సాక్షి ప్రతినిధి, నల్లగొండ: బీఆర్‌ఎస్ అధిష్టానం ఓకే అంటే.. ఉమ్మడి జిల్లాలోని రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎక్కడినుంచైనా పోటీచేసేందుకు సిద్ధమని పలుమార్లు ప్రకటించిన గుత్తా సుఖేందర్‌రెడ్డి కుటుంబం ఒక్కసారిగా యూటర్న్ ఎందుకు తీసుకుంది..? తాము పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయబోమని బీఆర్‌ఎస్ అధిష్టానానికి ఎందుకు తెగేసి చెప్పింది? దీనిపై పరిశీలిస్తే బీఆర్‌ఎస్ పార్టీలోని వర్గపోరే ఇందుకు కారణమని తెలుస్తోంది. తాము పోటీ చేస్తామని చెబుతున్నా ఇతర నేతలతో ఎందుకు సంప్రదింపులు జరుపుతున్నారని, ఇప్పుడే ఇలా ఉంటే రేపు ఎన్నికల్లో ఏం సహకరిస్తారంటూ సుఖేందర్‌రెడ్డి కుటుంబం నుంచి ఆవేదన వ్యక్తమవుతోంది.
అందుకే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ నుంచి తాము తప్పుకోవాల్సివచ్చిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అమిత్‌రెడ్డి దారెటు అన్నది చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో ఇటీవల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో గుత్తా అమిత్‌రెడ్డి భేటీ కావడంతో.. ఆయన పార్టీ మారుతారంటూ ప్రచారం జోరందుకుంది. అయితే, దానిని అమిత్ ఖండించారు. సీఎం రేవంత్‌రెడ్డికి గుత్తా కుటుంబానికి బంధుత్వం ఉండటంతో ఆ ప్రచారం సాధారణమేనని, తాము పార్టీ మారే ఆలోచన లేదని సుఖేందర్‌రెడ్డి ఇప్పటికే పలుమార్లు పేర్కొన్నారు.
పోటీకి సిద్ధంగా ఉన్నామన్నా..
తన కుమారుడు అమిత్‌రెడ్డి బీఆర్‌ఎస్ నుంచి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తాడని గుత్తా సుఖేందర్‌రెడ్డి గతంలో ప్రకటించారు. నల్లగొండ, భువనగిరి పార్లమెంట్ స్థానాల్లో ఎక్కడి నుంచి అయినా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. అయితే, బీఆర్‌ఎస్‌లోని జిల్లా నేతలు కొందరు అమిత్‌కు టికెట్ ఇవ్వద్దంటూ అధిష్టానానికి చెప్పారు. మొదటి నుంచీ మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి, సుఖేందర్‌రెడ్డికి మధ్య సఖ్యత లేని కారణంగా మాజీ మంత్రి వ్యతిరేకిస్తున్నట్లు ప్రచారం సాగింది. తాము పోటీ చేస్తామని చెబుతున్నా మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఇతరులను బరిలో నిలిపేందుకు చర్చలు జరిపారంటూ గుత్తా వర్గం మండిపడింది.
ఈ పరిణామాల నేపథ్యంలో అమిత్ పార్టీ మారతారంటూ ప్రచారం జరిగింది. కాంగ్రెస్ నుంచి భువనగిరి టికెట్ అడుగుతున్నారన్న చర్చ జోరందుకుంది. అయితే, తాము పార్టీ మారుతారనే ప్రచారాన్ని గుత్తా అమిత్‌రెడ్డి ఖండించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి జిల్లా మంత్రి కాబట్టే తాను కలిశానని పేర్కొన్నారు. కాగా, పార్లమెంట్ ఎన్నికల్లో తాను పోటీచేయబోనని, జిల్లాలో జరిగిన.. జరుగుతున్న పరిణామాలన్నింటిని కేటీఆర్, హరీష్‌రావుకు అమిత్‌రెడ్డి వివరించినట్లు తెలిసింది.
‘గుత్తా’కు అందని ఆహ్వానం!
పలువురు మాజీ ఎమ్మెల్యేలు, నేతలతో సోమవారం మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి తెలంగాణ భవన్‌లో భేటీ అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ నుంచి పోటీలో నిలిపే అభ్యర్థి విషయంపై చర్చించారు. అనంతరం వారంతా మాజీ సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఈ సమావేశానికి గుత్తా అమిత్‌కు ఆహ్వానం పంపలేదని తెలిసింది. అందుకే ఆయన హాజరుకాలేదని సమాచారం.
ఆ ఇద్దరిలో ఒకరు
నల్లగొండ పార్లమెంట్ నియోజకర్గంలో బీఆర్‌ఎస్ అభ్యర్థి విషయంపై మాజీ సీఎం కేసీఆర్‌తో జిల్లా నేతలు చర్చించారు. జగదీష్‌రెడ్డి నేతృత్వంలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిషోర్‌కుమార్, నల్లమోతు భాస్కర్‌రావు, చిరుమర్తి లింగయ్య, బొల్లం మల్లయ్యయాదవ్ తదితర నేతలు సోమవారం కేసీఆర్ వద్దకు వెళ్లారు. అభ్యర్థి విషయంలో ఏదైనా నిర్ణయానికి వచ్చారా అని కేసీఆర్ అడగ్గా నలుగురైదుగురు అడుగుతున్నారని చెప్పినట్లు తెలిసింది. అయితే, గట్టి పోటీ ఇవ్వగలిగే వారిలో మాజీ ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, కంచర్ల కృష్ణారెడ్డి పేర్లను సూచించినట్లు తెలిసింది. వారిద్దరిలోనే ఎవరో ఒకరికి టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
లక్ష్మిని పోటీచేయించే యోచనలో కాంగ్రెస్
భువనగిరి ఎంపీ టికెట్ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఆచితూచీ వ్యవహరిస్తోంది. భువనగిరిలో ఎవరైతే భారీ మెజారిటీతో గెలుస్తారన్న విషయంపైనా కాంగ్రెస్ అధిష్టానం సర్వే చేయిస్తోంది. ప్రస్తుతం టికెట్ అడుగుతున్న వారందరి పేర్లతోనూ సర్వేలు చేయించింది. బలమైన అభ్యర్థినే పోటీలో నిలుపాలన్న ఆలోచనలో ఉంది. అయితే, ఇక్కడి నుంచి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సతీమణి లక్ష్మిని బరిలో నిలపాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలిసింది. లక్ష్మీని పోటీచేయించాలంటూ అధిష్టానం రాజగోపాల్‌రెడ్డిపై ఒత్తిడి పెంచినట్లుగా తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment