
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నుంచి ఈ ఏడాది ఏప్రిల్ రెండో తేదీన ఖాళీ అయ్యే మూడు రాజ్యసభ స్థానాల భర్తీకి సంబంధించిన ద్వైవార్షిక ఎన్నిక షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ప్రకటించింది. బీఆర్‌ఎస్ తరఫున రాజ్యసభ సభ్యులుగా ఉన్న వద్దిరాజు రవిచంద్ర, బడుగుల లింగయ్య యాదవ్, జోగినపల్లి సంతోష్‌కుమార్‌ల పదవీ కాలం పూర్తి కానుండటంతో, ఆ స్థానాల భర్తీకి ఈ ఎన్నిక జరుగుతోంది. ఫిబ్రవరి 8న నోటిఫికేషన్ జారీ కానుండగా, 27న ఎన్నిక జరగనుంది. అయితే 15వ తేదీలోగా నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంది. దీంతో రాష్ట్ర అసెంబ్లీలో సంఖ్యాపరంగా ఎక్కువ సంఖ్యలో ఓట్లు కలిగి ఉన్న కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల్లో సందడి మొదలైంది. పలువురు నేతలు పెద్దల సభలో ప్రవేశించేందుకు ఆసక్తి చూపుతుండగా, ఎవరికి చాన్స్ దక్కుతుందనే చర్చ రెండు పార్టీల్లో జరుగుతోంది.
ఖాళీ అవుతున్న మూడు రాజ్యసభ స్థానాల్లో.. అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్ని బట్టి కాంగ్రెస్‌కు రెండు, బీఆర్‌ఎస్‌కు ఒక స్థానం చొప్పున దక్కే అవకాశం ఉంది. అయితే రాజ్యసభ ఎన్నికల్లో విప్ వర్తించదనే నిబంధనను ఆసరాగా తీసుకుని కాంగ్రెస్ పార్టీ మూడో అభ్యర్థిని కూడా బరిలోకి దించే అవకాశం లేకపోలేదని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇటీవలి కాలంలో పలువురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‌ను కలవడం, ఇటీవలి దావోస్ పర్యటన అనంతరం లండన్‌లో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీతో ముఖ్యమంత్రి భేటీ, తదితర పరిణామాలను ప్రస్తావిస్తున్నాయి. అయితే బీఆర్‌ఎస్ పార్టీ మాత్రం మిత్రపక్షం ఎంఐఎం సహకారంతో ఒక సభ్యుడిని సునాయాసంగా గెలిపించుకుంటామనే ధీమా వ్యక్తం చేస్తోంది.
ఒకటి ఢిల్లీకి, మరొకటి స్థానికులకు
రెండు రాజ్యసభ స్థానాలు ఖచ్చితంగా దక్కనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఒక స్థానాన్ని ఢిల్లీ కోటాలో అధిష్టానం చెప్పిన వారి కోసం రిజర్వు చేయాలని భావిస్తోంది. పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాం«దీని రాష్ట్రం నుంచి లోక్‌సభకు పోటీ చేయాల్సిందిగా కోరుతూ రాష్ట్ర కాంగ్రెస్ ఇప్పటికే తీర్మానం ఆమోదించింది. అలా వీలు కాని పక్షంలో కనీసం ఇక్కడ నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహించాలని పార్టీ నేతలు కోరుతున్నారు. ఇందుకు కూడా సోనియా మొగ్గు చూపని పక్షంలో ఇతర రాష్ట్రాలకు చెందిన జాతీయ స్థాయి నేతల్లో పార్టీ ఎంపిక చేసే ఒకరిని తెలంగాణ నుంచి పెద్దల సభకు పంపాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది.
నేడు టీపీసీసీ పీఏసీ భేటీలో చర్చ!
మరో సీటుపై పార్టీ నేతలు పలువురు ఆశలు పెట్టుకున్నారు. అయితే అభ్యర్థి ఎంపికలో సామాజికవర్గ సమీకరణలు కీలకం కావడంతో ఎస్సీ మాదిగ లేదా రెడ్డి లేదా బీసీలకు చాన్స్ దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. గాంధీభవన్‌లో మంగళవారం సాయంత్రం 4 గంటలకు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం జరగనుంది. ఈ భేటీలో లోక్‌సభ ఎన్నికల సన్నద్ధత, అభ్యర్థుల ఎంపిక వంటి అంశాలతో పాటు రాజ్యసభకు కాంగ్రెస్ నుంచి పోటీ చేసే అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన చర్చ కూడా జరిగే అవకాశముందని చెబుతున్నారు.
అరడజనుకు పైగానే ఆశావహులు
రాష్ట్రం నుంచి రాజ్యసభలో అడుగు పెట్టడంపై కాంగ్రెస్ నుంచి పలువురు సీనియర్ నేతలు ఆసక్తి చూపుతున్నారు. మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి, మాజీ కేంద్ర మంత్రులు బలరామ్ నాయక్, రేణుకా చౌదరి, సర్వే సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యేలు చిన్నారెడ్డి, వంశీచంద్‌రెడ్డి, సంపత్ కుమార్, వి.హనుమంతరావు తదితరులు ఈ జాబితాలో ఉన్నారు.
బీఆర్‌ఎస్ తరఫున ఎవరో?
రాష్ట్రం నుంచి ఏడుగురు సభ్యులు రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తుండగా అందరూ బీఆర్‌ఎస్‌కు చెందిన వారే కావడం గమనార్హం. ప్రస్తుతం ముగ్గురు రిటైర్ కానుండగా ఒక సీటు మాత్రం తిరిగి పార్టీకి దక్కనుంది. ఈ స్థానంలో తనకు మరోమారు అవకాశం ఇవ్వాల్సిందిగా వద్దిరాజు రవిచంద్ర కోరుతున్నారు. 2018 ఏప్రిల్ 13న రాజ్యసభ ఎంపీగా ఎన్నికైన బండా ప్రకాశ్ తన ఆరేళ్ల పదవీకాలం పూర్తి కాకుండానే 2022 మే 30న తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం శాసనమండలి సభ్యుడిగా ఎన్నికైన ప్రకాశ్ ప్రస్తుతం మండలి వైస్ చైర్మన్‌గా వ్యవహరిస్తుండగా, ఖాళీ అయిన రాజ్యసభ సీటుకు బీఆర్‌ఎస్ తరఫున వద్దిరాజు రవిచంద్ర ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
తనకు సుమారు రెండేళ్ల పాటు మాత్రమే రాజ్యసభ ఎంపీగా అవకాశం దక్కినందున మరోమారు చాన్స్ ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. అయితే సామాజికవర్గ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని బీసీ వర్గానికి చెందిన వారికి బీఆర్‌ఎస్ అవకాశం ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే బీఆర్‌ఎస్ తరఫున డాక్టర్ కె.కేశవరావు (మున్నూరు కాపు), దామోదర్ రావు (వెలమ), పార్థసారథి రెడ్డి (రెడ్డి), కేఆర్ సురేశ్‌రెడ్డి (రెడ్డి) ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మున్నూరుకాపు, ముదిరాజ్, యాదవ లేదా గౌడ సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని కేసీఆర్ ఎంపిక చేస్తారననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే మాజీ టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌తో పాటు మరికొన్ని పేర్లు కూడా పరిశీలనకు వచ్చే అవకాశముందని అంటున్నారు.