సాక్షి, చీరాల (ప్రకాశం): విద్యావిధానంలో కొత్త మార్పులు వస్తున్నాయి. బట్టీ విధానానికి స్వస్తి పలికేందుకు వస్తున్న మార్పులు విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఇప్పుడు విద్యార్థులకు ప్రభుత్వం అందించే ఉచిత పాఠ్యపుస్తకాలపై క్యూఆర్ కోడ్ ముద్రించారు. క్యూఆర్ కోడ్ వలన సమగ్ర సమాచారాన్ని క్షణాల్లో తెలుసుకోవచ్చు. దీని వరిశోధానాత్మక బోధన, పూర్తిస్థాయిలో అభ్యసనకు అవకాశం కలుగుతుంది. పాఠ్యాంశాలను విద్యార్థుల వీక్షించేందుకు దీక్షా యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. గత ఏడాది గణితం, భౌతికశాస్త్రం, సాంఘికశాస్త్రం పుస్తకాలపై ముద్రించారు. ఈ విద్యాసంవత్సరం నుంచి తెలుగు, హిందీ, ఆంగ్ల సబ్జెక్టుల పాఠ్యపుస్తకాలపై కూడా క్యూఆర్ కోడ్‌ను ముద్రించారు. ఈ విధానం వలన విద్యార్థులు తమ పాఠ్యాంశాలను ఆండ్రాయిడ్ ఫోన్‌లలో కూడా చూసుకోవచ్చని ఉపాధ్యాయులు చెబుతున్నారు. విద్యార్థులు పాఠ్యాంశాలపై త్వరితగతిన అర్థం చేసుకోవచ్చు.
ఎలా?
గూగుల్ ప్లేస్టోర్ నుంచి దీక్షాయాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. యాప్‌లో విద్యార్థి లేదా ఉపాధ్యాయుడు అనేది ఎంపిక చేసుకున్న అనంతరం భాషను ఎంపిక చేసుకోవాలి. తర్వాత పాఠ్యాంశం పైన ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే సమగ్రసమాచారం ఫోన్‌లో ప్రత్యక్షమవుతుంది. ఇలా చేయడం వలన ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు నల్లబజారుకు తరలివెళ్లకుండా ఉంటుంది. క్యూఆర్ కోడ్‌ను పుస్తకం మొదటి, చివరి పేజీల్లో ముద్రించేవారు. ప్రస్తుతం ముఖ్యమైన పాఠ్యాంశాలపై కూడా ముద్రించడంతో విద్యార్థులకు మరింత సులభతరం అయింది.
మెరుగైన ఫలితాలు వస్తాయి...
ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తున్నాం. డిజిటల్ తరగతులు, క్యూఆర్ కోడ్ వలన విద్యార్థులకు మెరుగైన ఫలితాలు వస్తాయి. పాఠ్యాంశాలను బోధన ద్వారా వినడం కంటే దృశ్యరూపంలో తిలకించడం వలన మార్చిపోయే అవకాశం ఉండదు.
- నాగేశ్వరరావు, ఎంఈఓ
Comments
Please login to add a commentAdd a comment