నల్గొండ : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రచారానికి పదును పెట్టారు. కారు స్పీడు పెంచేలా సుడిగాలి పర్యటనలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో భువనగిరి, మునుగోడు, కోదాడ, తుంగతుర్తి, ఆలేరు నియోజకవర్గాల్లో నిర్వహించిన ప్రచార సభల్లో పాల్గొన్న ఆయన మంగళవారం మరోమారు ఉమ్మడి నల్లగొండ జిల్లాకు రానున్నారు.
హుజూర్‌నగర్, మిర్యాలగూడ, దేవరకొండ నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్నారు. ఇందు కోసం పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. ఎన్నికల బరిలో నిలుస్తున్న అభ్యర్థులు, పార్టీ నేతలు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మంగళవారం హైదరాబాద్‌ను నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి మధ్యాహ్నం ఒంటి గంటకు హుజూర్‌నగర్ చేరుకుంటారు.
అక్కడ సభలో ప్రసంగించిన అనంతరం.. మధ్యాహ్నం 2 గంటలకు మిర్యాలగూడకు చేరుకుని సభలో ప్రసంగిస్తారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో మధ్యాహ్నం 3 గంటలకు దేవరకొండ చేరుకుంటారు. ఇక్కడ సభ ముగిశాక నేరుగా హైదరాబాద్ వెళ్లనున్నారు.
సభలకు భారీ ఏర్పాట్లు..
● హుజూర్‌నగర్ పట్టణం ఫణిగిరి గుట్ట రోడ్డులో 50 ఎకరాల విస్తీర్ణంలో సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. వేదికకు ఎడమ వైపున హెలిపాడ్ ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణానికి కుడి వైపు నుంచి జనం రాకపోకలకు ఏర్పాట్లు చేశారు. సభకు 80 వేల మందిని తరలించేలా ఎమ్మెల్యే సైదిరెడ్డి ప్రణాళిక రూపొందించారు. ఒక అదనపు ఎస్పీ, నలుగురు డీఎస్పీలు, 11 మంది ఇన్‌స్పెక్టర్లు, 45 మంది ఎస్‌ఐలు మొత్తం 400 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. సభా ప్రాంగణాన్ని సోమవారం ఎమ్మెల్యే సైదిరెడ్డి, ఎస్పీ రాహుల్ హెగ్డే పరిశీలించారు.
● మిర్యాలగూడ పట్టణంలోని ఎన్‌ఎస్పీ క్యాంపు గ్రౌండ్‌లో ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించనున్నారు. నియోజకవర్గంలోని ఐదు మండలాలు నుంచి సుమారు 70 వేలకు పైగా ప్రజలు సభకు రానున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. వర్షం వచ్చినా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేశారు. సీఎం కేసీఆర్ రాక నేపథ్యంలో పట్టణంలో భారీగా కటౌట్లు ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణాన్ని ఎమ్మెల్యే భాస్కర్‌రావు, మున్సిపల్ చైర్మన్ భార్గవ్‌తో కలిసి పరిశీలించి పలు సూచనలు చేశారు.
● దేవరకొండలోని ముదిగొండ రోడ్డులో ప్రజా ఆశీర్వాద సభకు ఆ పార్టీ నాయకులు సర్వం సిద్ధం చేశారు. ఈ సభకు నియోజకవర్గ పరిధిలోని ఏడు మండలాల నుంచి దాదాపు 80వేల మంది తరలివస్తారని బీఆర్‌ఎస్ వర్గాలు పేర్కొన్నాయి. ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ ఆయా మండలాలకు బాధ్యులను నియమించి సభ సక్సెస్ అయ్యేలా ప్రణాళికలు రూపొందించారు. సోమవారం ఆయన గుత్తా అమిత్‌రెడ్డి స్థానిక నాయకులతో కలిసి సభ ఏర్పాట్లను పరిశీలించారు.
భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన నల్లగొండ ఎస్పీ
నల్లగొండ ఎస్పీ అపూర్వరావు సోమవారం మిర్యాలగూడ, దేవరకొండలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. వాహనాల మళ్లింపు, పార్కింగ్ అంశాలపై సిబ్బందికి ఎస్పీ పలు సూచనలు చేశారు. మిర్యాలగూడలో నలుగురు డీఎస్పీలు, 15మంది సీఐలు, 50 మంది ఎస్‌ఐలు, 110 మంది ఏఎస్‌ఐలు, మరో 300 మంది కానిస్టేబుళ్లు, హోంగార్డులతో, దేవరకొండలో ఒక ఎస్పీ, ఇద్దరు అడిషనల్ ఎస్పీలు, నలుగురు డీఎస్పీలు, 12 మంది సీఐలతో పాటు ఎస్‌ఐలు, ఇతర సిబ్బంది మొత్తం కలిపి 530 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. బందోబస్తులో విధులు నిర్వహించనున్న పోలీసు సిబ్బందికి ఆమె పలు సూచనలు ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment