులు భావిస్తున్నారు. కథలాపూర్‌కు మరోసారి జెడ్పీ చైర్మన్ పోస్టు దక్కేనా..? 2014 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో కథలాపూర్ జెడ్పీటీసీగా గెలుపొందిన తుల ఉమ జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. జిల్లాల పునర్విభజన జరగడంతో ప్రస్తుతం కథలాపూర్ మండలం జగిత్యాల జిల్లా పరిధిలోకి వచ్చింది. జిల్లాలో 18 జెడ్పీటీసీ స్థానాలుండటంతో ఏ పార్టీ అధిక స్థానాలు గెలుచుకుంటే ఆ పార్టీ జెడ్పీ చైర్మన్ సీటు కైవసం చేసుకునే అవకాశాలున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ నుంచి జెడ్పీటీసీగా బరిలో ఉండే నాయకులు సైతం జిల్లాస్థాయిలో ప్రభావం చూపాలని అప్పుడే ఉన్నతస్థాయిలో పార్టీ నేతలో చర్చలు జరుపుతుండటం విశేషం. మరోసారి కథలాపూర్ జెడ్పీటీసీగా గెలుపొందినవారు జెడ్పీ చైర్మన్ సీటు దక్కించుకుంటారా లేదా అనేది రాజకీయ నాయకుల్లో ఆసక్తి రేపుతోంది. ఏదేమైనా గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికల సందడి నెలకొంది. ఏప్పుడేమి పరిణామాలు చోటుచేసుకుంటాయోనని రాజకీయనాయకులతోపాటు ప్రజల్లో రోజురోజుకు ఉత్కంఠ నెలకొంది. -
సమస్యల రాయికల్
ఎన్నో ఆశలతో మున్సిపాల్టీగా మారిన రాయికల్ పట్టణంలో సమస్యలు వేధిస్తున్నాయి. మున్సిపాలిటీగా ఏర్పడ్డ తర్వాత మంజూరైన నిధులతో ఇప్పటివరకు అభివృద్ధి పనులు చేపట్టకపోవడంతో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారైంది. రాయికల్ పట్టణంలోని పలు ప్రాంతాల్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి.ఎన్నికల వేళ నాయకులు ఇచ్చిన హామీలు నేరవేర్చే దిశగా నిధులు మంజూరు చేస్తే పట్టణం అభివృద్ధి లో దూసుకుపోతుంది.ఇప్పటికైనా అధికార పార్టీ నాయకులు, అధికారులు స్పందించి అభివృద్ధి నిధుల మంజూరుకు కృషి చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. సాక్షి, రాయికల్: ప్రస్తుతం పట్టణంలో అనేక సమస్యలు నెలకొన్నాయి. శివారు కాలనీలు చెత్తమయం... వెలగని వీధిదీపాలు... కాలనీల్లో మురుగుకాలువల అసంపూర్తి ఇది రాయికల్ పట్టణం తీరు. ఏళ్లు గడిచినా సమస్యల పరిస్కారానికి నోచుకోవడం లేదు.పట్టణంలో 16 వేల జనాభా ఉండగా సుమారు 10,914 మంది ఓటర్లు ఉన్నారు. 18 వార్డులున్నాయి. రాయికల్ పురపాలిక సంఘానికి రూ.25 కోట్లు మంజూరు కాగా పట్టణంలో పలు అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉంది. రాయికల్ పట్టణంలో ఏటా జనాభా పెరుగుతుండగా పట్టణ అభివృద్ధి మాత్రం జరగడం లేదు. శివారు కాలనీలో మురుగు కాలువలు లేక రహదారిపై మురికినీరు పారడంతో పాటు వీధిదీపాలు లేక కాలనీల్లో తాగునీటి ఎద్దడితో తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇవీ సమస్యలు.. • గ్రామీణ క్రీడాకారులు ప్రోత్సహించడానికి రాయికల్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మినీస్టేడియం ఏర్పాటుకు రూ.2.10 కోట్లు మం జూరు చేయగా కొంత మేరకు పనులు చేసి నిలిపివేశారు. మినీస్టేడియం పనులు పూర్తి చేయాల్సి ఉంది. • రాయికల్‌లో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేసి రాయికల్‌తో పాటు మూడు మండలాలకు సేవలు అందించాల్సి ఉంది. రాయికల్ పట్టణంలో నిర్మించిన అగ్నిమాపక కేంద్రం వాహనం, సిబ్బంది లేకపోవడంతో నిరుపయోగంగా మారింది. • పట్టణంలో ప్రయాణ ప్రాంగణంలో వసతులు లేకపోవడంతో ప్రయాణికులు రహదారిపై నిరీక్షించాల్సి వస్తోంది. రాయికల్ పట్టణంలో పాతబస్టాండ్‌లో ప్రయాణ ప్రాంగణం పునర్నిర్మించాలి. • పట్టణంలో స్వయం సహాయక బృందాల సమావేశం కోసం నిర్మించిన స్వశక్తి సంఘ భవనం పూర్తి చేయాల్సి ఉంది. • రాయికల్ మండల కేంద్రంలో అద్దె ఇరుకు గదుల్లో అవస్థల మధ్య ఉన్న గ్రంథాలయం సొంత భవనం నిర్మించాలి. • పట్టణంలో పెద్ద చెరువును మినీట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేయాలి. • రాయికల్ పట్టణ పురపాలిక భవనాన్ని నూతనంగా నిర్మించాల్సి ఉంది. • పట్టణంలోని వైకుంఠ దామంలో పనులు పూర్తి చేసి పట్టణ వాసులకు సరిపడా వసతులు కల్పించాల్సి ఉంది. • పట్టణంలోని హనుమాన్వాడ దేవాలయంతో పాటు మార్కెట్‌యార్డుకు మరిన్ని నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేయాల్సి ఉంది. • ప్రతి శనివారం నిర్వహించే వారసంతలో రహదారిపై ఇబ్బందులు పడకుండా వసతులు కల్పించాలి. • పట్టణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి భద్రత పెంచాలి. • మిషన్ భగీరథ పనులతో గుంతలు ఏర్పడి పట్టణ వాసులకు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలోని రహదారులను మరమ్మతులు చేపట్టాల్సి ఉంది. • పట్టణంలో పలు వీధుల్లో విద్యుత్ తీగలు ఇతర తీగలు వేలాడుతుండటంతో ప్రమాదకరంగా మారింది. సరిచేయడంతో పాటు విద్యుత్ స్తంభాలు వేయాల్సి ఉంది. సమస్యలు పరిష్కరించాలి పట్టణంలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి.ముఖ్యంగా రాయికల్ ఎన్నో ఎళ్లు ఉన్న పాత బస్టాండ్ లో ప్రయాణికుల కోసం షెడ్డు నిర్మాణం, మాదిగకుంట వినియోగంలోకి తీసుకవచ్చి సంక్షేమ వసతిగృహాలు, లైబ్రరీ వట్టి భవనాలు నిర్మించాలి – శ్రీనివాస్, రాయికల్ పట్టణాభివృద్ధి్ద కోసం నిధులు మంజూరు పట్టణంలో నెలకొన్న సమస్యలను ఎంపీ కవిత దృష్టికి తీసుకెళ్లడంతో పట్టణాభివృద్ధి కోసం రూ. 25 కోట్లు మంజూరు చేశారు.త్వరలోనే పనులు ప్రారంభిస్తాం. రానున్న కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ సహకారంతో మరిన్ని నిధులు తీసుకొచ్చి పట్టణాన్ని అభివృద్ది చేస్తా. – సంజయ్‌కుమార్, ఎమ్మెల్యే -
ప్రతిపక్షాలంటే ఎందుకంత భయం?
సాక్షి, జగిత్యాల: నేరం నాది కాదు ఆకలిదీ అనే సినిమాలాగా.. ఈ పాపం నాది కాదు కేంద్రానిది అన్న చందంగా టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని సీఎల్పీ ఉపనేత జీవన్ రెడ్డి విమర్శించారు. బుధవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వానికి ప్రతిపక్షాలు, ప్రజలంటే ఎందుకంత భయమని ప్రశ్నించారు. రైతు సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తే.. నిర్భందాలు, రెచ్చగొట్టే చర్యలకు పాల్పడటం ప్రజాస్వామ్య విరుద్దమన్నారు. వాస్తవాల్ని వక్రీకరించడం, శాశ్వతంగా సభ్యులను సభ నుంచి తొలిగించడం ప్రభుత్వ కుట్రగా ఆయన అభివర్ణించారు. స్వామిగౌడ్‌ని టీఆర్ఎస్ నాయకునిగా ఎవరూ భావించలేదని ఉద్యమకారునిగానే గుర్తించామన్నారు. గవర్నర్ ప్రసంగం వీడియో రికార్డింగ్ ఫుటేజీ ఎందుకు విడుదల చేయడం లేదని ప్రశ్నించారు. సభలో జరిగిన దాన్ని స్పీకర్, శాసనమండలి చైర్మన్ సుమోటోగా స్వీకరించడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఈ ఘటన ఆధారంగా చేసుకుని శాసనసభ్యులను సస్పెండ్ చేయటం అప్రజాస్వామికమని, సంఘటన ఫుటేజీ బయట పెట్టే వరకు చర్యలు తీసుకునే హక్కు లేదని స్పష్టం చేశారు. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని, పార్లమెంట్లో మీకోనీతి అసెంబ్లీలో మాకో నీతా అని ప్రశ్నించారు. -
పెళ్లింట్లో చోరీ..
జగిత్యాల: వారం రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉన్న ఇంట్లో దొంగలు పడి ఉన్నకాడికి ఊడ్చుకెళ్లారు. ఈ సంఘటన జగిత్యాల పట్టణంలోని మార్కెట్‌రోడ్ ప్రాంతంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. కాలనీలో నివాసముంటున్న ఓ ఇంట్లో త్వరలో పెళ్లి జరగనుంది. ఈ క్రమంలో పెళ్లి పనుల్లో నిమగ్నమైన కుటుంబ సభ్యులు పత్రికలు పంచడానికి ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లారు. ఇదే అదునుగా భావించిన దొంగలు ఇంట్లో ఉన్న 5 తులాల బంగారు ఆభరణాలు, రూ.1.50 లక్షల నగదుతో పాటు పలు విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారు. మంగళవారం ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ అనంత్ శర్మ సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. -
విద్యుత్ తీగ తెగిపడి రెండు ఎద్దులు ఆవు మృతి
పెద్దపల్లి (జగిత్యాల జిల్లా): మండల కేంద్రంలో బుధవారం రాత్రి విద్యుత్ తీగ తెగిపడి రెండు ఎద్దులు, ఆవు మృతిచెందాయి. సీగిరి సుందరయ్య రైతుకు చెందిన పశువులపై విద్యుత్ తీగ తెగిపడటంతో ఈ సంఘటన జరిగింది. -
ఇద్దరు కూలీల దారుణ హత్య
జగిత్యాల (కరీంనగర్): జగిత్యాల మండల కేంద్రంలోని గోవిందపల్లె కాలనీలో ఇద్దరు కూలీలను గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. బండరాళ్లతో మోది పక్కనే ఉన్న డ్రైనేజీలో పడేశారు. మృతులు పట్టణంలోని గోత్రాల కాలనీకి చెందిన కనకయ్య (40), భారతి (45)గా గుర్తించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించే పనిలో పడ్డారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు.