స్ట్రాంగ్ రూమ్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్ కర్ణన్
నల్లగొండ: జిల్లాలో ఆరు నియోజకవర్గాల పరిధిలో జరిగిన ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అంతా సిద్ధమైంది. జిల్లా కేంద్రం సమీపంలోని మిర్యాలగూడ రోడ్డులో దుప్పలిపల్లి గ్రామ శివారులోని గోదాముల్లో జరగనుంది. ఆదివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు.
ఆ తర్వాత ఈవీఎంలలో ఓట్లను లెక్కించనున్నారు. అయితే ఆయా నియోజకవర్గాల్లో ఉన్న పోలింగ్ స్టేషన్ల ఆధారంగా.. రౌండ్లు వారీగా కౌంటింగ్ జరగనుంది. మిర్యాలగూడ నియోజకవర్గం లెక్కింపు ప్రకియ 19 రౌండ్లలోనే పూర్తికానుండడంతో.. అక్కడి ఫలితమే మొదట వెలువడనుంది.
లెక్కింపు ఇలా..
3వ తేదీన ఉదయం 7 గంటలకు పోటీ చేసే అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్‌రూమ్‌లను తెరుస్తారు. 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. అవి పూర్తయిన తర్వాత ఈవీఎంలలోని ఓట్లను లెక్కిస్తారు. ఓట్ల లెక్కింపు కోసం ఒక్కో నియోజకవర్గానికి 14 టేబుళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో టేబుల్‌కు ఒక కౌంటింగ్ సూపర్‌వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్, మైక్రో అబ్జర్వర్ ఉంటారు.
పోస్టల్ ఓట్లు లెక్కింపు కోసం 4 టేబుళ్లను, సర్వీస్ ఓట్ల లెక్కింపునకు మరో టేబుళ్ల ఏర్పాటు చేశారు. రౌండ్ పూర్తయిన తర్వాత జనరల్ అబ్జర్వర్ అన్నీ పరిశీలించిన తర్వాతనే ఆ రౌండ్ ఫలితాలను వెల్లడించనున్నారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ర్యాండమైజ్‌గా ప్రతి నియోజకర్గంలో రెండు పోలింగ్ బూత్‌లలో వచ్చిన ఓట్లకు సంబంధించి ఈవీఎంల ఓట్లను. వీవీ ప్యాట్ల ఓట్లను సరి చూస్తారు. రెండు సమానంగా వస్తేనే.. తుది ఫలితాన్ని వెల్లడిస్తారు.
దేవరకొండ ఫలితం 23 రౌండ్లలో..
జిల్లాలోని ఆరు నియోజక వర్గాల్లో దేవరకొండ నియోజక వర్గం మినహా మిగతా నియోజక వర్గాల్లో 22 రౌండ్లలోపే కౌంటింగ్ ప్రక్రియ పూర్తి కానుంది. మునుగోడు, నకిరేకల్, నాగార్జునసాగర్ నియోజక వర్గాల్లో 22 రౌండ్లు, మిర్యాలగూడ 19, నల్లగొండ 21 రౌండ్లలో లెక్కింపు పూర్తి కానుంది. దేవరకొండ నియోజకవర్గంలో 23వ రౌండ్‌లో కౌంటింగ్ పూర్తవుతుంది.
ఈవీఎంల ఓట్ల లెక్కింపునకు సంబంధించి పోటీ చేసే అభ్యర్థులు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో ఒక రౌండ్ కౌంటింగ్ పూర్తయ్యేందుకు 20 నుంచి 40 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉంది. అభ్యర్థులు తక్కువగా ఉన్న చోట 20 నిమిషాల్లోపే ప్రక్రియ పూర్తి కానుంది. మునుగోడులో అభ్యర్థులు అధికంగా ఉండటంతో లెక్కింపు ఆలస్యం కానుంది.
భద్రతను పరిశీలించే అవకాశం..
కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. మొదట స్టేట్ పోలీస్, రెండో విడతలో స్టేట్ ఆర్ముడు పోలీస్, స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద సీఏపీఎఫ్ బలగాలు భద్రత నిర్వహిస్తున్నాయి.
స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఏజెంట్లు, అభ్యర్థులు వాటిని పరిశీలించుకునేందుకు అవకాశం ఉంది. స్ట్రాంగ్ రూమ్‌ల బయట ఏర్పాటు చేసిన సెంటర్‌లోకి వెళ్లి అక్కడ సీసీ కెమెరాల ద్వారా భద్రతను చూసుకోవచ్చు.
పకడ్బందీగా ఓట్ల లెక్కింపు.. కలెక్టర్ ఆర్‌వి.కర్ణన్
నల్లగొండ : అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపును పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్‌వి.కర్ణన్ తెలిపారు. శుక్రవారం ఆయన తిప్పర్తి మండలం అనిశెట్టి దుప్పలపల్లిలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాములో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.
ఆదివారం ఉదయం 8 గంటలకు నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ, మునుగోడు, నకిరేకల్, నాగార్జునసాగర్ నియోజకవర్గాలకు సంబంధించి ఓట్ల లెక్కింపును చేపట్టనున్నట్లు తెలిపారు. ఒక్కో నియోజకవర్గం ఓట్ల లెక్కింపునకు ఒక్కో హాల్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికల కమిషన్ అనుమతి ఉన్నవారికే స్ట్రాంగ్ రూమ్స్‌లోకి అనుమతి ఇస్తామని పేర్కొన్నారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment