నిధుల కేటాయింపులో పెద్దపీట  | Errabelli Dayakar Rao Visit In Karimnagar | Sakshi
Sakshi News home page

నిధుల కేటాయింపులో పెద్దపీట 

Published Thu, Jun 13 2019 9:37 AM | Last Updated on Thu, Jun 13 2019 9:37 AM

Errabelli Dayakar Rao Visit In Karimnagar - Sakshi

కరీంనగర్‌: నిధుల కేటాయింపు విషయంలో అన్ని జిల్లాల కంటే కరీంనగర్‌ జిల్లాకు పెద్దపీట వేస్తానని రాష్ట్రపంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హామీ ఇచ్చారు. బుధవారం జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో జెడ్పీ చైర్‌పర్సన్‌ తుల ఉమ అధ్యక్షతన జరిగిన ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్రం చట్టం వల్ల నిధులు, అధికారాలు కోల్పోవడంతో స్థానిక సంస్థలకు అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. తిరిగి అన్యాయం జరుగకుండా ఉండేందుకు నిధులు, అధికారాలను  బదలాయించడంతోపాటు అవినీతి రహిత పాలన కోసం చట్టాలను ఉల్లంఘించే సర్పంచులు, ఇతర స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులపై కూడా చర్య తీసుకునే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ పంచాయతీరాజ్, రెవెన్యూ, మున్సిపల్‌ చట్టసవరణకు పకడ్బందీ ప్రణాళిక రూపొందిస్తున్నారని చెప్పారు. త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లోనే చట్ట సవరణ చేసి కొత్త చట్టాలను  అమలులోకి తేస్తామని మంత్రి తెలిపారు. ఇందుకోసమే సర్పంచ్‌లకు చెక్‌ పవర్‌ ఇవ్వడంలో జాప్యం జరుగుతోంది తప్పా మరే ఉద్దేశం లేదని, సర్పంచ్‌లకు చెక్‌పవర్‌ లేక ఇబ్బందులు జరుగుతున్న మాట వాస్తవమేనని అంగీకరించారు. ఒకవేళ చట్టసవరణకు ముందు చెక్‌పవర్‌ ఇస్తే వాటిలో ఏమైనా తేడా వస్తే కోర్టును ఆశ్రయించే అవకాశాలుంటాయని, పకడ్బందీతో చట్టసవరణ చేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు.

ఈ చట్టసవరణ ద్వారా సర్పంచు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, జెడ్పీ చైర్‌పర్సన్లకు అధికారాలను బదలాయించడంతోపాటు ప్రత్యేకంగా నిధులు కేటాయించడం జరుగుతుందని చెప్పారు. గ్రామాల్లోని పాఠశాలలు, అంగన్‌వాడీ, ఉపాధి హమీ పథకం వంటి వాటిలో కూడా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయబోతున్నామని అన్నారు. గ్రామాలను పరిశుభ్రంగా అందంగా ఉండాలనే ఉద్దేశంతో గ్రామ కార్యదర్శులను నియమించామని, ఏ గ్రామంలో కూడా బహిరంగ ప్రదేశాల్లో  మలవిసర్జన చేస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. మిషన్‌ భగీరథ పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని, ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ పథకాన్ని అమలు చేసేందుకు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు వివరాలను తెలుసుకొని సీఎం కేసీఆర్‌ను అభినందిస్తున్నారని అన్నారు. వారం రోజుల్లో గ్రామీణ ఉపాధి హమీ బిల్లులు ఇస్తామని, ఇందుకోసం ఇటీవలనే కేంద్ర మంత్రిని కలువడం జరిగిందని మంత్రి ఎర్రబెల్లి ప్రకటించారు. హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ ఇంటికి కనీసం 6 మొక్కలు చొప్పున నాటి వాటిని బతికించుకోవాలని, ఊర్లలోని గుట్టలపై విరివిగా పండ్ల మొక్కలను పెంచాలని, దీంతో కోతుల బెడద కూడా తప్పుతుందని, వర్షాలు బాగా పడి మంచి రోజులు వస్తాయని, హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజాప్రతినిధులను కోరారు.

గతంలో రైతులకు ఇచ్చిన హరితహారం విజయవంతమైందని, రోడ్ల పక్కన అధికారులు నాటిని మొక్కలు ఎండిపోయాయని, ఈసారి అలా జరుగకుండా విరివిగా మొక్కలు నాటాలని సూచించారు. పండ్లు, పూల మొక్కలు నాటేందుకు, నీరు పోసేందుకు ఎన్ని డబ్బులైనా ఇచ్చేందుకు సీఎం కేసీఆర్‌ జిజ్జుగా ఉన్నారని, ప్రతి ఒక్కరూ హరితహారంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పంచాయతీరాజ్‌ వ్యవస్థలో లోపాలున్నాయని ఇందుకు అధికారులందరూ బాధ్యులు కాదని, కొంతమంది కక్కుర్తి పడి తప్పులు చేస్తున్నారని చెప్పారు. అవినీతి రహిత పాలన, ఒక్కరూపాయి లేకుండా రైతులందరికీ పాసుబుక్కులు, రైతుబంధు పథకాన్ని అమలు చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నారని అన్నారు. త్వరలోనే ధాన్యం కొనుగోలు చేసిన రైతులకు డబ్బులు ఇప్పిస్తామని, జూలై 1న ఆసరా పింఛన్లను రెట్టింపు చేసి ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా లబ్ధిదారులకు వాటిని పంపిణి చేసే కార్యక్రమాన్ని చేపడతామని అన్నారు.
 
వైద్య రంగంలో నెంబర్‌వన్‌  స్థానంలో నిలుపుదాం
ఆర్థిక శాఖ మంత్రిగా జిల్లాకు అధిక నిధులు కేటాయించిన మాట వాస్తవమేనని, ఇల్లు చక్కబెట్టి సమాజం గుర్తించి ఆలోచించాలనే ఉద్దేశంతో జిల్లాలో ఏకగ్రీవంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు ఇచ్చిన హమీ మేరకు ఒక్కో మండలానికి రూ.20 లక్షలు, రూ.30 లక్షల చొప్పున అదనంగా జిల్లాకు నిధులు మంజూరు చేశామని అన్నారు. ఆరోగ్య శాఖ మంత్రిగా జిల్లాను వైద్య రంగంలో రాష్ట్రంలోనే నెంబర్‌వన్‌ స్థానంలో నిలుపుతామని అన్నారు. రాజకీయ నాయకులకు పదవీ విరమణ ఉండదని, పదవిలో ఉన్నప్పుడు చేసిన పనులు గౌరవాన్ని నిలబెడుతాయని అన్నారు. స్థానిక సంస్థల పెండింగ్‌ బిల్లులు ఇప్పిస్తానని, అర్ధంతరంగా మిగిలిన పనులను పూర్తిచేయిస్తానని హామీ ఇచ్చారు. పదవిలో ఉన్నా లేకున్నా మీ గౌరవానికి భంగం కలిగించకుండా వ్యవహరిస్తానని జెడ్పీటీసీ, ఎంపీపీలకు భరోసా ఇచ్చారు.– రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌

కలిసికట్టుగా కృషి చేశాం
జిల్లా పరిషత్, మండల పరిషత్‌ సభ్యులుగా జిల్లా అభివృద్ధికి, సంక్షేమ పథకాల అమలుకు, సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ జెడ్పీ గౌరవాన్ని ఇనుమడింపజేసేందుకు మేమంతా అన్నదమ్ముల్లా, అక్కాచెల్లెల్లుగా, కుటుంబ సభ్యులుగా పార్టీలకతీతంగా కలిసికట్టుగా కృషి చేశామని, ఐదేళ్లు చాలా దగ్గరగా ఉన్నామని జెడ్పీ చైర్‌పర్సన్‌ తుల ఉమ సంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి ఈటల రాజేందర్‌ చేదోడు, వాదోడుగా ఉంటూ సంపూర్ణ సహకారాన్ని అందించారని ధన్యవాదాలు తెలిపారు. అధికారులు, సభ్యుల సహకారాన్ని మరిచిపోబోమని, అందరి సహకారంతో ఐదేళ్లు పదవిలో కొనసాగామని అన్నారు. రాష్ట్రంలోనే మొదటి జెడ్పీగా నిలబెట్టేందుకు నిధులు కేటాయించాలని మంత్రి దయాకర్‌రావును కోరారు. – జెడ్పీ చైర్‌పర్సన్‌ తుల ఉమ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement