Ballot voting
-
తెలంగాణ ఎన్నికలు.. సీఈవో వికాస్‌రాజ్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన సీఈఓ వికాస్‌రాజ్ కీలక కామెంట్స్ చేశారు. బ్యాలెట్ ఓట్ల వివరాలను కూడా ఆయన వెల్లడించారు. ఈసారి బ్యాలెట్ ఓట్లు భారీగా పెరిగినట్టు తెలిపారు వికాస్ రాజ్. కాగా, రాష్ట్ర శాసనసభ ఎన్నికల ఏర్పాట్లపై ఆదివారం ఆయన బీఆర్కేఆర్ భవన్లో మాట్లాడుతూ.. శనివారం నాటికి 1,24,239 మంది ఓటర్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేశారు. గత శాసనసభ ఎన్నికల్లో మొత్తంగా 1,00,135 పోస్టల్ బ్యాలెట్లే నమోదుకాగా.. ఈసారి భారీగా పెరుగుతున్నాయి. ∙కొత్త ఓటర్ల కోసం ఓటరు గుర్తింపు కార్డుల ముద్రణ పూర్తయింది. ఈ ఏడాది 54.39 లక్షల కార్డులను ముద్రించారు. ఇంకా 3 లక్షల కార్డులను బూత్ స్థాయి అధికారుల (బీఎల్ఓ) ద్వారా పంపిణీ చేయాల్సి ఉంది. ∙ 119 శాసనసభ నియోజకవర్గాల్లో మొత్తం 2,290 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా.. అందులో 2,068 మంది పురుషులు, 221 మంది మహిళలు, ఒకరు ట్రాన్స్‌జెండర్ ఉన్నారు. ∙మొత్తం 49 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. 31 జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో నాలుగు చొప్పున కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ∙ఎన్నికల్లో 1.85 లక్షల మంది పోలింగ్ సిబ్బంది, 22 వేల మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు. బీఎల్ఓలను కలుపుకొంటే మొత్తం 2.5లక్షల మంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. ఎన్నికల బందోబస్తు కోసం 45వేల మంది రాష్ట్ర పోలీసులు, 3 వేల మంది అటవీ, ఎక్సైజ్‌శాఖ సిబ్బందితోపాటు 50 కంపెనీల టీఎస్ఎస్పీ, 375 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించనున్నారు. ∙కర్ణాటక, ఏపీ, మహారాష్ట్రల నుంచి 5 వేల మంది చొప్పున, మధ్యప్రదేశ్, తమిళనాడుల నుంచి 2 వేల చొప్పున, ఛత్తీస్‌గఢ్ నుంచి 2,500 మంది కలిపి.. మొత్తంగా 23,500 మంది హోంగార్డులు రాష్ట్ర ఎన్నికల బందోబస్తు విధుల్లో పాల్గొననున్నారు. -
కౌంటింగ్‌కు కౌంటర్
వాషింగ్టన్: అమెరికా ఎన్నికల చరిత్రలోనే ఇదో అసాధారణ నిర్ణయం. విమర్శలు, వివాదాలు, క్షణక్షణం ఉత్కంఠ రేగే పరిస్థితుల మధ్య వ్యవహారం కోర్టు వరకు వెళుతోంది. మొదట్నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓట్లను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు కోర్టుకెక్కుతామని హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా ఓట్ల లెక్కింపు ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయని తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రస్తుతం జరుగుతున్న కౌంటింగ్ అమెరికా ప్రజల్ని మోసం చేయడమేనని ధ్వజమెత్తారు. పోలింగ్ సమయం ముగిసిన తర్వాత కూడా పోస్టల్ బ్యాలెట్‌కు అనుమతించడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన ట్రంప్ దీనిపై సుప్రీంకోర్టుకి వెళతానని స్పష్టం చేశారు. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 2 గంటలకు శ్వేత సౌధంలో తన మద్దతుదారులనుద్దేశించి ట్రంప్ మాట్లాడారు. ‘‘ఈ ఎన్నికల్లో మనమే గెలవబోతున్నాం. నా దృష్టిలో మనమే గెలిచాం. దేశ ప్రయోజనాలను పరిరక్షించడానికి మనం కట్టుబడి ఉన్నాం. అందుకే చట్టాన్ని సద్వినియోగం చేసుకుంటాం’’అని ట్రంప్ చెప్పారు. ‘‘వెంటనే పోస్టల్ బ్యాలెట్లను అనుమతించడం ఆపేయాలి. జో బైడెన్ శిబిరం దేశాన్ని ఇరకాటంలోకి నెట్టేస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో ఇంకా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌కి అనుమతిస్తున్నారు. నవంబర్ 3 అర్థరాత్రి తర్వాత వచ్చే పోస్టల్ బ్యాలెట్లను అనుమతించ కూడదు. అందుకే సుప్రీంకోర్టుకెళతాం’’అని ట్రంప్ తన అనుచరుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. ట్రంప్ మొదట్నుంచి పోస్టల్ బ్యాలెట్‌ని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఈ ఓట్లలో అక్రమాలకు ఆస్కారం ఉందన్నది ఆయన ప్రధాన ఆరోపణ. అయితే కరోనా సంక్షోభం నేపథ్యంలో ఈ సారి సగం మంది ఓటర్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అన్నింటినీ ఎదుర్కొంటాం: డెమొక్రాట్లు ఎన్నికల ఫలితాల్ని నిరోధించడానికి అధ్యక్షుడు ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్నారని డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ శిబిరం విమర్శించింది. ట్రంప్ కోర్టుకి వెళ్లకుండా తమ న్యాయ నిపుణుల బృందం అడ్డుకుంటుందని బైడెన్ క్యాంపైన్ మేనేజర్ ఓ మల్లే డిల్లాన్ ఒక ప్రకటనలో వెల్లడించారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ నిలిపివేయాలని ట్రంప్ పేర్కొనడం అసాధారణం, అవమానకరమని ఆమె మండిపడ్డారు. ట్రంప్ చర్యలు సరైనవి కావన్న డిల్లాన్ ఓటింగ్ నిలిపివేయాలనడం అమెరికా పౌరుల ప్రజాస్వామ్య హక్కుల్ని కాలరాయడమేనని అన్నారు. ట్రంప్ ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎదుర్కోవడానికి తమ న్యాయనిపుణుల బృందం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. అలా చెయ్యడం కుదరదు: అమెరికా పోస్టల్ సర్వీసు కరోనా సంక్షోభం నేపథ్యంలో ఈ సారి రికార్డు స్థాయిలో ఓటర్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆ ఓట్లు అన్నింటీనీ మంగళవారం సాయంత్రానికల్లా కౌంటింగ్ కేంద్రాలకు తరలించాలన్న న్యాయస్థానం ఆదేశాలను పాటించలేమని అమెరికా పోస్టల్ సర్వీసు స్పష్టం చేసింది. ప్రతీ రాష్ట్రంలోనూ రికార్డు స్థాయిలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు రావడం వల్ల సమయం పడుతుందని పోస్టల్ సర్వీసు తరఫు లాయర్ కోర్టులో తన వాదనలు వినిపించారు. కీలక రాష్ట్రాలుగా భావించే డజనుకి పైగా రాష్ట్రాల్లో 3 లక్షలకు పైగా ఓట్లు ఇంకా ఎన్నికల అధికారులకు అప్పగించవలసి ఉంది. -
ఓటేసిన 6 కోట్ల అమెరికన్లు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఈ దఫా ఓటర్లు చురుగ్గా పాల్గొంటున్నారు. ఇప్పటివరకు దాదాపు 5.87 కోట్ల మంది ఎర్లీ బ్యాలెట్ ద్వారా ఓటు వేసినట్లు గణాంకాలు వెల్లడించాయి. 2016 ఎన్నికలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. ఎర్లీ బ్యాలెట్లు ఎక్కువగా ఉంటే కౌంటింగ్ ఆలస్యమయి, రిజల్టు లేటవుతుంటుంది. ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఎర్లీ బాలెట్లు కూడా పెరిగాయని సీఎన్ఎన్ నివేదిక తెలిపింది. కరోనా సంక్షోభంతో ఎక్కువమంది ఓటింగ్ కేంద్రాలకు వెళ్లకుండా ఉండేందుకు మొగ్గు చూపుతున్నారని తెలిపింది. అమెరికాలో సుమారు 24 కోట్లమంది ఓటర్లు ఈ దఫా ఓటు హక్కు ఉపయోగించుకుంటారని యూఎస్ఏ టుడే తెలిపింది. ఇప్పటివరకు ఎర్లీ ఓటు ఉపయోగించుకున్నవారిలో డెమొక్రాట్ మద్దతుదారులు అధికమని(70 శాతం) నివేదిక తెలిపింది. ఫలితాలు ఆలస్యం ఎర్లీ బ్యాలెట్టు లెక్కించేందుకు సమయం పడుతుందని, అందువల్ల ఎన్నికలైన 3వతేదీ అనంతరం వెంటనే ఫలితాలు వచ్చే అవకాశాలు లేవని సీఎన్ఎన్ మరో నివేదికలో తెలిపింది. 2016లో సైతం ఈ ఆలస్యం జరిగిందని, ఈ దఫా జాప్యం మరింత ఎక్కువని పేర్కొంది. ప్రధాన ఎన్నికలు పూర్తయిన తర్వాతనే ఎర్లీ బ్యాలెట్లను లెక్కించే పని మొదలెడతారు. ఇవన్నీ పూర్తి కావడానికి మరో ఒకటి రెండు రోజులు పట్టవచ్చని నివేదిక తెలిపింది. ప్రస్తుతం ఓటయిన 5.87 కోట్ల ఓట్లలో 54 శాతం ఓట్లు కీలకమైన 16 రాష్ట్రాల నుంచి వచ్చాయని వివరించింది. వీటిలో మిన్నిసోటాలో ఎర్లీ ఓట్లు ఈదఫా ఎక్కువగా నమోదయ్యాయని తెలిపింది. అలాగే ఎన్నికల్లో ముందుగా ఓటు ఉపయోగించుకున్న వారిలో యువ ఓటర్ల సంఖ్య బాగా పెరిగిందని పేర్కొంది. గత ఎన్నికల్లో ట్రంప్‌ను ఆదుకున్న కీలక రాష్ట్రాల్లో ఈదఫా మార్పు ఉంటుందని అంచనా వేసింది. టెక్సాస్‌లో ఈదఫా భారీగా ఎర్లీ ఓట్లు పోలయ్యాయి. శతాబ్దిలో లేనంతగా 70 లక్షల మంది అమెరికన్లు ఇప్పటికే ఓటుహక్కును ఉపయోగించుకున్నారు. ఇది ఆ రాష్ట్రంలోని మొత్తం ఓటర్లలో 43 శాతానికి సమానం. -
జవాన్ల ఓటుకూ తూట్లు
కుటుంబాలకు.. స్వస్థలాలకు సుదూరంగా దేశ రక్షణ విధుల్లో తలమునకలయ్యే జవాన్లు వారు.అవసరమైతే ఎన్నికల బందోబస్తు విధుల్లో పాల్గొనడమే తప్ప.. తమ స్వస్థలాల్లో, తమకు నచ్చిన వారికి ఓటు వేసే వెసులుబాటు రక్షణ, పారా మిలటరీ దళాల్లోని జవాన్లకు ఇంతవరకు కల్పించలేదు.ఆ లోటును పూడ్చుతూ సర్వీస్ ఓటర్లుగా పిలిచే ఇటువంటి వారందరికీ ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల నుంచే ఓటు వేసే అవకాశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం కల్పించింది.కానీ ఏం లాభం.. దేశరక్షణకు తుపాకులు చేతబట్టే ఈ జవాన్లకు ఓటు వజ్రాయుధం మాత్రం అందని పరిస్థితి దాపురించింది. పోలింగ్ జరిగి 15 రోజులు దాటినా కనీసం 20 శాతం మందికి కూడా సర్వీస్ బ్యాలెట్లు అందలేదు.ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే పోస్టల్ బ్యాలెట్ల జారీలో అవకతవకలపై ఇప్పటికే రచ్చ జరుగుతోంది. ఈ తరుణంలో సర్వీస్ బ్యాలెట్ల పంపిణీ కూడా అస్తవ్యస్తంగా సాగినట్లు ఫిర్యాదులు, ఆరోపణలు తెరపైకి రావడం సర్వీస్, పోస్టల్ బ్యాలెట్ల జారీలో యంత్రాంగం వ్యవహారశైలిని మరింత ప్రశ్నార్థకం చేస్తోంది. సాక్షి, విశాఖపట్నం: దేశ రక్షణ వ్యవస్థలైన ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ విభాగాలతోపాటు పారా మిలటరీ దళాలుగా పిలిచే బీఎస్ఎఫ్(బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్), సీఆర్పీఎఫ్ (సెంట్రల్ రిజర్వు ప్రొటెక్షన్ ఫోర్స్), ఐటీబీపీ (ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్), సీఐఎస్ఎఫ్ (సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యురిటీ ఫోర్స్), ఎన్ఎస్జీ (నేషనల్ సెక్యురిటీ గార్డ్స్), ఎస్పీజీ (స్పెషల్ ప్రొటెక్షన్ గార్డ్), డిఫెన్స్ సెక్యురిటీ సర్వీసెస్(డీఎస్ఎస్), ఆర్పీఎఫ్(రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్) తదితర విభాగాల్లో పనిచేసే ఉద్యోగులు తమ కుటుంబాలకు, స్వస్థలాలకు దూరంగా ఏళ్ల తరబడి విధులు నిర్వర్తిస్తుంటారు. ఇలా దేశ రక్షణలో నిమగ్నమయ్యే వీరికి ఇప్పటి వరకు ఓటు హక్కు వినియోగించుకునే వెసులుబాటు ఉండే ది కాదు. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల నుంచే ఓటు హక్కు కల్పించారు. దీంతో తమ ప్రాంతాల్లో జరిగే ఎన్నికల్లో.. తమకు నచ్చిన అభ్యర్థులకు ఓటు వేసి ఎన్నుకునే అవకాశం వీరికి లభించింది. దీన్నే సర్వీస్ ఓటు అంటారు. 20 శాతం మందికి మించి అందనిసర్వీస్ ఓటు రక్షణ విభాగాలతోపాటు పారామిలటరీ దళాల్లో పనిచేసేందుకు ఉత్తరాంధ్ర వాసులు పోటీపడుతుంటారు. ఈ కారణంగానే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ సైనికోద్యోగులు వేలల్లోనే ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాలో అయితే లక్షల్లోనే ఉన్నారు. విశాఖ జిల్లాలో కనీసం 20వేల మంది వివిధ దళాల్లో పని చేస్తున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వీరంతా ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో తమ తొలిసారి లభించిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఉవ్విళ్లూరారు. కానీ సరిహద్దుల్లో పనిచేస్తున్న జిల్లాకు చెందిన సైనికోద్యోగుల్లో కనీసం 20 శాతం మందికి కూడా సర్వీస్ బ్యాలెట్లు అందని విషయం బయటపడింది.పోస్టల్ బ్యాలెట్లలోనే కాదు.. సర్వీస్ బ్యాలెట్ల జారీలోనూ జిల్లా యంత్రాంగం ఏ స్థాయిలో నిర్లక్ష్యం ప్రదర్శించిందో దీన్ని బట్టే అర్ధమవుతోంది. ఆర్వో దృష్టికి తీసుకెళ్లిన మాజీ సైనికులు ఇలా సర్వీస్ బ్యాలెట్ పొందని వారి వివరాల కోసం భీమునిపట్నానికి చెందిన శ్రీ చైతన్య ఎక్స్ సర్వీస్‌మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ సర్వే చేసింది. భీమిలి, విశాఖ తూర్పు నియోజకవర్గాల్లో కనీసం 20 శాతం మందికి కూడా అందలేదని గుర్తించారు. ఇలా సర్వీస్ ఓటు అందని సైనికుల జాబితాతో శుక్రవారం భీమిలి అసెంబ్లీ ఆర్వో బాలాత్రిపురసుందరిని కలిసి వినతిపత్రం అందజేశారు. సర్వీస్ ఓటు అందని వారికి కనీసం ఆన్లైన్లో ఓటు హక్కు విని యోగించుకునే అవకాశం కల్పించాలని కోరారు. ఆర్వోను కలిసిన వారిలో అసోసియేషన్ అధ్యక్ష, ఉపాధ్యక్షులు కొయ్య గురాయరెడ్డి, కొయ్య నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి కెప్టెన్ నాన్ చెట్టి, కార్యవర్గ సభ్యులు కేకే రెడ్డి, సురేష్, కోటి, శ్రీనివాస్, కొయ్య రామకృష్ణ, కొయ్య రాంబాబు, చిల్లా దేవి చెట్టి, కొటిరెడ్డి తదితరులున్నారు. అందని అసెంబ్లీ ఓట్లు బ్యాలెట్లు అందుకున్న కొద్దిమందిలో కూడా చాలా మందికి లోక్‌సభ బ్యాలెట్లే తప్ప.. అసెంబ్లీ బ్యాలెట్లు అందలేదని సమాచారం. ఉదాహరణకు కోల్‌కతా సమీపంలోని కృష్ణానగర్ వద్ద ఉన్న బీఎస్ఎఫ్ 99వ బెటాలియన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుళ్లకు లోక్‌సభ బ్యాలెట్ పత్రాలు తప్ప అసెంబ్లీ బ్యాలెట్ పత్రాలు నేటికీ అందలేదు. కమాండెంట్‌ను ఎన్నిసార్లు అడిగినా పోస్ట్‌లో వస్తాయని చెబుతున్నారని విశాఖ జిల్లాకు చెందిన బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఒకరు తమ కుటుంబ సభ్యులకు తెలిపారు. ఆర్మీతో పాటు వివిధ పారామిలటరీ దళాల్లో పనిచేస్తున్న విశాఖ జిల్లాకు చెందిన సైనికుల్లో అత్యధికంగా భీమిలి, విశాఖ తూర్పు, గాజువాక, చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లో ఉన్నారు. ఒక్క భీమిలి నియోజకవర్గంలోనే 1150 మందికిపైగా సైనికులుండగా, వారిలో ఓటు హక్కు వినియోగించుకున్న వారు 265 మందికి మించి లేరని తేలింది. ఇదే రీతిలో మిగిలిన నియోజకవర్గాల్లో కూడా సర్వీసు ఓటు అందని సైనికోద్యోగులు వేలల్లోనే ఉన్నారు. బ్యాలెట్ల జారీ ఇలా.. ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులకు వారు స్వయంగా దరఖాస్తు చేస్తే తప్ప పోస్టల్ బ్యాలెట్ జారీ చేయరు. కానీ సర్వీస్ ఓటర్లయిన జవాన్లు తమ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేయనవసరం లేదు. వీరి సర్వీస్ రికార్డును బట్టి ఎవరు, ఏ ప్రాంతానికి చెందినవారో తెలియజేస్తూ సంబంధిత రక్షణ విభాగాల ద్వారా భారత ఎన్నికల కమిషన్‌కు జాబితాలు పంపిస్తారు. ఈ జాబితాలను రాష్ట్రాల చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ల ద్వారా ఆయా జిల్లా ఎన్నికల అధికారులకు పంపిస్తారు. ఆ జాబితాల ఆధారంగా ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత సర్వీస్ బ్యాలెట్లను సంబంధించిన ఉద్యోగులు పని చేస్తున్న బెటాలియన్ క్యాంప్ కార్యాలయాలకు పంపాలి. పోలింగ్‌కు కనీసం వారం పది రోజుల ముందుగానే క్యాంప్ కార్యాలయాలకు చేరుకునే సర్వీస్ బ్యాలెట్లను సిబ్బంది తీసుకొని తమ ప్రాంతాల్లో పోటీలో ఉన్న అభ్యర్థుల్లో తమకు నచ్చిన వారికి ఓటు వేయాల్సి ఉంటుంది. వీరంతా దేశ రక్షణలో ఉన్న జవాన్లు అయినందున ఏ పార్టీకి అనుకూలంగా ఉండకూడదన్న భావనతో ఈ బ్యాలెట్ పత్రాల్లో పార్టీల గుర్తులుండవు. పో టీ చేసే అభ్యర్థుల పేర్లు మాత్రమే ఆంగ్లంతో పాటు మాతృ భాషల్లో ఉంటాయి. తమకు నచ్చిన పేరు ఎదురుగా టిక్ పెట్టి బ్యాలెట్ బాక్సుల్లో వేయాలి. ఆ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత బ్యాలెట్ బాక్సులను ఎన్నికల కమిషన్ ద్వారా ఆయా జిల్లాలకు పంపిస్తారు. కౌంటింగ్ రోజున తొలుత సర్వీస్ బ్యాలెట్లు, ఆ తర్వాత పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తారు. మావాళ్లకు బ్యాలెట్లు అందలేదు మా కుటుంబ సభ్యుడైన శ్రీనివాసరెడ్డి జబుల్పూర్ వద్ద ఆర్మీలో పనిచేస్తున్నారు. మా బంధువు కొల్లి వెంకటరెడ్డి బెంగుళూరులో డిఫెన్స్ సెక్యురిటీ సర్వీసెస్‌లో పనిచేస్తున్నారు. వీరిద్దరికి సర్వీసు ఓటు వినియోగించుకునే అవకాశం కల్పించలేదు. ఎన్ని సార్లు అడుగుతున్నా పోస్ట్ ద్వారా రావాల్సి ఉందని అంటున్నారే తప్ప ఇప్పటివరకు అందలేదు. –కొయ్య గురాయరెడ్డి, మాజీ సైనికోద్యోగి -
ఓటులోనూ రకాలు..!
సాక్షి,భువనగిరి : పోలింగ్ రోజు సాధారణ ఓటర్లతో పాటు ఇతర ఓటర్లు కూడా తమ హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ప్రత్యేక పరిస్థితుల్లో నిబంధనల ప్రకారం మాత్రమే ఈ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఇందులో టెండరు ఓటు, చాలెంజ్ ఓటు, పోస్టల్ బ్యాలెట్ ఓటు లాంటివి ఉంటాయి. టెండర్ ఓటు: కొన్ని సమయాల్లో ఓటరు ఓటు వేయడానికి వచ్చేసరికి అతని ఓటును ఇంకా ఎవరో వేసి వెళ్లడం చూస్తాం. అలాంటి సందర్భంలో సదరు ఓటరు వివరాలను ప్రీసైడింగ్ అధికారి పరిశీలిస్తారు.అతడు వాస్తవంగా ఓటు వేయలేదని నిర్ధారణకు వస్తే అతడికి ఈవీఎం ద్వారా కాకుండా బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటు వేసే అవకాశం కల్పిస్తారు.దీనిని టెండర్ ఓటు అంటారు. ఇందుకోసం ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో 20చొప్పున బ్యాలెట్ పేపర్లు అందుబాటులో ఉంటాయి. ఈబ్యాలెట్ను తీసుకుని ఓటర్ కంపార్ట్మెంట్లోకి వెళ్లి ఓటు వేసి ఆపత్రాలను కవర్లో పెట్టి ప్రీసైడింగ్ అధికారికి అందజేయాల్సి ఉంటుంది. పత్రం వెనుక ఇంకుతో టెండర్ బ్యాలెట్ అని అధికారులు రాస్తారు. చాలెంజ్ ఓటు: ఓటర్ గుర్తింపు విషయంలో అధికారులకు సందేహాలు కలిగిన ఏజెంట్లు అభ్యంతరం చెప్పిన సదరు ఓటర్ గుర్తింపును చాలెంజ్ చేసి రుజువు చేసుకోవాలి.ఉదాహరణకు ఒక వ్యక్తి ఓటు వేయడానికి వచ్చినప్పుడు అతని పేరు తప్పు చెబుతున్నారని ఏజెంట్ అభ్యంతరం తెలిపితే ఓటర్ను ఏజెంట్‌ను ప్రీసైడింగ్ అధికారి వద్దకు పంపుతారు. అభ్యంతరం చెప్పిన ఏజెంట్ నుంచే రెండు రూపాయలు చాలెంజ్ ఫీజుగా తీసుకుంటారు.అప్పుడు ఓటర్ వద్ద ఉన్న ఇతర గుర్తింపు వివరాలు అధికారులు పరిశీలిస్తారు.అప్పటికీ సంతృప్తి చెందకపోతే బీఎల్ఓను పిలిచి అతని స్థానిక ఓటర్ అవునా కాదా అనే విషయం, పేరు, తండ్రి పేరు లాంటి వివరాలు తెలుసుకుంటారు. అతడు స్థానిక ఓటరై జాబితాలో ఉన్న పేరు వాస్తవం అయితే ఆయనను ఆయన తండ్రి పేరు, చిరునామా లాంటి విషయాల్లో తేడా ఉన్న పెద్దగా పట్టించుకోరు. అప్పుడు ఏజెంట్, ఓటర్ ఇద్దరిలో ఎవరి వాదన సరైంది అని తేలితే వారిని వదిలి మిగతా వారికి ప్రీసైడింగ్ అధికారి మొదటి సారి హెచ్చరిక జారీ చేస్తారు. లేదా ఏజెంట్‌ను ఓటర్ను పోలీసులకు అప్పగించవచ్చు. ఫ్రాక్సీ ఓటు: కొందరు సర్వీసు ఓటర్లనే ఫ్రాక్సీ ఓటర్లుగా పరిగణిస్తారు. భద్రతా బలగాలు, రక్షణ రంగాల్లో పని చేసేవారు, ఫ్రాక్సీ విధా నం ద్వారా ఓటు హక్కును విని యోగించుకోవచ్చు. ఓటర్ స్థానికంగా లేనందున వారి తరపున ఓ ప్రతి నిధిని ఓటు వేసేందుకు అధికారులు అనుమతిస్తారు. వీరిని క్లాసిఫైడ్ ఓటర్‌గా పరిగణిస్తారు. నియోజకవర్గం, పోలింగ్‌బూత్ పరిధిలోని ఫ్రాక్సీ ఓటర్ వివరాలపై ముందే ఆర్వో ద్వారా ప్రీసైడింగ్ అధికారికి సమాచారం ఉంటుంది. సర్వీసు ఓటర్ తరఫున వచ్చే ఫ్రాక్సీ ఓటర్ ఆపోలింగ్ బూత్ పరిధిలోని మిగతా ఓటర్ల మాదిరిగానే ఓటు వేస్తారు. వీరు కూడా అందరి లాగే ఈవీఎంలో ఓటు వేయాల్సి ఉంటుంది. అయితే సాధారణ ఓటర్లకు కుడిచేతి చూపుడు వేలుకు సిరా చుక్క పెడితే ఫ్రాక్సీ ఓటర్‌కు మధ్య వేలుకు చుక్కపెడుతారు. ఇక తన ఓటు వినియోగించుకున్నప్పుడు అందరి లాగే చూపుడు వేలుకు చుక్క పెడుతారు. అయితే ఫ్రాక్సీ ఓటర్ తన ఓటు కాక ఒక్కరికి మాత్రమే ఓటు వేసే అవకాశం ఉంటుంది. పోస్టల్ బ్యాలెట్ ఓటు: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల చివరి జాబితా సిద్ధం కాగానే జిల్లా ఎన్నికల అధికారి రహస్యంగా పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తారు. ఈబ్యాలెట్ పేపర్లు సిద్ధం కాగానే జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సర్వీసు సెక్టార్లలో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ జిల్లా ఎన్నికల కార్యాలయం నుంచి పోస్టల్ బ్యాలెట్ పేపర్ పంపిణీ చేస్తారు. ఈప్రక్రియ నిర్వహణ, రిటర్నింగ్ అధికారి, ఒక ఏఆర్‌తోపాటు, కొందరి సహాయకులను నియమిస్తారు.వీరు పోస్టల్ బ్యాలెట్‌కు, ఉద్యోగులకు పంపిణీ చేయడానికి సిద్ధం చేస్తారు. అదే విధంగా పోస్టల్ బ్యాలెట్ స్వీకరించడానికి ఎన్నికల కార్యాలయంలో ఒక డ్రాప్ బాక్సును రెడీగా ఉంచుతారు.లేదంటే నేరుగా రిటర్నింగ్ అధికారికి అందజేయవచ్చు.పోస్టల్ బ్యాలెట్ పేపర్లు పోలింగ్ తేదీ కన్నా ఒకరోజు ముందు వరకు గాని, ఎన్నికల అధికారుల సూచించిన గడువు లోగా మాత్రమే అధికారులకు అందజేయాల్సి ఉంటుంది. -
సమ్మె చేద్దాం!
సాక్షి, చెన్నై:రైల్వే కార్మికులు సమ్మెకు జై కొట్టారు. 86.8 శాతం మంది సమ్మెకు ఆమోదం తెలియజేశారు. బ్యాలెట్ ఓటింగ్‌తో సమ్మె నిర్ణయానికి విజయం చేకూర్చారు. ఏఐఆర్ఎఫ్ సభల్లో చర్చ అనంతరం రైల్వే శాఖకు సమ్మె నోటీసు జారీ చేయనున్నట్లు ఎస్ఆర్ఎంయూ ప్రధాన కార్యదర్శి ఎన్.కన్నయ్య ప్రకటించారు. తమ డిమాండ్ల సాధన కోసం రైల్వే కార్మికులు ఆందోళనలు చేస్తున్నారు. ఇటీవల చేపట్టిన ఆందోళనతో కేంద్రం మెట్టు దిగి వచ్చింది. 38 డిమాండ్లలో రెండింటినీ మాత్రమే అంగీకరించింది. మిగిలిన 36 డిమాండ్లను కేంద్రం పెడచెవిన పెట్టింది. ఇందులో వీఆర్ఎస్ తీసుకునే సిబ్బంది వారసులకు విద్యార్హత ఆధారంగా ఉద్యోగ కల్పన, పెన్షన్ విధానంలో ఎన్పీఎస్ను రద్దు చేసి జీపీఎస్‌ను అమలు చేయాలి, ఆర్ఆర్బీ, ఆర్‌ఆర్‌సీలో రైల్వే ఉద్యోగులకు 20 శాతం సీట్లు కేటాయించాలి, రైల్వేలో ఖాళీలన్నింటనీ భర్తీ చేయాలి, సీసీఎల్‌ను ఎఫ్‌సీఎల్‌గా మార్చాలన్న డిమాండ్లు ఉన్నాయి. ఈ డిమాండ్ల సాధనే లక్ష్యంగా సమ్మె సైరన్ మొగించేందుకు రైల్వే కార్మికులు నిర్ణయించారు.ఓటింగ్ : ఇటీవల ఢిల్లీలో జరిగిన అఖిల భారత రైల్వే కార్మికుల సమాఖ్య మహానాడులో చేసిన తీర్మానం మేరకు సమ్మెకు వెళ్లే ముందు కార్మికుల అభిప్రాయం తెలుసుకునేందుకు నిర్ణయించారు. ఏఐఆర్ఎఫ్ పిలుపు మేరకు దక్షిణ రైల్వే పరిధిలో ఓటింగ్‌కు ఎస్ఆర్ఎంయూ చర్యలు తీసుకుంది. ఈనెల 20,21 తేదీల్లో దక్షిణ రైల్వే పరిధిలోని వెయ్యి చోట్ల బ్యాలెట్ ఓటింగ్ నిర్వహించారు. చెన్నై, అరక్కోణం, కాట్పాడి, జోలార్‌పేట, చెంగల్పట్టు , దిండివనం, పెరంబూరు తదితర ప్రాంతాల్లో జరిగిన ఓటింగ్‌లో పెద్ద సంఖ్యలో కార్మికులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 85 శాతం సమ్మెకు సిద్ధం : దక్షిణ రైల్వే పరిధిలో ఉపయోగించిన బ్యాలెట్ బాక్సుల్ని చెన్నైకు తెప్పించి ఆది, సోమ వారాల్లో ఓట్ల లెక్కింపు చేశారు. ఇందులో మెజారిటీ శాతం మంది సమ్మెకు జై కొట్టారు. మంగళవారం ఫలితాల్ని ఎస్ఆర్ఎంయూ ప్రధాన కార్యదర్శి కన్నయ్య మీడియాకు విడుదల చేశారు. దక్షిణ రైల్వే పరిధిలో 89,100 మంది కార్మికులు ఉండగా, 82,147 మంది తమ బ్యాలెట్ ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఇందులో 542 ఓట్లు తిరస్కరణకు గురి అయ్యాయి. 81,605 ఓట్లను పరిగణనలోకి తీసుకున్నారు. 91.6 శాతం ఓటింగ్ నమోదు అయింది. ఫలితాల్లో 77,361 మంది సమ్మెకు జై కొట్టగా, 4244 మంది సమ్మె వద్దు అని ఓటు వేశారు. 86.8 శాతం మంది సమ్మెకు అనుకూలంగా ఓటింగ్ వేయడంతో సైరన్ మొగించేందుకు ఎస్ఆర్ఎంయూ సన్నద్ధం అవుతోంది. కార్మిక లోకం నిర్ణయాన్ని అఖిల భారత సమాఖ్యకు పంపుతున్నామని కన్నయ్య పేర్కొన్నారు. ఆ సమాఖ్య మహా సభ జనవరిలో జరగనున్నదని, ఇందులో తీసుకునే నిర్ణయం మేరకు సమ్మె నోటీసునురైల్వే శాఖకు జారీ చేస్తామని పేర్కొన్నారు.