fathers day special :telangana jagtial stories - Sakshi
Sakshi News home page

Fathers Day: నాన్న ఎవ్రీడే వారియర్‌..

Published Sun, Jun 20 2021 8:08 AM | Last Updated on Sun, Jun 20 2021 1:25 PM

Fathers Day  Special Stories From Jagtial - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

అమ్మ ఊపిరిపోస్తే.. జీవితాన్ని ఇస్తాడు నాన్న.. తన గుండెలపై నడక నేర్పిస్తాడు నాన్న..ఊహతెలిసే వయసులో మొదటి స్నేహితుడు నాన్న..ఎంత కష్టమైనా కన్నీళ్లు రాకుండా చూసుకుంటాడు నాన్న..
పిల్లలు ఎదిగిన కొద్ది మొదట గర్వించేది నాన్న..బిడ్డల భవిష్యత్‌కోసం కొవ్వొత్తిలా కరిగేది నాన్న..ఆపదలో ఆత్మరక్షణగా నిలిచేది నాన్న..ప్రాణాపాయంలో ఊపిరిపోసేది నాన్న.. అందుకే నాన్న.. ఎవ్రీడే వారియర్‌ .. ప్రతీ మనిషి నిండు జీవితానికి దిక్సూచి నాన్న. బిడ్డ వేలు పట్టి నడిపించడమే కాదు, వెన్ను తట్టి జీవన యానానికి ప్రోత్సహించడమూ తండ్రికే చెల్లింది. కరోనా లాంటి మహమ్మారి తన బిడ్డలను మింగేయాలని చూసిన తరుణంలో కూడా చెదరని ఆత్మవిశ్వాసంతో బిడ్డల రక్షణ కోసం వ్యయ, ప్రయాసాలకు ఓర్చిన త్యాగమూర్తులు ఎందరో. కుటుంబం మొత్తం పాజిటివ్‌ వచ్చినా.. పిల్లలు క్లిష్టపరిస్థితిలో ఉన్నా ధైర్యం కోల్పోకుండా కొత్త ఊపిరిపోశారు. కరోనా కాటుకు కొడుకు, బిడ్డలను కోల్పోయి వారి పిల్లల బాధ్యత తీసుకుని తాతే.. తండ్రైన సంఘటనలూ అనేకం. ఇంటి పెద్దగా.. కుటుంబానికి రక్షణ వలయంగా తండ్రి సేవ మరువలేనిది. అందుకే ఏ కొడుకుకైనా.. కూతురుకైనా.. తమ జీవితంలో రియల్‌ హీరో నాన్న అంటారు. నేడు అంతర్జాతీయ ఫాదర్స్‌డే సందర్భంగా కథనం..

కొడుకు పోయిండు.. కుర్చే మిగిలింది..
సాక్షి, జగిత్యాల: పక్క ఫొటోలో కటింగ్‌ చేస్తున్న పెద్దాయన కోరుట్లకు చెందిన సాయన్న. ఇద్దరు కొడుకులు ధనుంజయ్, సురేశ్‌ (34), కూతురు ఉంది. చిన్న కొడుకు సురేశ్‌తో కలిసి కటింగ్‌షాపును నిర్వహిస్తుండేవాడు. సాఫీగా సాగుతున్న వీరి కుటుంబంలో కరోనా కల్లోలం సృష్టించింది. సురేశ్‌ మే మూడోవారంలో కరోనా బారిన పడ్డాడు.హోం క్వారంటైన్‌లో ఉన్న కొడుకుకు సాయన్ననే అన్నీ తానై సేవలు చేశాడు. ఆరో రోజు శ్వాస ఇబ్బందులు వచ్చాయి. కరీంనగర్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. తదుపరి సాయన్న, అతని భార్య దేవక్క, తమ్ముడు దిలీప్, సురేశ్‌ భార్య సునీత కరోనాబారిన పడి హోం క్వారంటైన్‌లో ఉండగా.. వారి బంధువులు సురేశ్‌ దగ్గర ఉండిపోయారు. చికిత్స పొందుతున్న సురేశ్‌ మే 26న చనిపోయాడు. అతన్ని కాపాడుకునేందుకు సాయన్న రూ.5లక్షలు ఖర్చు చేశాడు. అదే సమయంలో సాయన్న ఆరోగ్యం సైతం విషమించింది. జగిత్యాలలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చేరాడు. సురేశ్‌ చని పోయిన విషయాన్ని సాయన్నకు ఎవరూ చెప్పలేదు. రెండు రోజుల తర్వాత చెప్పడంతో కుమిలిపోయాడు. అదేబాధలోనే వారం రోజులకు సాయన్న, అతని కుటుంబసభ్యులందరూ కోలుకున్నారు. వీరందరికి కలిపి మరో లక్ష ఖర్చయింది. అటు కుటుంబ పోషణ, ఇప్పుడు అప్పుల భారం నుంచి బయటపడేందుకు సాయన్న రోజూ మళ్లీ సెలూన్‌ తీసి పనిచేస్తున్నాడు. కానీ.. పక్కనే ఖాళీగా కనిపిస్తున్న కుర్చీని చూస్తూ నిత్యం తన కొడుకునే గుర్తు తెచ్చుకుంటున్నాడు. 

మనవళ్లలో కొడుకును చూసుకుంటూ..
రామగిరి మండలం బేగంపేట గ్రామానికి చెందిన కుడికాల మల్లేశ్‌ సింగరేణి రిటైర్డ్‌ కార్మికుడు. భార్య మల్లమ్మ, ముగ్గురు కొడుకులు, కూతురు ఉన్నారు. మూడో కొడుకు మల్లేశ్‌ 13 ఏళ్లుగా ముత్తారం మండలం అడవిశ్రీరాంపూర్‌ గ్రామంలో మెడికల్‌షాపు నిర్వహిస్తూ.. భార్య సృజన, కొడుకులు శ్రీచరణ్, మణిదీప్‌లను పోషిస్తున్నాడు. గత మే నెలలో మల్లేశ్‌(కొడుకు) కరోనా బారిన పడ్డాడు. నాలుగురోజులకు శ్వాస తీసుకోవడం కష్టంగా మారడంతో కరీంనగర్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చేరాడు. భర్త బాగోగులు చూసుకుంటున్న క్రమంలో సృజన కూడా వైరస్‌బారిన పడి అదే ఆస్పత్రిలో అడ్మిట్‌ అయ్యింది. ఇద్దరికి వైద్యానికి తల్లిదండ్రులు సుమారు రూ.12లక్షలు అప్పుచేసి ఖర్చు చేశారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో గత నెల 26న మల్లేశ్, 27న సృజన మృతిచెందారు. అప్పటి నుంచి ఇద్దరు చిన్నారులను నానమ్మ, తాతయ్య మల్లేశ్, మల్లమ్మ చేరదీశారు. కరోనాతో దూరమైన కొడుకు కోడలును చిన్నారుల్లో చూసుకుంటూ.. నిత్యం బాధపడుతున్నారు. ‘పోయిన కొడుకు కోడలును మనవళ్ల ముఖంలో చూసుకుంటాం. ఎలాంటి ఇబ్బందులు రాకుండా పోషించుకుంటాం. ఉన్నతంగా చదివించి మంచి భవిష్యత్‌ అందిస్తామని’ మల్లేశ్‌ చెబుతున్నాడు.

అనుక్షణం.. ఒక నరకం
మెట్‌పల్లి పట్టణానికి చెందిన సత్యనారాయణ కిరాణాషాపు నిర్వహిస్తుంటాడు. భార్య భవాని, కూతుళ్లు నందిని(15), ప్రజ్ఞ(7) ఉన్నారు. సెకండ్‌వేవ్‌ మొదట్లో సత్యనారాయణతో పాటు భార్యాపిల్లలకు పాజిటివ్‌ వచ్చింది. దంపతులకు సమస్య లేకపోయినప్పటికీ.. పిల్లలిద్దరు పదిరోజుల పాటు ఆహారం తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు. బలహీనులయ్యారు. కంగారుపడిన సత్యనారాయణ ఏదైనా ప్రయివేటు ఆస్పత్రికి పిల్లలను తీసుకెళ్లాలని అనుకున్నాడు. ఇంట్లో ఉంటేనే ఉత్తమం అని స్నేహితులు ఇచ్చిన సలహాతో హోం ఐసోలేషన్‌లోనే ఉంచుతూ.. నిత్యం ధైర్యం చెబుతూ చిన్నారులను చూసుకున్నాడు. పదిరోజులకు కొంత కోలుకున్నారు. తరువాత మంచి ఆహారం అందించడంతో నిత్యం వారి పరిస్థితిని గమనించడం, డాక్టర్‌ సలహాలు తీసుకోవడంతో 20 రోజులకు కోలుకున్నారు. తరువాత కుటుంబం మొత్తం పరీక్ష చేయించుకోగా.. నెగెటివ్‌ వచ్చింది. ఇప్పడు సంతోషంగా వారి పనులు చేసుకుంటున్నారు. ‘పిల్లలే నా ప్రపంచం. వారికి పాజిటివ్‌ వచ్చిన సమయంలో ఒక్కరోజు అన్నం తినకుంటే నాకు నిద్ర పట్టేది కాదు. ప్రతీక్షణం యుగంగా గడిచింది. దేవుడికి మొక్కని రోజులేదు. నేను ధైర్యంగా ఉంటూ.. పిల్లలకు భయం లేకుండా చేశాను. ఫలితంగా కుటుంబం మొత్తం కరోనాను జయించాం.’ అని సత్యనారాయణ సంతోషం వ్యక్తం చేశాడు.

పిల్లలను మిస్‌ అయ్యాను
కరోనా ప్రారంభమైనప్పటి నుంచి కుటుంబాన్ని చాలా వరకు మిస్‌ అవుతున్నా. నా భార్య రాధిక, కొడుకు రాజశేఖర్‌రెడ్డి, కూతురు దీపక హైదరాబాద్‌లో ఉంటారు. చాలా సార్లు కుటుంబంతో గడపాలని ఉన్నా.. విపత్కర పరిస్థితుల్లో అన్ని ప్రాంతాలు సంచరిస్తూ అందరినీ కలుస్తుంటాం కాబట్టి పిల్లలను చూడాలనిపించినప్పుడు వీడియో కాల్‌ మాట్లాడేవాన్ని. కరోనా పరిస్థితుల్లో ప్రతిరోజూ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పా. వాళ్లు కూడా నా శ్రేయస్సు గురించి చెప్పేవారు.

– వీబీ. కమలాసన్‌రెడ్డి, కరీంనగర్‌ సీపీ

తండ్రి ధైర్యం.. బిడ్డ సేఫ్‌
సిరిసిల్లకు చెందిన బోనాల సత్యం స్థానికంగా ల్యాబ్‌ టెక్నీషియన్‌. భార్య పద్మశ్రీ ప్ర భుత్వ ఉపాధ్యాయురాలు. కొడుకు రాజేశ్‌ డాక్టర్‌. కూతురు స్వాతి, మనవరాలు రుచిత కలిసే ఉంటారు. గత ఆగస్టు 13న ఓ పెళ్లికి వెళ్లి వచ్చిన సత్యం కరోనా బారిన పడ్డారు. రెండు, మూడు రోజుల్లో ఇంటిల్లిపాదికి వైరస్‌ సోకింది. డాక్టర్‌గా పనిచేస్తున్న కొడుకు రాజేశ్‌ సూచనతో ఆస్పత్రిలో చేరాలని అనుకున్నారు. అప్పటికే కూతురు స్వాతి గర్భిణికాగా.. డెలివరీ టైమ్‌ కూడా. పాజిటివ్‌ ఉన్న స్వాతికి ప్రస వం చేసేందుకు స్థానిక డాక్టర్లు ధైర్యం చేయలేదు. తండ్రి ధైర్యంచేసి స్వాతిని కారులో హైదరాబాద్‌ తీసుకెళ్లాడు. ఓ ఆస్పత్రిలో డెలివరీ అయిన తరువాత ఐదు రోజుల్లో డిశ్చార్జ్‌ చేశారు. తిరిగి సిరిసిల్లకు వచ్చాక కొడుకుతో కలిసి సత్యం ప్రభుత్వాసుపత్రిలో ఐసోలేషన్‌లో చేరారు. పక్షం రోజుల్లో అంతా మామూలు స్థితికి చేరుకున్నారు. ‘కొడుకు నేను పక్కపక్క బెడ్లలోనే చికిత్స తీసుకున్నాం. ఆ రోజు లు మళ్లీ రావొద్దని కోరుకుంటున్నా. ఇప్పుడు క్షేమంగా ఉన్నాం’ అని సత్యం పేర్కొన్నాడు.

కొడుకు కోసం విదేశాల నుంచి..
బుగ్గారం మండలం సిరికొండకు చెందిన వంచిత ధర్మరాజుకు తల్లి మల్లవ్వ, భార్య గంగవ్వ, కొడుకులు రాహుల్, శ్రీయాన్స్‌ ఉన్నారు. ధర్మరాజు ఉపాధి నిమిత్తం గల్ఫ్‌ వెళ్తుంటాడు. సెకండ్‌వేవ్‌లో రాహుల్‌ కరోనా బారిన పడ్డాడు. ఇల్లు చిన్నదికావడంతో తెలిసినవాళ్ల గొర్రెలషెడ్డులో క్వారంటైన్లో ఉంచారు. కొద్దిరోజులకు ధర్మరాజు తల్లి మల్లవ్వ కూడా వైరస్‌ బారిన పడింది. ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రిలో చేర్పించారు. చిన్నకొడుకుకు వైరస్‌ సోకకుండా ఉండేందుకు గంగవ్వ పుట్టింటికి వెళ్లింది. రాహుల్, మల్లవ్వల బాగోగులను సమీప బంధువులు చూసుకోసాగారు. గల్ఫ్‌లో ఉన్న ధర్మరాజు ఇక్కడి పరిస్థితి చూసి చలించిపోయాడు. కొడుకుల కన్నా ఏదీ ముఖ్యం కాదనుకున్నాడు. వెంటనే గల్ఫ్‌  నుంచి అతికష్టంమీద వచ్చేశాడు. అందరి బాగోగులు దగ్గరుండి చూసుకున్నాడు. మంచి ఆహారం ఇచ్చి వైరస్‌నుంచి బయటపడేలా చేశాడు. ప్రస్తుతం స్థానికంగానే ఉంటున్నాడు. ‘పిల్లల కన్నా ఏదీ ముఖ్యం కాదు. నేను వచ్చాకే మా వాళ్లకు ధైర్యం వచ్చింది’ అని ధర్మరాజు చెప్పాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement