
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శానసనసభ రద్దు అయిన నేపథ్యంలో ముందస్తు ఎన్నికల నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) ప్రకటించిన ప్రత్యేక ఓటర్ల జాబితా రెండో సవరణ కార్యక్రమం కింద కొత్త ఓటర్ల నమోదుకు దరఖాస్తులు, అభ్యంతరాల స్వీకరణకు గడువు మంగళవారం ముగిసింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 10 నుంచి 25 వరకు 10 లక్షలకు పైగా దరఖాస్తులు, అభ్యంతరాలొచ్చాయని అధికారవర్గాలు పేర్కొన్నాయి. గత జూలై 20 నుంచి ఈ నెల 10 వరకు నిర్వహించిన ప్రత్యేక ఓటర్ల జాబితా తొలి సవరణ కార్యక్రమం కింద మరో 15.12 లక్షల దరఖాస్తులు, అభ్యంతరాలు నమోదయ్యాయి. వీటిలో 12 లక్షల వరకు దరఖాస్తులు, అభ్యంతరాల పరిశీలన పూర్తి కాగా, మిగిలినవాటిని వచ్చే నెల 4లోగా పరిష్కరించాల్సి ఉంది. అనంతరం వచ్చే నెల 7లోగా నవీకరించిన ఓటర్ల జాబితాల సప్లిమెంట్లను ప్రచురించి, 8న తుది ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నారు.
ఆన్‌లైన్‌లో జోరుగా ఓటరు నమోదు
కొత్త ఓటర్ల నమోదు కోసం ఆన్‌లైన్‌లోనే అత్యధిక ‘ఫామ్ 6’దరఖాస్తులొచ్చాయి. ఓటర్ల జాబితా రెండో సవరణ కార్యక్రమం కింద సోమవారం నాటికి 8.75 లక్షల దరఖాస్తులు రాగా.. అందులో ఆన్‌లైన్ ద్వారా 2,97,655, బూత్ లెవల్ అధికారులకు 2,72,218 ‘ఫామ్–6’దరఖాస్తులు వచ్చాయి. ముసాయిదా ఓటర్ల జాబితాలోని పేర్లపై అభ్యంతరాలు తెలపడానికి ఆన్‌లైన్ ద్వారా 4,825, బీఎల్‌ఓలకు మరో 1,75,981 ఫామ్–7 దరఖాస్తులు వచ్చాయి.
ఓటరు గుర్తింపు కార్డులో వివరాలను సరిదిద్దుకోవడానికి ఆన్‌లైన్ ద్వారా 33,705, బీఎల్‌ఓలకు 18,593 మంది ఫామ్–8 దరఖాస్తులు చేసుకున్నారు. కాగా, కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధాన అధికారి వెబ్‌సైట్ (http://ceotelangana.nic.in)తో పాటు జాతీయ ఓటర్ల నమోదు పోర్టల్ (https://www.nvsp.in) మొరాయించడంతో చివరి రోజు ఆన్‌లైన్‌లో ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నామినేషన్లు స్వీకరించే తుది గడువుకు 10 రోజుల ముందు వరకు కొత్త ఓటర్ల నమోదుకు దరఖాస్తులు స్వీకరించి అర్హులకు ఓటు హక్కు కల్పిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment