సాక్షి, న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలకు ప్రసారభారతి ఆధీనంలోని దూరదర్శన్, ఆలిండియా రేడియోల్లో ప్రచారానికి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) సమయం కేటాయించింది. ఈ మేరకు శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘం అండర్ సెక్రటరీ రాజేశ్ కుమార్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం తెలంగాణలో ఉన్న మొత్తం 10 గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీలకు కలిపి బ్రాడ్‌కాస్ట్‌కు 898 నిమిషాలు, టెలికాస్ట్‌కు 898 నిమిషాలు కేటాయించారు. అందులో బ్రాడ్‌కాస్ట్‌కు, టెలికాస్ట్‌కు విడివిడిగా సమయం కేటాయించారు.
అత్యధికంగా బీఆర్‌ఎస్ పార్టీకి 277 నిమిషాలు కేటాయించగా, ఆ సమయాన్ని 5 నిమిషాలకు ఒక స్లాట్ చొప్పున 55 స్లాట్లుగా విభజించారు. ఇక కాంగ్రెస్ పార్టీకి 185 నిమిషాలను 5 నిమిషాల చొప్పున 37 స్లాట్లు.. బీజేపీకి 79 నిమిషాలను 5 నిమిషాల చొప్పున 15 స్లాట్లు, టీడీపీకి 62 నిమిషాలను 12 స్లాట్లుగా, ఏఐఎంఐఎం పార్టీకి 58 నిమిషాలను 11 స్లాట్లుగా, బీఎస్పీకి 55 నిమిషాలను 11 స్లాట్లుగా సీపీఐ (ఎం)కు 47 నిమిషాలను 9 స్లాట్లుగా కేటాయించారు. ఈ ప్రచారాన్ని ఎన్నికలకు రెండు రోజుల ముందు నిలిపివేయాల్సి ఉంటుందని కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వుల్లో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment