సాక్షి, ఒంగోలు టౌన్: ప్రభుత్వ పాఠశాలలు, ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులందరికీ షూస్ ఇవ్వాలని రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసినా జిల్లాలోని కొన్ని మండలాలకు చెందిన మండల విద్యాశాఖాధికారులు వాటిని ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. జిల్లాలోని కనిగిరి, కంభం, పెద్దారవీడు, అర్ధవీడు, బల్లికురవ, అద్దంకి, మార్టూరు మండలాల్లోని ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు షూస్ ఇవ్వకుండా అక్కడి మండల విద్యాశాఖాధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఎయిడెడ్ ఉపాధ్యాయులు వాపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్స్‌తో పాటు షూస్ ఇవ్వాలని సాక్షాత్తు విద్యాశాఖామంత్రి ఆదిమూలపు సురేష్ ఆదేశించినా క్షేత్రస్థాయిలో కొంతమంది విద్యాశాఖాధికారులు మోకాలడ్డుతుండటంపై ఎయిడెడ్ ఉపాధ్యాయులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలోని ఎక్కువ శాతం ఎయిడెడ్ పాఠశాలలకు షూస్ పంపిణీ చేసినా ఆ ఏడు మండలాల పరిధిలోని మండల విద్యాశాఖాధికారుల నుంచి వింత సమాధానం రావడంపై ఎయిడెడ్ ఉపాధ్యాయులు నిరసన తెలుపుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలు, ఎయిడెడ్ పాఠశాలలు ఒకే కాంపౌండ్‌లో ఉన్నాయని, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు షూస్ ఇచ్చి, తమ విద్యార్థులకు ఇవ్వకపోవడంతో వారు ప్రభుత్వ పాఠశాలల వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయని ఎయిడెడ్ ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. అసలే విద్యార్థుల శాతం తక్కువగా ఉందని కలత చెందుతున్న తరుణంలో షూస్ అందించే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని ఏపీ టీచర్స్ గిల్డ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వెంకట్రావు, ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. వెంటనే ఏ ఏడు మండలాల పరిధిలోని ఎయిడెడ్ పాఠశాలలకు షూస్ అందించేలా సమగ్ర శిక్షా అభియాన్ జిల్లా ప్రాజెక్టు అధికారి వెంకటేశ్వరరావు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని వారు కోరారు.
Comments
Please login to add a commentAdd a comment