పారిశుద్ధ్య పనులు చేస్తున్న స్కావెంజర్
స్వచ్ఛతకు పెద్దపీట వేస్తున్నామని పాలకులు చెప్పే మాటలకు వాస్తవ పరిస్థితులకు పొంతన ఉండటం లేదు. పభుత్వ పాఠశాలల్లో తాత్కాలిక పద్ధతిన పని చేస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది (స్కావెంజర్లు)కి గత ఏడాది కాలంగా వేతనాలు రాకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు బడుల్లో బండెడు చాకిరీ చేసినా వేతనాలు సక్రమంగా అందక అప్పుచేసి కుటుంబాలు పోషించుకుంటున్నారు. స్కావెంజర్స్ పనిచేయడం మానేస్తే పాఠశాలల్లో స్వచ్ఛతకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
గిద్దలూరు (ప్రకాశం): ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల అవసరాలకు నిర్మించిన మరుగుదొడ్లు శుభ్రం చేసి స్వచ్ఛతను కాపాడేందుకు ప్రతి పాఠశాలకు ఒకరి చొప్పున స్కావెంజర్‌ను నియమించారు. నియామకాలు జరిగి మూడేళ్లు కావస్తోంది. అప్పటి నుంచి వారు పాఠశాలలను కనిపెట్టుకుని పనిచేస్తున్నారు. అయినప్పటికీ వారికి ఇచ్చే అరకొర వేతనాలను చెల్లించడంలో ప్రభుత్వం అలసత్యం వహిస్తోంది.
జిల్లాలో 3,101 మంది కార్మికులు:
జిల్లాలో ఉన్న మొత్తం 3,109 పాఠశాలల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టేందుకు తాత్కాలిక పద్ధతిలో పనిచేసేందుకు 3,101 మంది స్కావెంజర్లను నియమించారు. ఇందులో ప్రభుత్వ పాఠశాలలు 33, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలు 2,369, మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలు 273, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు 320, మున్సిపల్ పరిధిలో 55, ఇతర పాఠశాలలు 51 ఉన్నాయి. జెడ్పీ హైస్కూళ్లలో పనిచేసే వారికి నెలకు రూ. 4 వేలు, ఎంపీయూపీ స్కూళ్లలో పనిచేసే వారికి రూ. 2,500, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పనిచేసే కార్మికులకు నెలకు రూ. 2 వేల చొప్పున వేతనం ఖరారు చేశారు. వారి వేతనాలను వెలుగు, మెప్మా ద్వారా చెల్లించేలా నిర్ణయించారు.
ఏడాదిగా అందని వేతనాలు:
గ్రామీణ పాఠశాలల్లో పనిచేసే పారిశుద్ధ్య సిబ్బందికి గత ఏడాది కాలంగా వేతనాలు అందడం లేదు. దీంతో వారు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఉదయాన్నే, మధ్యాహ్నం మరుగుదొడ్లు, పాఠశాల శుభ్రం చేయాల్సి ఉంటుందని చెప్తున్నారు. పారిశుద్ధ్యం మెరుగుపరచేందుకు ఎంతో కష్టపడుతున్నామని, తమకు సకాలంలో వేతనాలు చెల్లించకపోవడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పులు తెచ్చి కుటుంబాల్ని పోషించుకోవాల్సి వస్తోందని వాపోతున్నారు.
పాఠశాలలో స్కావెంజర్లు లేకపోతే పాఠశాల అపారిశుద్ధ్యంతో దుర్వాశన వస్తుందని, స్కావెంజర్ ఉండటం వల్ల పాఠశాల ఆవరణ పరిశుభ్రంగా ఉంచుకోగలుగుతున్నామని ఉపాధ్యాయులు, విద్యార్థులు చెప్తున్నారు. ఇంత పనిచేస్తున్నప్పటికీ వారికి వేతనాలు ఇవ్వకపోవడం దారుణమని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు కలిసి కొంత మొత్తాన్ని ఇచ్చి పనిచేయించుకుంటున్నారు. కొన్ని పాఠశాలల్లో స్కావెంజర్లు కొద్దిసేపు పనిచేసి, ఇతర కూలీ పనులకు వెళ్తున్నారు.
నగర పంచాయతీల్లో మూడేళ్లుగా అందని వైనం:
కొత్తగా ఏర్పాటైన నగర పంచాయతీల్లోని మండల పరిషత్ ప్రాథమిక, ప్రాథమికోన్నత, జెడ్పీ ఉన్నత పాఠశాలలను మున్సిపాలిటీ స్కూళ్లుగా మార్చలేదు. దీంతో ఆయా పాఠశాలల్లో పనిచేస్తే స్కావెంజర్లకు గత మూడు సంవత్సరాలుగా వేతనాలు అందడం లేదు. గిద్దలూరు నగర పంచాయతీ పరిధిలో రెండు జెడ్పీ ఉన్నత పాఠశాలలు, 8 మండల పరిషత్ ప్రాథమిక, ఒక ప్రాథమికోన్నత పాఠశాల ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో పనిచేసే సిబ్బంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు.
ఎంఈఓను వేతనాల గురించి అడిగితే వెలుగు వారిపై, వెలుగు వారిని ప్రశ్నిస్తే మెప్మా వారిపై చెప్పుకుంటూ కాలం వెళ్లబుచ్చుతున్నారు. ఎప్పటికైనా జీతాలు రాకపోతాయా అన్న ఆశతో సిబ్బంది పనిచేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పాఠశాలల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు చెల్లించి పాఠశాలలను స్వచ్ఛతతో ఉంచేలా చూడాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు.
మూడేళ్లుగా జీతాలు రాలేదు
పాఠశాలలో పారిశుద్ధ్య పనులు చేస్తే నెలకు రూ. 4వేల వేతనం ఇస్తామని చెబితే చేరాను. మూడేళ్లుగా పనిచేస్తున్నా సక్రమంగా వేతనాలు రావడం లేదు. సారు వాళ్లు నెలకు రూ. 1500 నుంచి రూ. 2 వేల వరకు ఇస్తున్నారు. ఇళ్లు గడవడం కష్టంగా మారింది. ఇతర పనులు చేసుకునేందుకు వెళ్దామన్నా ఇక్కడి పనికి, బయట పనికి కుదరడం లేదు. అధికారులు జీతాలు ఇచ్చి ఆదుకోవాలి. – షేక్ తహరూన్, జడ్పీ హైస్కూల్, గిద్దలూరు.
మెప్మా అధికారులను అడగమంటున్నారు
జీతాల గురించి అధికారులను అడిగితే వెలుగు వాళ్లపై చెప్తున్నారు. వారిని అడిగితే మెప్మా వాళ్లు ఇస్తారని అంటున్నారు. మెప్మా వాళ్లు మాకు ఎలాంటి జీతాలు రాలేదని చెప్తున్నారు. ఇన్ని రోజులు ఈ పనినే నమ్ముకుని వేరే పనికి వెళ్లలేదు. జీతాలు ఎందుకు ఇవ్వకుండా పనిచేయించుకుంటున్నారో అర్థం కావడం లేదు. జీతాలు ఇప్పించేలా చూడండయ్యా. – ఎస్.కాదర్‌బీ, ఎంపీపీ స్కూల్, పీఆర్ కాలనీ, గిద్దలూరు.
Comments
Please login to add a commentAdd a comment