తొమ్మిదో తరగతి బాలికలు
ఒంగోలు టౌన్: ప్రభుత్వ పాఠశాలల్లో తొమ్మిదో తరగతి చదివే బాలికలకు ‘బడికెళ్తా’ పేరుతో ప్రభుత్వం గత ఏడాది ఆర్భాటంగా సైకిళ్లు పంపిణీ చేసి.. ఈ ఏడాది మాత్రం మొండి చేయి చూపింది. బాలికల డ్రాప్ అవుట్స్ శాతాన్ని తగ్గించాలని, ముఖ్యంగా తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికలు మధ్యలో పాఠశాల మానివేయకుండా ఉండేందుకు ప్రభుత్వం గత ఏడాది బడికెళ్తా పథకంలో సైకిళ్లు పంపిణీ చేసింది. గత ఏడాది తమ సీనియర్ల్‌కు ఇచ్చినట్లుగా తమకు సైకిళ్లు ఇస్తారని ఈ ఏడాది తొమ్మిదో తరగతికి వచ్చిన బాలికలు ఎంతగానో ఎదురు చూశారు. పాఠశాలలు తెరిచి రెండు నెలలు దాటినా సైకిళ్ల పంపిణీ టెండర్ల గడప కూడా దాటలేదు. టెండర్లు ఎప్పుడు పిలుస్తారో, ఎప్పుడు సైకిళ్లను సిద్ధం చేస్తారో, వాటిని బాలికలకు ఎప్పుడు పంపిణీ చేస్తారో ప్రశ్నార్ధకంగా మారింది. దీంతో బాలికలకు కాలినడనే పాఠశాలలకు వెళుతున్నారు.
ప్రచార ఆర్భాటమే..
చంద్రబాబు ప్రభుత్వం ఆర్భాటానికే కేరాఫ్‌గా నిలుస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న బాలికలు మధ్యలో పాఠశాల మానివేయకుండా ఉండాలన్న ఉద్దేశంతో బడికొస్తా కార్యక్రమానికి గత ఏడాది శ్రీకారం చుట్టింది. జిల్లాలో గత ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న 10,941మంది బాలికలకు ప్రభుత్వం సైకిళ్లు పంపిణీ చేసంఇ. ఈ ఏడాది 11,230 మంది బాలికలు తొమ్మిదవ తరగతి చదువుతున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి చలనం లేకపోవడంతో బాలికలు సైకిళ్లపై ఆశలు వదులుకున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి ప్రభుత్వ పాఠశాలల్లో జిల్లాల వారీగా తొమ్మిదో తరగతిలో ప్రవేశించే బాలికలు ఎంతమంది ఉన్నారన్న లెక్క అన్ని జిల్లాల్లోని సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయాల వద్ద ఉన్నాయి. ఆ డేటాను ఆధారం చేసుకొని మొదటి విడతలో బడికెళ్తాపథకం కింద సైకిళ్లు సిద్ధం చేయవచ్చు. కానీ, ప్రభుత్వానికి ముందు చూపు కొరవడింది.
పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, సైకిళ్లు..
ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు పూర్తి స్థాయిలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు సరఫరా చేయలేదు. యూనిఫాం కూడా ఇవ్వలేదు. ఇప్పటికీ అనేక పాఠశాలల్లోని విద్యార్థులు పాఠ్య పుస్తకాలు, యూనిఫాం కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. ఆ జాబితాలోకి తాజాగా సైకిళ్లు వచ్చి చేరాయి. పాఠశాలలు పునః ప్రారంభానికి ముందు ప్రభుత్వ పాఠశాలల్లో బాలికల సంఖ్యను పెంచాలన్న ఉద్దేశంతో బడికెళ్తా కార్యక్రమం గురించి ఉపాధ్యాయులతో విస్తృతంగా ప్రచారం చేయించింది. బాలికలు తాము నివాసం ఉంటున్న ప్రాంతాల నుంచి పాఠశాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడకుండా ఉండాలన్న ఉద్దేశంతో సైకిళ్లు అందించాలని నిర్ణయించింది. పథకానికి రూపకల్పన చేసినప్పటికీ ఆచరణలో మాత్రం ఘోరంగా విఫలమైంది.
Comments
Please login to add a commentAdd a comment