నిర్మాణం పూర్తయిన మాడుగులపల్లి మండలం పాములపహాడ్ వైకుంఠధామం
మిర్యాలగూడ : సర్పంచ్‌ల పదవీకాలం 20 రోజుల్లో ముగియనుంది. ఈలోపు ఎన్నికలు నిర్వహించి కొత్త పాలకవర్గాన్ని ఎన్నుకోవాల్సి ఉన్నప్పటికీ పార్లమెంట్ ఎన్నికలు దృష్ట్యా రాష్ట్ర ఎన్నికల సంఘం సర్పంచ్ ఎన్నికలపై దృష్టి పెట్టడం లేదు.
పదవీ కాలం ముగిశాక తిరిగి ఎన్నికలు నిర్వహించే వరకు పంచాయతీ కార్యదర్శులు ఇన్‌చార్జిలుగా వ్యవహరించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తమకు రావాల్సిన పెండింగ్ బిల్లుల కోసం సర్పంచ్‌లు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కొత్త ప్రభుత్వం బిల్లులు మంజూరు చేసి ఆదుకోవాలని కోరుతున్నారు.
సర్పంచ్‌లకు అందని బిల్లులు..
జిల్లాలో 844 గ్రామపంచాయతీలు ఉన్నాయి. గ్రామాల్లో రోడ్లు, డ్రెయినేజీలు, వీధి లైట్ల ఏర్పాటు, డంపింగ్‌యార్డులు, పల్లె ప్రకృతివనాలు, వైకుంఠధామాల నిర్మాణం చేపట్టారు. గ్రామాల్లో చెత్తను సేకరించేందుకు ప్రభుత్వం ట్రాక్టర్లను అందించింది.
మల్టీ పర్పస్ వర్కర్లను నియమించింది. కాగా, కేంద్రం నుంచి వచ్చే ఆర్థిక సంఘం నిధులు గ్రామపంచాయతీల్లో పనిచేసే సిబ్బంది జీతాలు, నిర్వహణకు కూడా సరిపోని పరిస్థితి. అభివృద్ధి పనులకు ప్రభుత్వం నుంచి బిల్లుల మంజూరులో జాప్యం కావడంతో సర్పంచ్‌లు అప్పలు చేసి మరీ పనులు పూర్తి చేశారు. ఇలా ఒకొక్కరు సుమారు రూ.5లక్షల నుంచి రూ.30లక్షల వరకు అప్పులు చేశారు.
బిల్లులు సకాలంలో రాకపోవడంతో తీసుకొచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజుల్లో తమ పదవీకాలం ముగుస్తుండడం.. చేసిన పనులకు ప్రభుత్వం నుంచి బిల్లులు అందకపోవడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు.
రూ.300 కోట్లకు పైగా పెండింగ్!
గ్రామాల్లో రైతు వేదికలు, వైకుంఠధామాలు, డంపింగ్‌యార్డు పనులు అధికారులు సర్పంచ్‌లపై ఒత్తిడి తీసుకొచ్చి మరీ పూర్తి చేయించారు. ఒక్కో రైతు వేదికను రూ.22లక్షల అంచనా వ్యయంతో నిర్మించగా అందులో రూ.12 లక్షలు ఉపాధి హామీ నిధుల నుంచి ఖర్చు చేయగా మిగిలిన రూ.10 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది.
ఉపాధిహామీ నుంచి నిధులు వచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి బిల్లులు ఇంత వరకు అందలేదని పలువురు చెబుతున్నారు. ఇలా ప్రతి పనికీ అరకొరగానే బిల్లులు విడుదలయ్యాయని అంటున్నారు. ఇలా జిల్లా వ్యాప్తంగా రూ.300 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. నూతన ప్రభుత్వమైనా పెండింగ్‌లో ఉన్న బిల్లులను చెల్లించి ఆదుకోవాలని సర్పంచ్‌లు కోరుతున్నారు.
రూ.70లక్షలు రావాల్సి ఉంది..
గ్రామాభివృద్ధి కోసం వడ్డీకి తీసుకొచ్చి పని చేశా. ఆ నిధులతో సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, నీటి సమస్య తీర్చేందుకు బోరు మోటార్లకు ఖర్చు చేశా. ఈనెల చివరన పదవీకాలం ముగియనుంది. నేను గ్రామాభివృద్ధి కోసం పెట్టన ఖర్చులో ఇంకా రూ.70 లక్షల బిల్లులు రావాల్సి ఉంది. పెట్టిన డబ్బులు వెంటనే చెల్లించకపోతే ఆర్థికంగా చితికిపోయే ప్రమాదం ఉంది. కొత్త ప్రభుత్వమైనా బిల్లులు చెల్లించాలి. – చల్లా అంజిరెడ్డి, సర్పంచ్, వీర్లపాలెం
అప్పులు తెచ్చి అభివృద్ధి చేశాం
గ్రామాభివృద్ధికి కోసం ఖర్చు చేసిన నిధులను వెంటనే విడుదల చేయాలి. అప్పులు తీసుకొచ్చి మరీ పనులు చేపట్టాం. దానికి సంబంధించిన ఎంబీ రికార్డులను కూడా సమర్పించాం. వెంటనే బిల్లులు మంజూరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలి. మా గ్రామంలో రూ.30 లక్షల అభివృద్ధి పనుల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. వెంటనే వాటిని అందించాలి. పదవీ కాలం పొడిగించాలి. – దొంతిరెడ్డి వెంకట్‌రెడ్డి, సర్పంచ్, రావులపెంట
Comments
Please login to add a commentAdd a comment