Sanitation workers Problems
-
కాలేజీ కుర్రాళ్ల వినూత్న ఆలోచన, బ్యాండికూట్ వస్తుంది తప్పుకోండి.. తప్పుకోండి!
ఉపాయాలు ఊరకే రావు. గట్టిగా ఆలోచిస్తేనే వస్తాయి. ఈ నలుగురు కుర్రాళ్లు అలాగే ఆలోచించారు. శానిటేషన్, హెల్త్‌కేర్, కెమికల్ ఇండస్ట్రీ, ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్లకు ఉపయోగపడే రోబోటిక్స్‌కు రూపకల్పన చేశారు. శాస్త్రానికి సామాజిక ధర్మం జోడించి ‘జెన్ రోబోటిక్స్’తో ఘన విజయం సాధించారు.. సెప్టిక్ ట్యాంకులు శుభ్రం చేసే క్రమంలో ఎంతోమంది అమాయకులు బలైతున్నారు. ప్రకటిత గణాంకాల కంటే మృతుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని సఫాయి కర్మాచారి ఆందోళన (ఎస్‌కేఎ) అనే స్వచ్ఛంద సంస్థ చెబుతోంది. మాన్యువల్ స్కావేంజింగ్ను నిషేధించాలని ఆ సంస్థ డిమాండ్ చేస్తుంది. కేరళలో ముగ్గురు స్కావెంజర్లు చనిపోయిన విషాదం ఇంజనీరింగ్ చేస్తున్న అరుణ్ జార్జ్, నిఖిల్ ఎన్పీ, రషీద్ కె, విమల్ గోవింద్ ఎంకేలను బాగా కదిలించింది. ‘ఈ సమస్యకు పరిష్కారం కనుక్కోవాలి’ అని గట్టిగా అనుకున్నారు. మలప్పురం(కేరళ) జిల్లాలోని కుట్టిపురం ఎంఈఎస్ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకునే రోజుల్లో ‘రోబోటిక్ స్కావెంజర్’ ఆలోచన చేశారు. మొదట కాలేజీ ప్రాజెక్ట్‌గా ఆ ఆలోచనను పట్టాలెక్కించారు. చదువులు పూర్తైతే ఉద్యోగాల కోసం కార్పొరేట్ ప్రపంచంలోకి అడుగు పెట్టాక కూడా వారిని ‘రోబోటిక్ స్కావెంజర్’ ఆలోచన వదల్లేదు. దీంతో ఉద్యోగాలు వదులు కొని ‘జెన్ రోబోటిక్స్’ అనే స్టార్టప్ మొదలుపెట్టారు. రోబోటిక్ స్కావెంజర్ ‘బ్యాండికూట్’తో ఈ స్టార్టప్ ప్రస్థానం మొదలైంది. 50 కిలోల బరువు ఉండే ‘బ్యాండికూట్’ రిమోట్–కంట్రోల్డ్ రోబోట్. 360 డిగ్రీల మోషన్స్‌లో పనిచేస్తుంది. సింగిల్ షిఫ్ట్‌లో పది నుంచి పన్నెండు మురుగు కాలువలను శుభ్రపరుస్తుంది. ఒక్కొక్క మురుగు కాలువను, మ్యాన్‌హోల్‌ను శుభ్రం చేయడానికి 30 నుంచి 40 నిమిషాల సమయం పడుతుంది. స్కై స్క్రాపర్స్కు సంబంధించిన గ్లాస్ ఫేసాడ్లను శుభ్రం చేసే ‘జీ–బిటల్’ రోబోట్ కూడా మెగా హిట్ అయింది. ఇక ‘వెల్బోర్’ అనేది ఆయిల్ అండ్ గ్యాస్, కెమికల్ ఇండస్ట్రీలకు సంబంధించిన పెద్ద ట్యాంకులను శుభ్రపరుస్తుంది. ‘బ్యాండికూట్’తో మొదలైన జెన్ రోబోటిక్స్ ప్రయాణం హెల్త్‌కేర్, కెమికల్ ఇండస్ట్రీ, ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్... మొదలైన వాటికి విస్తరించింది. ‘శానిటేషన్‌కు సంబంధించి పరిష్కరించుకోవాల్సిన పెద్ద సమస్యలు ఎన్నో ఉన్నాయి. వాటిపై దృష్టి పెడుతున్నాం’ అంటున్నాడు కో–ఫౌండర్స్‌లో ఒకరైన విమల్. ‘మరి ఈ యంత్రాల వల్ల కార్మికుల ఉపాధి దెబ్బతింటుంది కదా?’ అనే సందేహం అందరికీ వస్తుంది.దీన్ని దృష్టిలో పెట్టుకొని కార్మికులు సులభంగా ఆపరేట్ చేసేలా ఈ యంత్రాలను రూపొందించారు. మూడు వేల మందికి పైగా కార్మికులు ఈ యంత్రాల ద్వారా ఉపాధి పొందుతున్నారు. పారిశుద్ధ్య పనుల్లో మార్పు తీసుకురావడానికి సేఫ్టీ అండ్ డిగ్నిటీ నినాదంతో సాంకేతికతను ఉపయోగించుకుంటున్నాం. పారిశుద్ధ్య కార్మికులకు ఉపయోగపడే కొత్త ఆవిష్కరణలు చేయాలనుకుంటాం’ అంటున్నాడు ఫౌండర్స్‌లో ఒకరైన విమల్ గోవింద్. తిరువనంతపురం కేంద్రంగా మొదలైన ‘జెన్ రోబోటిక్స్’ పదిహేడు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పనిచేస్తోంది. బ్రిటన్, ఇండోనేషియ, మలేషియాలతో ఇటు ఆఫ్రికన్ దేశాలకు విస్తరించింది. ‘ఈ యువ బృందం ప్యాషన్, సామాజిక దృష్టి మమ్మల్ని ఆకట్టుకుంది’ అంటున్నాడు ‘జెన్ రోబోటిక్స్’ ఇన్వెస్టర్ ‘యూనికార్న్ ఇండియా వెంచర్స్’ ఫౌండర్, మెనేజింగ్ పాట్నర్ అనీల్ జోషి. -
నిజంగా ఈ నీలవేణిది చాలా పెద్ద మనసే
ఆమె ఒక నిరుపేద పారుశుధ్య కార్మికురాలు.. భర్త, కుమారుడు మృతిచెందారు.. జీతం, భర్త పింఛనే బతుకుదెరువు.. అందులోనే కొంత నిరుపేదలకు పంచుతోంది.. అదీ సరిపోక చెత్తలో ఉండే సామగ్రిని అమ్మి సాయం చేస్తోంది... అనాథలను, నిరుపేదలను చదివించడమే తన లక్ష్యం అంటోంది.. నిజంగా ఈ తలపూరి నీలవేణిది పెద్ద మనసే.. సమస్యలు చుట్టుముట్టినా... విజయవాడ 57వ డివిజన్ సుబ్బరాజునగర్కి చెందిన నీలవేణి (44) కార్పొరేషన్‌లోని పారిశుద్ధ్య విభాగంలో కార్మికురాలిగా విధులు నిర్వహిస్తోంది. ఆమె భర్త సాయిబాబు 2008లో గుండెపొటుతో మృతిచెందాడు. 2014లో కుమారుడు అనిల్‌కుమార్ ఫెర్రిలో స్నానం కోసమని కృష్ణా నదిలో దిగి మరణించాడు. అయినా ఆమె కృంగిపోలేదు. తనకు వచ్చే తక్కువ జీతంలోనే పేదలకు సాయం చేస్తూనే కుమార్తె నాగలక్ష్మీదుర్గకు పెళ్లి చేసింది. అనాథలకు, నిరుపేదలకు సాయం చేయడానికి తన జీతం డబ్బులతో పాటు భర్త మరణానంతరం వస్తోన్న పింఛన్ డబ్బులనూ ఉపయోగించేది. ఆ డబ్బులు సరిపోవడం లేదని భావించి తాను సేకరించిన చెత్తలో ప్లాస్టిక్, గాజు సీసాలు, పుస్తకాలు, ఇనుము వంటి సామాన్లు వేరుగా విక్రయించి ఆ డబ్బులు కూడా పేదలకు ఉపయోగించేది. ట్రస్ట్ ఏర్పాటు... నీలవేణి చేస్తోన్న సాయాన్ని చూసిన కొందరు ఆమెకు డబ్బులు ఇస్తున్నారు. తామూ సాయం చేస్తామని మరికొందరు ముందుకు వస్తున్నారు. వీరందరితో కలిసి నీలవేణి అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. స్థానికంగా ఉంటున్న 8 మంది యువకులతో కలిసి 2020 జూలైలో ‘దివానపు తిరుపతి చారిటబుల్ ట్రస్ట్’ను ఏర్పాటు చేసి దానిద్వారా నిరుపేద విద్యార్థులకు దుస్తులు, పుస్తకాలు, స్టేషనరీ సామాన్లు అందించడం, అనాథ, వృద్ధాశ్రమాల్లో ఉన్నవారికి, రోడ్లపైన అనాథలకు భోజనాలు, దుప్పట్లు పంపిణీ చేస్తున్నారు. లాక్డౌన్ సమయంలో నిరుపేద కార్మిక కుటుంబాలను గుర్తించి వారికి బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయలు, మాస్క్‌లు, మెడికల్ కిట్లు పంచిపెట్టింది. సమాజంలో ఒక మనిషి ఉన్నత స్థితికి చేరుకోవాలంటే దానికి చదువు ఒక్కటే మార్గమని.. అనాథ పిల్లలు, నిరుపేద చిన్నారులను చదివించాలన్నదే తన లక్ష్యమని నీలవేణి వెల్లడించారు. – అజిత్‌సింగ్ నగర్ (విజయవాడ సెంట్రల్) -
కరోనా ఎఫెక్ట్: మావీ ప్రాణాలే సారూ..!
సాక్షి, ఒంగోలు: కరోనా..ఆ పేరు చెబితేనే ప్రజలు హడలిపోతున్నారు. ఎవరిలోనైనా కరోనా లక్షణాలు కనిపిస్తే ఆమడ దూరంలో ఉంటున్నారు. అటువైపు వెళ్లాలన్నా జంకుతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఏ క్షణంలో ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. అయితే ఇవేమీ పట్టించుకోని పారిశుద్ధ్య కారి్మకులు మాత్రం యధావిధిగా తమ రోజువారీ విధులకు హాజరవుతున్నారు. తాము పనిచేసే ప్రాంతాలు కరోనా ప్రభావితంగా అనుమానిస్తున్నప్పటికీ మా పని మేం చేసుకుంటూ వెళతామంటూ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పారిశుద్ధ్య పనుల్లో నిమగ్నం అవుతున్నారు. కరోనా వంటి ప్రాణాంతక వ్యాధులు వ్యాపించినా పారిశుద్ధ్య కారి్మకులు మాత్రం ఎలాంటి రక్షణ కవచాలు లేకుండా తమకు కేటాయించిన ప్రాంతాల్లో పనులు చేస్తున్నారు. వారిని చూసిన ప్రజలు ‘అయ్యో పాపం!’ అంటూ నిట్టూరుస్తుంటే సంబంధిత అధికారులకు మాత్రం చీమకుట్టినట్లు కూడా ఉండకపోవడం గమనార్హం. జిల్లా కేంద్రమైన ఒంగోలులోనే పారిశుద్ధ్య కారి్మకులకు కనీస రక్షణ కవచాలు లేకుండా పనిచేస్తున్నారంటే ఇక మిగిలిన ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో ఎలాంటి దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇవి తప్పనిసరి! పారిశుద్ధ్య కారి్మకులు విధులు నిర్వర్తించే సమయంలో మూడు రకాల రక్షణ కవచాలు తప్పనిసరిగా ధరించాల్సి ఉంది. చేతులకు గ్లౌజ్, మూతికి మాస్క్, కాళ్లకు షూస్ ఉండాలి. ఈ మూడు రక్షణ కవచాలను ధరించుకున్న తర్వాతనే పారిశుధ్య పనులు చేపట్టాలి. అయితే ఒంగోలు నగరంలో పనిచేసే పారిశుధ్య కార్మికులకే ఈ మూడింటిలో ఒక్క రక్షణ కవచం కూడా లేదు. ఇక మిగిలిన మునిసిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో పనిచేసే పారిశుధ్య కార్మికుల పరిస్థితి ఏవిధంగా ఉంటుందో ఊహించవచ్చు. ఆరోగ్యాన్ని, ప్రాణాలను ఫణంగా పెట్టి కారి్మకులు పనిచేస్తున్నప్పటికీ అధికారులకు కనీసం జాలి కూడా కలగకపోవడం విచారకరం. జిల్లాలోని ఒంగోలు నగర పాలక సంస్థ, చీరాల, కందుకూరు, మార్కాపురం మునిసిపాలిటీలతోపాటు నగర పంచాయతీలు, గ్రామ పంచాయతీల్లో వేలాది మంది పారిశుద్ధ్య కారి్మకులు పని చేస్తున్నారు. గతంలో పరి్మనెంట్ పారిశుధ్య కారి్మకులు ఉండటం, ఆ తర్వాత వారు ఉద్యోగ విరమణ చేస్తుండటం, కొత్తగా పరి్మనెంట్ కారి్మకులను తీసుకోకపోవడం, కాంట్రాక్టు పద్ధతిన తీసుకుంటుండటంతో వారికి కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదు. పరి్మనెంట్ పారిశుద్ధ్య కార్మికులకు నామమాత్రంగా వసతులు కలి్పంచేవారు. వారి స్థానాల్లో కాంట్రాక్టు పద్ధతిన వచ్చిన కారి్మకులను అధికారులు పూర్తిగా విస్మరిస్తున్నారు. సర్క్యులర్ సాధించుకున్నా? కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్న పారిశుద్ధ్య కారి్మకులు విధులు నిర్వర్తించే సమయంలో కనీస రక్షణ కల్పించాల్సిన బాధ్యత సంబంధిత కమిషనర్లు, అధికారులపై ఉంది. అయితే వారు పారిశుద్ధ్య కారి్మకుల చేత పనులు చేయించుకోవడం తప్పితే రక్షణ బాధ్యత తమది కాదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒంగోలు నగరంలో పనిచేస్తున్న కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులు కొన్నేళ్ల క్రితం మాస్్క, గ్లౌజ్, షూస్ కావాలంటూ పోరాడి సర్క్యులర్ కూడా ఇప్పించుకున్నారు. అయితే ఆ సమయంలో ఉన్న మునిసిపల్ కమిషనర్లు సౌకర్యాలు కల్పిస్తామంటూ చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఇంతవరకు వారికి మాస్్క, గ్లౌజ్, షూస్ అనేవి లేకుండా పోయాయి. తమ తలరాత ఇంతే అన్నట్లుగా చేతులకు, కాళ్లకు, ముఖానికి ఏమీ పెట్టుకోకుండానే పారిశుద్ధ్య పనులు చేస్తున్నారు. సైడ్ కాల్వల్లో పేరుకుపోయిన చెత్తను కాళ్లకు కనీసం చెప్పులు కూడా లేకుండా, చేతులకు ఎలాంటి కవర్లు కూడా తగిలించుకోకుండా అలాగే తోడి బయటకు వేస్తున్నారు. నగరంలో ఏమైనా జంతువులు చనిపోతే చేతులకు ఎలాంటి రక్షణ గ్లౌజ్‌లు లేకుండా ఆ కళేబరాన్ని అలాగే పట్టుకొని ట్రాక్టర్లలో వేయడం నిత్యకృత్యమైంది. పారిశుద్ధ్య కారి్మకులు చేస్తున్న పనిని ప్రజలు చూసి జాలి పడుతుంటే, అధికారులకు ఆ మాత్రపు జాలి కూడా కలగడం లేదు. ఒంగోలు నగరంలో కరోనా కేసు నమోదైనందున ఇప్పటికైనా అధికారులు కరుణించి తమకు రక్షణ కవచాలు అందించాలని పారిశుద్ధ్య కారి్మకులు వేడుకుంటున్నారు. ఫేస్ మాస్క్‌లు సిద్ధం ఒంగోలు నగర పరిధిలోని పారిశుద్ధ్య కారి్మకులకు క్లాత్ ఫేస్ మాస్‌్కలు సిద్ధం చేసినట్లు నగర పాలక సంస్థ శానిటరీ సూపర్వైజర్ మోహన్‌రావు తెలిపారు. మొత్తం 786 మంది పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారని, వీరందరికీ మంగళవారం నుంచి వాటిని పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా షూస్, గ్లౌజ్‌లకు సంబంధించి కొటేషన్ ద్వారా వారికి అందిస్తామని చెప్పారు. – ఎస్ఎస్.మోహన్‌రావు, ఒంగోలు కార్పొరేషన్ శానిటరీ సూపర్వైజర్ -
పనిచేయమంటారు.. పైసలివ్వరు!
స్వచ్ఛతకు పెద్దపీట వేస్తున్నామని పాలకులు చెప్పే మాటలకు వాస్తవ పరిస్థితులకు పొంతన ఉండటం లేదు. పభుత్వ పాఠశాలల్లో తాత్కాలిక పద్ధతిన పని చేస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది (స్కావెంజర్లు)కి గత ఏడాది కాలంగా వేతనాలు రాకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు బడుల్లో బండెడు చాకిరీ చేసినా వేతనాలు సక్రమంగా అందక అప్పుచేసి కుటుంబాలు పోషించుకుంటున్నారు. స్కావెంజర్స్ పనిచేయడం మానేస్తే పాఠశాలల్లో స్వచ్ఛతకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గిద్దలూరు (ప్రకాశం): ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల అవసరాలకు నిర్మించిన మరుగుదొడ్లు శుభ్రం చేసి స్వచ్ఛతను కాపాడేందుకు ప్రతి పాఠశాలకు ఒకరి చొప్పున స్కావెంజర్‌ను నియమించారు. నియామకాలు జరిగి మూడేళ్లు కావస్తోంది. అప్పటి నుంచి వారు పాఠశాలలను కనిపెట్టుకుని పనిచేస్తున్నారు. అయినప్పటికీ వారికి ఇచ్చే అరకొర వేతనాలను చెల్లించడంలో ప్రభుత్వం అలసత్యం వహిస్తోంది. జిల్లాలో 3,101 మంది కార్మికులు: జిల్లాలో ఉన్న మొత్తం 3,109 పాఠశాలల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టేందుకు తాత్కాలిక పద్ధతిలో పనిచేసేందుకు 3,101 మంది స్కావెంజర్లను నియమించారు. ఇందులో ప్రభుత్వ పాఠశాలలు 33, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలు 2,369, మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలు 273, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు 320, మున్సిపల్ పరిధిలో 55, ఇతర పాఠశాలలు 51 ఉన్నాయి. జెడ్పీ హైస్కూళ్లలో పనిచేసే వారికి నెలకు రూ. 4 వేలు, ఎంపీయూపీ స్కూళ్లలో పనిచేసే వారికి రూ. 2,500, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పనిచేసే కార్మికులకు నెలకు రూ. 2 వేల చొప్పున వేతనం ఖరారు చేశారు. వారి వేతనాలను వెలుగు, మెప్మా ద్వారా చెల్లించేలా నిర్ణయించారు. ఏడాదిగా అందని వేతనాలు: గ్రామీణ పాఠశాలల్లో పనిచేసే పారిశుద్ధ్య సిబ్బందికి గత ఏడాది కాలంగా వేతనాలు అందడం లేదు. దీంతో వారు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఉదయాన్నే, మధ్యాహ్నం మరుగుదొడ్లు, పాఠశాల శుభ్రం చేయాల్సి ఉంటుందని చెప్తున్నారు. పారిశుద్ధ్యం మెరుగుపరచేందుకు ఎంతో కష్టపడుతున్నామని, తమకు సకాలంలో వేతనాలు చెల్లించకపోవడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పులు తెచ్చి కుటుంబాల్ని పోషించుకోవాల్సి వస్తోందని వాపోతున్నారు. పాఠశాలలో స్కావెంజర్లు లేకపోతే పాఠశాల అపారిశుద్ధ్యంతో దుర్వాశన వస్తుందని, స్కావెంజర్ ఉండటం వల్ల పాఠశాల ఆవరణ పరిశుభ్రంగా ఉంచుకోగలుగుతున్నామని ఉపాధ్యాయులు, విద్యార్థులు చెప్తున్నారు. ఇంత పనిచేస్తున్నప్పటికీ వారికి వేతనాలు ఇవ్వకపోవడం దారుణమని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు కలిసి కొంత మొత్తాన్ని ఇచ్చి పనిచేయించుకుంటున్నారు. కొన్ని పాఠశాలల్లో స్కావెంజర్లు కొద్దిసేపు పనిచేసి, ఇతర కూలీ పనులకు వెళ్తున్నారు. నగర పంచాయతీల్లో మూడేళ్లుగా అందని వైనం: కొత్తగా ఏర్పాటైన నగర పంచాయతీల్లోని మండల పరిషత్ ప్రాథమిక, ప్రాథమికోన్నత, జెడ్పీ ఉన్నత పాఠశాలలను మున్సిపాలిటీ స్కూళ్లుగా మార్చలేదు. దీంతో ఆయా పాఠశాలల్లో పనిచేస్తే స్కావెంజర్లకు గత మూడు సంవత్సరాలుగా వేతనాలు అందడం లేదు. గిద్దలూరు నగర పంచాయతీ పరిధిలో రెండు జెడ్పీ ఉన్నత పాఠశాలలు, 8 మండల పరిషత్ ప్రాథమిక, ఒక ప్రాథమికోన్నత పాఠశాల ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో పనిచేసే సిబ్బంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఎంఈఓను వేతనాల గురించి అడిగితే వెలుగు వారిపై, వెలుగు వారిని ప్రశ్నిస్తే మెప్మా వారిపై చెప్పుకుంటూ కాలం వెళ్లబుచ్చుతున్నారు. ఎప్పటికైనా జీతాలు రాకపోతాయా అన్న ఆశతో సిబ్బంది పనిచేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పాఠశాలల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు చెల్లించి పాఠశాలలను స్వచ్ఛతతో ఉంచేలా చూడాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు. మూడేళ్లుగా జీతాలు రాలేదు పాఠశాలలో పారిశుద్ధ్య పనులు చేస్తే నెలకు రూ. 4వేల వేతనం ఇస్తామని చెబితే చేరాను. మూడేళ్లుగా పనిచేస్తున్నా సక్రమంగా వేతనాలు రావడం లేదు. సారు వాళ్లు నెలకు రూ. 1500 నుంచి రూ. 2 వేల వరకు ఇస్తున్నారు. ఇళ్లు గడవడం కష్టంగా మారింది. ఇతర పనులు చేసుకునేందుకు వెళ్దామన్నా ఇక్కడి పనికి, బయట పనికి కుదరడం లేదు. అధికారులు జీతాలు ఇచ్చి ఆదుకోవాలి. – షేక్ తహరూన్, జడ్పీ హైస్కూల్, గిద్దలూరు. మెప్మా అధికారులను అడగమంటున్నారు జీతాల గురించి అధికారులను అడిగితే వెలుగు వాళ్లపై చెప్తున్నారు. వారిని అడిగితే మెప్మా వాళ్లు ఇస్తారని అంటున్నారు. మెప్మా వాళ్లు మాకు ఎలాంటి జీతాలు రాలేదని చెప్తున్నారు. ఇన్ని రోజులు ఈ పనినే నమ్ముకుని వేరే పనికి వెళ్లలేదు. జీతాలు ఎందుకు ఇవ్వకుండా పనిచేయించుకుంటున్నారో అర్థం కావడం లేదు. జీతాలు ఇప్పించేలా చూడండయ్యా. – ఎస్.కాదర్బీ, ఎంపీపీ స్కూల్, పీఆర్ కాలనీ, గిద్దలూరు. -
‘ప్రత్యేక’.. కష్టాలు తొలగేనా..!
ఆదిలాబాద్‌అర్బన్: గ్రామ పంచాయతీ బాధ్యతలు చేపట్టిన అధికారులకు ‘ప్రత్యేక’ కష్టాలు తొలగేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పంచాయతీల్లో అభివృద్ధి పరుగులు తీసేలా ప్రభుత్వం కసరత్తు చేస్తుంటే.. కింది స్థాయి ఉద్యోగులు, కార్మికులు లేక ప్రత్యేక అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. పల్లెలను పచ్చదనం, పరిశుభ్రంతో తీర్చిదిద్దేందుకు మూడు నెలల కార్యాచరణ ప్రణాళిక తయారీ చేసి పంద్రాగష్టు నుంచి పని ప్రారంభించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. పరిశుభ్రత, పచ్చదనం వైపు అడుగులు వేయడానికి సమయం ఆసన్నం కావడంతో కార్యాచరణ రూపకల్పనలో జిల్లా యంత్రాంగంతోపాటు అధికారులు తలమునకలు అవుతున్నారు. వివిధ శాఖల్లో వివిధ హోదాల్లో ఉంటూ ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్న అధికారులకు పంచాయతీ బాధ్యతలు అప్పగించడం ఒక భారమనుకుంటే.. పంచాయతీల్లో కార్యదర్శులు, కార్మికులు సరిపడా లేకపోవడం తలకు మించిన భారమవుతోంది. ఇదిలా ఉండగా, గతంలో పంచాయతీకో కార్యదర్శిని నియమిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే.. తాజాగా పంచాయతీ కార్మికులకు సైతం వేతనాలు పెంచి అవసరమైన చోట కార్మికులను నియమిస్తామని ప్రకటించడంతో పంచాయతీల్లో ఖాళీ పోస్టుల భర్తీకి లైన్ క్లియర్ అయినట్లయింది. 328 కార్యదర్శి పోస్టులు ఖాళీ.. జిల్లాలో 18 మండలాల పరిధిలో 509 రెవెన్యూ గ్రామాలున్నాయి. మొత్తం 467 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. బేల మండలంలోని రెండు గ్రామ పంచాయతీలు మినహా.. 465 పంచాయతీలకు ప్రత్యేక అధికారులు ఉన్నారు. జిల్లాలో మొత్తం 467 పంచాయతీ కార్యదర్శులు అవసరం. ప్రస్తుతం 139 మంది కార్యదర్శులు పని చేస్తున్నారు. ఇంకా 328 మంది పంచాయతీ కార్యదర్శులు అవసరం. కాగా, జిల్లాలో గతంలో 243 గ్రామ పంచాయతీలు ఉండేవి. జనాభా ప్రాతిపదికన రెండు, మూడు చిన్నచిన్న పంచాయతీలను కలుపుతూ ఒక క్లస్టర్‌గా విభజించారు. ఈ క్లస్టర్లకు కార్యదర్శులు బాధ్యత వహించారు. తాజాగా 226 కొత్త పంచాయతీలు ఏర్పాటయ్యాయి. ప్రతీ పంచాయతీకో కార్యదర్శిని నియమించి ప్రత్యేక పాలనను సక్రమంగా అందిస్తామని సీఎం కేసీఆర్ ఇది వరకే ప్రకటించారు. ఈ లెక్కన కొత్త, పాత గ్రామ పంచాయతీలకు కలిపి 328 మంది కార్యదర్శులు అవసరం ఉంది. కార్యదర్శులు సరిపడా లేకపోవడంతో ప్రత్యేక అధ/æకారులు పల్లె పాలనలో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. కార్మిక పోస్టుల భర్తీపై ఆశలు.. జిల్లాలోని అన్నీ గ్రామ పంచాయతీ పరిధిలో పారిశుధ్య కార్మికులు ఉన్నారు. గ్రామంలోని ప్రతీ 500 మంది జనాభాకు ఒక స్వీపర్, ఒక పంప్ ఆపరేటర్ పని చేస్తున్నారు. గ్రామ పంచాయతీలో 2 వేల జనాభా ఉంటే అక్కడ ఇద్దరు స్వీపర్లు, ఒక ఆపరేటర్ ఉన్నారు. 5 వేల జనాభా దాటిన గ్రామ పంచాయతీల్లో ముగ్గురు, నలుగురు చొప్పున పని చేస్తున్నారు. ఉదాహరణకు.. జిల్లా కేంద్రానికి అనుకొని మావల మేజర్ గ్రామ పంచాయతీలో 68 మంది పారిశుధ్య కార్మికులు పని చేస్తున్నారు. ఇప్పుడా పంచాయతీ మున్సిపాలిటీలో విలీనం కావడంతో ఒకే కార్మికుడిని అక్కడ ఉంచి మిగతా వారిని వేరే జీపీలకు సర్దుబాటు చేయాల్సి వచ్చింది. ఒక జీపీకి ఇంత మంది కార్మికులు ఉండాలనేది ఎక్కడా లేదని అధికారులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా, గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికులకు నెలకు రూ.500 నుంచి రూ.వెయ్యి చొప్పున ఇస్తున్నారు. కొన్ని పంచాయతీల్లో కార్మికులు నెలకు రూ.4 వేల నుంచి రూ.5 వేలు పొందుతున్నారు. కాగా, జిల్లాలో 467 పంచాయతీల్లో ఐదు వేల జనాభా దాటిన పంచాయతీలు ఆరు ఉండగా, 461 పంచాయతీల్లో 5 వేల కంటే తక్కువే జనాభా ఉంది. ప్రతీ ఐదు వేల మందికి ముగ్గురు కార్మికుల చొప్పున లెక్కేసుకున్నా.. జిల్లాలో 1,383 మంది కార్మికులు అవసరం. ప్రస్తుతం జిల్లాలో 758 మంది పారిశుధ్య కార్మికులు పని చేస్తున్నారు. ఈ లెక్కన ఇంకా 625 మంది కార్మికులు అవసరం. ఈ పోస్టుల భర్తీకే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా, ప్రస్తుతం పని చేస్తున్న కార్మికులకు గ్రామ పంచాయతీ సొంత నిధుల (జనరల్ ఫండ్స్) నుంచి వేతనాలు చెల్లిస్తున్నారు. సమ్మెలో కార్మికులు పంచాయతీలకు కార్యదర్శులు సరిపడా లేకపోవడంతో ప్రత్యేక పాలనకు ముందునుంచి ఒక్కో కార్యదర్శి రెండు, మూడు పంచాయతీలకు ఇన్చార్జిలుగా వ్యవహారిస్తూ వస్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి ఆ పంచాయతీల్లో బాధ్యతలు నిర్వర్తించడంతో పంచాయతీ స్వరూపంపై వారికి అవగాహన ఉంది. ప్రస్తుతం గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక తయారీలో కార్యదర్శులు పాత్ర కీలకం. ఇదిలా ఉండగా, జిల్లా వ్యాప్తంగా గత 20 రోజుల నుంచి జీపీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. కనీస వేతనం రూ.18 వేలు చెల్లించాలని, తమనే కార్యదర్శులుగా నియమించాలని డిమాండ్ చేస్తూ పంచాయతీలకు వెళ్లకుండా ఆయా మండలాల పరిధిలో కార్మికులు సమ్మె చేస్తున్నారు. దీంతో మూడు నెలల అభివృద్ది ప్రణాళిక రూపకల్పనకు స్పెషలాఫీసర్లు ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. పారిశుధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించడంతోపాటు కొత్త వారిని నియమించి, ఖాళీగా ఉన్న కార్యదర్శుల పోస్టులను భర్తీ చేయాలని గ్రామాల ప్రజలు కోరుతున్నారు. -
కార్మిక సమ్మెపై సర్కారీ కుట్ర
- సమస్యలు పరిష్కరించకుండా మొండివైఖరి: వెఎస్సార్ సీపీ నేత అప్పిరెడ్డి ధ్వజం - ప్రభుత్వం దిగివచ్చేవరకు ఆందోళన ఆపే ప్రసక్తే లేదు: జేఏసీ చైర్మన్ వరికల్లు రవికుమార్ - పారిశుద్ధ్య కార్మికుల కలెక్టరేట్ ముట్టడి విజయవంతం నగరంపాలెం(గుంటూరు): పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను పరిష్కరించటంలో రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తుందనీ, కార్మిక సమ్మెను భగ్నం చేయటానికి కుట్ర పన్నుతోందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి, గుంటూరు నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మున్సిపల్ కాంట్రాక్ట్ ఉద్యోగులు, కార్మికుల ఐక్యకార్యాచరణ సమితి, రాజకీయ పార్టీల పిలుపు మేరకు శుక్రవారం ఉదయం కార్మికులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు కలసి కలెక్టరేట్‌ను ముట్టడించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కాంతిలాల్‌దండేకు వినతి పత్రం అందజేసి కార్మికుల సమస్యలు పరిష్కరించి సమ్మెను విరమింపజేసే దిశగా చర్యలు చేపట్టాలని కోరారు. అనంతరం అప్పిరెడ్డి మాట్లాడుతూ, గతంలో ఉన్న ప్రభుత్వాలు పీఆర్సీ సిఫార్సుల మేరకు జీతాలు పెంచగా, చంద్రబాబునాయుడు మాత్రం కార్మికులకు వర్తింపచేయటం లేదన్నారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ కార్మికుల న్యాయమైన కోర్కెలు పరిష్కరించ టంలో ప్రభుత్వం విఫలమైంద న్నారు. కార్మికుల ఉసురు తగిలి తెలుగుదేశం ప్రభుత్వం కుప్పకూలిపోయే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ధనలక్ష్మి మాట్లాడుతూ కష్టపడి పనిచేస్తున్న కార్మికులకు జీతాలు పెంచటానికి డబ్బుల్లేవంటున్న చంద్రబాబు కానుకలు, ఉత్సవాల పేరిట కోట్లు దుబారా చేస్తున్నారన్నారు. జేఏసీ చైర్మన్ వరికల్లు రవికుమార్ మాట్లాడుతూ టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో రాష్ట్రంలోని కాంట్రాక్టు కార్మికులను పర్మనెంటు చేస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చిన తరువాత కనీసం పీఆర్సీ ప్రకారం జీతాలు పెంచ లేదన్నారు. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కార్మికుల సమస్యలపై అవగాహన లేకుండా రెండు, మూడు వేలు పెంచుతామని బేరాలు ఆడుతున్నా రన్నారు. ప్రభుత్వ దిగివచ్చి జీతాలు పెంచేవరకు సమ్మె ఆపే ప్రసక్తే లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి జీవీ కృష్ణారావు, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఆతుకూరి ఆంజనేయులు, వైఎస్సార్సీపీ రాష్ట్రకార్యదర్శి నసీర్‌అహ్మద్, నాయకులు ఎలికా శ్రీకాంత్ యాదవ్, గనిక జాన్సీరాణీ, టింబర్ డిపోజానీ, పానుగంటి చైతన్య, పల్లపురాఘవ, దాసరి కిరణ్, కొండారెడ్డి, కోటా పిచ్చిరెడ్డి, పెదాలబాబు, మైనార్టీ సెల్ రాష్ట్రకార్యదర్శి మార్కెట్‌బాబు, ట్రేడ్ యూనియన్ జిల్లా ప్రధానకార్యదర్శి ఆవుల సుందర రెడ్డి, కమల్, ఎర్రబాబు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ముత్యం, న్యూడె మొక్రసీ పార్టీ నాయకులు బ్రహ్మయ్య, జేఏసీ నాయకులు కోటా మాల్యాద్రి, సోముశంకర్, సీఐటీయూ నాయకులు నళినీకాంత్, నికల్సన్, కాళిదాసు,తదితరులు పాల్గొన్నారు. పోలీసులు, కార్మికుల మధ్య తోపులాట ... శుక్రవారం ఉదయం నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులు జేఏసీ నాయకులు, వివిధ రాజకీయపార్టీల నాయకులు పాదయాత్రగా కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఒక్కసారిగా కార్యాలయం లోపలకు చొచ్చుకు వెళ్ళటానికి ప్రయత్నించగా బారీ స్థాయిలో మొహరించిన పోలీసులు అడ్డుకోవటంతో తోపులాట జరిగింది. అతి కష్టంమీద పోలీసులు కార్మికులను నియంత్రించారు. దీంతో కలెక్టర్ కార్యాలయం ఎదుట కార్మికులు, నాయకులు బైటాయించి రాస్తారోకో చేశారు. పారిశుద్ధ్య కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, సమస్యలు పరిష్కరించాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈస్ట్ డీఎస్పీ సంతోష్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.