
సాక్షి, నల్లగొండ : తెలంగాణలో ఉప ఎన్నికలు రాబోతున్నాయని ఆసక్తికర కామెంట్స్ చేశారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. ముఖ్యమంత్రి రేవంత్ నీ పని అయిపోయింది.. తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు. రాష్ర్టంలో జరుగుతున్న మూడు ఎమ్మెల్సీ ఎన్నికలు రాష్ట్ర ప్రజల భవిష్యత్తుతో ముడిపడినవి అంటూ చెప్పుకొచ్చారు.
నల్లగొండలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ.. ‘తుమ్మితే ఊడిపోయే ముక్కులా తెలంగాణ, హిమాచల్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో ఉప ఎన్నికలు రాబోతున్నాయి. రేవంత్ నీ పని అయిపోయింది. తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు. 14 నెలలుగా విద్యార్థుల నుంచి పదవి విరమణ చేసిన ఉద్యోగుల వరకు రేవంత్ ప్రభుత్వం వారిని రాచి రంపాన పెడుతోంది.
రాష్ర్టంలో జరుగుతున్న మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నికలు.. రాష్ట్ర ప్రజల భవిష్యత్తుతో ముడిపడ్డాయి. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో కూడా అర్థం కావడం లేదు. కాంగ్రెస్ పార్టీకి పోటీ చేసే ధైర్యమే లేదు. వందేళ్ల కాంగ్రెస్ పార్టీకి దిక్కు మొక్కు లేకుండా పోయింది. బీఆర్ఎస్ గత చరిత్రలా మిగిలిపోయింది. బీఆర్ఎస్ 25 ఏళ్ల ఉత్సవాలు జరుపుకుంటూ అభ్యర్థినే నిలబెట్టలేకపోయింది. సమస్యలపై బరిగీసి కొట్లాడే పార్టీ బీజేపీ మాత్రమే.
సంఘాల పేరుతో పోటీ చేస్తున్న వ్యక్తులకు రేవంత్‌తో పోట్లాడే దమ్ముందా అనేది ఆలోచించుకోవాలి. 317 జీవోపై పోరాడి జైలుకు పోయింది బీజేపీ నేతలు మాత్రమే. ఆనాడు ఏ ఒక్క టీచర్ ఎమ్మెల్సీ కూడా దీనిపై మాట్లాడలేదు. పదవీ విరమణ తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడం లేదు. రేవంత్ పాలనపై పట్టులేదు. బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టాయి. కేసీఆర్ చిప్పచేతికి ఇస్తే దాని పట్టుకుని ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నాడు రేవంత్’ అంటూ ఘాటు విమర్శలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment