సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ప్రభుత్వం వేల సంఖ్యలో కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేస్తుండటంతో ఆ మేరకు అవసరమైన ఏర్పాట్లను చేసుకోవడంలో రాష్ట్ర ఎన్నికల సంఘం నిమగ్నమైంది. పోలింగ్‌కు అవసరమైన అన్ని ప్రక్రియలను దాదాపుగా పూర్తి చేసింది. ఎన్నికల నిర్వహణలో కీలకమైన బ్యాలెట్ బాక్సులను సమకూర్చుకునే ప్రక్రియ సైతం పూర్తవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం గిరిజన తండాలను, సాధారణ జనావాసాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా మారుస్తోంది. ప్రస్తు తం రాష్ట్రంలో 8,684 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. కొత్తగా 4,122 గ్రామ పంచాయతీ లు ఏర్పాటు చేయాలని అన్ని జిల్లాల నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు వచ్చాయి. దాదా పు అన్నింటినీ ప్రభుత్వం ఆమోదించే అవకా శం ఉంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం సైతం ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నికల ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు ఇప్ప టికే అన్ని జిల్లాల్లో స్వయంగా పర్యటించి అక్కడి అధికారులతో సమీక్షలు నిర్వహించారు. అవసరమైన నిర్ణయాలను తీసుకుంటున్నారు. సామగ్రిని సమకూర్చుతున్నారు.
వార్డుకో బ్యాలెట్ బాక్సు...
దేశవ్యాప్తంగా అన్ని ఎన్నికల్లోనూ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (ఈవీఎం)లనే వినియోగిస్తుండగా సర్పంచ్ ఎన్నికల్లో మాత్రం బ్యాలెట్ బాక్సులతో పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఎక్కువ సంఖ్యలో పోలింగ్ కేంద్రాలు ఉంటుండటంతో ఈ పరిస్థితి ఉంటోంది. 2013లో చివరిసారి గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగాయి. అప్పుడు రాష్ట్రవ్యాప్తంగా 8,778 గ్రామ పంచాయతీలు ఉండేవి. 94 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగలేదు. తర్వాత వాటిని సమీపంలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో విలీనం చేశారు. గ్రామ పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం జూలై 31తో ముగుస్తోంది. అప్పటిలోగా ఎన్నికలు నిర్వహించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. పాతవి, కొత్తగా ఏర్పాటు చేసేవి కలిపి రాష్ట్రంలో గ్రామ పంచాయతీల సంఖ్య 12,806కు పెరగనుంది. ప్రతి గ్రామ పంచాయతీలో కనీసం ఆరు నుంచి ఎనిమిది వార్డులు ఉండనున్నాయి. పంచాయతీరాజ్‌శాఖ ప్రతిపాదనల ప్రకారం మొత్తం వార్డుల సంఖ్య కనీసం 96 వేలకు చేరనుందని తెలుస్తోంది. ఒక్కో వార్డుకు ఒక బ్యాలెట్ బాక్సును ఏర్పాటు చేస్తారు. వేర్వేరు రంగులలో ఉండే సర్పంచ్, వార్డు మెంబరు ఎన్నికల బ్యాలెట్ పత్రాలను ఒకే బాక్సులో వేస్తారు. అనంతరం వేరు చేసి లెక్కిస్తారు. ఇలా వార్డుకు ఒకటి చొప్పున అయినా కనీసం 96 వేల బ్యాలెట్ బాక్సులు అవసరమవనున్నాయి. అలాగే అత్యవసర వినియోగం కోసం మరికొన్ని బాక్సులను సిద్ధంగా పెట్టాల్సి ఉంటుంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోసం లక్ష బ్యాలెట్ బాక్సులు అవసరమవుతాయని రాష్ట్ర ఎన్నికల సంఘం అంచనా వేసింది. కర్ణాటక, తమిళనాడు నుంచి భారీగా బ్యాలెట్ బాక్సులను సేకరిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment