రాయికల్ పట్టణం
ఎన్నో ఆశలతో మున్సిపాల్టీగా మారిన రాయికల్ పట్టణంలో సమస్యలు వేధిస్తున్నాయి. మున్సిపాలిటీగా ఏర్పడ్డ తర్వాత మంజూరైన నిధులతో ఇప్పటివరకు అభివృద్ధి పనులు చేపట్టకపోవడంతో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారైంది. రాయికల్ పట్టణంలోని పలు ప్రాంతాల్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి.ఎన్నికల వేళ నాయకులు ఇచ్చిన హామీలు నేరవేర్చే దిశగా నిధులు మంజూరు చేస్తే పట్టణం అభివృద్ధి లో దూసుకుపోతుంది.ఇప్పటికైనా అధికార పార్టీ నాయకులు, అధికారులు స్పందించి అభివృద్ధి నిధుల మంజూరుకు కృషి చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
సాక్షి, రాయికల్: ప్రస్తుతం పట్టణంలో అనేక సమస్యలు నెలకొన్నాయి. శివారు కాలనీలు చెత్తమయం... వెలగని వీధిదీపాలు... కాలనీల్లో మురుగుకాలువల అసంపూర్తి ఇది రాయికల్ పట్టణం తీరు. ఏళ్లు గడిచినా సమస్యల పరిస్కారానికి నోచుకోవడం లేదు.పట్టణంలో 16 వేల జనాభా ఉండగా సుమారు 10,914 మంది ఓటర్లు ఉన్నారు. 18 వార్డులున్నాయి. రాయికల్ పురపాలిక సంఘానికి రూ.25 కోట్లు మంజూరు కాగా పట్టణంలో పలు అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉంది. రాయికల్ పట్టణంలో ఏటా జనాభా పెరుగుతుండగా పట్టణ అభివృద్ధి మాత్రం జరగడం లేదు. శివారు కాలనీలో మురుగు కాలువలు లేక రహదారిపై మురికినీరు పారడంతో పాటు వీధిదీపాలు లేక కాలనీల్లో తాగునీటి ఎద్దడితో తీవ్ర అవస్థలు పడుతున్నారు.
ఇవీ సమస్యలు..
• గ్రామీణ క్రీడాకారులు ప్రోత్సహించడానికి రాయికల్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మినీస్టేడియం ఏర్పాటుకు రూ.2.10 కోట్లు మం జూరు చేయగా కొంత మేరకు పనులు చేసి నిలిపివేశారు. మినీస్టేడియం పనులు పూర్తి చేయాల్సి ఉంది.
• రాయికల్‌లో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేసి రాయికల్‌తో పాటు మూడు మండలాలకు సేవలు అందించాల్సి ఉంది. రాయికల్ పట్టణంలో నిర్మించిన అగ్నిమాపక కేంద్రం వాహనం, సిబ్బంది లేకపోవడంతో నిరుపయోగంగా మారింది.
• పట్టణంలో ప్రయాణ ప్రాంగణంలో వసతులు లేకపోవడంతో ప్రయాణికులు రహదారిపై నిరీక్షించాల్సి వస్తోంది. రాయికల్ పట్టణంలో పాతబస్టాండ్‌లో ప్రయాణ ప్రాంగణం పునర్‌నిర్మించాలి.
• పట్టణంలో స్వయం సహాయక బృందాల సమావేశం కోసం నిర్మించిన స్వశక్తి సంఘ భవనం పూర్తి చేయాల్సి ఉంది.
• రాయికల్ మండల కేంద్రంలో అద్దె ఇరుకు గదుల్లో అవస్థల మధ్య ఉన్న గ్రంథాలయం సొంత భవనం నిర్మించాలి.
• పట్టణంలో పెద్ద చెరువును మినీట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేయాలి.
• రాయికల్ పట్టణ పురపాలిక భవనాన్ని నూతనంగా నిర్మించాల్సి ఉంది.
• పట్టణంలోని వైకుంఠ దామంలో పనులు పూర్తి చేసి పట్టణ వాసులకు సరిపడా వసతులు కల్పించాల్సి ఉంది.
• పట్టణంలోని హనుమాన్‌వాడ దేవాలయంతో పాటు మార్కెట్‌యార్డుకు మరిన్ని నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేయాల్సి ఉంది.
• ప్రతి శనివారం నిర్వహించే వారసంతలో రహదారిపై ఇబ్బందులు పడకుండా వసతులు కల్పించాలి.
• పట్టణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి భద్రత పెంచాలి.
• మిషన్ భగీరథ పనులతో గుంతలు ఏర్పడి పట్టణ వాసులకు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలోని రహదారులను మరమ్మతులు చేపట్టాల్సి ఉంది.
• పట్టణంలో పలు వీధుల్లో విద్యుత్ తీగలు ఇతర తీగలు వేలాడుతుండటంతో ప్రమాదకరంగా మారింది. సరిచేయడంతో పాటు విద్యుత్ స్తంభాలు వేయాల్సి ఉంది.
సమస్యలు పరిష్కరించాలి
పట్టణంలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి.ముఖ్యంగా రాయికల్ ఎన్నో ఎళ్లు ఉన్న పాత బస్టాండ్ లో ప్రయాణికుల కోసం షెడ్డు నిర్మాణం, మాదిగకుంట వినియోగంలోకి తీసుకవచ్చి సంక్షేమ వసతిగృహాలు, లైబ్రరీ వట్టి భవనాలు నిర్మించాలి
– శ్రీనివాస్, రాయికల్
పట్టణాభివృద్ధి్ద కోసం నిధులు మంజూరు
పట్టణంలో నెలకొన్న సమస్యలను ఎంపీ కవిత దృష్టికి తీసుకెళ్లడంతో పట్టణాభివృద్ధి కోసం రూ. 25 కోట్లు మంజూరు చేశారు.త్వరలోనే పనులు ప్రారంభిస్తాం. రానున్న కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ సహకారంతో మరిన్ని నిధులు తీసుకొచ్చి పట్టణాన్ని అభివృద్ది చేస్తా.
– సంజయ్‌కుమార్, ఎమ్మెల్యే
Comments
Please login to add a commentAdd a comment