సాక్షి ప్రతినిధి, నల్లగొండ : నల్లగొండ లోక్‌సభ స్థానం నుంచి రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూతురు శ్రీనిధిరెడ్డి పోటీ చేయనున్నట్లు తెలిసింది. ఇటీవల ఏఐసీసీ.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోటీలో ఎవరైతే బాగుంటుంది అనే విషయంపై ఏఐసీసీ సర్వేలు చేయించినట్లు సమాచారం. ఈ సర్వేల్లో మంత్రి కోమటిరెడ్డి కూతురు శ్రీనిధిరెడ్డివైపు కూడా ప్రజలు మొగ్గు చూపినట్లు తెలిసింది. దీంతో అనూహ్యంగా శ్రీనిధిరెడ్డి పేరు తెరపైకి వచ్చింది.
ఇప్పటికే నల్లగొండ ఎంపీ టికెట్ కోసం మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి తనయుడు కుందూరు జయవీర్‌రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆశీస్సులు కూడా ఆయనకే ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో సూర్యాపేట టికెట్ విషయంలో రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, పటేల్ రమేష్‌రెడ్డి పోటీ పడ్డారు. టికెట్ దామోదర్‌రెడ్డికి దక్కడంతో పటేల్ రమేష్‌రెడ్డి వర్గమంతా ఆందోళనకు దిగింది.
అసెంబ్లీ బరిలో తాను కూడా ఉంటానని రమేష్‌రెడ్డి ప్రకటించడంతో కాంగ్రెస్ అధిష్టానం నల్లగొండ లోక్‌సభ టికెట్ ఇస్తామని ఆయనకు సర్దిచెప్పింది. ప్రస్తుతం ఆయన కూడా లోక్‌సభకు పోటీ చేస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ పరిస్థితుల్లో తాజాగా శ్రీనిధిరెడ్డి పేరు తెరపైకి వచ్చింది. అమెరికాలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేసిన శ్రీనిధిరెడ్డి తన తండ్రి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అయితే ఇప్పటివరకు ఆమె ఎంపీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకోలేదు.
Comments
Please login to add a commentAdd a comment