సాక్షి అమరావతి: రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో టీడీపీ భారీ ఎత్తున అవకతవకలకు పాల్పడుతోందని వైఎస్సార్‌సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని నాని కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) అధికారుల బృందానికి ఫిర్యాదు చేశారు. మైపార్టీ డ్యాష్ బోర్డు.కామ్ వెబ్‌సైట్ ద్వారా ఓటర్ల వ్యక్తిగత వివరాలను టీడీపీ అక్రమంగా సేకరిస్తోందన్నారు. ఆ పార్టీకి మద్దతు తెలపని ఓటర్లను జాబితా నుంచి తొలగించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఇందుకోసం తప్పుడు సమాచారంతో భారీ ఎత్తున ఫామ్–7లను ఎన్నికల సంఘానికి సమర్పిస్తోందన్నారు.
పైగా దొంగే దొంగ అన్నట్లు టీడీపీ నేతలే ఓటర్ల జాబితాలో అక్రమాలకు పాల్పడుతూ తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎన్నికల సన్నద్ధతపై విజయవాడలోని నోవాటెల్ హోటల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఈసీ అధికారుల బృందం శనివారం కూడా సమీక్ష నిర్వహించింది. ఈ నేపథ్యంలో సీఈసీ బృందాన్ని మంత్రులు జోగి రమేశ్, మేరుగు నాగార్జున, ఎమ్మెల్యేలు పేర్ని నాని, కొఠారు అబ్బయ్య చౌదరి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఫైబర్ నెట్ చైర్మన్ గౌతంరెడ్డి, నవరత్న పథకాల అమలు వైస్ చైర్మన్ నారాయణమూర్తిలతో కూడిన వైఎస్సార్‌సీపీ బృందం కలిసింది.
ఈ సందర్భంగా ఢిల్లీలో ఈ నెల 14న సీఈసీకి చేసిన ఫిర్యాదులను మరోసారి వైఎస్సార్‌సీపీ నేతలు సీఈసీ బృందం దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. ఓటర్ల జాబితాలో టీడీపీ అక్రమాలపై ఆధారాలతో సహా ఫిర్యాదు చేశామని చెప్పారు. ఈ సందర్భంగా ఇంకా ఆయన ఏమన్నారంటే..
తెలంగాణలో ఓట్లున్నవారిని ఏపీలో చేరుస్తోంది..
తెలంగాణలో ఓట్లు ఉన్న వారిని రాష్ట్రంలోనూ ఓటర్లుగా చేర్పించడానికి టీడీపీ ఆ రాష్ట్రంలో భారీ ఎత్తున శిబిరాలు నిర్వహిస్తోంది. ఇప్పటికే తెలంగాణలో ఒక ఓటు.. రాష్ట్రంలో మరో ఓటు ఉన్నవారు రాష్ట్రంలో 4.30 లక్షల మంది ఉన్నారు. వారి ఓట్లను తొలగించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశాం.
ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించాలని తప్పుడు సమాచారంతో పది లక్షలకుపైగా ఫామ్–7లను దాఖలు చేసిన టీడీపీ ఎన్నికల సెల్ రాష్ట్ర కో–ఆర్డినేటర్ కోనేరు సురేశ్‌పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరాం. మేనిఫెస్టో పేరుతో వచ్చే ఐదేళ్లలో ఒక్కో కుటుంబానికి ఏ మేరకు లబ్ధి చేకూరుతుందో వివరిస్తూ ‘బాబు ష్యూరిటీ–భవిష్యత్తుకు గ్యారంటీ’ పేరుతో ప్రమాణపత్రాలను ఓటర్లకు ఇవ్వడంపై అభ్యంతరాలు వ్యక్తం చేశాం.
టీడీపీ, జనసేన చట్టవ్యతిరేక కార్యకలాపాలు..
గతంలో సేవా మిత్ర యాప్ తరహాలోనే ఇప్పుడు మై పార్టీ డ్యాష్ బోర్డ్.కామ్ అనే వెబ్‌సైట్ ద్వారా ఓటర్ల వ్యక్తిగత సమాచారాన్ని టీడీపీ అక్రమంగా సేకరిస్తోంది. టీడీపీ, జనసేన చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయి. మేనిఫెస్టో రూపంలో కాకుండా వ్యక్తిగతంగా ఇంటింటికీ వెళ్లి టెక్నాలజీని ఉపయోగించి ప్రలోభాలకు గురిచేస్తున్నాయని ఎన్నికల అధికారుల బృందానికి వివరించాం.
వైఎస్సార్‌సీపీ ఓటర్లను గుర్తించి వారి ఓట్లను తొలగించడానికి టీడీపీ నేతలు దరఖాస్తు చేస్తున్నారు. తెలంగాణలో ఓట్లు ఉన్నవారిని సోషల్ మీడియా ద్వారా హోటల్స్‌కి పిలిపించుకుని రాష్ట్రంలో ఓట్లు ఎలా నమోదు చేసుకోవాలో చెబుతున్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని సీఈసీ బృందానికి ఫిర్యాదు చేశాం.
ఒకరికి ఒక ఓటే మా విధానం
ఒకరికి ఒక ఓటు ఉండాలన్నదే వైఎస్సార్‌సీపీ విధానం. తెలంగాణలో ఓటు ఉన్నవారు ఏపీలోనూ ఓటు నమోదు చేసుకుంటున్నారు. ఒక వ్యక్తి రెండు చోట్లా ఓట్లు కలిగి ఉండటం నేరం. రాష్ట్ర అధికార యంత్రాంగం మొత్తం ప్రభుత్వ కార్యకలాపాలు మానేసి ఎన్నికల ఫిర్యాదులపై విచారణలో నిమగ్నం కావాలనే టీడీపీ తప్పుడు ఫిర్యాదులు చేసింది.
టీడీపీకి చెందిన కోనేరు సురేశ్ 10 లక్షలకు పైబడి దొంగ ఓటర్లు ఉన్నారని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం ఇందుకు నిదర్శనం. వాటిని ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్లకు పంపి విచారణకు ఆదేశించింది. కోనేరు సురేశ్ తప్పుడు ఫిర్యాదు చేశారని జిల్లా కలెక్టర్లు ఎన్నికల సంఘానికి నివేదిక ఇచ్చారు. కోనేరు సురేశ్ తప్పుడు ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఆశ్చర్యపోయారు.
Comments
Please login to add a commentAdd a comment