నల్లగొండ : ఏప్రిల్ నెలల జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. నవంబర్ 30న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉపయోగించిన ఓటర్ల జాబితాను కాకుండా కొత్త ఓటరు జాబితాతో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. అందులో భాగంగానే కొత్తగా ఓటరు నమోదుకు అవకాశం కల్పించింది. మూడు రోజుల క్రితమే ఓటరు ముసాయిదా జాబితాను ప్రకటించింది.
అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో జిల్లాలో మొత్తం 14,64,080 మంది ఓటర్లు ఉండగా ముసాయిదా జాబితాలో 14,67,573 మంది ఓటర్లున్నారు. అంటే అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుంచి ఇప్పటి వరకు 3,493 మంది కొత్తగా ఓటు నమోదు చేసుకున్నారు. ఈ నెల 22 వరకు కొత్తగా ఓటరు నమోదుకు అవకాశం ఉండడంతో ఓటర్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
అవగాహన కల్పిస్తున్న బీఎల్‌ఓలు
1 జనవరి 2024 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు ఈనెల 22వ తేదీ వరకు ఓటరు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ప్రస్తుతం బీఎల్‌ఓలు ఓటర్ల జాబితాను తీసుకుని ఇల్లిల్లూ తిరిగి ఓటు ఉందా లేదా తెలుసుకుని ఓటు లేకపోతే దరఖాస్తు చేసుకోమని అవగాహన కల్పిస్తున్నారు.
మరోవైపు ప్రస్తుతం ప్రకటించిన ముసాయిదా ఓటరు జాబితాపై అభ్యంతరాలు, మార్పులు, చేర్పులకు సంబంధించి వచ్చిన దరఖాస్తులను ఫిబ్రవరి 2వ తేదీ లోగా పరిష్కరించనున్నారు. మార్పులు, చేర్పుల అనంతరం ఓటరు తుది జాబితాను ఫిబ్రవరి 8న ప్రకటించనున్నారు. ఈ జాబితాతోనే ఏప్రిల్‌లో లోక్‌సభ ఎన్నికలను నిర్వహించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment