సాక్షి,భువనగిరి : పోలింగ్ రోజు సాధారణ ఓటర్లతో పాటు ఇతర ఓటర్లు కూడా తమ హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ప్రత్యేక పరిస్థితుల్లో నిబంధనల ప్రకారం మాత్రమే ఈ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఇందులో టెండరు ఓటు, చాలెంజ్ ఓటు, పోస్టల్ బ్యాలెట్ ఓటు లాంటివి ఉంటాయి.
టెండర్ ఓటు:
కొన్ని సమయాల్లో ఓటరు ఓటు వేయడానికి వచ్చేసరికి అతని ఓటును ఇంకా ఎవరో వేసి వెళ్లడం చూస్తాం. అలాంటి సందర్భంలో సదరు ఓటరు వివరాలను ప్రీసైడింగ్ అధికారి పరిశీలిస్తారు.అతడు వాస్తవంగా ఓటు వేయలేదని నిర్ధారణకు వస్తే అతడికి ఈవీఎం ద్వారా కాకుండా బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటు వేసే అవకాశం కల్పిస్తారు.దీనిని టెండర్ ఓటు అంటారు. ఇందుకోసం ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో 20చొప్పున బ్యాలెట్ పేపర్లు అందుబాటులో ఉంటాయి. ఈబ్యాలెట్‌ను తీసుకుని ఓటర్ కంపార్ట్‌మెంట్‌లోకి వెళ్లి ఓటు వేసి ఆపత్రాలను కవర్‌లో పెట్టి ప్రీసైడింగ్ అధికారికి అందజేయాల్సి ఉంటుంది. పత్రం వెనుక ఇంకుతో టెండర్ బ్యాలెట్ అని అధికారులు రాస్తారు.
చాలెంజ్ ఓటు:
ఓటర్ గుర్తింపు విషయంలో అధికారులకు సందేహాలు కలిగిన ఏజెంట్లు అభ్యంతరం చెప్పిన సదరు ఓటర్ గుర్తింపును చాలెంజ్ చేసి రుజువు చేసుకోవాలి.ఉదాహరణకు ఒక వ్యక్తి ఓటు వేయడానికి వచ్చినప్పుడు అతని పేరు తప్పు చెబుతున్నారని ఏజెంట్ అభ్యంతరం తెలిపితే ఓటర్‌ను ఏజెంట్‌ను ప్రీసైడింగ్ అధికారి వద్దకు పంపుతారు. అభ్యంతరం చెప్పిన ఏజెంట్ నుంచే రెండు రూపాయలు చాలెంజ్ ఫీజుగా తీసుకుంటారు.అప్పుడు ఓటర్ వద్ద ఉన్న ఇతర గుర్తింపు వివరాలు అధికారులు పరిశీలిస్తారు.అప్పటికీ సంతృప్తి చెందకపోతే బీఎల్‌ఓను పిలిచి అతని స్థానిక ఓటర్ అవునా కాదా అనే విషయం, పేరు, తండ్రి పేరు లాంటి వివరాలు తెలుసుకుంటారు. అతడు స్థానిక ఓటరై జాబితాలో ఉన్న పేరు వాస్తవం అయితే ఆయనను ఆయన తండ్రి పేరు, చిరునామా లాంటి విషయాల్లో తేడా ఉన్న పెద్దగా పట్టించుకోరు. అప్పుడు ఏజెంట్, ఓటర్ ఇద్దరిలో ఎవరి వాదన సరైంది అని తేలితే వారిని వదిలి మిగతా వారికి ప్రీసైడింగ్ అధికారి మొదటి సారి హెచ్చరిక జారీ చేస్తారు. లేదా ఏజెంట్‌ను ఓటర్‌ను పోలీసులకు అప్పగించవచ్చు.
ఫ్రాక్సీ ఓటు:
కొందరు సర్వీసు ఓటర్లనే ఫ్రాక్సీ ఓటర్లుగా పరిగణిస్తారు. భద్రతా బలగాలు, రక్షణ రంగాల్లో పని చేసేవారు, ఫ్రాక్సీ విధా నం ద్వారా ఓటు హక్కును విని యోగించుకోవచ్చు. ఓటర్ స్థానికంగా లేనందున వారి తరపున ఓ ప్రతి నిధిని ఓటు వేసేందుకు అధికారులు అనుమతిస్తారు. వీరిని క్లాసిఫైడ్ ఓటర్‌గా పరిగణిస్తారు. నియోజకవర్గం, పోలింగ్‌బూత్ పరిధిలోని ఫ్రాక్సీ ఓటర్ వివరాలపై ముందే ఆర్వో ద్వారా ప్రీసైడింగ్ అధికారికి సమాచారం ఉంటుంది. సర్వీసు ఓటర్ తరఫున వచ్చే ఫ్రాక్సీ ఓటర్ ఆపోలింగ్ బూత్ పరిధిలోని మిగతా ఓటర్ల మాదిరిగానే ఓటు వేస్తారు. వీరు కూడా అందరి లాగే ఈవీఎంలో ఓటు వేయాల్సి ఉంటుంది. అయితే సాధారణ ఓటర్లకు కుడిచేతి చూపుడు వేలుకు సిరా చుక్క పెడితే ఫ్రాక్సీ ఓటర్‌కు మధ్య వేలుకు చుక్కపెడుతారు. ఇక తన ఓటు వినియోగించుకున్నప్పుడు అందరి లాగే చూపుడు వేలుకు చుక్క పెడుతారు. అయితే ఫ్రాక్సీ ఓటర్ తన ఓటు కాక ఒక్కరికి మాత్రమే ఓటు వేసే అవకాశం ఉంటుంది.
పోస్టల్ బ్యాలెట్ ఓటు:
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల చివరి జాబితా సిద్ధం కాగానే జిల్లా ఎన్నికల అధికారి రహస్యంగా పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తారు. ఈబ్యాలెట్ పేపర్లు సిద్ధం కాగానే జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సర్వీసు సెక్టార్లలో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ జిల్లా ఎన్నికల కార్యాలయం నుంచి పోస్టల్ బ్యాలెట్ పేపర్ పంపిణీ చేస్తారు. ఈప్రక్రియ నిర్వహణ, రిటర్నింగ్ అధికారి, ఒక ఏఆర్‌తోపాటు, కొందరి సహాయకులను నియమిస్తారు.వీరు పోస్టల్ బ్యాలెట్‌కు, ఉద్యోగులకు పంపిణీ చేయడానికి సిద్ధం చేస్తారు. అదే విధంగా పోస్టల్ బ్యాలెట్ స్వీకరించడానికి ఎన్నికల కార్యాలయంలో ఒక డ్రాప్ బాక్సును రెడీగా ఉంచుతారు.లేదంటే నేరుగా రిటర్నింగ్ అధికారికి అందజేయవచ్చు.పోస్టల్ బ్యాలెట్ పేపర్లు పోలింగ్ తేదీ కన్నా ఒకరోజు ముందు వరకు గాని, ఎన్నికల అధికారుల సూచించిన గడువు లోగా మాత్రమే అధికారులకు అందజేయాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment