మీ ఓటును వేరేవాళ్లు వేసేశారా? ఏం ఫర్వాలేదు. నేనే అసలైన ఓటరును అని సవాలు చేయండి. టెండర్ ఓటేయవచ్చు!ఎన్నికల్లో ఓటేసేందుకు పోలింగ్ కేంద్రానికి వెళ్లే సరికి మీ ఓటు వేరేవారు వేసేశారా? అయితే దిగులుపడాల్సిన అవసరం లేదు. మీకు టెండర్ ఓటు వేసే హక్కును ఎన్నికల సంఘం కల్పించింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (ఈవీఎం) ద్వారా కాకుండా పేపర్ బ్యాలెట్ ద్వారా ఓటేసే అవకాశం కల్పిస్తారు. టెండర్ బ్యాలెట్ ఓటర్ల వివరాలను ప్రిసైడింగ్ అధికారులు ఫారం–17బీలో రికార్డు చేస్తారు.
ఈ ఫారంలోని 5వ కాలమ్‌లో ఓటరు సంతకం/వేలి ముద్రను తీసుకున్న తర్వాత వారికి బ్యాలెట్ పత్రం అందజేస్తారు. ప్రత్యేక ఓటింగ్ కంపార్ట్‌మెంట్‌లోకి ఓటరు బ్యాలెట్ పత్రాన్ని తీసుకెళ్లి తాము ఓటెయదలచిన అభ్యర్థికి చెందిన ఎన్నికల గుర్తుపై స్వస్తిక్ ముద్రను వేయాల్సి ఉంటుంది. ఓటేవరికి వేశారో బయటకు కనబడని విధంగా బ్యాలెట్ పత్రాన్ని మడిచి కంపార్ట్‌మెంట్ బయటకి వచ్చి ప్రిసైడింగ్ అధికారికి అందజేయాలి. ఆ బ్యాలెట్ పత్రాన్ని టెండర్ ఓటుగా ప్రిసైడింగ్ అధికారి మార్క్ చేసి ప్రత్యేక ఎన్వలప్‌లో వేరుగా ఉంచుతారు.
చాలెంజ్ ఓటు అంటే ..?
ఓటేసేందుకు వచ్చిన వ్యక్తి గుర్తింపును అభ్యర్థుల పోలింగ్ ఏజెంట్లు రెండు రూపాయలు చెల్లించి సవాలు చేయవచ్చు. ఓటరు గుర్తింపును నిర్ధారించడానికి ప్రిసైడింగ్ అధికారి విచారణ జరుపుతారు. ఓటరు గుర్తింపు నిర్ధారణ జరిగితే ఓటేసేందుకు అవకాశం కల్పిస్తారు. దొంగ ఓటరు అని నిర్ధారణ అయితే సదరు వ్యక్తిని ప్రిసైడింగ్ అధికారి పోలీసులకు అప్పగించి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది.
అనుచితంగా ప్రవర్తిస్తే గెంటివేతే...
పోలింగ్ సమయంలో పోలింగ్ కేంద్రంలో అనుచితంగా ప్రవర్తించిన లేదా చట్టపర ఆజ్ఞలను పాటించడంలో విఫలమైన వ్యక్తులను ప్రిసైడింగ్ అధికారి బయటకు పంపించవచ్చు. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 132 కింద ఈ మేరకు అధికారాలు ప్రిసైడింగ్ అధికారికి ఉన్నాయి. మద్యం లేదా మాదక ద్రవ్యాల మత్తులో ఉన్న వారు ఓటు హక్కును వినియోగించుకోవచ్చు కానీ... విచక్షణ కోల్పోయి పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ ప్రక్రియకు ఆటంకం కలిగించే వ్యక్తులను మాత్రం పోలీసుల సహాయంతో బయటకు పంపించేందుకు నిబంధనలు అనుమతిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment