కార్మిక సమ్మెపై సర్కారీ కుట్ర | Government not performing in worker's stike | Sakshi
Sakshi News home page

కార్మిక సమ్మెపై సర్కారీ కుట్ర

Published Sat, Jul 25 2015 1:57 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM

కార్మిక సమ్మెపై సర్కారీ కుట్ర - Sakshi

కార్మిక సమ్మెపై సర్కారీ కుట్ర

- సమస్యలు పరిష్కరించకుండా మొండివైఖరి: వెఎస్సార్ సీపీ నేత అప్పిరెడ్డి ధ్వజం
- ప్రభుత్వం దిగివచ్చేవరకు ఆందోళన ఆపే ప్రసక్తే లేదు: జేఏసీ చైర్మన్ వరికల్లు రవికుమార్
- పారిశుద్ధ్య కార్మికుల కలెక్టరేట్ ముట్టడి విజయవంతం
నగరంపాలెం(గుంటూరు):
పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను పరిష్కరించటంలో రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తుందనీ, కార్మిక సమ్మెను భగ్నం చేయటానికి కుట్ర పన్నుతోందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి, గుంటూరు నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మున్సిపల్ కాంట్రాక్ట్ ఉద్యోగులు, కార్మికుల ఐక్యకార్యాచరణ సమితి, రాజకీయ పార్టీల పిలుపు మేరకు శుక్రవారం ఉదయం కార్మికులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు కలసి కలెక్టరేట్‌ను ముట్టడించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కాంతిలాల్‌దండేకు వినతి పత్రం అందజేసి కార్మికుల సమస్యలు పరిష్కరించి సమ్మెను విరమింపజేసే దిశగా చర్యలు చేపట్టాలని కోరారు.  

అనంతరం అప్పిరెడ్డి మాట్లాడుతూ, గతంలో ఉన్న ప్రభుత్వాలు పీఆర్‌సీ సిఫార్సుల మేరకు జీతాలు పెంచగా, చంద్రబాబునాయుడు మాత్రం కార్మికులకు వర్తింపచేయటం లేదన్నారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ కార్మికుల న్యాయమైన కోర్కెలు పరిష్కరించ టంలో ప్రభుత్వం విఫలమైంద న్నారు. కార్మికుల ఉసురు తగిలి తెలుగుదేశం ప్రభుత్వం కుప్పకూలిపోయే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ధనలక్ష్మి మాట్లాడుతూ కష్టపడి పనిచేస్తున్న కార్మికులకు జీతాలు పెంచటానికి డబ్బుల్లేవంటున్న చంద్రబాబు కానుకలు, ఉత్సవాల పేరిట కోట్లు దుబారా చేస్తున్నారన్నారు. జేఏసీ చైర్మన్ వరికల్లు రవికుమార్ మాట్లాడుతూ టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో రాష్ట్రంలోని కాంట్రాక్టు కార్మికులను పర్మనెంటు చేస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చిన తరువాత కనీసం పీఆర్‌సీ ప్రకారం జీతాలు పెంచ లేదన్నారు.

మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కార్మికుల సమస్యలపై అవగాహన లేకుండా రెండు, మూడు వేలు పెంచుతామని బేరాలు ఆడుతున్నా రన్నారు. ప్రభుత్వ దిగివచ్చి జీతాలు పెంచేవరకు సమ్మె ఆపే ప్రసక్తే లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి జీవీ కృష్ణారావు, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఆతుకూరి ఆంజనేయులు, వైఎస్సార్‌సీపీ రాష్ట్రకార్యదర్శి నసీర్‌అహ్మద్, నాయకులు ఎలికా శ్రీకాంత్ యాదవ్, గనిక జాన్సీరాణీ, టింబర్ డిపోజానీ, పానుగంటి చైతన్య, పల్లపురాఘవ, దాసరి కిరణ్, కొండారెడ్డి, కోటా పిచ్చిరెడ్డి, పెదాలబాబు, మైనార్టీ సెల్ రాష్ట్రకార్యదర్శి మార్కెట్‌బాబు, ట్రేడ్ యూనియన్ జిల్లా ప్రధానకార్యదర్శి ఆవుల సుందర రెడ్డి, కమల్, ఎర్రబాబు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ముత్యం,  న్యూడె మొక్రసీ పార్టీ నాయకులు బ్రహ్మయ్య, జేఏసీ నాయకులు కోటా మాల్యాద్రి, సోముశంకర్, సీఐటీయూ నాయకులు నళినీకాంత్, నికల్సన్, కాళిదాసు,తదితరులు పాల్గొన్నారు.
 
పోలీసులు, కార్మికుల మధ్య తోపులాట ...
శుక్రవారం ఉదయం  నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులు జేఏసీ నాయకులు, వివిధ రాజకీయపార్టీల నాయకులు పాదయాత్రగా కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఒక్కసారిగా కార్యాలయం లోపలకు చొచ్చుకు వెళ్ళటానికి ప్రయత్నించగా బారీ స్థాయిలో మొహరించిన పోలీసులు అడ్డుకోవటంతో తోపులాట జరిగింది. అతి కష్టంమీద పోలీసులు కార్మికులను నియంత్రించారు. దీంతో కలెక్టర్ కార్యాలయం ఎదుట కార్మికులు, నాయకులు బైటాయించి రాస్తారోకో చేశారు. పారిశుద్ధ్య కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, సమస్యలు పరిష్కరించాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈస్ట్ డీఎస్పీ సంతోష్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement