సర్వీస్ బ్యాలెట్ అందని సైనికుల జాబితాలను చూపిస్తున్న మాజీ సైనికోద్యోగులు
కుటుంబాలకు.. స్వస్థలాలకు సుదూరంగా దేశ రక్షణ విధుల్లో తలమునకలయ్యే జవాన్లు వారు.అవసరమైతే ఎన్నికల బందోబస్తు విధుల్లో పాల్గొనడమే తప్ప.. తమ స్వస్థలాల్లో, తమకు నచ్చిన వారికి ఓటు వేసే వెసులుబాటు రక్షణ, పారా మిలటరీ దళాల్లోని జవాన్లకు ఇంతవరకు కల్పించలేదు.ఆ లోటును పూడ్చుతూ సర్వీస్ ఓటర్లుగా పిలిచే ఇటువంటి వారందరికీ ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల నుంచే ఓటు వేసే అవకాశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం కల్పించింది.కానీ ఏం లాభం.. దేశరక్షణకు తుపాకులు చేతబట్టే ఈ జవాన్లకు ఓటు వజ్రాయుధం మాత్రం అందని పరిస్థితి దాపురించింది. పోలింగ్ జరిగి 15 రోజులు దాటినా కనీసం 20 శాతం మందికి కూడా సర్వీస్ బ్యాలెట్లు అందలేదు.ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే పోస్టల్ బ్యాలెట్ల జారీలో అవకతవకలపై ఇప్పటికే రచ్చ జరుగుతోంది. ఈ తరుణంలో సర్వీస్ బ్యాలెట్ల పంపిణీ కూడా అస్తవ్యస్తంగా సాగినట్లు ఫిర్యాదులు, ఆరోపణలు తెరపైకి రావడం సర్వీస్, పోస్టల్ బ్యాలెట్ల జారీలో యంత్రాంగం వ్యవహారశైలిని మరింత ప్రశ్నార్థకం చేస్తోంది.
సాక్షి, విశాఖపట్నం: దేశ రక్షణ వ్యవస్థలైన ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ విభాగాలతోపాటు పారా మిలటరీ దళాలుగా పిలిచే బీఎస్‌ఎఫ్(బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్), సీఆర్‌పీఎఫ్ (సెంట్రల్ రిజర్వు ప్రొటెక్షన్ ఫోర్స్), ఐటీబీపీ (ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్), సీఐఎస్‌ఎఫ్ (సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యురిటీ ఫోర్స్), ఎన్‌ఎస్‌జీ (నేషనల్ సెక్యురిటీ గార్డ్స్), ఎస్‌పీజీ (స్పెషల్ ప్రొటెక్షన్ గార్డ్), డిఫెన్స్ సెక్యురిటీ సర్వీసెస్(డీఎస్‌ఎస్), ఆర్పీఎఫ్(రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్) తదితర విభాగాల్లో పనిచేసే ఉద్యోగులు తమ కుటుంబాలకు, స్వస్థలాలకు దూరంగా ఏళ్ల తరబడి విధులు నిర్వర్తిస్తుంటారు. ఇలా దేశ రక్షణలో నిమగ్నమయ్యే వీరికి ఇప్పటి వరకు ఓటు హక్కు వినియోగించుకునే వెసులుబాటు ఉండే ది కాదు. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల నుంచే ఓటు హక్కు కల్పించారు. దీంతో తమ ప్రాంతాల్లో జరిగే ఎన్నికల్లో.. తమకు నచ్చిన అభ్యర్థులకు ఓటు వేసి ఎన్నుకునే అవకాశం వీరికి లభించింది. దీన్నే సర్వీస్ ఓటు అంటారు.
20 శాతం మందికి మించి అందనిసర్వీస్ ఓటు
రక్షణ విభాగాలతోపాటు పారామిలటరీ దళాల్లో పనిచేసేందుకు ఉత్తరాంధ్ర వాసులు పోటీపడుతుంటారు. ఈ కారణంగానే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ సైనికోద్యోగులు వేలల్లోనే ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాలో అయితే లక్షల్లోనే ఉన్నారు. విశాఖ జిల్లాలో కనీసం 20వేల మంది వివిధ దళాల్లో పని చేస్తున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వీరంతా ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో తమ తొలిసారి లభించిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఉవ్విళ్లూరారు. కానీ సరిహద్దుల్లో పనిచేస్తున్న జిల్లాకు చెందిన సైనికోద్యోగుల్లో కనీసం 20 శాతం మందికి కూడా సర్వీస్ బ్యాలెట్లు అందని విషయం బయటపడింది.పోస్టల్ బ్యాలెట్లలోనే కాదు.. సర్వీస్ బ్యాలెట్ల జారీలోనూ జిల్లా యంత్రాంగం ఏ స్థాయిలో నిర్లక్ష్యం ప్రదర్శించిందో దీన్ని బట్టే అర్ధమవుతోంది.
ఆర్వో దృష్టికి తీసుకెళ్లిన మాజీ సైనికులు
ఇలా సర్వీస్ బ్యాలెట్ పొందని వారి వివరాల కోసం భీమునిపట్నానికి చెందిన శ్రీ చైతన్య ఎక్స్ సర్వీస్‌మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ సర్వే చేసింది. భీమిలి, విశాఖ తూర్పు నియోజకవర్గాల్లో కనీసం 20 శాతం మందికి కూడా అందలేదని గుర్తించారు. ఇలా సర్వీస్ ఓటు అందని సైనికుల జాబితాతో శుక్రవారం భీమిలి అసెంబ్లీ ఆర్వో బాలాత్రిపురసుందరిని కలిసి వినతిపత్రం అందజేశారు. సర్వీస్ ఓటు అందని వారికి కనీసం ఆన్‌లైన్‌లో ఓటు హక్కు విని యోగించుకునే అవకాశం కల్పించాలని కోరారు. ఆర్వోను కలిసిన వారిలో అసోసియేషన్ అధ్యక్ష, ఉపాధ్యక్షులు కొయ్య గురాయరెడ్డి, కొయ్య నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి కెప్టెన్ నాన్ చెట్టి, కార్యవర్గ సభ్యులు కేకే రెడ్డి, సురేష్, కోటి, శ్రీనివాస్, కొయ్య రామకృష్ణ, కొయ్య రాంబాబు, చిల్లా దేవి చెట్టి, కొటిరెడ్డి తదితరులున్నారు.
అందని అసెంబ్లీ ఓట్లు
బ్యాలెట్లు అందుకున్న కొద్దిమందిలో కూడా చాలా మందికి లోక్‌సభ బ్యాలెట్లే తప్ప.. అసెంబ్లీ బ్యాలెట్లు అందలేదని సమాచారం. ఉదాహరణకు కోల్‌కతా సమీపంలోని కృష్ణానగర్ వద్ద ఉన్న బీఎస్‌ఎఫ్ 99వ బెటాలియన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుళ్లకు లోక్‌సభ బ్యాలెట్ పత్రాలు తప్ప అసెంబ్లీ బ్యాలెట్ పత్రాలు నేటికీ అందలేదు. కమాండెంట్‌ను ఎన్నిసార్లు అడిగినా పోస్ట్‌లో వస్తాయని చెబుతున్నారని విశాఖ జిల్లాకు చెందిన బీఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ ఒకరు తమ కుటుంబ సభ్యులకు తెలిపారు. ఆర్మీతో పాటు వివిధ పారామిలటరీ దళాల్లో పనిచేస్తున్న విశాఖ జిల్లాకు చెందిన సైనికుల్లో అత్యధికంగా భీమిలి, విశాఖ తూర్పు, గాజువాక, చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లో ఉన్నారు. ఒక్క భీమిలి నియోజకవర్గంలోనే 1150 మందికిపైగా సైనికులుండగా, వారిలో ఓటు హక్కు వినియోగించుకున్న వారు 265 మందికి మించి లేరని తేలింది. ఇదే రీతిలో మిగిలిన నియోజకవర్గాల్లో కూడా సర్వీసు ఓటు అందని సైనికోద్యోగులు వేలల్లోనే ఉన్నారు.
బ్యాలెట్ల జారీ ఇలా..
ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులకు వారు స్వయంగా దరఖాస్తు చేస్తే తప్ప పోస్టల్ బ్యాలెట్ జారీ చేయరు. కానీ సర్వీస్ ఓటర్లయిన జవాన్లు తమ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేయనవసరం లేదు. వీరి సర్వీస్ రికార్డును బట్టి ఎవరు, ఏ ప్రాంతానికి చెందినవారో తెలియజేస్తూ సంబంధిత రక్షణ విభాగాల ద్వారా భారత ఎన్నికల కమిషన్‌కు జాబితాలు పంపిస్తారు. ఈ జాబితాలను రాష్ట్రాల చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ల ద్వారా ఆయా జిల్లా ఎన్నికల అధికారులకు పంపిస్తారు. ఆ జాబితాల ఆధారంగా ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత సర్వీస్ బ్యాలెట్లను సంబంధించిన ఉద్యోగులు పని చేస్తున్న బెటాలియన్ క్యాంప్ కార్యాలయాలకు పంపాలి. పోలింగ్‌కు కనీసం వారం పది రోజుల ముందుగానే క్యాంప్ కార్యాలయాలకు చేరుకునే సర్వీస్ బ్యాలెట్లను సిబ్బంది తీసుకొని తమ ప్రాంతాల్లో పోటీలో ఉన్న అభ్యర్థుల్లో తమకు నచ్చిన వారికి ఓటు వేయాల్సి ఉంటుంది. వీరంతా దేశ రక్షణలో ఉన్న జవాన్లు అయినందున ఏ పార్టీకి అనుకూలంగా ఉండకూడదన్న భావనతో ఈ బ్యాలెట్ పత్రాల్లో పార్టీల గుర్తులుండవు. పో టీ చేసే అభ్యర్థుల పేర్లు మాత్రమే ఆంగ్లంతో పాటు మాతృ భాషల్లో ఉంటాయి. తమకు నచ్చిన పేరు ఎదురుగా టిక్ పెట్టి బ్యాలెట్ బాక్సుల్లో వేయాలి. ఆ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత బ్యాలెట్ బాక్సులను ఎన్నికల కమిషన్ ద్వారా ఆయా జిల్లాలకు పంపిస్తారు. కౌంటింగ్ రోజున తొలుత సర్వీస్ బ్యాలెట్లు, ఆ తర్వాత పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తారు.
మావాళ్లకు బ్యాలెట్లు అందలేదు
మా కుటుంబ సభ్యుడైన శ్రీనివాసరెడ్డి జబుల్‌పూర్ వద్ద ఆర్మీలో పనిచేస్తున్నారు. మా బంధువు కొల్లి వెంకటరెడ్డి బెంగుళూరులో డిఫెన్స్ సెక్యురిటీ సర్వీసెస్‌లో పనిచేస్తున్నారు. వీరిద్దరికి సర్వీసు ఓటు వినియోగించుకునే అవకాశం కల్పించలేదు. ఎన్ని సార్లు అడుగుతున్నా పోస్ట్ ద్వారా రావాల్సి ఉందని అంటున్నారే తప్ప ఇప్పటివరకు అందలేదు. –కొయ్య గురాయరెడ్డి, మాజీ సైనికోద్యోగి
Comments
Please login to add a commentAdd a comment