తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల 'పోలింగ్‌ 70.66 శాతం'! | Telangana Assembly election 2023 voting ended peacefully | Sakshi
Sakshi News home page

పోలింగ్‌ 70.66 శాతం!

Published Fri, Dec 1 2023 4:40 AM | Last Updated on Fri, Dec 1 2023 8:41 AM

Telangana Assembly election 2023 voting ended peacefully - Sakshi

హైదరాబాద్‌లోని భౌరంపేటలో ఓటు వేయడానికి బారులుతీరిన ఓటర్లు

గడప దాటని సిటీ 
చెంతనే పోలింగ్‌ కేంద్రం.. అయినా సిటీ ఓటరు గడప దాటలేదు. సెలవును సరదాగా గడిపేశారు. ఓటేసేందుకు కదల్లేదు. క్రితంసారితో పోలిస్తే 5% పోలింగ్‌ తగ్గింది. 

పట్నమిలా..హైదరాబాద్‌ భరత్‌నగర్‌లోని పోలింగ్‌ కేంద్రం  


16 కి.మీ. నడిచొచ్చి.. ఓటేసి
వీరంతా ములుగు జిల్లా వాజేడు మండలం కొంగాల పంచాయతీ పరిధిలోని పెనుగోలు ఆదివాసీలు. మూడు గుట్టలు ఎక్కి దిగి, మధ్యలో మూడు వాగులు దాటి 16 కిలోమీటర్లు నడిచి వచ్చి మరీ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తమ గోడు పట్టించుకోవడం లేదని వారు గోడు వెళ్లబోసుకున్నారు. ఈసారి ఎన్నికలకు దూరంగా ఉండాలనుకున్నా.. రాజ్యాంగం కల్పించిన హక్కును ఉపయోగించుకోవాలనే ఇంతదూరం నడిచి వచ్చామని చెప్పారు.   – వాజేడు 

పల్లె ఇలా..

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర శాసనసభ ఎన్నికల పోలింగ్‌ గురువారం ప్రశాంతంగా ముగిసింది. అభ్యర్థుల భవితవ్యం ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల్లో (ఈవీఎం) నిక్షిప్తమైంది. గురువారం రాత్రి వరకు రాష్ట్రవ్యాప్తంగా సుమారుగా 70.66 శాతం పోలింగ్‌ నమోదైందని కేంద్ర ఎన్నికల సంఘం అంచనా వేసింది. కచ్చితమైన గణాంకాలను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వికాస్‌రాజ్‌ శుక్రవారం ప్రకటిస్తారని ఆయన కార్యాలయం తెలిపింది. రాష్ట్ర శాసనసభకు 2014లో జరిగిన ఎన్నికల్లో 69.5 శాతం, 2018 ఎన్నికల్లో 73.2 శాతం పోలింగ్‌ నమోదైంది. తాజా పోలింగ్‌లో కడపటి వార్తలు అందేసరికి 70.66 శాతంగా నమోదైంది. ఇది మరింత పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ నెల 3న (ఆదివారం) ఓట్ల లెక్కింపు నిర్వహించి, ఫలితాలను ప్రకటించనున్నారు. 

అత్యధికంగా జనగామలో.. 
గురువారం సాయంత్రానికల్లా అత్యధికంగా.. మునుగోడు 91.51, ఆలేరు 90.16, భువనగిరి 89.9 శాతం  పోలింగ్‌ నమోదైంది. అత్యల్పంగా యాకూత్‌పురలో 39.69 శాతం, మలక్‌పేట 41, నాంపల్లిలో 42.76, చార్మినార్‌లో 43.26 శాతం పోలింగ్‌ నమోదైంది. 

► జిల్లాల వారీగా పోలింగ్‌ శాతాలను పరిశీలిస్తే.. అత్యధికంగా యాదాద్రి భువనగిరిలో 90.03 శాతం, మెదక్‌లో 86.69శాతం జనగామలో 85.74, నల్లగొండలో 85.49శాతం పోలింగ్‌ నమోదైంది. అత్యల్పంగా హైదరాబాద్‌లో 46.65 శాతం, రంగారెడ్డిలో 59.94 శాతమే ఓట్లు వేశారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్‌ శాతం తగ్గిపోయినట్టు ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 

►మొత్తం 119 నియోజకవర్గాలకుగాను 13 వామ పక్ష తీవ్రవాద ప్రభావిత స్థానాల్లో సాయంత్రం 4 గంటలకు, మిగతా 106 చోట్ల సాయంత్రం 5 గంటలకు పోలింగ్‌ ముగిసింది. అయితే పోలింగ్‌ ముగిసే సమ యానికల్లా.. పోలింగ్‌ కేంద్రాలకు చేరుకుని, క్యూలైన్లలో ఉన్న ఓటర్లందరికీ ఓటేసే అవకాశం కల్పించారు. కొన్నిచోట్ల ఇలా రాత్రి వరకు పో లింగ్‌ సాగింది. ఈ క్రమంలోనే పోలింగ్‌ శాతాలపై శుక్రవారం ఉదయమే స్పష్ట త వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు చెప్తున్నాయి. 

పలుచోట్ల ఆలస్యంగా.. 
అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో ఉదయం 5.30 గంటలకే మాక్‌ పోలింగ్‌ నిర్వహించారు. ఉదయం 7 గంటలకే పోలింగ్‌ మొదలుకావాలి. అ యితే పలుచోట్ల ఈవీఎంలు, ఓటర్‌ వెరిఫయబుల్‌ ఆడిట్‌ ట్రయల్‌ (వీవీ ప్యాట్‌) యంత్రాలు మొరాయించడంతో గంట నుంచి రెండు గంటలు ఆలస్యంగా పోలింగ్‌ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని పోలింగ్‌ కేందాల్లో ఈవీఎంలు మొరాయించాయి? ఎన్నింటిని రిప్లేస్‌ చేశారన్న అంశంపై సీఈఓ కార్యాలయం ప్రకటన జారీ చేయలేదు. 

ఉదయమే బారులు తీరిన ఓటర్లు 
రాష్ట్రవ్యాప్తంగా చాలాచోట్ల ఓటర్లు ఉదయమే పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. దీనితో వడివడిగా ఓటింగ్‌ సాగింది. మధ్యాహ్నం కొంత మందగించినా తర్వాత పుంజుకుంది. ఉదయం 9 గంటల వరకు 7.78 శాతం, 11 గంటల వరకు 20.64 శాతం, మధ్యాహ్నం 3 గంటల సమయానికి 51.89 శాతం, సాయంత్రం 5 గంటలకు 64.42 శాతం పోలింగ్‌ నమోదైంది. కడపటి వార్తలు అందేసరికి 70.66 శాతంగా నమోదైంది. రాత్రి వరకు పలుచోట్ల ఓటింగ్‌ కొనసాగిన నేపథ్యంలో ఆ లెక్క లన్నీ క్రోడీకరించాల్సి ఉంది. దీనితో ఓటింగ్‌ శాతం పెరగనుందని ఎన్నికల సంఘం అంచనా వేసింది. 

తగ్గిన ఓట్ల గల్లంతు ఫిర్యాదులు 
గత శాసనసభ ఎన్నికల సందర్భంగా భారీ సంఖ్యలో ఓట్లు గల్లంతైనట్టు ఆరోపణలు వచ్చాయి. ప్రధానంగా హైదరాబాద్‌ జంట నగరాల్లో లక్షల ఓట్లు తొలగించినట్టు విమర్శలు వచ్చాయి. అయితే ఈసారి ఎన్నికల్లో ఓట్ల గల్లంతుపై ఫిర్యాదులు నామమాత్రంగానే వచ్చాయి. 

వివరాలు వెల్లడించని ఎన్నికల ప్రధానాధికారి 
శాసనసభ ఎన్నికల పోలింగ్‌ ముగిసిన వెంటనే కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధిగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) విలేకరుల సమావేశం నిర్వహించి.. వివరాలను వెల్లడించడం ఆనవాయితీ. అంతేకాదు.. పోలింగ్‌ కొనసాగుతున్న సమయంలోనూ సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించేవారు. అయితే సీఈఓ వికాస్‌రాజ్‌ గురువారం శాసనసభ ఎన్నికల పోలింగ్‌ ముగిశాక ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.

దీంతో మీడియా ప్రతినిధులు సీఈఓ కార్యాలయం ప్రజాసంబంధాల విభాగం అధికారులను సంప్రదించారు. పోలింగ్‌ తీరుపై విలేకరుల సమావేశం నిర్వహించాలని కోరారు. కానీ సీఈఓ వికాస్‌రాజ్‌ అంగీకరించలేదని అధికారులు బదులిచ్చారు. కేవలం పోలింగ్‌ శాతంపై ప్రాథమిక అంచనాలు మినహా ఎలాంటి ఎలాంటి సమాచారాన్ని సీఈఓ కార్యాలయం వెల్లడించలేదు. 

ఈవీఎంల తరలింపుపై ఉద్రిక్తత  
సూర్యాపేట జిల్లా నాగారం మండలం పేరబోయినగూడెంలో అధికారులు ఎస్కార్ట్‌ లేకుండా ఈవీఎంలను తరలిస్తున్నారని, ఈవీఎంలను మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పోలీసులు వచ్చి సర్దిచెప్పడంతో గ్రామస్తులు వెనక్కి తగ్గారు. అయితే ఖాళీ ఈవీఎంలను కారులో తరలిస్తున్న సెక్టోరియల్‌ అధికారిని అడ్డుకుని అద్దాలను ధ్వంసం చేశారు. 

ఇంటింటికీ ఓటింగ్‌కు భారీ స్పందన: సీఈసీ 
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 80ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు కలిపి 25,400 మంది తొలిసారిగా ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకున్నారని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. తొలిసారి కల్పించిన ఈ అవకాశాన్ని ఓటర్లు సది్వనియోగం చేసుకున్నారని ఒక ప్రకటనలో తెలిపింది. 

బందోబస్తుతో ప్రశాంతం 
రాష్ట్రవ్యాప్తంగా పోలీసుశాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి, అనుక్షణం పర్యవేక్షించడంతో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. జిల్లాల్లో పలుచోట్ల చెదురుమదురు ఘటనలు జరిగి, ఉద్రిక్తత నెలకొన్నా అక్కడి పోలీసు సిబ్బంది వేగంగా స్పందించి పరిస్థితిని చక్కదిద్దారు. రాష్ట్ర పోలీస్‌శాఖ నుంచి 45వేల మంది పోలీసు సిబ్బంది, 375 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, కర్నాటక, ఏపీ, మహారాష్ట్రల నుంచి 23,500 మంది హోంగార్డులు బందోబస్తు విధుల్లో పాల్గొన్నారు. మావోయిస్టులు ఎన్నికల బహిష్కరణ పిలుపు ఇచ్చిన నేపథ్యంలో.. ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు ప్రత్యేక జాగ్రత్తలు చేపట్టారు. కూంబింగ్, ఏరియా డామినేషన్‌ సెర్చ్‌ చేపట్టారు. 

ఓటెత్తని హైదరాబాద్‌! 
సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్‌ జిల్లా పరిధిలో రాష్ట్రంలోనే తక్కువగా పో లింగ్‌ నమోదైంది. అధికారులు ఎంతగా అవగాహన కల్పించే ప్రయత్నం చేసినా.. ఎప్పటిలాగే హైదరాబాద్‌ జనం ఓటు వేసేందుకు తరలివెళ్లలేదు. పోలింగ్‌ కేంద్రాల్లో ఎంత క్యూ ఉందో, ఎంత సమయంలో ఓటేయవచ్చో ఆన్‌లైన్‌లో ముందే తెలుసుకునే సదుపాయం కల్పించినా ఫలితం రాలేదు. చాలా వరకు సెలవురోజుగానే భావించి విశ్రాంతి తీసుకునేందుకు, వినోద కార్యక్రమాల్లో మునిగిపోయి ఉండటమే దీనికి కారణమని అధికారవర్గాలు చెప్తున్నాయి.

అంతేగాకుండా ఒకటి కంటే ఎక్కువచోట్లా ఓట్లున్నవారూ ఇక్కడ గణనీయంగా ఉండటం, వారంతా స్వస్థలాలకు తరలడం కూడా పోలింగ్‌ తగ్గడానికి మరో కారణమని పేర్కొంటున్నాయి. హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి వెల్లడించిన సమాచారం మేరకు.. జిల్లాలో కడపటి వార్తలు అందేసరికి 46.65 శాతమే పోలింగ్‌ నమోదైంది. గత అసెంబ్లీ ఎన్నికల (50.51 శాతం)తో పోలిస్తే ఐదు శాతం తగ్గడం గమనార్హం.

జిల్లాల్లో ఓటింగ్‌ తీరు ఇదీ.. 
ఉమ్మడి ఆదిలాబాద్‌.. 
గిరిజన ప్రాంతాల్లో ధాటిగా ఓటింగ్‌ 
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా పరిధిలోని మారుమూల, గిరిజన ప్రాంతాల్లో అధికంగా పోలింగ్‌ నమోదైంది. ఆసిఫాబాద్, సిర్పూర్, మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి తదితర స్థానాల్లో పలుచోట్ల రాత్రిదాకా ఓటింగ్‌ జరిగింది. కాగజ్‌నగర్‌ పట్టణంలోని 90వ పోలింగ్‌ కేంద్రం వద్ద బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్, సిర్పూర్‌ బీజేపీ అభ్యర్థి పాల్వాయి హరీశ్‌బాబు ధర్నాకు దిగారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్, బీఎస్పీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. వారిని అదుపు చేసే క్రమంలో డీఎస్పీ శ్రీనివాస్‌రావు, ఎస్సై గంగన్న, కానిస్టేబుల్‌ రత్నాకర్, మరికొందరికి గాయాలయ్యాయి.

ఇక్కడ రీపోలింగ్‌ నిర్వహించాలని ప్రవీణ్‌కుమార్‌ రిటరి్నంగ్‌ అధికారికి ఫిర్యాదు చేశారు. మంచిర్యాల జిల్లా వరిపేట, ఆదిలాబాద్‌ జిల్లా బజార్‌హత్నూర్‌ మండలం కొత్తపల్లిలలో ప్రజలు తమ సమస్యలు తీర్చలేదంటూ నిరసన వ్యక్తం చేయగా.. అధికారులు నచ్చజెప్పడంతో ఓటేశారు. ఆదిలాబాద్‌ జిల్లా భీంపూర్‌ మండలం గొల్లఘాట్‌ గ్రామస్తులు.. తమ ఊరిగి రోడ్డు, మంచినీటి సౌకర్యం కల్పించాలంటూ ఓటు వేయలేదు. పోలింగ్‌ కేంద్రాల వద్ద క్యూలైన్‌లో నిలబడి ఇద్దరు మృతి చెందారు. 

ఉమ్మడి ఖమ్మం..
గ్రామాల్లో పోలింగ్‌ బహిష్కరణ 
ఖమ్మం ఉమ్మడి నియోజకవర్గాల్లో పలుచోట్ల రాత్రి 8వరకు కూడా పోలింగ్‌ జరిగింది. కొత్తగూడెం రూరల్, ఏన్కూరు, సత్తుపల్లి మండలాల్లోని పలు గ్రామాల ప్రజలు తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించడం లేదంటూ పోలింగ్‌ను బహిష్కరించారు. అధికారులు ఆయా గ్రామాలకు వెళ్లి సర్దిచెప్పడంతో మధ్యాహ్నం ఓట్లు వేశారు. కూసుమంచి, ఎర్రుపాలెం, తల్లాడ, బోనకల్, కొనిజర్ల, తిరుమలాయపాలెం, అశ్వారావుపేట, మణుగూరు, పినపాక మండలాల్లోని పలు పోలింగ్‌ కేంద్రాల్లో బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ శ్రేణుల మధ్య ఘర్షణలు జరిగాయి. పోలీసులు లాఠీచార్జి చేసి పరిస్థితిని చక్కదిద్దారు. ఖమ్మం రూ రల్‌ మండలంలోని గోళ్లపాడులో ఏనుగు సీతారాంరెడ్డి(75) ఓటు వేసి పోలింగ్‌ బూత్‌ నుంచి బయటికి వస్తూ కుప్పకూలి కన్నుమూశాడు. 

ఉమ్మడి రంగారెడ్డి..
బాగా తగ్గిన పోలింగ్‌ 

చెదురుమదురు ఘటనలు మినహా రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లో పోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది. గత ఎన్నికల కంటే ఈసారి ఓటింగ్‌శాతం తగ్గింది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఖానాపూర్‌లో, రాజేంద్రనగర్‌ నియోజకవర్గం మణికొండలో, మహేశ్వరం నియోజకవర్గం జల్‌పల్లిలో స్వల్ప ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి.

ఉమ్మడి నల్లగొండ.. 
పలుచోట్ల లాఠీచార్జి 
నల్లగొండ జిల్లా ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల లాఠీచార్జిలు, చెదురుమదురు ఘటనలు జరిగాయి. బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ వర్గాలు బాహాబాహీకి దిగాయి. ఆలేరు మండలం కొలనుపాకలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గొంగిడి సునీత భర్త మహేందర్‌రెడ్డి గులాబీ కండువాతో పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లడంపై కాంగ్రెస్‌ నేతలు అభ్యంతరం చెప్పారు. ఈసమయంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ నేతల మధ్య వాగ్వాదం జరిగింది.

కొందరు రాళ్లు రువ్వడంతో మహేందర్‌రెడ్డి కారు అద్దాలు పగిలాయి. పోలీసులు లాఠీచార్జి చేసి అందరినీ చెదరగొట్టారు. హుజూర్‌నగర్‌లోనూ గులాబీ కండువా వేసుకుని పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్తున్న ఎమ్మెల్యే సైదిరెడ్డిని పోలీసులు ఆపడంతో వాగ్వాదం జరిగింది. నారాయణపురం మండల కేంద్రంలో ఇద్దరు వ్యక్తులు టెండర్‌ ఓట్లు వేశారు. 

ఉమ్మడి కరీంనగర్‌..
డబ్బుల కోసం నిరసనలతో.. 

కరీంనగర్‌ ఉమ్మడి జిల్లా పరిధిలో పెద్దగా అవాంఛనీయ ఘటన లు జరగలేదు. కరీంనగర్‌ జిల్లాలో రేకుర్తిలో కాంగ్రెస్‌ ఎన్నికల ఏజెంట్‌ వాహనాన్ని బీఆర్‌ఎస్‌ నాయకులు అడ్డగించారని పోలీసులకు ఫిర్యా దు అందింది. మానకొండూర్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి రసమయి బాలకిషన్‌ గులాబీ చొక్కా ధరించి పోలింగ్‌ కేంద్రాలకు వచ్చారంటూ మొగిలిపాలెం, గన్నేరువరం గ్రామాల్లో కాంగ్రెస్‌ నాయకులు అభ్యంతరం చెప్పడంతో వాగ్వాదం జరిగింది.

పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్‌ మండ లం గంగారంలో అధికార పార్టీ అభ్యర్థి పంచిన డబ్బులు తమకు అందలేదంటూ కొందరు ఓటర్లు రోడ్డుపై బైఠాయించారు. రాజన్న సిరిసి ల్ల జిల్లా లింగంపేటలో తమకు డబ్బులు ఇవ్వలేదంటూ బీజేపీ నాయకుడి ఇంటి వద్ద మహిళా గ్రూపు సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. 

ఉమ్మడి మహబూబ్‌నగర్‌..
ప్రశాంతంగా పోలింగ్‌.. 
పాలమూరు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది. దేవరకద్ర, జడ్చర్ల నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాల్లో రాత్రి 9 గంటల వరకు పోలింగ్‌ జరిగింది. పలుచోట్ల ఈవీఎంలు మొరాయించాయి. అచ్చంపేట నియోజకవర్గం పదర మండలం వంకేశ్వరంలో డబ్బులు పంచుతున్నారంటూ బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. పలుచోట్ల బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ మధ్య, మరికొన్నిచోట్ల బీఆర్‌ఎస్‌–బీజేపీ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. నారాయణపేట జిల్లా మాగనూరు మండలం వర్కూర్‌లో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డికి, కాంగ్రెస్‌ కార్యకర్తలకు మధ్య గొడవ చోటు చేసుకుంది. 

ఉమ్మడి నిజామాబాద్‌..
మందకొడిగా మొదలై.. 
నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లాలో పోలింగ్‌ మందకొడిగా ప్రారంభమై మధ్యాహ్నానికి పుంజుకుంది. పలుచోట్ల రాత్రిదాకా ఓటర్లు క్యూలలో ఉన్నారు. నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గంలోని పలుచోట్ల గుమిగూడిన పార్టీల కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జి చేశారు. పలువురికి గాయాలయ్యాయి. కామారెడ్డిలో కాంగ్రెస్‌ అభ్యర్థి రేవంత్‌రెడ్డి సోదరుడు కొండల్‌రెడ్డిని నాన్‌లోకల్‌ అంటూ బీఆర్‌ఎస్‌ నేతలు అడ్డుకున్నారు. 

ఉమ్మడి వరంగల్‌..
బీఆర్‌ఎస్‌–కాంగ్రెస్‌ జగడం  
వరంగల్‌ ఉమ్మడి జిల్లా పరిధిలోని వర్ధన్నపేట నియోజకవర్గం పర్వతగిరిలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ నాయకుల మధ్య గొడవ జరిగింది. మహబూబాబాద్‌ జిల్లా పరిధిలో పలుచోట్ల ఈవీఎంలు మొరాయించడం, మరికొన్ని చోట్ల తమ గ్రామాలను అభివృద్ధి చేయలేదంటూ జనం రాకపోవడంతో ఓటింగ్‌ జరగలేదు. దంతాలపల్లి బీజేపీ, బీఆర్‌ఎస్‌ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. మంగపేటలో బీఆర్‌ఎస్‌ నేత మాజీ జెడ్పీటీసీ వైకుంఠం ఓట్లకు డబ్బులిస్తానని మోసం చేశారంటూ పలువురు ఓటర్లు నిరసన వ్యక్తం చేశారు.

జనగామ నియోజకవర్గ కేంద్రంలోని ఓ పోలింగ్‌ స్టేషన్‌లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి సతీమణి నీలిమ, కాంగ్రెస్‌ అభ్యర్థి కొమ్మూరి కుమారుడు ప్రశాంత్‌రెడ్డి, కోడలు దివ్యల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో రెండు పార్టీల కార్యకర్తలు గొడవకు దిగడంతో పోలీసులు లాఠీచార్జి చేసి చెదరగొట్టారు. జనగామ మండలం శామీర్‌పేట పోలింగ్‌ కేంద్రంలో ఎదురుపడిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి పరుష పదజాలంతో దూషించుకున్నారు. ఇక్కడా బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ శ్రేణులు పరస్పర దాడులకు దిగడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. 

ఉమ్మడి మెదక్‌..
స్వల్ప ఘర్షణల మధ్య.. 
మెదక్‌ ఉమ్మడి జిల్లాలో పోలింగ్‌ సందర్భంగా పలుచోట్ల స్వల్ప ఘర్షణలు చోటు చేసుకున్నాయి. బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ నాయకుల మధ్య తోపులాటలు జరగడంతో పోలీసులు లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. మునిపల్లి మండలం పెద్దగోకులారంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ మధ్య, సదాశివపేట ఎంపీడీఓ కార్యాలయం వద్ద, పటాన్‌చెరులో మూడుచోట్ల బీఆర్‌ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది.  

ఎన్నికల విధుల్లో గుండెపోటుతో ఉద్యోగి మృతి 
పటాన్‌చెరుటౌన్‌/కైలాస్‌నగర్‌: ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగి గుండెపోటుతో మృతి చెందాడు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గురువారం జరిగిన ఈ సంఘటనపై ఎస్‌ఐ సురేందర్‌ రెడ్డి కథనం ప్రకారం.. కొండాపూర్‌ మండలం గొల్లపల్లికి చెందిన నీరడి సుధాకర్‌ (43) కొండాపూర్‌లో వెటర్నరీ విభాగంలో సహాయకునిగా పని చే స్తున్నారు. బుధవారం పటాన్‌చెరు మండలం ఇస్నా పూర్‌ గ్రామం (248) పోలింగ్‌ బూత్‌లో ఎన్నికల విధులు నిర్వహించేందుకు వచ్చారు. ఈ క్రమంలో అర్ధరాత్రి గుండెపోటు రావడంతో సీపీఆర్‌ చేసి ప టాన్‌చెరు ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే చెందినట్లు వెల్లడించారు. 

ఓటు వేయడానికి వచ్చి మృతి 
ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని భుక్తాపూర్‌ కాలనీకి చెందిన చంద్రగిరి రాజన్న (65) ఓటు వేసేందుకు ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలోని పోలింగ్‌ కేంద్రానికి వచ్చాడు. క్యూలో నిల్చున్న సమయంలో కళ్లు తిరిగి కింద పడ్డాడు. వెంటనే స్థానికులు హుటాహుటిన రిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. వృద్ధుడిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు వెల్లడించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement