పంచాయతీలకు పవర్‌ షాక్‌! | Dues Of The Grama Panchayats Electricity Bills Is Rs.700 Crore | Sakshi
Sakshi News home page

పంచాయతీలకు పవర్‌ షాక్‌!

Published Mon, Dec 16 2019 2:31 AM | Last Updated on Mon, Dec 16 2019 4:37 AM

Dues Of The Grama Panchayats Electricity Bills Is Rs.700 Crore - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గ్రామ పంచాయతీలకు కరెంట్‌ షాక్‌ తగిలింది. పాత బకాయిలు గుదిబండగా మారడంతో స్థానిక సంస్థల ఖజానాకు భారీ చిల్లు పడనుంది. ఏళ్ల తరబడి చెల్లించని బిల్లుల చిట్టాను వెలికితీసిన విద్యుత్‌ సంస్థలు.. గ్రామాల వారీగా జాబితాను పంచాయతీరాజ్‌శాఖకు అందజేశాయి. ఇందులో ఒక్కో పంచాయతీకి సగటున రూ.లక్షల్లో బిల్లులు రావడంతో పాలకవర్గాలు గగ్గోలు పెడుతున్నాయి. పాత బకాయిలు తప్పనిసరిగా చెల్లించాలని సీఎం కేసీఆర్‌ స్పష్టంచేయడంతో ఈ మేరకు పెండింగ్‌ బిల్లుల వ్యవహా రానికి ముగింపు పలకాలని పీఆర్‌ శాఖ నిర్ణయించింది.

భారీగా పెండింగ్‌..
రాష్ట్రవ్యాప్తంగా 12,571 గ్రామ పంచాయతీలకు సంబంధించి రూ.700.68 కోట్ల మేర విద్యుత్‌ బకాయిలున్నాయి. ఇందులో రూ.280 కోట్ల మేర సర్‌చార్జీలే ఉండటం గమనార్హం. వీటిని వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ పద్ధతిలో చెల్లించే వెసులుబాటు కల్పించే అంశాన్ని పరిశీలించాలని ట్రాన్స్‌కోను పంచాయతీరాజ్‌ శాఖ అభ్యర్థించింది. వినియోగ చార్జీలను తగ్గించలేమని, బిల్లులు కట్టకపోవడంతో మోపిన అపరాధ రుసుం(సర్‌చార్జీ)ను తగ్గించే అంశాన్ని సానుకూలంగా పరిశీలిస్తామని ఆ సంస్థ స్పష్టం చేసింది.

ఏ శాఖ నుంచైనా కచ్చితంగా వసూలు చేయాలని సీఎం స్పష్టం చేయడం.. స్థానిక సంస్థలు కరెంట్‌ బిల్లుల క్లియర్‌కు మొదటి ప్రాధాన్యతనివ్వాలని కొత్త పంచాయతీరాజ్‌ చట్టంలో పొందుపరచడం పంచాయతీరాజ్‌ శాఖను ఇరకాటంలో పడేసింది. నిధుల కటకటతో కొట్టుమిట్టాడిన పంచాయతీలు.. పేరుకుపోయిన బిల్లులే కాదు.. నెలవారీ బిల్లులు కూడా చెల్లించకుండా వాయిదా వేస్తూ వచ్చా యి. దీంతో మొత్తం తడిసి మోపెడయ్యాయి.

కట్‌ చేయలేక..కాసులు రాక..
విద్యుద్దీపాలు, తాగునీటి అవసరాలకు స్థానిక సంస్థలు విద్యుత్‌ను వినియోగిస్తున్నాయి. వీటిని అత్యవసర సర్వీసులుగా గుర్తించినందున కరెంట్‌ సరఫరాను నిలిపివేయడం ట్రాన్స్‌కోకు ప్రతిబం ధకంగా మారింది. అయితే ప్రభుత్వ శాఖల నుంచి భారీ మొత్తంలో రావాల్సిన బిల్లు లు సకాలంలో రాకపోవడంతో సంస్థకు ఆర్థికంగా కష్టంగా మారిందని సీఎం దృష్టికి విద్యుత్‌ శాఖ తీసుకెళ్లింది.

దీంతో విద్యుత్‌ సంస్థలను కాపాడుకోవాలంటే ఏ శాఖ అయినా తప్పకుండా కరెంట్‌ చార్జీలు చెల్లించాల్సిందేనని తేల్చిచెప్పడంతో స్థానిక సంస్థలకు మినహాయింపు లేకుండాపోయింది. తాజాగా గ్రామ సీమల అభివృద్ధికి ప్రతినెలా రాష్ట్ర ప్రభుత్వం రూ.339 కోట్లు విడుదల చేస్తోంది. ఈ నిధుల నుంచి కరెంట్‌ చార్జీలు చెల్లించాలని సూచిస్తూ పీఆర్‌ కమిషనర్‌ రఘునందన్‌రావు డీపీవోలను ఆదేశించారు.

కొత్త మీటర్ల అమరికకు రూ.1,600
కొత్త గ్రామ పంచాయతీల్లో విద్యుత్‌ మీటర్ల ఏర్పాటుకు సర్వీస్‌ చార్జీ, ఇతరత్రా అవసరాలకు వన్‌టైమ్‌ కింద రూ.1,600 వినియోగించుకునే వెసులుబాటును ప్రభుత్వం స్పష్టం చేసిం ది. గతేడాది రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 4 వేల కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయి. వీటికి సంబంధించిన విద్యుత్‌ సరఫరా, నిర్వహణ బాధ్యతలు విడిపోయినందున దానికి తగ్గట్టుగా నూతన జీపీల్లోనే కరెంట్‌ మీటర్‌ ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.

బకాయిల భారం కష్టమే
కాగా పెండింగ్‌ కరెంట్‌ బిల్లులను స్థానిక పంచాయతీలు చెల్లించాలని ప్రభుత్వం స్పష్టం చేయడంతో చిన్న పంచాయతీలు దిక్కుతోచని పరిస్థితుల్లో పడ్డాయి. ఇప్పటికే మల్టీ పర్పస్‌ వర్కర్, ట్రాక్టర్, ట్రాలీ కొనుగోలు, 30 రోజుల పల్లె ప్రణాళికలో భాగంగా చేసిన పనులకు నిధుల్లేక తల్లడిల్లుతున్న తరుణంలో ఈ భారాన్ని ఎలా మోయాలనే సందిగ్ధ పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement