మాట్లాడుతున్న ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, పక్కన లింగయ్య యాదవ్, చెరుకు సుధాకర్
నకిరేకల్ : విలువలతో కూడిన రాజకీయం చేస్తే సమాజం గౌరవిస్తుందని, దిక్కుమాలిన రాజకీయాలు చేస్తే ప్రజలు అసహ్యించుకుంటారని నకిరేకల్ బీఆర్‌ఎస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్య అన్నారు. ఆయన శుక్రవారం రాత్రి నకిరేకల్ మండలం నోముల గ్రామంలో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ కోమటిరెడ్డి బ్రదర్స్‌పై ఘాటైన విమర్శలు చేశారు. ‘అందరం ఒకటే ఉర్లో పుట్టి పెరిగినోళ్లం.. నేను 1995లో రాజకీయాల్లోకి వచ్చాను.
ఎమ్మెల్యే స్థానం ఎస్సీ రిజర్వు కావడంతో నాకు అవకాశం వచ్చింది. ఆనాడు మీ సహకారం తీసుకున్నా. మీకు మాకు రాజకీయ విభేదాలు లేవు. రాజకీయ పరిస్థితుల వల్ల, నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ మారాను. ఆనాడు మీరు, మేము కలిసి టీఆర్‌ఎస్‌లోకి వెళ్దామని నిర్ణయానికి వచ్చాం. కానీ, మీ కోతి చేష్టల వల్ల సీఎం కేసీఆర్ మీమ్మల్ని తీసుకోలేదు’ అని లింగయ్య అన్నారు. తాను ఓడిపోయిన తర్వాత తన మీద కొందరు దాడులు చేయాలనే ప్రయత్నాలు చేశారని, కార్యకర్తలపై కేసులు పెట్టించారని అన్నారు. సీఎం పిలుపు మేరకు కొంత మంది సంప్రందించి నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ మారానని చెప్పారు.
గతంలో మీకు వ్యతిరేకంగా పనిచేసిన వేముల వీరేశంను ఇప్పుడు వెంట వేసుకుని తిరుగుతూ విలువలు లేని రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. కోమటిరెడ్డి సోదరులను నల్లగొండ జిల్లా నుంచి తరిమికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. నల్లగొండలో, మునుగోడులో కోమటిరెడ్డి బ్రదర్స్‌ను సైలెంట్ ఓటుతో ఓడిస్తానని అన్నారు. తన కార్యకర్తలు ఇక్కడ ప్రచారం చేస్తారు.. నేను వారి నియోజకవర్గాలకు వెళ్లి వారి ఓటమి కోసం ప్రచారం చేస్తా అన్ని చిరుమర్తి లింగయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, సీనియర్ నాయకుడు చెరుకు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment