సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన సీఈఓ వికాస్‌రాజ్ కీలక కామెంట్స్ చేశారు. బ్యాలెట్ ఓట్ల వివరాలను కూడా ఆయన వెల్లడించారు. ఈసారి బ్యాలెట్ ఓట్లు భారీగా పెరిగినట్టు తెలిపారు వికాస్ రాజ్.
కాగా, రాష్ట్ర శాసనసభ ఎన్నికల ఏర్పాట్లపై ఆదివారం ఆయన బీఆర్‌కేఆర్ భవన్‌లో మాట్లాడుతూ.. శనివారం నాటికి 1,24,239 మంది ఓటర్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేశారు. గత శాసనసభ ఎన్నికల్లో మొత్తంగా 1,00,135 పోస్టల్ బ్యాలెట్లే నమోదుకాగా.. ఈసారి భారీగా పెరుగుతున్నాయి. ∙కొత్త ఓటర్ల కోసం ఓటరు గుర్తింపు కార్డుల ముద్రణ పూర్తయింది. ఈ ఏడాది 54.39 లక్షల కార్డులను ముద్రించారు. ఇంకా 3 లక్షల కార్డులను బూత్ స్థాయి అధికారుల (బీఎల్‌ఓ) ద్వారా పంపిణీ చేయాల్సి ఉంది. ∙
119 శాసనసభ నియోజకవర్గాల్లో మొత్తం 2,290 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా.. అందులో 2,068 మంది పురుషులు, 221 మంది మహిళలు, ఒకరు ట్రాన్స్‌జెండర్ ఉన్నారు. ∙మొత్తం 49 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. 31 జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో నాలుగు చొప్పున కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ∙ఎన్నికల్లో 1.85 లక్షల మంది పోలింగ్ సిబ్బంది, 22 వేల మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు. బీఎల్‌ఓలను కలుపుకొంటే మొత్తం 2.5లక్షల మంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు.
ఎన్నికల బందోబస్తు కోసం 45వేల మంది రాష్ట్ర పోలీసులు, 3 వేల మంది అటవీ, ఎక్సైజ్‌శాఖ సిబ్బందితోపాటు 50 కంపెనీల టీఎస్‌ఎస్పీ, 375 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించనున్నారు. ∙కర్ణాటక, ఏపీ, మహారాష్ట్రల నుంచి 5 వేల మంది చొప్పున, మధ్యప్రదేశ్, తమిళనాడుల నుంచి 2 వేల చొప్పున, ఛత్తీస్‌గఢ్ నుంచి 2,500 మంది కలిపి.. మొత్తంగా 23,500 మంది హోంగార్డులు రాష్ట్ర ఎన్నికల బందోబస్తు విధుల్లో పాల్గొననున్నారు.
Comments
Please login to add a commentAdd a comment