ఎంపీ అభ్యర్థుల ఎంపికపై బీఆర్‌ఎస్ కసరత్తు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఎంపీ అభ్యర్థుల ఎంపికపై బీఆర్‌ఎస్ పార్టీ కసరత్తు ముమ్మరం చేసింది. ఉమ్మడి జిల్లాలోని నల్లగొండ, భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గాలకు ఆశావహులతో పార్టీ అధిష్టానంతోపాటు మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి మంతనాలు జరుపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఢీకొట్టేలా సత్తా కలిగిన నేతలను ఎంపిక చేయాలన్న ఆలోచనలో బీఆర్‌ఎస్ నాయకత్వం ఉండటంతో నేతలు ఆ వైపుగా కసరత్తు ముమ్మరం చేశారు. ఇదే అంశంపై జగదీష్‌రెడ్డి చర్చలు జరుపుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి.. బీఆర్‌ఎస్ పార్టీని గెలిపించే సత్తా కలిగిన నేతలపై దృష్టి సారించారు.
నల్లగొండలో ఆశావహులతో చర్చలు
నల్లగొండ లోక్‌సభ స్థానం నుంచి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి తనయుడు అమిత్‌రెడ్డి, నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి సోదరుడు కంచర్ల కృష్ణారెడ్డి, గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్ నుంచి ఎంపీగా పోటీచేసి ఓడిపోయిన వేమిరెడ్డి నర్సింహారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ తేర చిన్నపరెడ్డి, బీసీ నేత సుంకరి మల్లేష్‌గౌడ్ పోటీచేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. అందులో నల్లగొండ అభ్యర్థిగా మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి తనయుడు కుందూరు రఘువీర్‌రెడ్డి పేరును ప్రకటించింది.
నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు మొదటి నుంచి పట్టుంది. ప్రస్తుతం ఈ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని సూర్యాపేట మినహా మిగిలిన ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ పార్టీకి చెందిన శాసన సభ్యులే ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జానారెడ్డికి కాకుండా ఆయన కుమారుడికి టికెట్ ఇచ్చినందున బలమైన నేతను నిలబెడితే గెలవవచ్చనేది బీఆర్‌ఎస్ ఆలోచన. ఇక్కడి నుంచి గిరిజన నేతను నిలబెడితే ఎలా ఉంటుందన్న ఆలోచనలో కూడా బీఆర్‌ఎస్ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గంలో మూడు లక్షలకు పైగా గిరిజన ఓటర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో గిరిజన వర్గానికి చెందిన ఒక డాక్టర్‌ను సంప్రదించి పోటీచేయాలని కూడా బీఆర్‌ఎస్ పార్టీ కోరినట్లు సమాచారం. మరోవైపు.. బీసీ అభ్యర్థిని నిలబెట్టే అంశంపైనా అభిప్రాయ సేకరణ చేస్తున్నట్లు తెలిసింది.
భువనగిరిలో బీసీనా.. ఓసీనా?
భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కూడా శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి తనయుడు గుత్తా అమిత్‌రెడ్డి పోటీచేసేందుకు సుముఖత చూపుతున్నారు. నల్లగొండ, భువనగిరిలో ఏ స్థానం నుంచైనా అధిష్టానం అవకాశం ఇస్తే పోటీ చేసేందుకు సిద్ధమేనని గుత్తా సుఖేందర్‌రెడ్డి ఇప్పటికే పలుమార్లు ప్రకటించిన విషయం తెలిసిందే. గుత్తా అమిత్‌రెడ్డితో పాటు భువనగిరి నియోజకవర్గం నుంచి బూడిద బిక్షమయ్యగౌడ్, దూదిమెట్ల బాలరాజు యాదవ్, క్యామ మల్లేష్‌యాదవ్, జిట్టా బాలకృష్ణారెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయి.
వారితో కూడా మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే భువనగిరి నుంచి బీజేపీ బీసీ అభ్యర్థిని ఖరారు చేసిన నేపథ్యంలో బీఆర్‌ఎస్ కూడా ఆ దిశగా కసరత్తు ప్రారంభించింది. మొత్తంగా.. రెండు పార్లమెంట్ స్థానాల్లో బలమైన వ్యక్తులను నిలిపి విజయం సాధించే విధంగా బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థుల ఎంపికలో నిమగ్నమైంది.
Comments
Please login to add a commentAdd a comment