బాండ్ల రూపంలో పార్టీలకు మొత్తంరూ.12,999 కోట్ల విరాళం
అందులో రూ.6,060 కోట్లు బీజేపీకి.. రూ.1,609 కోట్లు తృణమూల్‌కు
టాప్–6లో బీజేపీ, తృణమూల్,కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేడీ, డీఎంకే
అత్యధిక బాండ్లు విరాళమిచ్చిన టాప్–2 కంపెనీల్లో మేఘా ఇంజనీరింగ్
తమిళనాడుకు చెందిన ఫ్యూచర్ గేమింగ్ రూ.1,368 కోట్లు; మేఘా రూ.1,186 కోట్లు
సుప్రీం ఆదేశాల మేరకు తమ వెబ్‌సైట్లో వెల్లడించిన కేంద్ర ఎన్నికల కమిషన్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్ల పథకంతో అధికార బీజేపీకి అత్యధికంగా నిధులు సమకూరినట్లు వెల్లడయ్యింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎవరెవరు ఎంతెంత బాండ్లు కొన్నారు? ఏ పార్టీలకు ఎంతెంత వచ్చింది? అనే వివరాలను ఎన్నికల కమిషన్‌కు తెలియజేసింది. ఈసీ ఈ జాబితాలను తమ వెబ్‌సైట్లో పెట్టి బహిరంగపరచింది.
దీని ప్రకారం మొత్తంగా దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకూ ఎన్నికల బాండ్ల రూపంలో రూ.12,999 కోట్ల రూపాయలు బాండ్ల రూపంలో అందాయి. దీన్లో 46.7 శాతం... అంటే దాదాపుగా సగం అధికార బీజేపీ ఖాతాలోకే వచ్చాయి. రూ.6,060 కోట్ల విలువైన బాండ్లు బీజేపీ ఖాతాలోకి రాగా... ఆ తరవాతి స్థానాల్లో రూ.1,609 కోట్లతో తృణమూల్ కాంగ్రెస్, రూ.1,421 కోట్లతో కాంగ్రెస్ పార్టీ, రూ.1,214 కోట్లతో బీఆర్‌ఎస్, రూ.775 కోట్లతో బిజూ జనతా దళ్, రూ.639 కోట్లతో డీఎంకే వరుసగా నిలిచాయి.
సుప్రీంకోర్టు నిర్దేశించిన గడువు మేరకు గురువారం సాయంత్రం ఈసీ తమ అధికారిక వెబ్‌సైట్‌లో రెండు భాగాలుగా ఈ వివరాలను పొందుపరిచింది. మొదటి భాగంలో బాండ్లు కొనుగోలు చేసినవారి వివరాలు, వాటి విలువ, రెండో భాగంలో ఆయా బాండ్లను నగదుగా మార్చుకున్న పార్టీల వివరాలు తేదీలతో సహా ఉన్నాయి. తమిళనాడుకు చెందిన ఫ్యూచర్ గేమింగ్, హోటల్ సరీ్వసెస్ అనే సంస్థ అత్యధిక విలువైన బాండ్లు కొనుగోలు చేసి టాప్–1గా నిలిచింది.
కోయంబత్తూరుకు చెందిన ఈ సంస్థ రూ.1,368 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేయగా... హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న మెగా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రా సంస్థ రూ.966 కోట్లు, దాని అనుబంధ సంస్థ వెస్టర్న్ యూపీ పవర్ ట్రాన్స్‌మిషన్ కంపెనీ లిమిటెడ్ రూ.220 కోట్లు కలిపి మొత్తం రూ.1,186 కోట్ల విలువైన బాండ్లను కొని రెండో స్థానంలో నిలిచింది.
రూ.వెయ్యి కోట్లను దాటి బాండ్లు కొనుగోలు చేసిన కంపెనీలు ఈ రెండే కాగా... వందల కోట్ల మేర భారీగా బాండ్లు కొనుగోలు చేసిన కంపెనీల జాబితాలో గ్రాసిమ్ ఇండస్ట్రీస్, పిరమల్ ఎంటర్‌ప్రైజెస్, టోరెంట్ పవర్, మహీంద్రా అండ్ మహీంద్రా, భారతీ ఎయిర్‌టెల్, డీఎల్‌ఎఫ్ కమర్షియల్ డెవలపర్స్, ఎక్సెల్ మైనింగ్, వేదాంత లిమిటెడ్, అపోలో టైర్స్, లక్ష్మీ నివాస్ మిట్టల్, పీవీఆర్, సూలా వైన్స్, వెల్‌స్పన్, సన్ ఫార్మా తదితర ప్రఖ్యాత సంస్థలున్నాయి.
తెలుగు రాష్ట్రాలకు చెందిన యశోద హాస్పిటల్స్, నవయుగ ఇంజినీరింగ్, దివీస్ ల్యా»ొరేటరీస్, ఎన్‌సీసీ, నాట్కో ఫార్మా, అరబిందో ఫార్మా కూడా బాండ్లు కొనుగోలు చేసిన సంస్థల్లో ఉన్నాయి. ఎలక్టోరల్ బాండ్ల పథకం 2018లో అమల్లోకి వచ్చింది. వ్యక్తులు, వ్యాపార/వాణిజ్య సంస్థలు ఈ బాండ్లను కొనుగోలు చేసి, రాజకీయ పార్టీలకు అందజేశాయి. 2019 ఏప్రిల్ 1 నుంచి 2024 ఫిబ్రవరి 15వ తేదీ దాకా జారీ చేసిన బాండ్ల వివరాలను సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో ఎస్‌బీఐ వెల్లడించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment