జగిత్యాల మండలంలోని అంతర్గాం ఈత వనం
సాక్షి, జగిత్యాల: గ్రామాల్లో ఈత, తాటి కల్లును అమ్ముకుని, ఆయా గ్రామాల్లోని గీత కార్మికులు జీవనం సాగిస్తుంటారు. కాని ప్రస్తుతం గ్రామాల్లో ఈత, తాటి చెట్లు తగ్గుతుండటంతో, పాటుగా కొన్ని రకాల తెగుళ్లు వ్యాపించి ఉన్న చెట్లు సైతం కల్లుగీతకు పనికి రాకుండా పోతున్నాయి. దీంతో, గీత కార్మికులకు ఉపాధి దొరకక రోడ్డున పడే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కల్లుగీతపైనే ఆధారపడిన గ్రామాల్లో గీత కార్మికుల సంఘాల తరుపున భూములు కొనుగోలు చేయడం లేదా ప్రభుత్వ భూములను లీజు ప్రతిపాదికన తీసుకుంటున్నారు. ఇందులో ప్రభుత్వ సహాకారంతో వినూత్న పద్ధతిలో ఈత వనాలు పెంచేందుకు ప్రయత్నిస్తూ విజయవంతమవుతున్నారు.
జిల్లాలో తొలుత నాగులపేట సంఘం
జగిత్యాల జిల్లాలో తొలుత కోరుట్ల మండలంలోని నాగులపేట గీత కార్మిక సంఘం ఈత వనాల పెంపకంలో ఇతర గ్రామాల గీత కార్మికులకు ఆదర్శంగా మారారు. ఆ గ్రామంలో 70 మంది గీత కార్మికులు కల్లుగీతపైనే ఆధారపడతారు. ఈత వనాల సంఖ్య తగ్గిపోవడంతో, గ్రామంలో ఓ 20 ఎకరాల వరకు కొనుగోలు చేసి, ఈత వనాన్ని ఓ పద్ధతి ప్రకారం మూడేళ్లుగా పెంచి, నాలుగవ ఏడాది నుంచి కల్లు గీస్తూ ఉపాధి పొందుతున్నారు.
మొక్కల నర్సరీ నుంచి మంచి నాణ్యమైన ఈత మొక్కలను తీసుకుని 4 5 పద్ధతిలో నాటారు. నాటే ముందు డీఏపీ వంటి ఎరువులను వాడారు. ఎప్పటికప్పుడు కింది కొమ్మలను కత్తిరించి, ప్రతీ ఏటా ఎరువులు వేస్తూ కల్లు దిగుబడిని తీస్తున్నారు. మొక్కలను పెట్టిన సమయంలో నీటి ఎద్దడికి గురికాకుండా ఓ కూలీ మనిషిని పెట్టి విజయవంతంగా ఈతవనాన్ని పోషించి సక్సెస్ అయ్యారు. ప్రస్తుతం ఇందులో 2500 వరకు ఈత చెట్లు ఉన్నాయి.
రెండో గ్రామంగా అంతర్గాం సంఘం ఆదర్శం
జగిత్యాల మండలంలోని అంతర్గాం గీత కార్మికులు మాజీ జెడ్పీటీసీ జితేందర్‌రావు నేతృత్వంలో నాగులపేట ఈతవనాన్ని సందర్శించి, మూడేళ్ల క్రితం వీరు సైతం ఈత వనాన్ని పెంచారు. వీరు మరింత ముందడుగు వేసి డ్రిప్ ద్వారా సాగు నీటితో పాటు ఎరువులను కూడా అందిస్తున్నారు. దాదాపు 100 మంది సంఘ సభ్యులు, దాదాపు 5వేల మొక్కలను, 9‘‘9 పద్ధతిలో 8 ఎకరాల్లో నాటారు. ఒక్కో మొక్కకు రూ.25 చొప్పున సంగారెడ్డిలోని నర్సరీల నుంచి కొనుగోలు చేసి తీసుకొచ్చారు. దాదాపు మూడేళ్ల క్రితం ఈత మొక్కలను నాటగా, ప్రస్తుతం ఏపుగా పెరిగాయి. మరో ఏడాదిలో కల్లు గీతకు వచ్చే అవకాశం ఉంది. పక్కకు చెరుకు కట్ట ఉండగా, ఆ కట్టకు సైతం ఈత మొక్కలను నాటారు. నాటేందుకు ముందు కోళ్ల ఎరువును వేయగా, యూరియా, పొటాష్‌ను డ్రిప్ ద్వారా నేరుగా మొక్కల మొదళ్ల దగ్గర పడేలా చేశారు. అలాగే ఈత వనంలో కలుపు మొక్కలు పెరగకుండా ట్రాక్టర్‌తో అంతర కృషి చేస్తున్నారు.
పలువురు ప్రముఖుల సందర్శన
అంతర్గాం గీత కార్మికులు పెంచిన ఈతవనాన్ని ఇప్పటికే అప్పటి రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు, వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ పరిశీలించి, ఇతర గ్రామాల్లో సైతం డ్రిప్ ద్వారా ఈత వనం పెంచేందుకు చర్యలు తీసుకుంటామని ప్రకటించడం విశేషం. అలాగే ఉద్యానశాఖ కమిషనర్ వెంకట్రామిరెడ్డితో పాటు మంత్రి హరీష్‌రావు సూచన మేరకు సిద్దిపేట నియోజకవర్గంలోని గీత కార్మికులు సైతం అంతర్గాంలోని ఈతవనాన్ని పరిశీలించి వెళ్లారు. ఈ రెండు గ్రామాల్లోని ఈత వనాలను చూసిన గీతకార్మికులు, జగిత్యాల మండలంలోని మోతె, జగిత్యాల, అంతర్గాం, అంబారిపేట గీత కార్మికులు ఈతవనాన్ని పెంచేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టడం గమనార్హం.
పల్లె కల్లు పట్నం కోసం..
ఈత చెట్ల నుంచి వచ్చే కల్లును మార్కెటింగ్ చేసేందుకు కూడా గీతకార్మికులు ఇప్పటి నుంచి ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు. ఇక అమ్మగా, మిగిలిపోయిన ఈత కల్లును పట్నం పంపించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు ఒక్కో ఈత చెట్టుకు కనీసం 5 లీటర్ల కల్లు వస్తుంది, 5వేల ఈత చెట్లకు 25వేల లీటర్ల కల్లు వస్తుంది. ఇంత కల్లు గ్రామంలో కాని, సమీప పట్టణ ప్రాంతాల్లో కాని అమ్ముడు పోదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ సహాకారంతో అంతర్గాం కల్లు హైద్రాబాద్ పట్నానికి పంపేలా సైతం ప్రభుత్వ ప్రతినిధులతో చర్చలు చేస్తున్నారు. దీనివల్ల గీత కార్మికులకు మంచి అదాయం రావడమే కాకుండా, రుచికరమైన నాణ్యమైన ఈత కల్లు ఈత కల్లు తాగే ప్రియులకు వరంగా మారనుంది. కార్యక్రమం వల్ల ఇరువర్గాలకు సైతం లాభం చేకూరనుంది.
మా ఈత వనాన్ని చూసి వెళ్లారు
కొన్నేళ్లుగా మా సంఘం భూమి వృథాగా ఉండటంతో, మూడేళ్ల క్రితం ఈత వనాన్ని పెంచాం. ఈత వనాన్ని పెంచడం వల్ల మా సంఘంలోని 100 మంది సభ్యులకు ఉపాధి దొరికే అవకాశం ఏర్పడింది. మా ఈత వనాన్ని చూసి చాలామంది గౌడ కులస్తులు మా బాటలో ఈత మొక్కలను పెంచేందుకు ముందుకు వస్తుండటం చాలా సంతోషంగా ఉంది.
– గొడిసెల శంకర్ గౌడ్ , గౌడ సంఘం నాయకుడు, అంతర్గాం
Comments
Please login to add a commentAdd a comment