కె.వి. రమణాచారి
నల్లగొండ టూటౌన్: నీలగిరి మున్సిపల్ కమిషనర్ కె.వి.రమణాచారి గురువారం రాజీనామా చేశారు. గత సీఎం కేసీఆర్ సిద్దిపేటలో మున్సిపల్ కమిషనర్‌గా, సిద్దిపేట అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ వైస్ చైర్మన్‌గా పనిచేస్తున్న రిటైర్డ్ ఉద్యోగి రమణాచారిని నీలగిరి పట్టణ అభివృద్ధి, సుందరీకరణ కోసం మున్సిపల్ కమిషనర్‌గా నియమించిన విషయం తెలిసిందే. 2022 జనవరి 5న రమణాచారి మున్సిపల్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు.
నీలగిరి పట్టణంలో జరిగిన రహదారుల విస్తరణ, పట్టణ సుందరీకరణ పనుల్లో కీలక పాత్ర పోషించారు. రోడ్ల విస్తరణకు చాలా మంది వ్యాపారస్తులు తమ దుకాణాలను స్వచ్ఛందంగా కూల్చుకొని మున్సిపాలిటీకి సహకరించారు. కేసీఆర్ మనిషిగా మద్ర పడిన రమణాచారి నీలగిరి మున్సిపల్ కమిషనర్‌గా దాదాపు రెండేళ్ల పాటు పనిచేశారు. మున్సిపల్ ఉద్యోగులను విధి నిర్వహణలో ఉరుకులు, పరుగులు పెట్టించారు.
మొదట్లో ఒక సంవత్సరం మాత్రమే ఉంటారని భావించిన మున్సిపల్ ఉద్యోగులు మొదట్లో ఆయన చెప్పిన సమయం ప్రకారం విధులు నిర్వహించారు. ఉదయం 8 గంటలకే విధులకు హాజరైన ఉద్యోగులు రాత్రి 8 గంటల వరకు కూడా కార్యాలయంలోనే ఉండే వారు. దాంతో రాను, రాను ఉద్యోగుల్లో సమయ పాలనపై అసంతృప్తి నెలకొంది.
కేసీఆర్ పంపిన కమిషనర్ కావడం, పట్టణ అభివృద్ధికి పని గంటలు ఎక్కువ చేయాలని మొదట్లోనే రమణాచారి ఉద్యోగులకు వివరించడం కారణంగా ఉద్యోగులు మిన్నకుండిపోయారు. ఐదారు నెలల నుంచి ఇంకా ఎన్నాళ్లు ఎక్కువ పనిగంటలు.. అనే చర్చ ఉద్యోగుల్లో మొదలైంది. ఇటీవల ఉద్యోగులు కూడా ఉదయం 10 గంటలకు వచ్చి సాయంత్రం వరకే ఉండడం మొదలు పెట్టారు.
ఇంతలోనే ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారడంతో ఉద్యోగుల్లో కూడా మార్పు వచ్చింది. కమిషనర్ కూడా మరో సంవత్సరం ఉండాలని కోరుకున్నా ప్రస్తుత అధికార పార్టీ నేత నుంచి హామీ దొరకలేదని తెలుస్తోంది. దాంతో మున్సిపల్ కమిషనర్ ఉద్యోగానికి రాజీనామా చేశారు.
నూతన కమిషనర్‌గా వెంకటేశ్వర్లు
నీలగిరి మున్సిపల్ కమిషనర్‌గా కందుకూరి వెంకటేశ్వర్లును నియమిస్తూ కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజాఆరోగ్య శాఖ ఎస్‌ఈగా పనిచేస్తున్న ఆయన గురువారం మున్సిపల్ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు స్వీకరించారు. వెంకటేశ్వర్లు గతంలో నీలగిరి మున్సిపాలిటీ డీఈ, ఈఈ, ఇన్‌చార్జ్ కమిషనర్‌గా పనిచేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పట్టణ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment