grama panchayats
-
బిల్లులు లేకుండానే ఆడిట్లు పూర్తి.. ఆడిట్‌పై అనుమానాలు!
దురాజ్‌పల్లి (సూర్యాపేట): జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో గత ఐదేళ్ల కాలంలో చోటుచేసుకున్న అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఆడిట్ ద్వారా అవినీతిని నిగ్గు తేల్చాల్సిన అధికారులు, పాలక వర్గాలతో జతకట్టారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. శ్రీతిలాపాపం తలా పిడికెడుంశ్రీ అన్న చందంగా ఆడిట్ సమయంలో జీపీల వారీగా కమీషన్లు తీసుకొని బిల్లులు లేకుండానే ఆడిట్ పూర్తి చేశారనే ఆరోపణలకు ఇటీవల బయటపడుతున్న అక్రమాలు అద్దం పడుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జిల్లాలోని గ్రామ పంచాయతీలకు ఈ ఐదేళ్ల కాలంలో వివిధ మార్గాల ద్వారా పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తూ వచ్చాయి. వీటిని కొందరు సర్పంచ్‌లు సక్రమంగా ఖర్చు చేయకుండా దుర్వినియోగానికి పాల్పడి రూ.లక్షల నిధులు స్వాహా చేసినట్టు వాస్తవాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ► నిధుల అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో జనవరి 5న మఠంపల్లి గ్రామ పంచాయతీ రికార్డులను హుజూర్నగర్ ఆర్డీఓ స్వాధీనం చేసుకొని విచారణ నిర్వహించారు. 49 చెక్కుల ద్వారా రూ.74.84లక్షలను ఎంబీలు లేకుండా డ్రా చేశారని, వీటిని రికవరీ చేయాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. ఆ సమయంలో అక్కడ పనిచేసిన కార్యదర్శిని సస్పెండ్ చేశారు. ఇలా జిల్లాలోని చాలా పంచాయతీల్లో రూ.లక్షల నిధులు దుర్వినియోగమైనట్టు అధికారులు విచారణలో గుర్తించారు. ► మేళ్లచెరువు గ్రామ పంచాయతీలో నిధులు దుర్వినియోగంపై కొద్దిరోజుల క్రితం జిల్లా కలెక్టర్‌కు వార్డు మెంబర్లు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ దీనిపై విచారణకు ఆదేశించాగా జనవరి 5న కోదాడ ఆర్డీఒ నేతృత్వంలోని బృందం జీపీ రికార్డులను స్వాధీనం చేసుకొని విచారణ చేపట్టారు. దీంట్లో దాదాపు రూ.2కోట్లు దుర్వినియోగమైనట్లు గుర్తించారు. స్థానిక సర్పంచ్‌కు నోటీసులు జారీ చేసి 45 రోజుల్లో నిధులు రికవరీ చేయాలని తహసీల్దార్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఏడాదికి రూ.45 కోట్లు జిల్లాలో మొత్తం 475 పంచాయతీలు ఉన్నాయి. పంచాయతీల్లో పారిశుద్ధ్య పనులు, తాగునీటి సరఫరా, వీధిలైట్ల నిర్వహణ, డ్రెయినేజీలు, సీసీ రోడ్ల నిర్మాణం తదితర మౌలిక సదుపాయాలను మెరుగుపర్చేందుకు ప్రభుత్వాలు నిధులు విడుదల చేస్తాయి. ఒక్కో వ్యక్తికి స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ద్వారా ప్రతినెలా రూ.335, కేంద్రం నుంచి 15వ ఆర్థిక సంఘం ద్వారా రూ.201.46 చొప్పున గ్రాంట్ వస్తుంది. ఇవీకాక ఉపాధి నిధులు, రిజిస్ట్రేషన్, మైనింగ్ శాఖలకు వచ్చే ఆదాయంలో 25 శాతం నిధులు, ఎమ్మెల్యేలు, మంత్రులకు ఇచ్చే సీడీపీ నిధుల్లో 75 శాతం కోత విధించి వాటిని కూడా ప్రభుత్వం పంచాయతీలకే మళ్లిస్తోంది. దీంతో జీపీలకు ఏడాదికి రూ.45 కోట్ల నిధులు విడుదలవుతున్నాయి. ఆడిట్లో అభ్యంతరాలు కనబడలేదా..! పంచాయతీ పాలకవర్గం ఆమోదం లేకుండా చిల్లిగవ్వ ఖర్చు పెట్టడానికి వీలు లేదు. ఖర్చు చేసిన ప్రతిపైసాకు బిల్లులు చూపించాలి. అయితే గత ఐదేళ్ల కాలంలో గ్రామాల్లో చేసిన పనులకు 2019–20 నుంచి 2022–23 వరకు అంటే నాలుగేళ్ల ఆడిట్‌ను పూర్తి చేశారు. ఈ సమయంలో కొన్ని అభ్యంతరాలను గుర్తించిన తర్వాత బిల్లులు చూపడంతో క్లియరెన్స్ ఇచ్చినట్టు సమాచారం. ఇంతవరకు భాగానే ఉన్నా కొన్ని పంచాయతీల్లో నిధుల దుర్వినియోగం జరిగిందని ఇటీవల ఫిర్యాదులు రావడంతో అధికారులు విచారణ చేసి నిధుల దుర్వినియోగం జరిగినట్లు గుర్తించారు. అయితే ఇక్కడే ఆడిట్‌పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో ఆడిట్ చేసిన సమయంలో ఉన్న బిల్లులు ఇప్పుడెందుకు లేవనే ప్రశ్నలు తలెత్తున్నాయి. ఆడిట్ సమయంలో బిల్లులు లేకున్నా అధికారులు కమీషన్ల కోసం కళ్లు మూసుకున్నారా.. లేక దొంగ బిల్లులు కావడంతో ఇప్పుడు చూపడం లేదా అనేది అర్థంకాని ప్రశ్నగా మారింది. పంచాయతీల్లో ఖర్చు చేసిన నిధులపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. -
ముగియనున్న పంచాయతీల పదవీకాలం.. ఆవేదనలో సర్పంచ్‌లు!
మిర్యాలగూడ : సర్పంచ్ల పదవీకాలం 20 రోజుల్లో ముగియనుంది. ఈలోపు ఎన్నికలు నిర్వహించి కొత్త పాలకవర్గాన్ని ఎన్నుకోవాల్సి ఉన్నప్పటికీ పార్లమెంట్ ఎన్నికలు దృష్ట్యా రాష్ట్ర ఎన్నికల సంఘం సర్పంచ్ ఎన్నికలపై దృష్టి పెట్టడం లేదు. పదవీ కాలం ముగిశాక తిరిగి ఎన్నికలు నిర్వహించే వరకు పంచాయతీ కార్యదర్శులు ఇన్చార్జిలుగా వ్యవహరించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తమకు రావాల్సిన పెండింగ్ బిల్లుల కోసం సర్పంచ్‌లు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కొత్త ప్రభుత్వం బిల్లులు మంజూరు చేసి ఆదుకోవాలని కోరుతున్నారు. సర్పంచ్‌లకు అందని బిల్లులు.. జిల్లాలో 844 గ్రామపంచాయతీలు ఉన్నాయి. గ్రామాల్లో రోడ్లు, డ్రెయినేజీలు, వీధి లైట్ల ఏర్పాటు, డంపింగ్‌యార్డులు, పల్లె ప్రకృతివనాలు, వైకుంఠధామాల నిర్మాణం చేపట్టారు. గ్రామాల్లో చెత్తను సేకరించేందుకు ప్రభుత్వం ట్రాక్టర్లను అందించింది. మల్టీ పర్పస్ వర్కర్లను నియమించింది. కాగా, కేంద్రం నుంచి వచ్చే ఆర్థిక సంఘం నిధులు గ్రామపంచాయతీల్లో పనిచేసే సిబ్బంది జీతాలు, నిర్వహణకు కూడా సరిపోని పరిస్థితి. అభివృద్ధి పనులకు ప్రభుత్వం నుంచి బిల్లుల మంజూరులో జాప్యం కావడంతో సర్పంచ్‌లు అప్పలు చేసి మరీ పనులు పూర్తి చేశారు. ఇలా ఒకొక్కరు సుమారు రూ.5లక్షల నుంచి రూ.30లక్షల వరకు అప్పులు చేశారు. బిల్లులు సకాలంలో రాకపోవడంతో తీసుకొచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజుల్లో తమ పదవీకాలం ముగుస్తుండడం.. చేసిన పనులకు ప్రభుత్వం నుంచి బిల్లులు అందకపోవడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. రూ.300 కోట్లకు పైగా పెండింగ్! గ్రామాల్లో రైతు వేదికలు, వైకుంఠధామాలు, డంపింగ్‌యార్డు పనులు అధికారులు సర్పంచ్‌లపై ఒత్తిడి తీసుకొచ్చి మరీ పూర్తి చేయించారు. ఒక్కో రైతు వేదికను రూ.22లక్షల అంచనా వ్యయంతో నిర్మించగా అందులో రూ.12 లక్షలు ఉపాధి హామీ నిధుల నుంచి ఖర్చు చేయగా మిగిలిన రూ.10 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. ఉపాధిహామీ నుంచి నిధులు వచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి బిల్లులు ఇంత వరకు అందలేదని పలువురు చెబుతున్నారు. ఇలా ప్రతి పనికీ అరకొరగానే బిల్లులు విడుదలయ్యాయని అంటున్నారు. ఇలా జిల్లా వ్యాప్తంగా రూ.300 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. నూతన ప్రభుత్వమైనా పెండింగ్‌లో ఉన్న బిల్లులను చెల్లించి ఆదుకోవాలని సర్పంచ్‌లు కోరుతున్నారు. రూ.70లక్షలు రావాల్సి ఉంది.. గ్రామాభివృద్ధి కోసం వడ్డీకి తీసుకొచ్చి పని చేశా. ఆ నిధులతో సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, నీటి సమస్య తీర్చేందుకు బోరు మోటార్లకు ఖర్చు చేశా. ఈనెల చివరన పదవీకాలం ముగియనుంది. నేను గ్రామాభివృద్ధి కోసం పెట్టన ఖర్చులో ఇంకా రూ.70 లక్షల బిల్లులు రావాల్సి ఉంది. పెట్టిన డబ్బులు వెంటనే చెల్లించకపోతే ఆర్థికంగా చితికిపోయే ప్రమాదం ఉంది. కొత్త ప్రభుత్వమైనా బిల్లులు చెల్లించాలి. – చల్లా అంజిరెడ్డి, సర్పంచ్, వీర్లపాలెం అప్పులు తెచ్చి అభివృద్ధి చేశాం గ్రామాభివృద్ధికి కోసం ఖర్చు చేసిన నిధులను వెంటనే విడుదల చేయాలి. అప్పులు తీసుకొచ్చి మరీ పనులు చేపట్టాం. దానికి సంబంధించిన ఎంబీ రికార్డులను కూడా సమర్పించాం. వెంటనే బిల్లులు మంజూరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలి. మా గ్రామంలో రూ.30 లక్షల అభివృద్ధి పనుల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. వెంటనే వాటిని అందించాలి. పదవీ కాలం పొడిగించాలి. – దొంతిరెడ్డి వెంకట్‌రెడ్డి, సర్పంచ్, రావులపెంట -
తెలంగాణ పంచాయతీలకు అవార్డుల పంట
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ గ్రామ పంచాయతీలు అవార్డుల పంట పండించాయి. జాతీయస్థాయిలో ఉత్తమ పంచాయతీలుగా ఎన్నికై రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచాయి. మొత్తం 9 విభాగాలకుగాను 8 విభాగాల్లో విశేష ప్రతిభ కనబర్చి అవార్డులను సొంతం చేసుకొని రాష్ట్రపతితో ప్రశంసలు అందుకున్నాయి. జాతీయ పంచాయతీ అవార్డులు–2023లో భాగంగా కేంద్రం ప్రకటించిన మొత్తం 46 జాతీయ అవార్డుల్లో 13 అవార్డులను తెలంగాణ గెలుచుకుంది. 9 కేటగిరీల్లో అవార్డుల ఎంపిక జరగగా, 8 కేటగిరీల్లో పంచాయతీలు అవార్డులు సాధించాయి. దీంతో తెలంగాణను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రత్యేకంగా అభినందించారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఢిల్లీలోని విజ్ఞానభవన్‌లో సోమవారం జరిగిన పంచాయత్ అవార్డుల కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీపీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, అధికారులు అందుకున్నారు. నాలుగు కేటగిరీల్లో నాలుగు మొదటి ర్యాంకులు దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయతీ సతత్ వికాస్ పురస్కార్ విభాగంలో నాలుగు కేటగిరీల్లో నాలుగు గ్రామాలు మొదటి ర్యాంకులు సాధించగా, రెండు గ్రామాలు రెండో ర్యాంకులను, మరో రెండు గ్రామాలు మూడో ర్యాంకులను సాధించాయి. ఐదు నానాజీ దేశ్‌ముఖ్ సర్వోత్తమ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాలను తెలంగాణ కైవసం చేసుకుంది. అవార్డుల కార్యక్రమం అనంతరం మంత్రి ఎర్రబెల్లి తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ వల్ల జరుగుతున్న పల్లెప్రగతి కార్యక్రమం, అది సాధించిన ఫలితాలను వివరించారు. దేశంలో తెలంగాణ మాత్రమే కేంద్ర ఆర్థిక సంఘం నిధులకు పంచాయతీలకు సక్రమంగా అందజేస్తోందని చెప్పారు. సీఎం కేసీఆర్ ఆలోచనా పథంలో పనిచేస్తూ, ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని, దేశానికి ఆదర్శంగా తెలంగాణను నిలపాలని అవార్డు గ్రహీతలకు సూచించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేయాలని మంత్రి ఎర్రబెల్లి కోరారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయతీ సతత్ వికాస్ పురస్కార్ : 1) ఆరోగ్యకర పంచాయతీ: గౌతంపూర్– 1వ ర్యాంకు (భద్రాద్రి కొత్తగూడెం జిల్లా) 2) నీరు సమృద్ధిగా ఉన్న పంచాయతీ: నెల్లుట్ల– 1వ ర్యాంకు(జనగాం జిల్లా) 3) సామాజిక భద్రత పంచాయతీ: కొంగట్పల్లి– 1వ ర్యాంకు (మహబూబ్‌నగర్ జిల్లా) 4) మహిళలకు స్నేహపూర్వక పంచాయతీ: అయిపూర్–) 1 వ ర్యాంకు (సూర్యాపేట జిల్లా) 5) పేదరికంలేని మెరుగైన జీవనోపాధి పంచాయతీ: మన్దొడ్డి– 2వ ర్యాంక్ (జోగులాంబ గద్వాల్ జిల్లా) 6) సుపరిపాలన పంచాయతీ: చీమలదారి– 2వ ర్యాంక్ (వికారాబాద్ జిల్లా) 7) పరిశుభ్ర పంచాయతీ : సుల్తాన్పూర్–3వ ర్యాంకు (పెద్దపల్లి జిల్లా) 8) స్వయం సమృద్ధి మౌలిక సదుపాయాలు ఉన్న పంచాయతీ: గంభీరావ్‌పేట– 3వ ర్యాంకు (రాజన్న సిరిసిల్ల జిల్లా) నానాజీ దేశ్‌ముఖ్ సర్వోత్తం పంచాయత్ సతత్ వికాస్ పురస్కారం... బెస్ట్ బ్లాక్ పంచాయతీ: తిమ్మాపూర్(ఎల్ఎండీ)– 2వ ర్యాంకు (కరీంనగర్ జిల్లా) బెస్ట్ డిస్ట్రిక్ట్ పంచాయతీ: ములుగు– 2వ ర్యాంకు గ్రామ ఊర్జా స్వరాజ్ ప్రత్యేక పంచాయతీ అవార్డు : ముక్రా– 3వ ర్యాంకు (ఆదిలాబాద్ జిల్లా) కార్బన్ న్యూట్రల్ ప్రత్యేక పంచాయతీ అవార్డు: కన్హా– 2వ ర్యాంకు (రంగారెడ్డి జిల్లా) గ్రామ ఊర్జా స్వరాజ్ ప్రత్యేక పంచాయతీ అవార్డు : ఎర్రవెల్లికి ప్రత్యేక ప్రశంస (సిద్ధిపేట జిల్లా) ఆ పంచాయతీలు రాష్ట్రానికి గర్వకారణం:– సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: పచ్చదనం, పరిశుభ్రతతోపాటు పలు అభివృద్ధి ఇతివృత్తాల విభాగాల్లో తెలంగాణ పంచాయతీలు దేశంలోనే అత్యున్నత స్థాయిలో నిలవడం రాష్ట్రానికే గర్వకారణమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. ఈ మేరకు మంత్రి ఎర్రబెల్లి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీపీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, పంచాయతీరాజ్ శాఖ అధికారులను సీఎం కేసీఆర్ అభినందించారు. ‘దేశవ్యాప్తంగా 2.5 లక్షల గ్రామపంచాయతీలు పోటీపడగా అందులో కేవలం 46 గ్రామాలు అవార్డులు దక్కించుకున్నాయి. వాటిలో 13 అవార్డులు తెలంగాణకే వచ్చినయి. అంటే ప్రకటించిన మొత్తం జాతీయ అవార్డుల్లో 30 శాతం తెలంగాణ రాష్ట్రమే కైవసం చేసుకున్నది. ఈ 13 ర్యాంకుల్లోంచి కూడా 4 ఫస్టు ర్యాంకులు తెలంగాణకే రావడం గొప్ప విషయం’అని పేర్కొన్నారు. -
రోడ్డుకు అటూ.. ఇటూ.. రెండు పంచాయతీలు
ఆళ్లగడ్డ /ప్రత్తిపాడు: చూడ్డానికి ఒకే ఊరిలా ఉంటుంది గానీ.. అక్కడ రెండు పంచాయతీలున్నాయి. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని పేరాయిపల్లె, గోపాలపురం పంచాయతీలను విభజించేది ఓ వీధి రోడ్డే. పేరాయిపల్లెలో 859, గోపాలపురంలో 563 మంది ఓటర్లున్నారు. గోపాలపురం మొదట్నుంచీ ప్రత్యేక పంచాయతీగానే ఉంది. పేరాయిపల్లె మాత్రం సుమారు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న జిజమ్మలదిన్నె గ్రామ పంచాయతీ పరిధిలో ఉండేది. 1995లో ప్రత్యేక పంచాయతీగా ఏర్పాటు చేశారు. ఒకే ఊరిలా ఉన్న ఇక్కడ విడివిడిగా పాఠశాలలు, ఆలయాలు ఉన్నాయి. అలాగే గుంటూరు జిల్లాలోని ప్రత్తిపాడు మండల పరిధిలోని నన్నపనేనివారిపాలెం, గింజుపల్లివారిపాలేలను ఒకే రోడ్డు విడదీస్తుంది. అయితే నన్నపనేనివారిపాలెం తిమ్మాపురం పంచాయతీలో, గింజుపల్లివారిపాలెం పాతమల్లాయపాలెం పంచాయతీ పరిధిలో ఉన్నాయి. రెండు గ్రామాల్లో కలిపి సుమారుగా 153 మంది ఓటర్లున్నారు. గుంటూరు జిల్లాలో నన్నపనేనివారిపాలెం, గింజుపల్లివారిపాలేల మధ్య రహదారి -
గ్రామ సచివాలయాలకు వీధి దీపాల బాధ్యత
సాక్షి, అమరావతి: గ్రామాల్లో ఎల్ఈడీ వీధి దీపాలను మరింత సమర్థంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా వీధి దీపాల నిర్వహణ బాధ్యతను గ్రామ సచివాలయాల చేతుల్లో పెట్టాలని యోచిస్తోంది. ఫిర్యాదు వచ్చిన 48 గంటల్లోనే వెలిగేలా క్షేత్రస్థాయి సిబ్బందిని సమాయత్తం చేస్తోంది. సచివాలయ కార్యదర్శిని పర్యవేక్షకుడిగా నియమించనుంది. ఈ దిశగా విధివిధానాలను రూపొందించాలని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. వివరాలను ఇంధన పొదుపు సంస్థ సీఈవో చంద్రశేఖర్ రెడ్డి శుక్రవారం మీడియాకు వెల్లడించారు. ► పంచాయతీ కార్యదర్శులు రాష్ట్ర ఇంధన సామర్థ్య అభివృద్ధి సంస్థ భాగస్వామ్యంతో ఎల్ఈడీ వీధి దీపాల నిర్వహణ బాధ్యతలను నిర్వహించాల్సి ఉంటుంది. ► ఫిర్యాదుల పరిష్కారంలో ఎనర్జీ అసిస్టెంట్ల తోడ్పాటు కూడా తీసుకుంటారు. ఒకవేళ ఎనర్జీ అసిస్టెంట్లు అందుబాటులో లేకపోతే పంచాయతీ కార్యదర్శి ప్రత్యేకంగా సాంకేతిక నిపుణులను నియమించుకోవచ్చు. ► కొత్త వ్యవస్థలో భాగంగా డెస్‌్కటాప్, మొబైల్ ఆధారిత యాప్‌ను అభివృద్ధి చేయడంతో పాటు టోల్ ఫ్రీ నంబరును ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచుతారు. ► గ్రామ పంచాయతీల్లో ఎల్ఈడీ వీధి లైట్లు అమర్చడం వల్ల దీర్ఘకాలికంగా రూ.156 కోట్ల విలువైన విద్యుత్ ఆదా చేయవచ్చు. -
గ్రామ పంచాయతీలకు రూ.1,168 కోట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రూ.1,168.28 కోట్లను విడుదల చేస్తూ పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది బుధవారం ఉత్తర్వులిచ్చారు. 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెండో విడత రాష్ట్రానికి విడుదల చేయాల్సిన నిధులను కేంద్రం ఆ ఆర్థిక ఏడాది విడుదల చేయలేదు. ఆ నిధులను ఇప్పుడు కేంద్రం రాష్ట్రానికి విడుదల చేయడంతో వాటిని ఆయా గ్రామ పంచాయతీలకు విడుదల చేస్తూ ఉత్తర్వులిచ్చారు. -
పంచాయతీలకు పవర్ షాక్!
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీలకు కరెంట్ షాక్ తగిలింది. పాత బకాయిలు గుదిబండగా మారడంతో స్థానిక సంస్థల ఖజానాకు భారీ చిల్లు పడనుంది. ఏళ్ల తరబడి చెల్లించని బిల్లుల చిట్టాను వెలికితీసిన విద్యుత్ సంస్థలు.. గ్రామాల వారీగా జాబితాను పంచాయతీరాజ్‌శాఖకు అందజేశాయి. ఇందులో ఒక్కో పంచాయతీకి సగటున రూ.లక్షల్లో బిల్లులు రావడంతో పాలకవర్గాలు గగ్గోలు పెడుతున్నాయి. పాత బకాయిలు తప్పనిసరిగా చెల్లించాలని సీఎం కేసీఆర్ స్పష్టంచేయడంతో ఈ మేరకు పెండింగ్ బిల్లుల వ్యవహా రానికి ముగింపు పలకాలని పీఆర్ శాఖ నిర్ణయించింది. భారీగా పెండింగ్.. రాష్ట్రవ్యాప్తంగా 12,571 గ్రామ పంచాయతీలకు సంబంధించి రూ.700.68 కోట్ల మేర విద్యుత్ బకాయిలున్నాయి. ఇందులో రూ.280 కోట్ల మేర సర్‌చార్జీలే ఉండటం గమనార్హం. వీటిని వన్‌టైమ్ సెటిల్మెంట్ పద్ధతిలో చెల్లించే వెసులుబాటు కల్పించే అంశాన్ని పరిశీలించాలని ట్రాన్స్‌కోను పంచాయతీరాజ్ శాఖ అభ్యర్థించింది. వినియోగ చార్జీలను తగ్గించలేమని, బిల్లులు కట్టకపోవడంతో మోపిన అపరాధ రుసుం(సర్‌చార్జీ)ను తగ్గించే అంశాన్ని సానుకూలంగా పరిశీలిస్తామని ఆ సంస్థ స్పష్టం చేసింది. ఏ శాఖ నుంచైనా కచ్చితంగా వసూలు చేయాలని సీఎం స్పష్టం చేయడం.. స్థానిక సంస్థలు కరెంట్ బిల్లుల క్లియర్‌కు మొదటి ప్రాధాన్యతనివ్వాలని కొత్త పంచాయతీరాజ్ చట్టంలో పొందుపరచడం పంచాయతీరాజ్ శాఖను ఇరకాటంలో పడేసింది. నిధుల కటకటతో కొట్టుమిట్టాడిన పంచాయతీలు.. పేరుకుపోయిన బిల్లులే కాదు.. నెలవారీ బిల్లులు కూడా చెల్లించకుండా వాయిదా వేస్తూ వచ్చా యి. దీంతో మొత్తం తడిసి మోపెడయ్యాయి. కట్ చేయలేక..కాసులు రాక.. విద్యుద్దీపాలు, తాగునీటి అవసరాలకు స్థానిక సంస్థలు విద్యుత్‌ను వినియోగిస్తున్నాయి. వీటిని అత్యవసర సర్వీసులుగా గుర్తించినందున కరెంట్ సరఫరాను నిలిపివేయడం ట్రాన్స్‌కోకు ప్రతిబం ధకంగా మారింది. అయితే ప్రభుత్వ శాఖల నుంచి భారీ మొత్తంలో రావాల్సిన బిల్లు లు సకాలంలో రాకపోవడంతో సంస్థకు ఆర్థికంగా కష్టంగా మారిందని సీఎం దృష్టికి విద్యుత్ శాఖ తీసుకెళ్లింది. దీంతో విద్యుత్ సంస్థలను కాపాడుకోవాలంటే ఏ శాఖ అయినా తప్పకుండా కరెంట్ చార్జీలు చెల్లించాల్సిందేనని తేల్చిచెప్పడంతో స్థానిక సంస్థలకు మినహాయింపు లేకుండాపోయింది. తాజాగా గ్రామ సీమల అభివృద్ధికి ప్రతినెలా రాష్ట్ర ప్రభుత్వం రూ.339 కోట్లు విడుదల చేస్తోంది. ఈ నిధుల నుంచి కరెంట్ చార్జీలు చెల్లించాలని సూచిస్తూ పీఆర్ కమిషనర్ రఘునందన్‌రావు డీపీవోలను ఆదేశించారు. కొత్త మీటర్ల అమరికకు రూ.1,600 కొత్త గ్రామ పంచాయతీల్లో విద్యుత్ మీటర్ల ఏర్పాటుకు సర్వీస్ చార్జీ, ఇతరత్రా అవసరాలకు వన్‌టైమ్ కింద రూ.1,600 వినియోగించుకునే వెసులుబాటును ప్రభుత్వం స్పష్టం చేసిం ది. గతేడాది రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 4 వేల కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయి. వీటికి సంబంధించిన విద్యుత్ సరఫరా, నిర్వహణ బాధ్యతలు విడిపోయినందున దానికి తగ్గట్టుగా నూతన జీపీల్లోనే కరెంట్ మీటర్ ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. బకాయిల భారం కష్టమే కాగా పెండింగ్ కరెంట్ బిల్లులను స్థానిక పంచాయతీలు చెల్లించాలని ప్రభుత్వం స్పష్టం చేయడంతో చిన్న పంచాయతీలు దిక్కుతోచని పరిస్థితుల్లో పడ్డాయి. ఇప్పటికే మల్టీ పర్పస్ వర్కర్, ట్రాక్టర్, ట్రాలీ కొనుగోలు, 30 రోజుల పల్లె ప్రణాళికలో భాగంగా చేసిన పనులకు నిధుల్లేక తల్లడిల్లుతున్న తరుణంలో ఈ భారాన్ని ఎలా మోయాలనే సందిగ్ధ పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. -
మింగింది కక్కాల్సిందే...
సాక్షి, మోర్తాడ్(నిజామాబాద్) : గ్రామ పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభత్వాలు కేటాయించిన నిధులను పక్కదారి పట్టించిన అక్రమార్కులకు ఆడిట్ అధికారులు నోటీసులను జారీ చేస్తున్నారు. 2001 నుంచి 2018 వరకు పంచాయతీల ఆడిట్‌ను ఇటీవల పూర్తి చేసిన అధికారులు నిధులు పక్కదారి పట్టిన పంచాయతీలను గుర్తించి నోటీసులు అందిస్తున్నారు. 18 ఏళ్ల నుంచి గడచిన ఏడాది వరకు వివిధ పీరియడ్లలో సర్పంచ్‌లుగా వ్యవహరించిన వారికి కార్యదర్శులుగా పని చేసిన ఉద్యోగులలో బాధ్యులు ఎవరు ఉంటే వారికి నోటీసులు ఇవ్వాలని ఆడిట్ అధికారులు నిర్ణయించారు. జిల్లాలో పంచాయతీల పునరి్వభజన జరుగకముందు 393 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ అన్ని పంచాయతీల్లో ఆడిట్ అధికారులు జమా ఖర్చుల వివరాలను పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా ఖర్చు చేసిన ఆంశాలను గుర్తించి అభ్యంతరాలను వ్యక్తం చేశారు. అలా జిల్లాలో 50,346 అభ్యంతరాలు వెల్లడయ్యాయి. ఈ అభ్యంతరాలకు సంబంధించి మొత్తం రూ.64.06 కోట్లు పక్కదారి పట్టినట్లు అధికారులు గుర్తించారు. గ్రామ పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీఆర్జీఎఫ్, ఆర్థిక సంఘం, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ల ద్వారా నిధులు కేటాయించేవి. అలాగే తలసరి నిధులతో పాటు పంచాయతీలకు ఇంటి పన్నులు, నీటి కుళాయి బిల్లులు, లైసెన్స్‌ల జారీ, తైబజార్ వేలం వల్ల కూడా ఆదాయం లభిస్తుంది. ప్రభుత్వం కేటాయించిన నిధుల ఖాతాలు, జనరల్ ఫండ్ ఖాతాల ద్వారా జరిపిన చెల్లింపులను ఆడిట్ అధికారులు పరిశీలించి అభ్యంతరాలను వ్యక్తం చేశారు. ఎంబీ రికార్డు సరిగా ఉన్నవాటిని మినహాయించి సరైన రసీదులు లేకుండా నిధులు ఖర్చు చేసిన వాటిపై అధికారులు ఆడిట్లో అభ్యంతరం తెలిపారు. -
మున్సి‘పోల్స్’కు ముందే హోదా పెంపు
సాక్షి, అనంతపురం న్యూసిటీ/కదిరి: మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ క్రమంలోనే జిల్లాలోని పెనుకొండ, ఉరవకొండ, గోరంట్ల మేజర్ గ్రామ పంచాయతీలకు నగర పంచాయతీలుగా హోదా కల్పించేందుకు సిద్ధమైంది. ఈనెల 31లోగా ఆయా పంచాయతీల స్థాయి పెంపుపై వివరాలు ఇవ్వాలని మున్సిపల్ శాఖ అధికారులను ఆదేశించింది. ఈ మేరకు జీఓ ఎంఎస్ నెం.18 విడుదల చేసింది. అంతేకాకుండా జిల్లాలో ఇప్పటికే ఉన్న మున్సిపాలిటీలతో పాటు కొత్తగా నగర పంచాయతీలుగా ఏర్పడనున్న మూడు పంచాయతీల సమీప గ్రామాలు, ప్రాంతాలను సైతం ఆయా మున్సిపాలిటీల్లో విలీనం చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు సమాచారం ఇవ్వాలని కోరింది. దీంతో జిల్లా కలెక్టర్ సత్యనారాయణ కొత్తగా ఏర్పాటు కానున్న నగర పంచాయతీలు, మున్సిపాలిటీల్లోని సమీప ప్రాంతాలు, గ్రామాల సమగ్ర సమాచారం ఇవ్వాలని పట్టణాభివృద్ధి శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. మున్సి‘పోల్స్’కు ముందే హోదా పెంపు ఎన్నికలకు ముందే కొత్త మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం అనంతపురం నగర పాలక సంస్థతో పాటు హిందూపురం, గుంతకల్లు, ధర్మవరం, కదిరి, కళ్యాణదుర్గం, పుట్టపర్తి, గుత్తి, పామిడి మున్సిపాలిటీలున్నాయి. ఈ నెల 2వ తేదీతో వీటి పాలకవర్గం గడువు ముగిసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయా మున్సిపాలిటీలకు ప్రత్యేక అధికారులను నియమించింది. వీటికి తిరిగి ఎన్నికలు నిర్వహించేలోపే ఉరవకొండ, గోరంట్ల, పెనుకొండ పంచాయతీలకు నగర పంచాయతీ హోదా కల్పించి వీటికీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. గతేడాది ప్రతిపాదనలు గతేడాది ఆగస్టు 23న అప్పటి కలెక్టర్ ఆదేశాల మేరకు డిస్ట్రిక్ట్ టౌన్, కంట్రీ ప్లానింగ్ అధికారి జిల్లాలోని ఉరవకొండ, పెనుకొండ, గోరంట్ల, యాడికి మేజర్ గ్రామ పంచాయతీలకు నగర పంచాయతీలుగా హోదా కల్పించాలని, అనంతపురం చుట్టూ పది కిలోమీటర్ల దూరంలో ఉండే రాజీవ్‌కాలనీ, ప్రసన్నాయపల్లి, రాప్తాడు, ఏ నారాయణపురం పంచాయతీలను నగరపాలక సంస్థలో విలీనం చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అలాగే ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా అనంతపురం చుట్టు పక్కల ఉన్న బీకేఎస్, ఉప్పరపల్లి, రుద్రంపేట, కక్కలపల్లి కాలనీ, కక్కలపల్లి, అనంతపురం రూరల్ గ్రామ పంచాయితీలను విలీనం చేయవద్దని పేర్కొన్నారు. హోదా పెరిగితే.. నిధుల వరద పెనుకొండ, గోరంట్ల, ఉరవకొండ ప్రాంతాలను నగర పంచాయతీలు హోదా దక్కితే వాటికి భారీగా నిధులు మంజూరవుతాయి.దీంతో అవి అభివృద్ధి దిశగా ముందుకెళ్లనున్నాయి. -
మరో 4నగర పంచాయతీలు
సాక్షి, అరసవల్లి: ఓవైపు గ్రామీణాభివృద్ధి... మరోవైపు పట్టణీకరణ.. ఇలా అన్ని విధాలుగా ప్రజలకు సౌకర్యాలు కల్పించి, జీవన ప్రమాణాలను పెంచేందుకు రాష్ట్ర సర్కార్ సంకల్పించింది. ఇప్పటికే మారుమూల గిరిజన తండాలు గ్రామ పంచాయతీలుగా అప్‌గ్రేడ్ కాగా.. పట్టణ నాగరికత, వనరులు పెరిగిన గ్రామ పంచాయతీలను నగర పంచాయతీ/మున్సిపాల్టీలుగా అప్‌గ్రేడ్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. దీంతో మరోసారి నగర పంచాయతీల అంశం తెరమీదకొచ్చింది. ఈమేరకు జిల్లాలో రాజకీయ, పారిశ్రామిక, ఆర్థిక, సహజ వనరులు, జనాభా తదితర అంశాలను ప్రాతిపదికగా తీసుకుని టెక్కలి, నరసన్నపేట, పాతపట్నం, రణస్థలం గ్రామ పంచాయతీలను నగర పంచాయతీలుగా మార్చేందుకు పురపాలక శాఖ సన్నద్ధమయ్యింది. దీంతో జిల్లా పంచాయతీ అధికారులు ఆయా ప్రతిపాదిత పంచాయతీల నైసర్గిక స్వరూపం, జనాభా, అతి సమీప గ్రామ పంచాయతీల్లో ఉన్న జనాభాతోపాటు అసెస్మెంట్లు తదితర వివరాలను సిద్ధం చేసే పనిలో పడ్డారు. దీంతో ఈ ప్రతిపాదనలను త్వరలోనే ఆచరణ సాధ్యంగా మలిచేందుకు ఆయా పం చాయతీ అధికారులు తగు చర్యల్లో నిమగ్నమయ్యారు. స్వరూపం మారనున్న ఆ నాలుగు... జిల్లాలో ప్రస్తుతం వరకు 1141 గ్రామ పంచాయతీలున్నాయి. ఇందులో ప్రధానంగా టెక్కలి, నరసన్నపేట, పాతపట్నం, రణస్థలం పట్టణ పంచాయతీలను నగర పంచాయతీలుగా మార్చేందుకు ప్రతిపాదనలు రావడంతో జిల్లాలో చర్చలు జోరందుకున్నాయి. ఇందుకు ప్రధాన కారణం.. ఈ నాలుగు పంచాయతీలు రాజకీయ ప్రాధాన్యత గల ప్రాంతాలు కావడంతో అన్ని విధాలుగా అప్‌గ్రేడ్ అవ్వనున్నట్లు చెప్పవచ్చు. మున్సిపల్ నిబంధనల ప్రకారం నగర పంచాయతీ లేదా మున్సిపాల్టీగా మార్పు చేయాలంటే కనీస జనాభా 20 వేలకు మించిన పంచాయతీలుగా ఉండాలి. అయితే ప్రస్తుతం ప్రకటించిన నాలుగు పంచాయతీల్లో పాతపట్నం, రణస్థలంలలో 20 వేలలోపు జనాభా ఉండడంతో సమీప గ్రామాలను కలుపుకుని నగర పంచాయతీలుగా మార్చేందుకు చర్యలు చేపట్టనున్నారు. దీంతో ఈనాలుగు పంచాయతీ కేంద్రాల స్వరూపాలే మారిపోనున్నాయి. ఈనెల 31లోగా నివేదికలు పంపించేందుకు చర్యలు జిల్లాలో నాలుగు పంచాయతీలను నగర పంచాయతీలుగా మార్చేందుకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయం నుంచి ప్రతిపాదనలు కోరారు. నిబంధనల ప్రకారం ప్రతిపాదిత పంచాయతీకి సంబంధించి జనాభా, ఆదాయం, వనరులు, కోల్పోతున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు, విస్తీర్ణం, సర్వే నెంబర్లు తదితర 13 ప్రొఫార్మాలను ఈనెల 31లోగా పంపించేందుకు చర్యలు చేపడుతున్నాం. టెక్కలి జిల్లా కేంద్రం తర్వాత ప్రధాన రాజకీయ కేంద్రంగా టెక్కలినే చెప్పవచ్చు. ఇక్కడ 2001 జనాభా లెక్కల ప్రకారం 28,631 మంది ఉండగా, ప్రస్తుతానికి ఆ సంఖ్య 34 వేల వరకు చేరింది. అలాగే ఈ పంచాయతీ కేంద్రంలో 6067 ఇళ్లు ఉన్నట్లు అధికారిక సమాచారం. అయితే టెక్కలికి అతి సమీపంలో చాకిపల్లి, అక్కువరం, బన్నువాడ, రావివలస, కె.కొత్తూరు తదితర పంచాయతీలున్నాయి. నరసన్నపేట వాణిజ్య వ్యాపార కేంద్రంగా ఉన్న నరసన్నపేటలో 2001 నాటికి 26,280 మంది జనాభా ఉండగా, ఇప్పుడా సంఖ్య 30 వేలకు పైగా ఉంది. అలాగే 8977 ఇళ్లు ఉండగా, అతి సమీపంగా సత్యవరం తదితర పంచాయతీలున్నాయి. పాతపట్నం పాత సిటీగా పేరున్న ఈ పట్టణానికి ఒడిశా సరిహద్దు ప్రాంతంగా చారిత్రక ప్రాధాన్యత ఉంది. 2001 నాటికి 17,247 మంది జనాభా ఉండగా, ప్రస్తుతానికి ఈ సంఖ్య 20 వేలకు పైగా చేరింది. ఇక్కడ 5995 ఇళ్లు ఉండగా, అతి సమీపంగా ప్రహరాజపాలెం, బూరగాం, కోదూరు తదితర గ్రామాలున్నాయి. రణస్థలం ఫార్మా కేంద్రంగా పేరున్న రణస్థలం ప్రాంతానికి చారిత్రక ప్రాధాన్యత ఉండగా, పలు ఫార్మా పరిశ్రమలు, అణువిద్యుత్ కేంద్రం నిర్మాణంతో ఈ ప్రాంతానికి దేశవ్యాప్తంగా పేరు ప్రసిద్ధి కానుంది. రణస్థలంతోపాటు జంట ప్రాంతంగా ఉన్న జేఆర్ పురంలో జనాభా కలిపి 2001 నాటికి 11,332 మంది కాగా, ప్రస్తుతానికి ఆ సంఖ్య 15 వేలకు పైగానే చేరింది. ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ స్థిర నివాసాలు చేసుకోవడంతో ఈ ప్రాంతం కొన్నేళ్లుగా విస్తరించింది. అలాగే ఈ జంట ప్రాంతాల్లో ప్రస్తుతానికి 3,062 ఇళ్లు ఉన్నాయి. రణస్థలానికి సమీపంలో రావాడ, కోష్ట తదితర ప్రాంతాలున్నాయి. -
మొక్కుబడి గ్రామసభలకు చెక్
సాక్షి, ఆదిలాబాద్ : గ్రామాల్లో మొక్కుబడిగా నిర్వహించే గ్రామ సభలు, సమావేశాలకు ప్రభుత్వం చెక్ పెట్టనుంది. ఇకనుంచి గ్రామసభలు, సమావేశాలు పకడ్బందీగా నిర్వహించేందుకు కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈమేరకు ప్రభుత్వం నుంచి జిల్లా అధికారులకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. గ్రామ ప్రగతి, ప్రజలకు సంక్షేమ పథకాలు అందించేందుకు సభలు, పంచాయతీ సమావేశాలు కీలకం. ఇప్పటివరకు మొక్కుబడిగా సాగినా ఇకనుంచి బాధ్యతాయుతంగా నిర్వహించనున్నారు. రెండు నెలలకోసారి గ్రామసభ, నెలకోసారి పంచాయతీ పాలకవర్గ సమావేశం నిర్వహించాలి. లేదంటే సర్పంచ్ పదవికి అనర్హులుగా ప్రకటిస్తారు. మండలంలో 37 జీపీలు.. ఆదిలాబాద్ ఉమ్మడి మండలంలోని ఆదిలాబాద్‌రూరల్‌లో 34 గ్రామపంచాయతీలు ఉండగా, నూతనంగా ఏర్పాటైన మావల మండలంలో 3 గ్రా మాలు ఉన్నాయి. ఆయా గ్రామపంచాయతీల్లో ఇదివరకు మొక్కుబడిగా సమావేశాలు నిర్వహించేవారు. కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఇకనుంచి తప్పనిసరిగా సమావేశాలు నిర్వహించాల్సి ఉంటుంది. లేనియేడల అధికారులు చర్యలు తీసుకుంటారు. కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం సమావేశాలను సకాలంలో నిర్వహిస్తే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందని పలువురు పేర్కొంటున్నారు. కోరం ఉండాల్సిందే.. గ్రామసభకు జనాభాను బట్టి ప్రజలు హాజరు కావాల్సి ఉంటుంది. గ్రామాల్లో 500 ఓటర్లు ఉంటే 50 మంది, 3వేల మంది ఓటర్లు ఉంటే 150 మంది, 5వేల మంది ఓటర్లు ఉంటే 200 మంది, 10వేల మంది ఓటర్లు ఉంటే 300 మంది, అంతకుమించి ఉంటే 400 మంది గ్రామసభలకు హాజరుకావాల్సిందే. కొత్త చట్టం ప్రకారం ఏడాదికి ఆ రుసార్లు నిర్వహించాలి. తేదీ, సమయం ముందుగా ఊరిలో ప్రచారం చేయాలి. ఒకవేళ నిర్ణయించిన తేదీన గ్రామసభ జరగకపోతే తిరిగి పది రో జుల్లో నిర్వహించాలి. సర్పంచ్ లేకుంటే ఉప సర్పంచ్ ఆధ్వర్యంలోనైనా ఏర్పాటు చేయాలి. జాప్యం కుదరదు.. గ్రామపంచాయతీ పాలకవర్గాలు ఫిబ్రవరి 2న ఏర్పాటయ్యాయి. మార్చి చివరి నాటికి మొదటసభ నిర్వహించాల్సి ఉండగా, ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో ప్రభుత్వం ఇన్నాళ్లు పట్టించుకోలేదు. ఇప్పుడు ఎన్నికలు పూర్తయినా సభలు నిర్వహించకపోవడంతో పంచాయతీరాజ్‌శాఖ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఏడాదికి నాలుగుసార్లు.. పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసేందు కు 73 రాజ్యాంగ సవరణలో 29 అంశాలను చేర్చా రు. వివిధ సంక్షేమ పథకాల విధులు, పారదర్శకంగా నిర్వహించేలా గ్రామాలను ఆర్థికంగా బలోపేతం చేస్తూ అభివృద్ధి చేసేలా పంచాయతీ సమావేశాలు పక్కాగా నిర్వహించాల్సి ఉంటుంది. ప్రతీ రెండునెలలకోసారి గ్రామసభలు తప్పనిసరిగా నిర్వహించాలి. అలాగే పంచాయతీ పాలకవర్గ సమావేశాలు నెలనెలా నిర్వహించాల్సిందే. -
పల్లెల్లో పచ్చదనం, పరిశుభ్రత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని గ్రామసీమలను పచ్చదనం, పరిశుభ్రతకు కేంద్రాలుగా మార్చేందుకు ప్రభుత్వపరంగా కార్యాచరణ సిద్ధమైంది. గ్రామపంచాయతీల్లో పచ్చదనం, పరిశుభ్రత ప్రధాన అంశాలుగా విస్తృత స్థాయిలో ప్రచార కార్యక్రమాలతోపాటు వాటి అమలుకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. నగరాల్లో పౌరులకు అందుబాటులోకి వచ్చే సౌకర్యాలన్నీ కూడా పల్లె ప్రజలకు కూడా అందేలా మార్పు తీసుకురావాలని నిర్ణయించింది. గ్రామాల్లోనూ పూర్తిస్థాయిలో పారిశుధ్యం, వీధి దీపాలు, ఇతర మౌలిక సౌకర్యాల కల్పనకు కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొచ్చిన ప్రభుత్వం.. దీనిని పకడ్బందీగా అమలు చేసేందుకు కార్యక్రమాలను రూపొందించింది. పంచాయతీల్లో సౌకర్యాలు మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలు, ప్రచార కార్యక్రమాలకు సంబంధించి గతంలోనే సీఎం కేసీఆర్ ఆదేశాలిచ్చారు. వీటిని తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు, జెడ్పీపీ సీఈవోలు, జిల్లా పంచాయతీ అధికారులకు పీఆర్ శాఖ కొన్ని రోజుల క్రితం ఒక మెమోను కూడా జారీ చేసింది. పచ్చదనం, పరిశుభ్రతకు సంబంధించిన పనుల పర్యవేక్షణను గ్రామపంచాయతీ, సర్పంచ్‌లతోపాటు ఈవోపీఆర్డీ, ఎంపీడీవోలు చేపట్టాలని సూచించింది. అన్ని గ్రామాల్లో ఎంపీడీవోలు, ఈవోపీఆర్లు, డీపీవోలు, డీఎల్పీవోలు విస్తృతంగా పర్యటించి ప్రభుత్వం నిర్ణయించిన కార్యక్రమాలు పక్కాగా అమలయ్యేలా చూడాలని ఆదేశించింది. పంచాయతీల్లో ’డ్రై డే’.. గ్రామ పంచాయతీల్లో దోమల వృద్ధి లేకుండా నిరోధించేందుకు వారానికి ఒకరోజు ’డ్రై డే’నిర్వహించాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా పంచాయతీ సిబ్బంది వారానికి ఒకరోజు ఇంటింటికి వెళ్లి డ్రై డే పాటించాల్సిన ప్రాముఖ్యతను వివరిస్తారు. ఇళ్లు, వాటి చుట్టూ ఉన్న పరిసరాల్లోని గుంటలు, తొట్టెలు, పాత టైర్లు తదితరాల్లో నీటి నిల్వలు లేకుండా చూసేలా ప్రజల్లో చైతన్యం కల్పిస్తారు. రాష్ట్రంలోని అన్ని పల్లెలను పచ్చదనం, పరిశుభ్రతతో కూడిన గ్రామాలుగా తీర్చిదిద్దడంలో భాగంగా వివిధ రూపాల్లో విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని ఇదివరకే పీఆర్ శాఖ సూచించింది. ఈ–పంచాయతీలు... ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగించుకుని గ్రామ పంచాయతీలను ఈ–పంచాయతీలుగా మార్చే క్రమంలో సాంకేతికంగా ప్రస్తుతం అందుబాటులో ఉన్న వనరులు, సామగ్రిని ఉపయోగించుకోవడంతోపాటు మెరుగైన సాంకేతికతలను అనుసరించే దిశలో చర్యలు చేపట్టనున్నారు. రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఆన్లైన్లో వివిధ కార్యకలాపాల నిర్వహణపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. పంచాయతీల్లో ఆన్లైన్ డేటా ఎంట్రీపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, పంచాయతీ మాడ్యుల్స్‌ను అప్లోడ్ చేయడం వంటివి పూర్తిచేయాలని జిల్లా పంచాయతీ అధికారుల (డీపీవో)ను పీఆర్ శాఖ ఆదేశించింది. భవన నిర్మాణ అనుమతులు, లే అవుట్ల పర్మిషన్లను ఆన్లైన్లోనే జారీ చేసేందుకు వీలుగా సాంకేతిక పరమైన వసతులు సమకూర్చుకోవాలని సూచించింది. జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, వివాహ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు, భూరికార్డుల మ్యుటేషన్లు, ట్రేడ్ లైసెన్స్‌ల జారీ వంటి వాటిని ఆన్లైన్లోనే అందించేందుకు వీలుగా ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంది. గ్రామ పంచాయతీల పరిధిలో జరిగే వివాహాలను తప్పనిసరిగా అక్కడే రిజిష్టర్ చేసేలా చూడాలని సూచించింది. పంచాయతీ కార్యదర్శులకు పనితీరు సూచికలు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. -
నిధుల కేటాయింపులో పెద్దపీట
కరీంనగర్: నిధుల కేటాయింపు విషయంలో అన్ని జిల్లాల కంటే కరీంనగర్ జిల్లాకు పెద్దపీట వేస్తానని రాష్ట్రపంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హామీ ఇచ్చారు. బుధవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ అధ్యక్షతన జరిగిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్రం చట్టం వల్ల నిధులు, అధికారాలు కోల్పోవడంతో స్థానిక సంస్థలకు అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. తిరిగి అన్యాయం జరుగకుండా ఉండేందుకు నిధులు, అధికారాలను బదలాయించడంతోపాటు అవినీతి రహిత పాలన కోసం చట్టాలను ఉల్లంఘించే సర్పంచులు, ఇతర స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులపై కూడా చర్య తీసుకునే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పంచాయతీరాజ్, రెవెన్యూ, మున్సిపల్ చట్టసవరణకు పకడ్బందీ ప్రణాళిక రూపొందిస్తున్నారని చెప్పారు. త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లోనే చట్ట సవరణ చేసి కొత్త చట్టాలను అమలులోకి తేస్తామని మంత్రి తెలిపారు. ఇందుకోసమే సర్పంచ్‌లకు చెక్ పవర్ ఇవ్వడంలో జాప్యం జరుగుతోంది తప్పా మరే ఉద్దేశం లేదని, సర్పంచ్‌లకు చెక్‌పవర్ లేక ఇబ్బందులు జరుగుతున్న మాట వాస్తవమేనని అంగీకరించారు. ఒకవేళ చట్టసవరణకు ముందు చెక్‌పవర్ ఇస్తే వాటిలో ఏమైనా తేడా వస్తే కోర్టును ఆశ్రయించే అవకాశాలుంటాయని, పకడ్బందీతో చట్టసవరణ చేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. ఈ చట్టసవరణ ద్వారా సర్పంచు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, జెడ్పీ చైర్పర్సన్లకు అధికారాలను బదలాయించడంతోపాటు ప్రత్యేకంగా నిధులు కేటాయించడం జరుగుతుందని చెప్పారు. గ్రామాల్లోని పాఠశాలలు, అంగన్వాడీ, ఉపాధి హమీ పథకం వంటి వాటిలో కూడా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయబోతున్నామని అన్నారు. గ్రామాలను పరిశుభ్రంగా అందంగా ఉండాలనే ఉద్దేశంతో గ్రామ కార్యదర్శులను నియమించామని, ఏ గ్రామంలో కూడా బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన చేస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. మిషన్ భగీరథ పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని, ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ పథకాన్ని అమలు చేసేందుకు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు వివరాలను తెలుసుకొని సీఎం కేసీఆర్‌ను అభినందిస్తున్నారని అన్నారు. వారం రోజుల్లో గ్రామీణ ఉపాధి హమీ బిల్లులు ఇస్తామని, ఇందుకోసం ఇటీవలనే కేంద్ర మంత్రిని కలువడం జరిగిందని మంత్రి ఎర్రబెల్లి ప్రకటించారు. హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ ఇంటికి కనీసం 6 మొక్కలు చొప్పున నాటి వాటిని బతికించుకోవాలని, ఊర్లలోని గుట్టలపై విరివిగా పండ్ల మొక్కలను పెంచాలని, దీంతో కోతుల బెడద కూడా తప్పుతుందని, వర్షాలు బాగా పడి మంచి రోజులు వస్తాయని, హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజాప్రతినిధులను కోరారు. గతంలో రైతులకు ఇచ్చిన హరితహారం విజయవంతమైందని, రోడ్ల పక్కన అధికారులు నాటిని మొక్కలు ఎండిపోయాయని, ఈసారి అలా జరుగకుండా విరివిగా మొక్కలు నాటాలని సూచించారు. పండ్లు, పూల మొక్కలు నాటేందుకు, నీరు పోసేందుకు ఎన్ని డబ్బులైనా ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ జిజ్జుగా ఉన్నారని, ప్రతి ఒక్కరూ హరితహారంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పంచాయతీరాజ్ వ్యవస్థలో లోపాలున్నాయని ఇందుకు అధికారులందరూ బాధ్యులు కాదని, కొంతమంది కక్కుర్తి పడి తప్పులు చేస్తున్నారని చెప్పారు. అవినీతి రహిత పాలన, ఒక్కరూపాయి లేకుండా రైతులందరికీ పాసుబుక్కులు, రైతుబంధు పథకాన్ని అమలు చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నారని అన్నారు. త్వరలోనే ధాన్యం కొనుగోలు చేసిన రైతులకు డబ్బులు ఇప్పిస్తామని, జూలై 1న ఆసరా పింఛన్లను రెట్టింపు చేసి ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా లబ్ధిదారులకు వాటిని పంపిణి చేసే కార్యక్రమాన్ని చేపడతామని అన్నారు. వైద్య రంగంలో నెంబర్‌వన్ స్థానంలో నిలుపుదాం ఆర్థిక శాఖ మంత్రిగా జిల్లాకు అధిక నిధులు కేటాయించిన మాట వాస్తవమేనని, ఇల్లు చక్కబెట్టి సమాజం గుర్తించి ఆలోచించాలనే ఉద్దేశంతో జిల్లాలో ఏకగ్రీవంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు ఇచ్చిన హమీ మేరకు ఒక్కో మండలానికి రూ.20 లక్షలు, రూ.30 లక్షల చొప్పున అదనంగా జిల్లాకు నిధులు మంజూరు చేశామని అన్నారు. ఆరోగ్య శాఖ మంత్రిగా జిల్లాను వైద్య రంగంలో రాష్ట్రంలోనే నెంబర్‌వన్ స్థానంలో నిలుపుతామని అన్నారు. రాజకీయ నాయకులకు పదవీ విరమణ ఉండదని, పదవిలో ఉన్నప్పుడు చేసిన పనులు గౌరవాన్ని నిలబెడుతాయని అన్నారు. స్థానిక సంస్థల పెండింగ్ బిల్లులు ఇప్పిస్తానని, అర్ధంతరంగా మిగిలిన పనులను పూర్తిచేయిస్తానని హామీ ఇచ్చారు. పదవిలో ఉన్నా లేకున్నా మీ గౌరవానికి భంగం కలిగించకుండా వ్యవహరిస్తానని జెడ్పీటీసీ, ఎంపీపీలకు భరోసా ఇచ్చారు.– రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కలిసికట్టుగా కృషి చేశాం జిల్లా పరిషత్, మండల పరిషత్ సభ్యులుగా జిల్లా అభివృద్ధికి, సంక్షేమ పథకాల అమలుకు, సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ జెడ్పీ గౌరవాన్ని ఇనుమడింపజేసేందుకు మేమంతా అన్నదమ్ముల్లా, అక్కాచెల్లెల్లుగా, కుటుంబ సభ్యులుగా పార్టీలకతీతంగా కలిసికట్టుగా కృషి చేశామని, ఐదేళ్లు చాలా దగ్గరగా ఉన్నామని జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ సంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి ఈటల రాజేందర్ చేదోడు, వాదోడుగా ఉంటూ సంపూర్ణ సహకారాన్ని అందించారని ధన్యవాదాలు తెలిపారు. అధికారులు, సభ్యుల సహకారాన్ని మరిచిపోబోమని, అందరి సహకారంతో ఐదేళ్లు పదవిలో కొనసాగామని అన్నారు. రాష్ట్రంలోనే మొదటి జెడ్పీగా నిలబెట్టేందుకు నిధులు కేటాయించాలని మంత్రి దయాకర్‌రావును కోరారు. – జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ -
బతుకులు తెల్లారెదెన్నడు!
చెన్నారావుపేట: ఎన్నో సంవత్సరాల నిరీక్షణ.. తక్కు వేతనం అని చూడకుండా నిరంతరం శ్రమ చేసేవారే జీపీ కార్మికులు.. కాని వారి బతుకులు దుర్భరంగా మారాయి. చాలీ చాలని వేతనాలతో సతమతమవుతున్నారు. భవిష్యత్‌లో మంచి వేతనం పెరుగుతందనే కోటి ఆశలతో ఎదురుచూపులుచూస్తుంది. తెలంగాణ వచ్చాకనైనా మా బతుకులు బాగుపడలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం లేచింది మొదలు సాయంత్రం, రాత్రి అనకుండా గ్రామాలలోని డ్రెయినేజీ, వీధులు, ఇంటి పన్నులు, నల్ల పన్నులు, వీధి లైట్లు, గ్రామ ప్రజలకు నీటిని అందించడం, ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొనడం, అధికారులు చెప్పిన పనులు చేయడంతో పాటు ఎన్నో మౌళిక వసతుల రూపలకల్పనలో గ్రామ పంచాయతీ కార్మికుల పాత్ర కీలకమైంది. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేస్తానని హామీ ఇచ్చారు. కాని గ్రామ పంచాయతీల్లో ఎన్నో ఏళ్లుగా చాలిచాలని వేతనాలతో తాత్కాలిక ఉద్యోగులుగా పనిచేస్తున్న కార్మికులను విస్మరించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలాల్లో 265 పాత గ్రామ పంచాయతీలు ఉండగా 136 నూతన జీపీలు ఏర్పాటు కావడంతో 401కి చేరాయి. గ్రామ పంచాయితీలు.. పాత జీపీల ప్రకారంగా ఉన్న సిబ్బంది వివరాలు ఇలా ఉన్నాయి. అందులో 3 Salaries), 12 పుల్టైం వర్కర్లు(9 బిల్ కలెక్టర్లు, 03 పంప్ ఆపరేటర్,) , 58 మంది పార్ట్ టైం(16 బిల్ కలెక్టర్లు, 15 మంది పంప్ ఆపరేటర్లు, 12 స్వీపర్లు, 3 అటెండర్లు ఇతరులు 12 మంది) ఉద్యోగులు ఉన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులుగా( తాత్కాలిక ఉద్యోగులుగా బిల్ కలెక్టర్లు 99, అటెండర్లు 23, ఎలక్ట్రీసిటీ 107, పంప్ ఆపరేటర్లు 246 మంది, శానిటేషన్ స్వీపర్లు 257, ఇతరులు 96, మొత్తం 828 మంది తాత్కాలిక ఉద్యోగులుగా ఉన్నారు. చాలీచాలని వేతనం వీరికి నెలకు వేతనం రూ. 1000 నుంచి సుమారుగా రూ. 5 వేల వరకు ఇస్తున్నారు. ఇవి సక్రమంగా నెలనెలకు ఇవ్వకపోవడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జీపీ కార్మికులకు కనీస వేతనాలు, ఈపీఎప్, ఈఎస్ఐ, ప్రభుత్వం నుంచి విడుదలైన జీవోలు, మెమోలను పంచాయతీరాజ్, గ్రామీణ ఉపాధి కల్పన కమిషనర్ నుంచి జిల్లా ఉన్నతాధికారులకు గతంలో పంపించారని, అమలు చేయడంలో జిల్లా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం 2012 డిసెంబర్ 20 న జరిగిన చలో కమిషనరేట్ కార్యక్రమం చేపట్టగా దిగొచ్చిన ప్రభుత్వం వేలాది కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని యూనియన్ ప్రతినిధులతో అడిషనల్ కమిషనర్ ఒప్పుకున్నారని తెలిపారు. 2013 మే, జూన్‌లో కూడా 33 రోజులు చేసిన సమ్మెకు కూడా ప్రభుత్వం అమలు చేస్తానని హామి ఇచ్చినప్పటికీ సంవత్సరాలు గడుస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఐదుసంత్సరాల సర్వీస్ పూర్తయిన పంచాయతీ కార్మికులను పర్మనెంట్ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం జీవో నంబర్ 3 ను అమలు చేయాలని కోరుతున్నారు. పర్మనెంట్ ఉద్యోగులుగా గుర్తించాలి 1995లో పాత మగ్దుంపుర గ్రామ పంచాయతీలో ఎలక్ట్రీషన్ వర్కర్‌గా విధుల్లో చేరాను. అప్పుడు రూ.70 వేతనం అందించారు. 15 సంవత్సరాలకు రూ. 1500 వేతనం అందిస్తున్నారు. ఇవి నెలనెలకు ఇవ్వడం లేదు. గ్రామ పంచాయతీలో విద్యుత్ దీపాలు, బావి మోటర్, ఇంటి పన్నులుతో పాటు పలు రకాల పనులు చేస్తాం. పభుత్వం గుర్తించి ప్రభుత్వ ఉద్యోగులుగా గర్తించి వేతనాలు పెంచాలి. నాంపెల్లి కుమార్, ఎలక్ట్రీషియన్,పాత మగ్దుంపురం కనీస వేతనం రూ. 20 వేలు అందించాలి ప్రభుత్వం అన్ని రకాల ఉద్యోగులను ఆదుకుంటుంది. వారి తో పాటు గ్రామ పంచాయతీలలో చాలీ చాలనీ వేతనాలతో పనిచేస్తున్న కార్మికులకు ప్రభుత్వం రూ. 20 వేల వేతనం ప్రభుత్వం ద్వారా అందించి ఆదుకోవాలి. జీపీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ఆదుకోవాలి. కూచన ప్రకాశ్, తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల ఫోరం జిల్లా అధ్యక్షుడు -
పల్లెలకు వెలుగు
సాక్షి, వరంగల్ రూరల్ : గ్రామీణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలనలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు, పాలక వర్గాలకు వెన్నుదన్నుగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. గ్రామ పంచాయతీ పాలన పారదర్శకంగా సాగేందుకు గ్రామ స్థాయిలో ఏడు కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ కమిటీల్లో పాలకవర్గం భాగస్వామ్యం ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలిసారిగా పంచాయతీరాజ్ చట్టం–2018లో రూపుదిద్దుకుంది. జిల్లాలో మొత్తం 401 పంచాయతీలకు నూతన పాలకవర్గంతో గ్రామ జ్యోతి కమిటీలు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. తెలంగా ణ పంచాయతీరాజ్ చట్టం–2018లోని సెక్షన్ –49 ప్రకారం ప్రతి గ్రామ పంచాయతీలో నాలుగు స్టాండింగ్ కమిటీలను ఏర్పా టు చేయాలి. ప్రభుత్వం ఉత్తర్వుల ప్రకారం ఈ కమిటీలకు సర్పంచ్ లేదా ఉపసర్పంచ్ లేదంటే వార్డు సభ్యులు చైర్మన్లుగా ఉంటా రు. ఆయా కమిటీల్లో ఆ గ్రామాల్లోని స్వయం సహాయక సంఘాల అధ్యక్షులు, సామాజిక కార్యకర్తలు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, సంబంధిత రంగాల్లో అనుభవం ఉండి పదవీ విరమణ చేసినవారు సభ్యులుగా నియమితులవుతారు. వేర్వేరుగా ఏర్పాటయ్యే ఏడు కమిటీలకు ప్రత్యేక బాధ్యతలుంటాయి. వారికి సంబంధించిన అంశాల్లో గ్రామంలో పర్యటించి పరిస్థితులపై సమగ్ర సమాచారాన్ని సేకరిస్తారు. ఆ సమచారం ప్రకారం ఆయా రంగాల్లో అందుతున్న సేవలపై సమావేశంలో సమీక్షించి విశ్లేషించాల్సి ఉంటుంది. అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకొని ప్రజల అవసరాలు తీర్చేలా ప్రణాళికలను రూపొందించేందుకు కృషి చేయాలి. దీంతో గ్రామాల సమగ్రాభివృద్ధి చేసుకోవచ్చని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ కమిటీలకు గ్రామ స్థాయిలో సంబంధిత అధికారి కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. గ్రామాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసుకోవడమే.. గ్రామాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసుకోవాలంటే కీలకమైన సహజ వనరులు, వ్యవసాయం, పౌష్టికాహారం, తాగునీరు, పారిశుధ్యం, విద్య, వైద్యం, ఉపాధి కల్పనలో పంచాయతీరాజ్ వ్యవస్థను సిద్ధం చేసి ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. మన ఊరు, మన సమస్యలు, మన ఆలోచనలు, మన వనరులు, మన పరిష్కారాలు ఉండేలా పంచాయతీరాజ్ సంస్థలు కృషి చేయాలని లక్ష్యం. ఇవీ కమిటీలు పారిశుద్ధ్యం, డంపింగ్‌యార్డు, శ్మశానవాటికల నిర్వహణ వీధి దీపాల నిర్వహణ మొక్కలు నాటడం, సంరక్షణ గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు పారిశుద్ధ్యం–తాగునీరు ఆరోగ్యం–పోషకాహారం ఉత్తర్వులు రాగానే ఏర్పాటు చేస్తాం.. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం–2018లో స్టాడింగ్ కమిటీలను ఏర్పాటు చేయాలని రూపొందించారు. కమిటీల ఏర్పాటు నిర్ణయం ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాగానే ఏర్పాటు చేస్తాం. గ్రామాన్ని సమగ్రంగా అభివృద్ది కోసం ఈ కమిటీలు ఎంతగానో దోహదపడనున్నాయి.–రాజారావు, జిల్లా పంచాయతీ అధికారి -
పంచాయతీకో కార్యదర్శి
నేరడిగొండ(బోథ్): గ్రామపంచాయతీల్లో నూతన కార్యదర్శుల నియామకానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. గ్రామ పంచాయతీకో కార్యదర్శిని నియమించింది. దీంతో గ్రా మపంచాయతీలు అభివృద్ధి పథంలో పయనించనున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో 467 గ్రామపంచాయతీలు ఉండగా కార్యదర్శులు 132 మంది మాత్రమే ఉన్నారు. ఈ లెక్కన 335 మంది పంచాయతీ కార్యదర్శుల కొరత ఉండేది. ఒక్కో కార్యదర్శికి మూడు నుంచి నాలుగు గ్రామాల చొప్పున అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ క్రమంలో 2018 అక్టోబర్‌లో ప్రభుత్వం గ్రామపంచాయతీ సెక్రెటరీల నియామకం కోసం నోటిఫికేషన్ విడుదల చేసి ఎంపిక ప్రక్రియ చేపట్టింది. రాత పరీక్షకు హాజరైన అభ్యర్థుల్లో మెరిట్ ఆధారంగా ఎంపిక చేపట్టారు. డిసెంబర్లో సర్టిఫికెట్ల పరిశీలన సైతం జరిపారు. అనంతరం కొంద రు అభ్యర్థులు ప్రభుత్వం రోల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించడం లేదని, పరీక్షల్లో ప్రశ్నలను తప్పుగా ఇచ్చారని కోర్టుకు వెళ్లిన విషయం విధితమే. దీంతో నియామకాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో కోర్టు క్లియరెన్స్ ఇవ్వడంతో ఇప్పటికే కార్యదర్శి ఉద్యోగాలకు ఎంపికైన వారికి శుక్రవారం నియామక పత్రాలను అందించారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 11న ప్రభుత్వం సెలవు ప్రకటించినప్పటికీ కార్యదర్శుల నియామకానికి సంబంధించిన చర్యలు వెంటనే చేపట్టాలనే ఆదేశాలతో పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఈ ప్రక్రియను పూర్తి చేశారు. 290 మంది జూనియర్ పంచాయతీల నియామకం ఆదిలాబాద్ జిల్లాలో 335 పంచాయతీ కార్యదర్శులు ఖాళీగా ఉండగా ఇటీవల రాసిన పంచాయతీ పరీక్షలో ఫలితాలు సా«ధించిన 318 మందిని అర్హులుగా గుర్తించారు. వీరిలో 290 మందికి జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా నియామక పత్రాలు అందించారు. మరో 28 మందిని పూర్తి వివరాలు సేకరించి నియామక పత్రాలు అందజేస్తామని జిల్లా అధికారులు తెలిపారు. త్వరలోనే అన్ని స్థానాల్లో నియామకం చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు. తీరనున్న సమస్యలు.. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులదే కీలక పాత్ర. జనన, మరణ ద్రువీకరణ పత్రాలతోపాటు 18 రకాల సర్టిఫికెట్లు ఇచ్చేది వారే. గ్రామాభివృద్ధి కోసం విడుదలయ్యే నిధులు ఎన్ని, ఖర్చు చేసింది ఎంత, తాగునీరు, పన్నుల వసూళ్లు, అత్యవసరంగా గ్రామాల్లో చేపట్టాల్సిన పనులు, తదితర అంశాలన్ని కార్యదర్శులే చేపట్టాల్సి ఉంటుంది. అంతటి ప్రాధాన్యత ఉన్న కార్యదర్శుల పోస్టులు ఖాళీగా ఉండడంతో అభివృద్ధికి ఆటంకం ఏర్పడింది. నూతనంగా జూనియర్ కార్యదర్శులు గ్రామానికొకరు రానుండడంతో సమస్యలు పరిష్కారం కానున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు.. నూతనంగా ఎంపికైన కార్యదర్శులకు నియామక పత్రాలను అందజేశాం. వీరికి సంబంధించిన సర్టిఫికెట్లను గతంలోనే పరిశీలించాం. గ్రామానికో కార్యదర్శి నియామకంతో పల్లెల్లో సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారానికి నోచుకుంటాయి. దీంతో పాలన సౌలభ్యంగా ఉంటుంది. మరిన్ని ఖాళీలను భర్తీ చేస్తాం. – టి.సాయిబాబా, జిల్లా పంచాయతీ అధికారి సంతోషంగా ఉంది కాస్త ఆలస్యమైనా నియామకాలు చేపట్టడం సంతోషంగా ఉంది. 2018 అక్టోబర్ 10న రాత పరీక్ష నిర్వహించారు. ఫలితాలను అదే ఏడాది డిసెంబర్ 18న వెల్లడించారు. సర్టిఫికెట్ల పరిశీలన సైతం చేశాక న్యాయపరమైన సమస్యలు ఉత్పన్నం కావడంతోపాటు శాసన మండలి ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికలు రావడంతో నియామకంలో ఆలస్యం జరిగింది. శుక్రవారం నియామక పత్రం అందజేయడంతో సంతోషంగా ఉంది. – కొప్పుల రవీందర్, వడూర్ -
ఖజానా కళకళ
ఆదిలాబాద్‌అర్బన్: ఆస్తిపన్ను ఈ సారి రికార్డు స్థాయిలో వసూలైంది. పంచాయతీ ఎన్నికలు జరిపి ప్రశాంత వాతావరణంలో పన్ను వసూలు చేయడంలో పంచాయతీరాజ్ శాఖ సఫలమైంది. కుప్పలు తెప్పలుగా పేరుకుపోయిన ఇంటి పన్ను, ఇతర పన్నులు వసూలు చేసింది. గత రెండు, మూడేళ్లుగా పేరుకుపోయిన మొండి బకాయిలను సైతం వసూలు చేయడంతో పంచాయతీ ఖజానా కళకళలాడుతోంది. ఉమ్మడి నాలుగు జిల్లాల పన్ను లక్ష్యం రూ.16.73 కోట్లు ఉండగా, శుక్రవారం నాటికి రూ.13.70 కోట్లు వసూలయ్యాయి. ఆస్తి పన్ను వసూళ్లలో పంచాయతీరాజ్ శాఖ రికార్డు సాధించే దిశగా ముందుకు వెళ్తోంది. ఓవైపు లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నా.. నిర్ధేశిత లక్ష్య సాధనకు చేరువలో నిలవడంతోపాటు వసూళ్ల శాతాన్ని గణనీయంగా పెంచుకోగలిగింది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రూ.16,73,97,379 మేర పన్నుల రూపేణా రాబట్టాలని లక్ష్యంగా పెట్టుకోగా, రూ.13,70,99,238 వసూలైంది. అంటే ఆస్తి పన్ను వసూళ్లపై ఆయా జిల్లాల పంచాయతీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించడంతో ఈ మేరకు సాధ్యమైందని చెప్పవచ్చు. గత రెండు, మూడేళ్లుగా బకాయిదారులు కట్టకుండా పన్ను ఎగవేస్తున్నారు. దీంతో పన్ను వసూలుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించిన పంచాయతీరాజ్ శాఖ అందుకు అనుగుణంగా అధికారులను, సిబ్బందిని నియమించి రావాల్సిన మొత్తాన్ని రాబడుతోంది. మరోవైపు పన్ను వసూళ్లలో ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించిన సహించేది లేదని.. టార్గెట్లను అధిగమించాల్సిందేనని పంచాయతీ కార్యదర్శులకు హుకుం జారీ చేయడంతో టాక్సు వసూళ్లు భారీగా పెరిగాయి. ఉమ్మడి జిల్లాలో రూ.13.70కోట్లు వసూలు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు రూ.13.70 కోట్ల పన్ను వసూళ్లు చేశారు. మిగతా రూ.3.02 కోట్లను మరో రెండు రోజుల్లో వసూలు చేయాల్సి ఉంది. ఇందులో ఆదిలాబాద్‌లో రూ.4.07 కోట్లు వసూలు కాగా, మిగతా రూ.98.86 లక్షలు, మంచిర్యాలలో రూ.3.95 కోట్లు రాబట్టగా, మిగతా రూ.65.06 లక్షలు, కుమురంభీంలో రూ.3.14 కోట్లు వసూలు చేయగా, ఇంకా రూ.37.80 లక్షలు రాబట్టాల్సి ఉంది. నిర్మల్‌లో రూ.2.53 కోట్లు వసూలు కాగా, ఇంకా రూ.1.01 కోట్లు మరో రెండు రోజుల్లో రాబట్టాల్సి ఉంది. పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి జిల్లాలోని పన్ను వసూళ్లపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఆయా పంచాయతీ కార్యాలయంలో ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేసి రోజు పన్ను వసూళ్లను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. దీంతో పన్ను వసూళ్లలో వెనుకబడి పంచాయతీని ముందుకు తీసుకెళ్లడంలో పాత్ర పోషిస్తున్నారు. దీంతో 100 శాతం పన్ను వసూలైన పంచాయతీల్లోని సిబ్బందిని ఇతర పంచాయతీల్లో పన్ను వసూళ్లకు పంపిస్తున్నారు. దీంతో సిబ్బంది సైతం ఎక్కువై లక్ష్యం చేరుకునే దిశగా నడుస్తున్నారు. దీంతో పాటు జిల్లా పంచాయతీ అధికారులు పన్ను వసూళ్ల విషయమై ఉదయం, సాయంత్రం రెండుమార్లు జిల్లాలోని అన్ని పంచాయతీ కార్యదర్శులను అడిగి తెలుసుకుంటున్నారు. పన్ను వసూళ్లలో వెనుకబడిన పంచాయతీలు ఎవైనా ఉంటే.. యాక్టివ్‌గా ఉన్న సిబ్బందిని అక్కడికి పంపిస్తున్నారు. దీంతో రెండు, మూడు రోజుల్లోనే ఆ పంచాయతీ లక్ష్య సాధన దిశగా అడుగులేస్తోంది. అయితే జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో సిగ్నల్స్ పని చేయకపోవడం, నెట్వర్క్ సమస్య ఉండడంతో రోజు ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సిన వసూళ్ల సమాచారాన్ని ఒక్కో రోజు ఆలస్యంగా జరుగుతోందని తెలుస్తోంది. గడువు పొడిగిస్తే.. వందశాతం వసూలు ఆదిలాబాద్ జిల్లాలో 467 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇప్పటి వరకు 178 గ్రామ పంచాయతీల్లో మాత్రమే 100 శాతం పన్ను వసూలు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్ ఒకటికల్లా సుమారు 200 పంచాయతీల్లో వందశాతం పన్ను వసూళ్లు సాధిస్తామని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇప్పటి వరకు పన్ను వసూళ్ల లక్ష్యాన్ని 80.48 శాతం చేరుకోగా, రెండు రోజుల్లో మరో పదిశాతం సాధించేందుకు కృషి చేస్తున్నారు. గతేడాది మాదిరిగా ప్రభుత్వం ఈ ఏడాది కూడా పన్ను వసూళ్ల గడువును పక్షం రోజుల పాటు పొడిగిస్తే అటుఇటుగా ఖచ్చితంగా శతశాతం చేరుకునేందుకు చర్యలు తీసుకుంటా మని పంచాయతీ అధికారులు పేర్కొంటున్నారు. లక్ష్యాన్ని చేరుకుంటాం.. పన్ను వసూళ్ల లక్ష్యాన్ని గడువులోగా చేరుకుంటాం. ఎప్పుడు లేనంతగా ఈ ఏడాది పన్ను వసూలైంది. ఇదే వేగంతో ముందుకు వెళ్తాం. ఇప్పటికే లక్ష్యం 80 శాతం దాటింది. మిగిలిన రెండు రోజుల్లో 90 శాతం చేరుకునేలా చర్యలు తీసుకున్నాం. ప్రభుత్వం గ్రేస్ పీరియడ్ పెంచుతుందని అనుకుంటున్నాం. గడువు పెంచితే మరింత వేగంగా పన్ను వసూలు చేసి వందశాతం సాధిస్తాం. – సాయిబాబా, జిల్లా పంచాయతీ అధికారి, ఆదిలాబాద్ -
ఉప సర్పంచ్‌లకు నిరాశే..
సాక్షి, భూపాలపల్లి: నూతన పంచాయతీరాజ్ చట్టం అమలులోకి వచ్చే వరకు కార్యదర్శి, సర్పంచ్‌కు ఉమ్మడి చెక్ పవర్ కల్పించే విధంగా ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. దీనికి సంబంధించి పలు జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందినట్లు సమాచారం. గ్రామ పంచాయతీల్లో కొత్త పాలకవర్గం ఏర్పడి రెండు నెలలు దాటినా అభివృద్ధిలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. చెక్‌పవర్ విషయంలో నెలకొన్న సందిగ్ధత తొలగకపోవడంతో పల్లెల్లో పాలన పడకేసింది. నిధులు ఉన్నా ఖర్చుపెట్టలేని పరిస్థితి. దీంతో ప్రభుత్వం ప్రస్తుతానికైతే పాత విధానంలోనే సర్పంచ్, పంచాయతీ కార్యదర్శికి జాయింట్ చెక్ పవర్‌ను కల్పించనుంది. అయితే ఇన్నాళ్లుగా చెక్‌పవర్‌పై ఆశలు పెట్టుకున్న ఉపసర్పంచ్లు నిరాశలో ఉన్నారు. రిజర్వేషన్లు కలిసి రాకున్నా ఉపసర్పంచ్ పదవి కొసం కొంత మంది పెద్ద మొత్తంలో ఖర్చు చేశారు. తాత్కాలికమేనా.. జీపీల్లో చెక్ పవర్ సర్పంచ్, కార్యదర్శులకే ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో కలెక్లర్లు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇది తాత్కాలికమా, లేక ఇలాగే కొనసాగిస్తారా అనే విషయంపై స్పష్టత లేదు. ములుగు, భూపాలపల్లి జిల్లాల్లోని 415 గ్రామపంచాయతీలకు ఎన్నికలు ముగిసి మూడు నెలలు కావస్తోంది. ఇప్పటికీ గ్రామాల్లో గెలిచిన సర్పంచ్‌లకు పవర్ లేక అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. సర్పంచ్, ఉపసర్పంచ్‌ల ఉమ్మడి చెక్‌పవర్‌పై ప్రభుత్వం ఇంకా ఎటువంటి స్పష్టత ఇవ్వకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. కనీసం గ్రామ పంచాయతీ సిబ్బందికి నెలనెలా జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. వీటిని దృష్టిలో పెట్టుకుని పాత విధానంలోనే సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులకు తాత్కాలికంగా చెక్‌పవర్ ఇచ్చే విషయంపై రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఇందుకోసం ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు కూడా వెళ్లినట్లు సమాచారం. అయితే ప్రస్తుతం గ్రామాల్లో నిలిచిన బకాయిలు, బిల్లులు చెల్లించేందుకు మాత్రమే తాత్కాలికంగా సర్పంచ్, కార్యదర్శులకు ఉమ్మడి చెక్‌పవర్ ఇచ్చే అవకాశం ఉందని పలువురు ఉపసర్పంచ్లు అనుకుంటున్నారు. అయితే రాష్ట్రంలోని చాలా మంది డీపీఓలు సర్పంచ్‌తో పాటు పంచాయతీ కార్యదర్శికే ఉమ్మడి చెక్ పవర్ ఉంటే నిధులను సమర్థవంతంగా వినియోగించుకోవచ్చనే అభిప్రాయాన్ని ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిసింది. నిరాశలోనే.. ఇన్నాళ్లు చెక్ పవర్‌తో పవర్ వస్తుందనుకున్న ఉపసర్పంచ్‌లకు నిరాశే ఎదురుకానుంది. రెండు జిల్లాల్లో ఉన్న 415 పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో ఉపసర్పంచ్‌ల ఎన్నికలు కూడా అదే స్థాయిలో తీసుకున్నారు. చెక్‌పవర్ సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు ఉంటుందని ఈసారి చాలా మంది పెద్ద మొత్తంలో ఖర్చు చేశారు. కొన్ని చోట్ల సర్పంచ్ల కంటే ఉపసర్పంచ్ పదవి కోసం ఎక్కువ ఖర్చు చేసిన వారు కూడా ఉన్నారు. కొంత మంది రిజర్వేషన్లు కలిసి రాకపోవడంతో ఉపసర్పంచ్ పదవి కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేశారు. ప్రస్తుతం చెక్‌పవర్ పై స్పష్టత లేకపోవడం ఉపసర్పంచ్లు ఆందోళనలో ఉన్నారు. సమర్థ నిర్వహణకే.. ప్రభుత్వం సర్పంచ్, ఉపసర్పంచ్‌లకు జాయింట్ చెక్‌పవర్ కల్పించే ఆంశంపై పునరాలోచన చేసినట్లు తెలుస్తోంది. కొత్త పంచాయితీరాజ్ చట్టం–2018 ప్రకారం సర్పంచ్, ఉపసర్పంచ్‌కు సమష్టిగా చెక్ పవర్ కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సవరించిన పంచాయితీరాజ్ చట్టానికి గతేడాది ఆమోదముద్ర వేసింది. అయితే ఈ నిర్ణయం అములు విషయంలో సర్కారు ఆచితూచి అడుగువేస్తోంది. ముఖ్యంగా ఆర్థిక అధికారాలు ఇరువురు ప్రజాప్రతినిధులకు కట్టబెట్టడం వల్ల విధుల దుర్వినియోగం జరుగుతుందని, రికార్డుల నిర్వహణ కూడా కష్టసాధ్యమవుతోందని పంచాయితీరాజ్ శాఖ అంచనా వేసింది. అంతేకాకుండా లావాదేవీల్లో అధికారులను బాధ్యులను చేయడం కూడా కుదరదని తేల్చింది. మరోవైపు పంచాయతీ పాలనా వ్యవహారాల్లో కీలక భూమిక పోషించే కార్యదర్శుల కస్టడీలో రికార్డులు ఉంటాయని, ఈ తరుణంలో నిధుల వినియోగంలో వారికి బాధ్యతలు అప్పగిస్తే నియంత్రణ కష్టమని పంచాయతీరాజ్ ఉద్యోగుల సంఘం ప్రభుత్వం దృష్టికి తెచ్చింది. చెక్‌పవర్‌ను వారికి కల్పించి కార్యదర్శులపై చర్యలు తీసుకుంటామనే నిర్ణయం సరికాదని అభిప్రాయపడింది. ఈ వాదనతో ఏకీభవించిన పంచాయితీరాజ్ శాఖ, గతంలో ఉన్న మాదిరే సర్పంచ్, కార్యదర్శికి జాయింట్ చెక్‌పవర్ కల్పించే దిశగా ఆలోచన చేసినట్లు తెలిసింది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. ఎటువంటి సమాచారం రాలేదు – చంద్రమౌళి, జిల్లా పంచాయతీ అధికారి సర్పంచ్‌లు, కార్యదర్శులకు జాయంట్ చెక్ పవర్ గురించి ఎటువంటి సమాచారం రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందిన తర్వాతే ఈ విషయంపై స్పష్టత వస్తుంది. -
పక్కా భవనాల నిర్మాణమెప్పుడో..?
కొడిమ్యాల: 500 జనాభా ఉన్న గ్రామాలు, గిరిజన తండాలను రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసింది. ఇక తమ సమస్యలన్నీ స్థానికంగానే పరిష్కరించుకోవచ్చని నూతన గ్రామ పంచాయతీల పరిధిలోని ప్రజలు సంతోషించారు. ఐతే వారి ఆశలు నిజం కావడానికి మరింత సమయం పట్టేలా ఉంది. నూతన పంచాయతీలు 21 కొడిమ్యాల మండలంలో హిమ్మత్‌రావుపేట, శనివారంపేట, దమ్మయ్యపేట, చింతలపల్లి, గంగారాంతండా, అప్పారావుపేట, కొండాపూర్, తుర్కకాశీనగర్ గ్రామాలు, గంగాధర మండలంలో చిన్న ఆకంపెల్లి, ఇస్లాంపూర్, మంగపేట, చెర్లపల్లి, లింగంపల్లి, నర్సింహులపల్లి, మధురానగర్, ముప్పిడిపల్లి, వెంకంపల్లి, మల్యాల మండలంలో గొర్రెగుండం, గుడిపేట గ్రామాలు, రామడుగు మండలంలో పందికుంటపల్లి, చొప్పదండి మండలంలో సాంబయ్యపల్లి గ్రామం కొత్త పంచాయతీలుగా ఏర్పడ్డాయి. అద్దె భవనాల్లోనే పాలన పాలనాధికారాల వికేంద్రీకరణతో అభివృద్ధి వేగవంతం కానుందని ఆనందపడ్డారు. ఐతే కొత్తగా ఏర్పడ్డ గ్రామ పంచాయతీలకు పక్కా భవనాలు లేకపోవడంతో పరిపాలనా నిర్వహణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పలు గ్రామాల్లో కుల సంఘ భవనాలు, పాఠశాలల్లోని అదనపు గదులు, నిరుపయోగంగా ఉన్న పాత ప్రభుత్వ భవనాలను గ్రామ పంచాయతీ కార్యాలయాలుగా ఉపయోగించుకుంటున్నారు. అధిక గ్రామాల్లో అద్దె భవనాలనే పంచాయతీలకు పరిపాలనా భవనాలుగా ఉపయోగిస్తున్నారు. కొత్త జీపీల నిర్వహణకు నిధుల లేమి కారణంగా అద్దె భవనాలకు అద్దె కూడా చెల్లించలేని స్థితిలో గ్రామ పంచాయతీలున్నాయి. కానరాని కారోబార్లు.. కార్మికులు నూతన గ్రామ పంచాయతీల్లో ఇప్పటివరకు కారోబార్లు, పారిశుధ్య కార్మికులు, వాటర్ పంప్మెన్లు, ఎలక్ట్రీషియన్లను నియమించలేదు. నిధులు లేకపోవడంతో తాత్కాలికంగా పని చేసేవారిని నియమించుకోలేకపోతున్నారు. దీంతో ఆయా పంచాయతీల్లోని ప్రజలు అరకొర వసతులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పారిశుధ్య కార్మికులు లేక గ్రామాల్లో చెత్త పేరుకుపోతోంది. కొన్ని గ్రామాల్లో సర్పంచ్‌లు వారి డబ్బులతోనే పనులు చేపడుతున్నారు. నిధులు మంజూరయ్యే దాకా కొత్త పాలకవర్గాలు ఏమీ చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. కార్యదర్శుల నియామకంలో ఆలస్యం పంచాయతీ కార్యదర్శుల రాత పరీక్ష నిర్వహించి నెలలు గడుస్తున్నా.. ఉద్యోగ నియామకాలు చేపట్టకపోవడంతో గ్రామాల్లో పాలన గాడి తప్పుతోంది. ప్రస్తుతమున్న కార్యదర్శులను నాలుగు నుంచి ఐదు గ్రామాలకు ఇన్‌చార్జీలుగా నియమించారు. దీంతో ఏ ఒక్క గ్రామానికి సరైన సమయాన్ని కేటాయించలేకపోతున్నారు. ఏ ఒక్క గ్రామ పంచాయతీకి వారంలో రెండు రోజుల సమయాన్ని కూడా కేటాయించలేకపోతున్నారు. ప్రజలు వివిధ రకాల ధ్రువపత్రాలు పొందడంలో ఆలస్యమవుతోంది. పన్నుల వసూళ్ల లక్ష్యం నెరవేరడం లేదు. గ్రామాల్లో పారిశుధ్యం, తాగునీటి సరఫరాలో అవాంతరాలు ఏర్పడుతున్నాయి. కోర్టు సమస్యలు త్వరలోనే పరిష్కరించబడతాయని, కార్యదర్శుల నియామకాలు చేపడతామని అధికారులు పేర్కొంటున్నారు. కలెక్టర్‌కు వినతి నూతన గ్రామ పంచాయతీలకు పక్కా భవనాలు నిర్మించాలని కోరుతూ కొడిమ్యాల మండలంలోని 21 గ్రామాల సర్పంచ్‌లు జగిత్యాల జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రాన్ని సమర్పించారు. గ్రామ పంచాయతీ కార్యాలయ భవనాలకు నిధులు మంజూరయ్యేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్‌కు వారు విన్నవించారు. జేబులో నుంచే.. ఇప్పటివరకు మా తండాకు ఎలాంటి నిధులు మంజూరు కాలేదు. కొత్త గ్రామ పంచాయతీలకు త్వరలోనే నిధులు మంజూరు చేస్తామని అధికారులు చెబుతున్నారు. తండాలో పారిశుధ్యం, రోజూవారీ ఇతర పనుల నిర్వహణకు ప్రస్తుతానికి జేబులో నుంచే ఖర్చు చేస్తున్నా. – భూక్యా భోజ్యనాయక్, సర్పంచ్, గంగారాంతండా నిధులు మంజూరు చేయాలి కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలి. ముందుగా గ్రామ పంచాయతీ భవనాలకు నిధులందించాలి. తర్వాత ఇతర పనులపై దృష్టి సారించాలి. నిధులు లేక ఏ పని చేపట్టలేకపోతున్నాం. – గరిగంటి మల్లేశం, సర్పంచ్, అప్పారావుపేట -
సొంత భవనాలు కలేనా?
స్వపరిపాలనలో గ్రామాలను ఎంతో అభివృద్ధి చేసుకుంటామని కలలుగన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పడటంతో గ్రామాలకు మరో స్వాతంత్య్రం వచ్చినట్లయింది. పంచాయతీ హోదాతో పాటు సమస్యలు నెరవేరుతాయని, సొంత భవనాల నిర్మాణం \జరుగుతుందని ఆశపడ్డారు. పంచాయతీ హోదావచ్చి ఏడాది కావస్తున్నా కనీస సౌకర్యాల కల్పనకు నోచుకోవడం లేదు. సమస్యలకు తోడు ఇన్చార్జి కార్యదర్శులతో పాలన అస్తవ్యస్తంగా మారింది. రేగోడ్(మెదక్): మండలంలో గతంలో 12 పంచాయతీలు ఉండేవి. గతేడాది పెద్దతండా, సంగమేశ్వర తండా, తిమ్మాపూర్, వెంకటాపూర్, పోచారం, తాటిపల్లి గ్రామాలకు పంచాయతీలుగా హోదా దక్కడంతో మొత్తంగా పంచాయతీల సంఖ్య 18కి చేరింది. స్వరాష్ట్రంలో సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని భావించిన ప్రజలకు నిరాశే మిగులుతోంది. కనీస సౌకర్యాలు లేక ఇబ్బందుల పాలవుతున్నారు. ఐదు వందల జనాభా కలిగిన గ్రామాలు, తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేసినా పంచాయతీలకు సొంత భవనాలు ఇప్పటి వరకూ నిర్మించలేదు. అంగన్వాడీ పాఠశాలల భవనాలు, ప్రభుత్వ పాఠశాలల భవనాల్లో పంచాయతీ కార్యాలయాలను కొనసాగిస్తున్నారు. నామమాత్ర ఫర్నిచర్‌ను ఏర్పాటు చేసినా సమావేశాలకు స్థలం సరిపోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. పంచాయతీలను ఏర్పాటు చేసి సుమారు ఏడాది కావస్తున్నా.. భవన నిర్మాణాలకు నిధులు మంజూరు చేయకపోవడం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇన్చార్జి కార్యదర్శులే దిక్కు.. పంచాయతీకి ఒక గ్రామ కార్యదర్శి ఉండాలి. కానీ ఇక్కడ 18 గ్రామ పంచాయతీలకు నలుగురు మాత్రమే కార్యదర్శులు పని చేస్తున్నారు. ఇద్దరు కార్యదర్శులకు ఐదు చొప్పున పంచాయతీలు, మరో ఇద్దరు కార్యదర్శులకు నాలుగు చొప్పున పంచాయతీలకు ఇన్చార్జిలుగా వ్యవహరిస్తున్నారు. ఇన్చార్జి బాధ్యతలతో కార్యదర్శులకు భారంగా మారింది. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో విఫలమవుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఏ గ్రామ కార్యదర్శి ఏ గ్రామంలో ఉంటున్నారనే విషయం తెలియక అధికారులు, ప్రజలు సతమతమవుతున్నారు. దీంతో పారిశుధ్య నిర్వహణ గ్రామాల్లో అస్తవ్యస్తంగా మారింది. అపరిశుభ్రత కారణంగా ఇటీవల సంగమేశ్వర తండాలో ఇంటింటికీ జ్వరాలు వచ్చిన విషయం తెలిసిందే. గ్రామ పంచాయతీలకు లక్షలాది రూపాయల నిధులను ప్రభుత్వం మంజూరు చేస్తున్నా సమస్యల పరిష్కారం నోచుకోక, పారిశుధ్యం కానరక ప్రజలు అవస్థలు పడుతున్నారు. సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. నిధులు మంజూరు చేయాలి మా తండాను మేమే పరిపాలించుకునే విధంగా సీఎం కేసీఆర్ కృషి చేయడం ఆనందంగా ఉంది. పంచాయతీ ఏర్పడినా సొంత పంచాయతీ భవనం నిర్మాణం కాలేదు. పంచాయతీలో సమస్యలు వెక్కిరిస్తున్నాయి. నిధులు మంజూరు చేసి సమస్యలను తొలగించాలి. –సంతోష్ చౌహాన్, సంగమేశ్వర తండా వెంటనే బదిలీలు చేపట్టాలి జిల్లాలో సుమారు పదేళ్లకు పైగా ఒకే మండలంలో పనిచేస్తున్న కార్యదర్శులు ఉన్నారు. వారందరికీ బదిలీలు చేయాలి. ఒక్కో కార్యదర్శికి ఐదారు పంచాయతీలు ఉండటంతో పని ఒత్తిడికి గురై మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతీ పంచాయతీకి కార్యదర్శులను నియమించి సమస్యలను పరిష్కరించాలి. –పంచాయతీ కార్యదర్శిల అసోసియేషన్ జిల్లా కోశాధికారి -
ఖర్చు లేకుండా సర్పంచ్‌లయ్యారు
సాక్షిప్రతినిధి, కరీంనగర్: ఎందరో ప్రభుత్వ ఉన్నతోద్యోగులు కూడా పదవీ విరమణ తర్వాత ప్రజాప్రతినిధి కావాలని కోరుకుంటున్నారని, అలాంటిది గ్రామాల స్పెషల్ ఆఫీసర్లకు రూపాయి ఖర్చు లేకుండా సర్పంచ్ పదవి వరించిందని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. సర్పంచులుగా వ్యవహరించే అధికారం రావడం అధికారులకు ఇది గొప్ప అవకాశమని, ఇలాంటి అవకాశాలు అందరికీ రాదని అన్నారు. గ్రామాల స్పెషల్ ఆఫీసర్ల బాధ్యత గొప్ప కర్తవ్యంగా భావించి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. మంగళవారం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో గ్రామాల స్పెషల్ ఆఫీసర్లు, పంచాయతీ కార్యదర్శులు, మెడికల్ ఆఫీసర్లతో మంత్రి రాజేందర్ పారిశుధ్యం–ప్రజారోగ్యంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో అన్ని గ్రామాలలో విషజ్వరాలు ప్రబలుతున్నాయని, వాటిని నియంత్రించేందుకు పకడ్బందీగా పారిశుధ్య చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వర్షాకాలంలో గ్రామాలలో డెంగ్యూ, మలేరియా విషజ్వరాలు, అంటువ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని నిధులకు కొరత లేదని గ్రామాలలో మొదటిగా సమస్యను గుర్తించి పరిష్కారానికి చర్యలు గైకొనాలని అన్నారు. గ్రామాల పారిశుధ్యం, అభివృద్ధి పనుల్లో ప్రజలను భాగస్వామ్యులను చేయాలని.. అప్పుడే అనుకున్న ఫలితాలు సాధ్యమవుతాయని పేర్కొన్నారు. గ్రామాలలో చదువుకున్న యువతను గుర్తించి వారి సెల్ నెంబర్లు సేకరించి సమస్యలపై రోజూ మాట్లాడాలని మంత్రి సూచించారు. పనుల నిర్వహణలో ప్రజల సలహాలు, సూచనలు తీసుకోవాలని.. సమస్యలను ధర్మబద్ధంగా పరిష్కరించాలని అన్నారు. ఏళ్లుగా పూర్తికాని ప్రాజెక్టులను ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండేళ్లలో పూర్తి చేసి అనుసంధానం చేసుకున్నామని అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం రూ.600 కోట్లు మంజూరు చేసిందని, ప్రతీ నియోజకవర్గానికి రూ.70–80 కోట్లు వచ్చాయని మంత్రి తెలిపారు. గ్రామాలలో ప్రజలు ఇబ్బందులు పడకుండా ఎన్ని నిధులైనా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. పెద్ద గ్రామాలకు, మండలాల్లో దోమల నివారణకు ఫాగింగ్ మిషన్లు కొనుగోలు చేసి అందజేస్తామని తెలిపారు. స్పెషల్ ఆఫీసర్లు బాధ్యతాయుతంగా పనులు నిర్వహించాలని అన్నారు. జిల్లా పంచాయతీ అధికారి ప్రతిరోజూ గ్రామాలలో పారిశుధ్య చర్యలను పర్యవేక్షించాలని అధికారులకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించాలి గ్రామాల స్పెషల్ ఆఫీసర్లు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ తుల ఉమ అన్నారు. ప్రజల భాగస్వామ్యంతో గ్రామాల అభివృద్ధికి ప్రజలతో కలిసి పనిచేయాలని అన్నారు. గ్రామాలలో పరిసరాల పరిశుభ్రతపై ప్రజలను చైతన్యవంతులను చేయాలని సూచించారు. జిల్లాలో అన్ని గ్రామ పంచాయతీల స్పెషల్ ఆఫీసర్లు సంబంధిత అధికారులతో కలిసి వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పనుల వివరాలను ఎప్పటికప్పుడు ఆ గ్రూప్‌లో షేర్ చేసుకోవాలని అన్నారు. యుద్ధప్రాతిదికన మరుగుదొడ్లు.. లీకేజీలను నివారించండి జిల్లాలో టాయిలెట్లు లేని అన్ని పాఠశాలలకు, అంగన్వాడీ కేంద్రాలకు కొత్తగా టాయిలెట్లను మంజూరు చేశామని వాటిని వెంటనే పూర్తి చేయించాలని కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ అధికారులను ఆదేశించారు. మరమ్మతులున్న టాయిలెట్లను గ్రామపంచాయతీ నిధులతో వెంటనే పూర్తి చేయించాలని ఆదేశించారు. శిథిలావస్థలో ఉన్న తరగతి గదులను, టాయిలెట్లను వెంటనే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల ద్వారా వారం రోజుల్లో పూడ్చివేయాలని ఆదేశించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని.. రోడ్లపై నీరు నిలువ ఉండకుండా చూడాలని ఆదేశించారు. క్లోరినేషన్ చేసిన తాగునీటినే సరఫరా చేయాలని, పైపులైన్ల లీకేజీలను అరికట్టాలని ఆదేశించారు. గ్రామాలలో అపరిశుభ్ర పరిసరాలతో అంటువ్యాధులు, జ్వరాలు సోకితే సంబంధిత గ్రామపంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు. ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు మాట్లాడుతూ.. గ్రామాల ప్రత్యేక అధికారులు చిత్తశుద్ధితో పనులు చేసి కరీంనగర్ జిల్లాను వ్యాధుల రహిత జిల్లాగా మార్చాలని అన్నారు. ప్రజల్లో పారిశుధ్యంపై, హరితహారంపై చైతన్యం తేవాలని సూచించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. 2010లో జిల్లాలో డెంగ్యూతో ఎక్కువ మంది చనిపోయారని పేర్కొన్నారు. గ్రామాలలో పారిశుధ్య కార్మికుల సమ్మెతో పరిశుభ్రత లోపించిందని తెలిపారు. అన్ని గ్రామాలకు వెంటనే మెడికల్ బృందాలను పంపించాలని కోరారు. కరీంనగర్ నియోజకవర్గంలో ఆరు గ్రామాలకు లేరని, ఆ గ్రామాలకు అధికారులను నియమించి పారిశుధ్య చర్యలు చేపట్టాలని కోరారు. చొప్పదండి ఎమ్మెల్యే బొడిగె శోభ మాట్లాడుతూ.. అన్ని గ్రామాలలో వెంటనే గ్రామ సభలు నిర్వహించి సమస్యలను తెలుసుకోవాలని అన్నారు. ప్రత్యేకాధికారుల బాధ్యతను భారంగా కాకుండా బాధ్యతగా భావించాలన్నారు. మానకొండూర్ ఎమ్మెల్యే, సాంస్కృతిక సారథి రసమయి బాలకిషన్ మాట్లాడుతూ.. స్పెషల్ ఆఫీసర్లు పాత సర్పంచుల సహకారంతో పనులు చేయాలని అన్నారు. సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి నారాయణరావు, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుజాత, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ వెంకటేశ్వర్రావు, రెవెన్యూ డివిజనల్ అధికారి రాజాగౌడ్, జిల్లా పరిషత్ శిక్షణా మేనేజర్ సురేందర్, మండల అభివృద్ధి అధికారులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మెడికల్ ఆఫీసర్లు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. -
‘ప్రత్యేక’.. కష్టాలు తొలగేనా..!
ఆదిలాబాద్‌అర్బన్: గ్రామ పంచాయతీ బాధ్యతలు చేపట్టిన అధికారులకు ‘ప్రత్యేక’ కష్టాలు తొలగేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పంచాయతీల్లో అభివృద్ధి పరుగులు తీసేలా ప్రభుత్వం కసరత్తు చేస్తుంటే.. కింది స్థాయి ఉద్యోగులు, కార్మికులు లేక ప్రత్యేక అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. పల్లెలను పచ్చదనం, పరిశుభ్రంతో తీర్చిదిద్దేందుకు మూడు నెలల కార్యాచరణ ప్రణాళిక తయారీ చేసి పంద్రాగష్టు నుంచి పని ప్రారంభించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. పరిశుభ్రత, పచ్చదనం వైపు అడుగులు వేయడానికి సమయం ఆసన్నం కావడంతో కార్యాచరణ రూపకల్పనలో జిల్లా యంత్రాంగంతోపాటు అధికారులు తలమునకలు అవుతున్నారు. వివిధ శాఖల్లో వివిధ హోదాల్లో ఉంటూ ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్న అధికారులకు పంచాయతీ బాధ్యతలు అప్పగించడం ఒక భారమనుకుంటే.. పంచాయతీల్లో కార్యదర్శులు, కార్మికులు సరిపడా లేకపోవడం తలకు మించిన భారమవుతోంది. ఇదిలా ఉండగా, గతంలో పంచాయతీకో కార్యదర్శిని నియమిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే.. తాజాగా పంచాయతీ కార్మికులకు సైతం వేతనాలు పెంచి అవసరమైన చోట కార్మికులను నియమిస్తామని ప్రకటించడంతో పంచాయతీల్లో ఖాళీ పోస్టుల భర్తీకి లైన్ క్లియర్ అయినట్లయింది. 328 కార్యదర్శి పోస్టులు ఖాళీ.. జిల్లాలో 18 మండలాల పరిధిలో 509 రెవెన్యూ గ్రామాలున్నాయి. మొత్తం 467 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. బేల మండలంలోని రెండు గ్రామ పంచాయతీలు మినహా.. 465 పంచాయతీలకు ప్రత్యేక అధికారులు ఉన్నారు. జిల్లాలో మొత్తం 467 పంచాయతీ కార్యదర్శులు అవసరం. ప్రస్తుతం 139 మంది కార్యదర్శులు పని చేస్తున్నారు. ఇంకా 328 మంది పంచాయతీ కార్యదర్శులు అవసరం. కాగా, జిల్లాలో గతంలో 243 గ్రామ పంచాయతీలు ఉండేవి. జనాభా ప్రాతిపదికన రెండు, మూడు చిన్నచిన్న పంచాయతీలను కలుపుతూ ఒక క్లస్టర్‌గా విభజించారు. ఈ క్లస్టర్లకు కార్యదర్శులు బాధ్యత వహించారు. తాజాగా 226 కొత్త పంచాయతీలు ఏర్పాటయ్యాయి. ప్రతీ పంచాయతీకో కార్యదర్శిని నియమించి ప్రత్యేక పాలనను సక్రమంగా అందిస్తామని సీఎం కేసీఆర్ ఇది వరకే ప్రకటించారు. ఈ లెక్కన కొత్త, పాత గ్రామ పంచాయతీలకు కలిపి 328 మంది కార్యదర్శులు అవసరం ఉంది. కార్యదర్శులు సరిపడా లేకపోవడంతో ప్రత్యేక అధ/æకారులు పల్లె పాలనలో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. కార్మిక పోస్టుల భర్తీపై ఆశలు.. జిల్లాలోని అన్నీ గ్రామ పంచాయతీ పరిధిలో పారిశుధ్య కార్మికులు ఉన్నారు. గ్రామంలోని ప్రతీ 500 మంది జనాభాకు ఒక స్వీపర్, ఒక పంప్ ఆపరేటర్ పని చేస్తున్నారు. గ్రామ పంచాయతీలో 2 వేల జనాభా ఉంటే అక్కడ ఇద్దరు స్వీపర్లు, ఒక ఆపరేటర్ ఉన్నారు. 5 వేల జనాభా దాటిన గ్రామ పంచాయతీల్లో ముగ్గురు, నలుగురు చొప్పున పని చేస్తున్నారు. ఉదాహరణకు.. జిల్లా కేంద్రానికి అనుకొని మావల మేజర్ గ్రామ పంచాయతీలో 68 మంది పారిశుధ్య కార్మికులు పని చేస్తున్నారు. ఇప్పుడా పంచాయతీ మున్సిపాలిటీలో విలీనం కావడంతో ఒకే కార్మికుడిని అక్కడ ఉంచి మిగతా వారిని వేరే జీపీలకు సర్దుబాటు చేయాల్సి వచ్చింది. ఒక జీపీకి ఇంత మంది కార్మికులు ఉండాలనేది ఎక్కడా లేదని అధికారులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా, గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికులకు నెలకు రూ.500 నుంచి రూ.వెయ్యి చొప్పున ఇస్తున్నారు. కొన్ని పంచాయతీల్లో కార్మికులు నెలకు రూ.4 వేల నుంచి రూ.5 వేలు పొందుతున్నారు. కాగా, జిల్లాలో 467 పంచాయతీల్లో ఐదు వేల జనాభా దాటిన పంచాయతీలు ఆరు ఉండగా, 461 పంచాయతీల్లో 5 వేల కంటే తక్కువే జనాభా ఉంది. ప్రతీ ఐదు వేల మందికి ముగ్గురు కార్మికుల చొప్పున లెక్కేసుకున్నా.. జిల్లాలో 1,383 మంది కార్మికులు అవసరం. ప్రస్తుతం జిల్లాలో 758 మంది పారిశుధ్య కార్మికులు పని చేస్తున్నారు. ఈ లెక్కన ఇంకా 625 మంది కార్మికులు అవసరం. ఈ పోస్టుల భర్తీకే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా, ప్రస్తుతం పని చేస్తున్న కార్మికులకు గ్రామ పంచాయతీ సొంత నిధుల (జనరల్ ఫండ్స్) నుంచి వేతనాలు చెల్లిస్తున్నారు. సమ్మెలో కార్మికులు పంచాయతీలకు కార్యదర్శులు సరిపడా లేకపోవడంతో ప్రత్యేక పాలనకు ముందునుంచి ఒక్కో కార్యదర్శి రెండు, మూడు పంచాయతీలకు ఇన్చార్జిలుగా వ్యవహారిస్తూ వస్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి ఆ పంచాయతీల్లో బాధ్యతలు నిర్వర్తించడంతో పంచాయతీ స్వరూపంపై వారికి అవగాహన ఉంది. ప్రస్తుతం గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక తయారీలో కార్యదర్శులు పాత్ర కీలకం. ఇదిలా ఉండగా, జిల్లా వ్యాప్తంగా గత 20 రోజుల నుంచి జీపీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. కనీస వేతనం రూ.18 వేలు చెల్లించాలని, తమనే కార్యదర్శులుగా నియమించాలని డిమాండ్ చేస్తూ పంచాయతీలకు వెళ్లకుండా ఆయా మండలాల పరిధిలో కార్మికులు సమ్మె చేస్తున్నారు. దీంతో మూడు నెలల అభివృద్ది ప్రణాళిక రూపకల్పనకు స్పెషలాఫీసర్లు ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. పారిశుధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించడంతోపాటు కొత్త వారిని నియమించి, ఖాళీగా ఉన్న కార్యదర్శుల పోస్టులను భర్తీ చేయాలని గ్రామాల ప్రజలు కోరుతున్నారు. -
ఉత్కంఠకు తెర!
ఒంగోలు టూటౌన్: ప్రభుత్వం నిర్ణయం పంచాయతీ పాలకవర్గాలకు నిరాశే మిగిల్చింది. సర్పంచులను పర్సన్ ఇన్చార్జులుగా నియమిస్తారన్న ఆశలు ఆడియాశలయ్యాయి. సర్పంచుల సంఘం హైకోర్టుకెళ్లి పోరాడిన ఫలితం లేకుండా పోయింది. చివరకు ప్రత్యేక అధికారుల నియామకానికే సర్కారు మొగ్గు చూపింది. అనుకున్నదే తడవుగా వెంటనే గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించాలని బుధవారం జీవో 269 కూడా జారీ చేసింది. దీంతో గురువారం నుంచి గ్రామ పంచాయతీలు ప్రత్యేక అధికారుల పాలనలోకి వెళ్లనున్నాయి. ప్రత్యేక అధికారుల నియామకంపై జిల్లా అధికారులు వెంటనే కసరత్తు మొదలు పెట్టినట్లు సమాచారం. ఏపీ ప్రభుత్వానికి కంటే ముందే రెండు రోజుల క్రితమే తెలంగాణ ప్రత్యేక అధికారుల నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం నిర్ణయంతో స్థానిక సంస్థల్లో ఇన్నాళ్లూ నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. జిల్లాలోని 1028 గ్రామ పంచాయతీల్లో సకాలంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం ఓటర్ల జాబితాను సిద్ధం చేసింది. సిద్ధం చేసిన ఓటర్ల జాబితాను వార్డుల వారీగా ఓటర్ల జాబితాను ఆయా గ్రామ పంచాయతీలలో ఏర్పాటు చేయించింది. అయినా సకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ముందుకు రాలేదు. ప్రభుత్వంపై ప్రజల్లోతీవ్ర వ్యతిరేకత ఉండటంతో ఎన్నికలు నిర్వహించేందుకు వెనుకంజ వేసింది. దీంతో ప్రస్తుత పాలకవర్గాల గడువు ముగిసే వరకు ఎన్నికల నిర్వహణపై కాలయాపన చేసింది. పాలక వర్గాల గుడువు ముగిసే రోజున ప్రత్యేక అధికారుల నియామకానికే మొగ్గు చూపింది. రూ.150 కోట్ల నిధులకు గండి... ప్రభుత్వం నిర్ణయంతో గ్రామ పంచాయతీలు ఆర్థిక కష్టాల్లో పడే పరిస్థితి రానుంది. పంచాయతీ పాలకవర్గాలు ఉంటేనే కేంద్రం 14వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేస్తుంది. కాని ప్రస్తుత పాలకవర్గాల గడువు పూర్తవడంతో ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించడానికే మొగ్గు చూపింది. దీంతో ఏటా గ్రామ పంచాయతీలకు వచ్చే ఆర్థిక సంఘం నిధులు ఇక నిలిచిపోనున్నాయి. దాదాపు ఏటా రూ.150 కోట్లకు పైగా నిధులు గ్రామ పంచాయతీలకు వచ్చేవి. ఆ నిధుల ద్వారానే పంచాయతీలు మనుగడ సాగిస్తూవస్తున్నాయి. ప్రస్తుతం అవి కూడా లేకుండా పోయాయి. ఇంటిపన్నులే దిక్కు.. 14వ ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోతే.. పంచాయతీలకు ఇంటిపన్నులే దిక్కు అవుతాయి. ఇప్పటికే చాలా గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ కంప్యూటర్ ఆపరేటర్లకు జీతాలు, తాగునీటి పథకాల నిర్వహణకు ఇబ్బందులు పడుతున్నాయి. తగినన్ని నిధులు లేక ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్నాయి. మేజర్ పంచాయతీలలో ఇంటిపన్నుల వసూళ్ల వలన కొంత నెట్టుకు వచ్చే అవకాశం ఉంటుంది. మైనర్ పంచాయతీలకు మాత్రం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. -
పల్లె పాలన..ఇక ప్రత్యేకం
నెల్లూరు(అర్బన్): పల్లె పాలన..ఇక ప్రత్యేకం. గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారులు కొలువుదీరన్నారు. జిల్లాలో 940 మంది సర్పంచ్ల పదవీ కాలం ముగియడంతో ముందుగా ఊహించినట్టుగానే ప్రభుత్వం పంచాయతీలకు ప్రత్యేకాధికారులను నియమిస్తూ బుధవారం జీఓ నంబర్ 269ను విడుదల చేసింది. ప్రత్యేకాధికారులను నియమించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో సర్పంచ్‌లు మాజీలయ్యారు. పల్లెపాలన సాగేందుకు తహసీల్దారు, డిప్యూటీ తహసీల్దారు, ఎంపీడీఓ, ఈఓపీఆర్డీ తదితర క్యాడర్ కలిగిన అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించాలని నిబంధనలు ఉండటంతో ఆ దిశగా కలెక్టర్, డీపీఓ చర్యలు చేపట్టారు. బుధవారం ‘సాక్షి’లో ఇక ప్రత్యేక పాలనే అంటూ కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే. ఈ కథనంలో పేర్కొన్నట్టుగానే ప్రభుత్వం విధి, విధానాలు రూపొందించింది. ఈ విధివిధానాల ప్రకారమే అధికారులు పారిశుద్ధ్యం, కార్మికుల జీతభత్యాలు, తాగునీటి సరఫరా, పైపులైను మరమ్మతులు తదితర వాటికి ఖర్చు చేయాల్సి ఉంది. రోడ్లు, పబ్లిక్ స్థలాలు ఎవరైనా ఆక్రమిస్తే జరిమానా సైతం విధించవచ్చు. పంచాయతీ కార్యదర్శి, ప్రత్యేక అధికారి కలిసి సమన్వయంతో పని చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు గ్రామ సభల తీర్మానాల ద్వారా అభివృద్ధి పనులు జరిగేవి. ఇప్పుడు గ్రామ సభల తీర్మానాలు అవసరం లేదు. ప్రత్యేకాధికారులే అభివృద్ధి పనుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలకు ఇవ్వాల్సిన పర్ కాపిటా(తలసరి నిధులు), ఎస్డీఎఫ్ (రాష్ట్రాభివృద్ధి నిధులు) వంటి నిధులను సైతం కొన్నేళ్లుగా విడుదల చేయకపోవడంతో కేంద్రం ఇచ్చే నిధులపైనే పాలన నడుస్తోంది. ప్రజలు ఎన్నుకున్న పాలకులు లేకపోవడంతో కేంద్రం నుంచి వచ్చే ఆర్థిక సంఘం నిధులు ఆగిపోనున్నాయి. దీంతో అభివృద్ధి పనులకు నిధుల గండం పొంచి ఉంది. దీంతో అభివృద్ధి కుంటుపడనుంది. ప్రత్యేక అధికారుల నియామకంపై జిల్లా పంచాయతీ అ«ధికారి సత్యనారాయణను వివరణ కోరగా గురువారమే నియమిస్తామని తె లిపారు. పాలన యథావిధిగా జరుగుతుందన్నారు. -
పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధం
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ప్రభుత్వం వేల సంఖ్యలో కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేస్తుండటంతో ఆ మేరకు అవసరమైన ఏర్పాట్లను చేసుకోవడంలో రాష్ట్ర ఎన్నికల సంఘం నిమగ్నమైంది. పోలింగ్‌కు అవసరమైన అన్ని ప్రక్రియలను దాదాపుగా పూర్తి చేసింది. ఎన్నికల నిర్వహణలో కీలకమైన బ్యాలెట్ బాక్సులను సమకూర్చుకునే ప్రక్రియ సైతం పూర్తవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం గిరిజన తండాలను, సాధారణ జనావాసాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా మారుస్తోంది. ప్రస్తు తం రాష్ట్రంలో 8,684 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. కొత్తగా 4,122 గ్రామ పంచాయతీ లు ఏర్పాటు చేయాలని అన్ని జిల్లాల నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు వచ్చాయి. దాదా పు అన్నింటినీ ప్రభుత్వం ఆమోదించే అవకా శం ఉంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం సైతం ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నికల ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు ఇప్ప టికే అన్ని జిల్లాల్లో స్వయంగా పర్యటించి అక్కడి అధికారులతో సమీక్షలు నిర్వహించారు. అవసరమైన నిర్ణయాలను తీసుకుంటున్నారు. సామగ్రిని సమకూర్చుతున్నారు. వార్డుకో బ్యాలెట్ బాక్సు... దేశవ్యాప్తంగా అన్ని ఎన్నికల్లోనూ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (ఈవీఎం)లనే వినియోగిస్తుండగా సర్పంచ్ ఎన్నికల్లో మాత్రం బ్యాలెట్ బాక్సులతో పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఎక్కువ సంఖ్యలో పోలింగ్ కేంద్రాలు ఉంటుండటంతో ఈ పరిస్థితి ఉంటోంది. 2013లో చివరిసారి గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగాయి. అప్పుడు రాష్ట్రవ్యాప్తంగా 8,778 గ్రామ పంచాయతీలు ఉండేవి. 94 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగలేదు. తర్వాత వాటిని సమీపంలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో విలీనం చేశారు. గ్రామ పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం జూలై 31తో ముగుస్తోంది. అప్పటిలోగా ఎన్నికలు నిర్వహించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. పాతవి, కొత్తగా ఏర్పాటు చేసేవి కలిపి రాష్ట్రంలో గ్రామ పంచాయతీల సంఖ్య 12,806కు పెరగనుంది. ప్రతి గ్రామ పంచాయతీలో కనీసం ఆరు నుంచి ఎనిమిది వార్డులు ఉండనున్నాయి. పంచాయతీరాజ్‌శాఖ ప్రతిపాదనల ప్రకారం మొత్తం వార్డుల సంఖ్య కనీసం 96 వేలకు చేరనుందని తెలుస్తోంది. ఒక్కో వార్డుకు ఒక బ్యాలెట్ బాక్సును ఏర్పాటు చేస్తారు. వేర్వేరు రంగులలో ఉండే సర్పంచ్, వార్డు మెంబరు ఎన్నికల బ్యాలెట్ పత్రాలను ఒకే బాక్సులో వేస్తారు. అనంతరం వేరు చేసి లెక్కిస్తారు. ఇలా వార్డుకు ఒకటి చొప్పున అయినా కనీసం 96 వేల బ్యాలెట్ బాక్సులు అవసరమవనున్నాయి. అలాగే అత్యవసర వినియోగం కోసం మరికొన్ని బాక్సులను సిద్ధంగా పెట్టాల్సి ఉంటుంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోసం లక్ష బ్యాలెట్ బాక్సులు అవసరమవుతాయని రాష్ట్ర ఎన్నికల సంఘం అంచనా వేసింది. కర్ణాటక, తమిళనాడు నుంచి భారీగా బ్యాలెట్ బాక్సులను సేకరిస్తోంది.