సాక్షి, యాదాద్రి: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీఆర్‌ఎస్ పార్టీని ప్రజలు పక్కన బెట్టి కాంగ్రెస్‌కు జైకొట్టారు. 2004 ఎన్నికల్లో మాదిరిగానే ప్రస్తుత ఎన్నికల్లో గులాబీ పార్టీ నుంచి ఒక్కరే విజయం సాధించారు. అప్పటి ఎన్నికల్లో ఆలేరు నుంచి నగేష్ గెలుపొందగా.. తాజా ఎన్నికల్లో సూర్యాపేట నియోజకవర్గం నుంచి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి మాత్రమే విజయం సాధించారు. మిగతా 11 మంది పరాజయం పాలయ్యారు.
ప్రస్థానం ఇలా..
2001లో ఏర్పడిన టీఆర్‌ఎస్‌ను 2004, 2009 అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు అంతంగా ఆదరించలేదు. ఆ మధ్యకాలంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నిల్లో మాత్రం చాలాచోట్ల విజయం సాధించింది. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో, 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో ఒక్క ఆలేరు నియోజకవర్గంలోనే టీఆర్‌ఎస్ విజయం సాధించింది. 2014లో జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పుంజుకుంది.
12 అసెంబ్లీ స్థానాలగాకు గాను 6 అసెంబ్లీ స్థానాలు, ఒక ఎంపీ స్థానాన్ని కై వసం చేసుకుంది. భువనగిరి పార్లమెంట్ స్థానంతో పాటు భువనగిరి, ఆలేరు, మునుగోడు, నకిరేకల్, తుంగతుర్తి, సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ ఘన విజయం సాధించింది.
2004లో నగేష్ ఒక్కరే విజయం
తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో టీఆర్‌ఎస్ కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకుని 2004 ఎన్నికల్లో బరిలోకి దిగింది. ఆలేరులో టీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసిన డాక్టర్ నగేష్ టీడీపీ అభ్యర్థి మోత్కుపల్లి నర్సింహులుపై విజయం సాధించారు. అదే ఎన్నికల్లో భువనగిరి నుంచి బరిలోకి దిగిన టీఆర్‌ఎస్ అభ్యర్థి ఆలె నరేంద్ర.. టీడీపీ అభ్యర్థి ఎలిమినేటి ఉమామాధవరెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు.
నకిరేకల్‌లో టీఆర్‌ఎస్ నుంచి పోటీచేసిన డాక్టర్ చెరుకు సుధాకర్ ఓటమిపాలయ్యారు. కాగా, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2008లో కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఆలేరు ఎమ్మెల్యే డాక్టర్ నగేష్ రాజీనామా చేశారు. వెంటనే జరిగిన ఉప ఎన్నికలో మరోసారి నగేష్ విజయం సాధించారు. 2009 నాటికి పరిస్థితి పూర్తి భిన్నంగా మారింది. ఆ ఎన్నికల్లో మూడు స్థానాలకు పోటీచేసిన టీఆర్‌ఎస్ ఒక్క సీటును కూడా గెలుచుకోలేదు.
టీడీపీ, వామపక్షాలతో కలిసి మహాకూటమి పేరుతో ఆలేరు, సూర్యాపేట, హుజూర్‌నగర్ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ పోటీ చేసింది. ఆలేరులో టీఆర్‌ఎస్ అభ్యర్థి కళ్లెం యాదగిరిరెడ్డి ఓటమి పాలయ్యారు. హుజూర్‌నగర్‌లో గుంటకండ్ల జగదీశ్వర్‌రెడ్డి, సూర్యాపేటలో పోరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి పరాజయం పొందారు.
2018లో తొమ్మిది నుంచి 12 స్థానాలకు..
2018లో జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య తొమ్మిదికి పెరిగింది. మునుగోడు, నకిరేకల్, హుజూర్‌నగర్‌లో మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. అయితే, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్‌ను వీడి బీఆర్‌ఎస్‌లో చేరారు. హుజూర్‌నగర్ నుంచి గెలిచిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నల్లగొండ స్థానం నుంచి బరిలో నిలిచారు.
ఎంపీగా విజయం సాధించడంతో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాతో హుజూర్‌నగర్‌కు వచ్చిన ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్ తరఫున శానంపూడి సైదిరెడ్డి పోటీ చేసి విజయం సాధించారు. దీంతోపాటు నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఆకస్మిక మరణంతో వచ్చిన ఉపఎన్నికలో ఆయన తనయుడు నోముల భగత్ బీఆర్‌ఎస్ నుంచి పోటీలో నిలిచి గెలుపొందారు.
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో వచ్చిన ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి ప్రజలు పట్టంకట్టారు. జిల్లా మొత్తంలో 12 మంది ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్ తరఫున శాసనసభలో ప్రాతినిధ్యం వహించారు.
Comments
Please login to add a commentAdd a comment