అంగన్‌వాడీల్లో ‘స్మార్ట్‌’ సేవలు | Telangana Government Provide Smart Phones To Anganwadi Workers | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీల్లో ‘స్మార్ట్‌’ సేవలు

Published Fri, Mar 8 2019 3:41 PM | Last Updated on Fri, Mar 8 2019 3:43 PM

Telangana Government Provide Smart Phones To Anganwadi Workers - Sakshi

అంగన్‌వాడీ సెంటర్‌ను పరిశీలిస్తున్న సమీమ్‌ సుల్తానా (ఫైల్‌)

సాక్షి, కోరుట్ల (జగిత్యాల): పూర్వ ప్రాథమిక విద్య బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అంగన్‌వాడీ సెంటర్లలో గ్రామాల్లోని చిన్నారులకు, బాలింతలకు, గర్భిణులకు, కిషోర బాలికలకు అందించే పౌష్టికాహార వివరాలతో పాటు బాలింతలు, గర్భిణుల వివరాలను అంగన్‌వాడీ కార్యకర్తలు ఎప్పటికప్పుడు వివిధ రికార్డుల్లో నమోదు చేయాల్సి ఉంటుంది. పలు సందర్భాల్లో అంగన్‌వాడీ కేంద్రాల్లో నిర్వహించిన కార్యక్రమాల వివరాలను సైతం రికార్డుల్లో నమోదు చేయాలి.

ఈ విధంగా నమోదు చేయడానికే కార్యకర్తలకు ఎక్కువ సమయం సరిపోతుంది. దీంతో కార్యకర్తల సమయం వృథా కాకుండా ఉండేందుకు వారు చేపట్టే ప్రతి పనిని త్వరగా పూర్తి చేసేందుకు ఆన్‌లైన్‌లో వివరాలను నమోదు చేయడానికి ప్రభుత్వం అంగన్‌వాడీ కార్యకర్తలకు స్మార్ట్‌ఫోన్లు పంపిణీ చేసేందుకు వచ్చే నెల నుంచి కార్యాచరణ చేపట్టనున్నట్లు అధికారులు చెబుతున్నారు. చిన్నారులు, బాలింతలు, గర్భిణీల వివరాలు స్మార్ట్‌ఫోన్లో ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు, వాటి వల్ల చేకూరే ప్రయోజనాలను ఐటి అధికారులు కార్యకర్తలకు శిక్షణ ఇవ్వనున్నారు.

మండలంలోని వివరాలు

మండలంలో అయిలాపూర్, మోహన్‌రావుపేట రెండు సెక్టార్లు ఉన్నాయి. వీటి పరిధిలోని 15 గ్రామపంచాయతీల్లో 41 అంగన్‌వాడీ సెంటర్లు ఉన్నాయి. వీటిలో 40 మంది అంగన్‌వాడీ కార్యకర్తలు, 36 మంది ఆయాలు పనిచేస్తున్నారు. ఇందులో 6 నెలల నుండి 3 సంవత్సరాల లోపు 1213 మంది పిల్లలు అర్హులు కాగా 1147 మంది పిల్లలు నమోదు చేసుకోగా 1130 మంది పిల్లలు హాజరవుతున్నారు. 3ఏళ్ల నుంచి 6ఏళ్ల లోపు పిల్లలు 644 మందికి 564 మంది హాజరవుతున్నారు. గర్భిణులు 327కు 286, బాలింతలు 324కు 282 మంది హాజరవుతున్నారు.

వీరికి సంబందించిన సమాచారం రికార్డుల్లో ఎప్పటికప్పుడు నమోదు చేస్తున్నారు. దీంతో వారికి సమయం వృథా కావడంతో వేరే పనులపై దృష్టి సారించలేకపోతున్నారు. స్మార్ట్‌ఫోన్లు పంపిణీ చేసినట్లయితే ప్రతి రోజు లబ్ధిదారుల ఇంటింటికి వెళ్ళి ఆన్‌లైన్లోనే వారి వివరాలు నమోదు చేసేందుకు అవకాశం ఉంటుంది. దీంతో రికార్డులు తిరగేసే పనిలేకుండా ఒక్క క్లిక్‌తో పని సులభంగా అయిపోవడం, సమయంతో పాటు ఇతర పనులు చేసుకోవచ్చు.

ఇంటర్‌నెట్‌తో సమస్యలు

అంగన్‌వాడీ కార్యకర్తలకు పనిభారం తగ్గించి వివరాల నమోదు ప్రక్రియ వేగవంతం అయ్యేందుకు ప్రభుత్వం అందించే స్మార్ట్‌ఫోన్లకు గ్రామాల్లో ఇంటర్‌నెట్‌ సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రతి పనికి సంబంధించిన వివరాలు ఆన్‌లైన్లో నమోదు చేసేందుకు నెట్‌ వినియోగం అత్యవసరం. కాగా గ్రామాల్లో వివిధ సెల్‌ఫోన్ల కంపనీల ఇంటర్‌నెట్‌ సేవలు ఒక్కోరకంగా ఉంటాయి. సిగ్నల్‌ లేనిచోట మాత్రం స్మార్ట్‌ఫోన్ల వినియోగం సమస్యగా మారే అవకాశం ఉంది.  స్మార్ట్‌ ఫోన్లతో పనులు సులభతరం కానున్నాయి.

స్మార్ట్‌ఫోన్లతో సమయం ఆదా

చిన్నారులు, బాలింతలు, గర్భిణుల వివరాలు రికార్డుల్లో రాసే బదులు స్మార్ట్‌ఫోన్ల వినియోగంతో సమయం ఆదా అవడమే కాకా పని ఒత్తిడి తగ్గి పనులు వేగవంతం అవుతాయి. ఆన్‌లైన్‌ సేవలు కొనసాగడం వల్ల ప్రతి అంగన్‌వాడీ సెంటర్‌ పనితీరు పరిశీలించే వీలుంది.
– సమీమ్‌ సుల్తానా, సూపర్‌వైజర్‌

సద్వినియోగం చేసుకుంటాం

చిన్నారులు, బాలింతలు, గర్భిణుల వివరాలను 14 రికార్డుల్లో నమోదు చేయాలంటే ఇబ్బందులు పడేవాళ్లం. ప్రభుత్వం అందించే స్మార్ట్‌ ఫోన్లను సద్వినియోగం చేసుకుంటాం. దీంతో పనులు వేగవంతం కావడమే కాకా సమయం ఆదా అవుతుంది.
– ఎన్‌. భాగ్యలక్ష్మీ, అంగన్‌వాడీ టీచర్‌

పనిభారం తగ్గుతుంది

ప్రభుత్వం సూచించిన పనులు చేయడానికి కార్యకర్తలకు సమయం దొరకడం లేదు. దీంతో చిన్నారులకు విద్యాబోధన, ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావడంతో అంగన్‌వాడీ కార్యకర్తలకు పనిభారం పెరిగింది. ఆన్‌లైన్‌ నమోదుతో పనులు వేగవంతం అవుతాయి.
– జి. సుజాత,అంగన్‌వాడీ టీచర్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement