గ్రామ సచివాలయం
ఆదిలాబాద్‌అర్బన్: గ్రామ పంచాయతీ బాధ్యతలు చేపట్టిన అధికారులకు ‘ప్రత్యేక’ కష్టాలు తొలగేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పంచాయతీల్లో అభివృద్ధి పరుగులు తీసేలా ప్రభుత్వం కసరత్తు చేస్తుంటే.. కింది స్థాయి ఉద్యోగులు, కార్మికులు లేక ప్రత్యేక అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. పల్లెలను పచ్చదనం, పరిశుభ్రంతో తీర్చిదిద్దేందుకు మూడు నెలల కార్యాచరణ ప్రణాళిక తయారీ చేసి పంద్రాగష్టు నుంచి పని ప్రారంభించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. పరిశుభ్రత, పచ్చదనం వైపు అడుగులు వేయడానికి సమయం ఆసన్నం కావడంతో కార్యాచరణ రూపకల్పనలో జిల్లా యంత్రాంగంతోపాటు అధికారులు తలమునకలు అవుతున్నారు.
వివిధ శాఖల్లో వివిధ హోదాల్లో ఉంటూ ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్న అధికారులకు పంచాయతీ బాధ్యతలు అప్పగించడం ఒక భారమనుకుంటే.. పంచాయతీల్లో కార్యదర్శులు, కార్మికులు సరిపడా లేకపోవడం తలకు మించిన భారమవుతోంది. ఇదిలా ఉండగా, గతంలో పంచాయతీకో కార్యదర్శిని నియమిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే.. తాజాగా పంచాయతీ కార్మికులకు సైతం వేతనాలు పెంచి అవసరమైన చోట కార్మికులను నియమిస్తామని ప్రకటించడంతో పంచాయతీల్లో ఖాళీ పోస్టుల భర్తీకి లైన్ క్లియర్ అయినట్లయింది.
328 కార్యదర్శి పోస్టులు ఖాళీ..
జిల్లాలో 18 మండలాల పరిధిలో 509 రెవెన్యూ గ్రామాలున్నాయి. మొత్తం 467 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. బేల మండలంలోని రెండు గ్రామ పంచాయతీలు మినహా.. 465 పంచాయతీలకు ప్రత్యేక అధికారులు ఉన్నారు. జిల్లాలో మొత్తం 467 పంచాయతీ కార్యదర్శులు అవసరం. ప్రస్తుతం 139 మంది కార్యదర్శులు పని చేస్తున్నారు. ఇంకా 328 మంది పంచాయతీ కార్యదర్శులు అవసరం. కాగా, జిల్లాలో గతంలో 243 గ్రామ పంచాయతీలు ఉండేవి. జనాభా ప్రాతిపదికన రెండు, మూడు చిన్నచిన్న పంచాయతీలను కలుపుతూ ఒక క్లస్టర్‌గా విభజించారు. ఈ క్లస్టర్లకు కార్యదర్శులు బాధ్యత వహించారు. తాజాగా 226 కొత్త పంచాయతీలు ఏర్పాటయ్యాయి. ప్రతీ పంచాయతీకో కార్యదర్శిని నియమించి ప్రత్యేక పాలనను సక్రమంగా అందిస్తామని సీఎం కేసీఆర్ ఇది వరకే ప్రకటించారు. ఈ లెక్కన కొత్త, పాత గ్రామ పంచాయతీలకు కలిపి 328 మంది కార్యదర్శులు అవసరం ఉంది. కార్యదర్శులు సరిపడా లేకపోవడంతో ప్రత్యేక అధ/æకారులు పల్లె పాలనలో ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
కార్మిక పోస్టుల భర్తీపై ఆశలు..
జిల్లాలోని అన్నీ గ్రామ పంచాయతీ పరిధిలో పారిశుధ్య కార్మికులు ఉన్నారు. గ్రామంలోని ప్రతీ 500 మంది జనాభాకు ఒక స్వీపర్, ఒక పంప్ ఆపరేటర్ పని చేస్తున్నారు. గ్రామ పంచాయతీలో 2 వేల జనాభా ఉంటే అక్కడ ఇద్దరు స్వీపర్లు, ఒక ఆపరేటర్ ఉన్నారు. 5 వేల జనాభా దాటిన గ్రామ పంచాయతీల్లో ముగ్గురు, నలుగురు చొప్పున పని చేస్తున్నారు. ఉదాహరణకు.. జిల్లా కేంద్రానికి అనుకొని మావల మేజర్ గ్రామ పంచాయతీలో 68 మంది పారిశుధ్య కార్మికులు పని చేస్తున్నారు. ఇప్పుడా పంచాయతీ మున్సిపాలిటీలో విలీనం కావడంతో ఒకే కార్మికుడిని అక్కడ ఉంచి మిగతా వారిని వేరే జీపీలకు సర్దుబాటు చేయాల్సి వచ్చింది. ఒక జీపీకి ఇంత మంది కార్మికులు ఉండాలనేది ఎక్కడా లేదని అధికారులు పేర్కొంటున్నారు.
ఇదిలా ఉండగా, గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికులకు నెలకు రూ.500 నుంచి రూ.వెయ్యి చొప్పున ఇస్తున్నారు. కొన్ని పంచాయతీల్లో కార్మికులు నెలకు రూ.4 వేల నుంచి రూ.5 వేలు పొందుతున్నారు. కాగా, జిల్లాలో 467 పంచాయతీల్లో ఐదు వేల జనాభా దాటిన పంచాయతీలు ఆరు ఉండగా, 461 పంచాయతీల్లో 5 వేల కంటే తక్కువే జనాభా ఉంది. ప్రతీ ఐదు వేల మందికి ముగ్గురు కార్మికుల చొప్పున లెక్కేసుకున్నా.. జిల్లాలో 1,383 మంది కార్మికులు అవసరం. ప్రస్తుతం జిల్లాలో 758 మంది పారిశుధ్య కార్మికులు పని చేస్తున్నారు. ఈ లెక్కన ఇంకా 625 మంది కార్మికులు అవసరం. ఈ పోస్టుల భర్తీకే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా, ప్రస్తుతం పని చేస్తున్న కార్మికులకు గ్రామ పంచాయతీ సొంత నిధుల (జనరల్ ఫండ్స్) నుంచి వేతనాలు చెల్లిస్తున్నారు.
సమ్మెలో కార్మికులు
పంచాయతీలకు కార్యదర్శులు సరిపడా లేకపోవడంతో ప్రత్యేక పాలనకు ముందునుంచి ఒక్కో కార్యదర్శి రెండు, మూడు పంచాయతీలకు ఇన్‌చార్జిలుగా వ్యవహారిస్తూ వస్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి ఆ పంచాయతీల్లో బాధ్యతలు నిర్వర్తించడంతో పంచాయతీ స్వరూపంపై వారికి అవగాహన ఉంది. ప్రస్తుతం గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక తయారీలో కార్యదర్శులు పాత్ర కీలకం. ఇదిలా ఉండగా, జిల్లా వ్యాప్తంగా గత 20 రోజుల నుంచి జీపీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది.
కనీస వేతనం రూ.18 వేలు చెల్లించాలని, తమనే కార్యదర్శులుగా నియమించాలని డిమాండ్ చేస్తూ పంచాయతీలకు వెళ్లకుండా ఆయా మండలాల పరిధిలో కార్మికులు సమ్మె చేస్తున్నారు. దీంతో మూడు నెలల అభివృద్ది ప్రణాళిక రూపకల్పనకు స్పెషలాఫీసర్లు ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. పారిశుధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించడంతోపాటు కొత్త వారిని నియమించి, ఖాళీగా ఉన్న కార్యదర్శుల పోస్టులను భర్తీ చేయాలని గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment