ఉపాయాలు ఊరకే రావు. గట్టిగా ఆలోచిస్తేనే వస్తాయి. ఈ నలుగురు కుర్రాళ్లు అలాగే ఆలోచించారు. శానిటేషన్, హెల్త్‌కేర్, కెమికల్ ఇండస్ట్రీ, ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్‌లకు ఉపయోగపడే రోబోటిక్స్‌కు రూపకల్పన చేశారు. శాస్త్రానికి సామాజిక ధర్మం జోడించి ‘జెన్ రోబోటిక్స్’తో ఘన విజయం సాధించారు..
సెప్టిక్ ట్యాంకులు శుభ్రం చేసే క్రమంలో ఎంతోమంది అమాయకులు బలైతున్నారు. ప్రకటిత గణాంకాల కంటే మృతుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని సఫాయి కర్మాచారి ఆందోళన (ఎస్‌కేఎ) అనే స్వచ్ఛంద సంస్థ చెబుతోంది. మాన్యువల్ స్కావేంజింగ్‌ను నిషేధించాలని ఆ సంస్థ డిమాండ్ చేస్తుంది. కేరళలో ముగ్గురు స్కావెంజర్లు చనిపోయిన విషాదం ఇంజనీరింగ్ చేస్తున్న అరుణ్ జార్జ్, నిఖిల్ ఎన్‌పీ, రషీద్ కె, విమల్ గోవింద్ ఎంకేలను బాగా కదిలించింది.
‘ఈ సమస్యకు పరిష్కారం కనుక్కోవాలి’ అని గట్టిగా అనుకున్నారు. మలప్పురం(కేరళ) జిల్లాలోని కుట్టిపురం ఎంఈఎస్ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకునే రోజుల్లో ‘రోబోటిక్ స్కావెంజర్’ ఆలోచన చేశారు. మొదట కాలేజీ ప్రాజెక్ట్‌గా ఆ ఆలోచనను పట్టాలెక్కించారు. చదువులు పూర్తైతే ఉద్యోగాల కోసం కార్పొరేట్ ప్రపంచంలోకి అడుగు పెట్టాక కూడా వారిని ‘రోబోటిక్ స్కావెంజర్’ ఆలోచన వదల్లేదు. దీంతో ఉద్యోగాలు వదులు కొని ‘జెన్ రోబోటిక్స్’ అనే స్టార్టప్ మొదలుపెట్టారు.
రోబోటిక్ స్కావెంజర్ ‘బ్యాండికూట్’తో ఈ స్టార్టప్ ప్రస్థానం మొదలైంది. 50 కిలోల బరువు ఉండే ‘బ్యాండికూట్’ రిమోట్–కంట్రోల్డ్ రోబోట్. 360 డిగ్రీల మోషన్స్‌లో పనిచేస్తుంది. సింగిల్ షిఫ్ట్‌లో పది నుంచి పన్నెండు మురుగు కాలువలను శుభ్రపరుస్తుంది. ఒక్కొక్క మురుగు కాలువను, మ్యాన్‌హోల్‌ను శుభ్రం చేయడానికి 30 నుంచి 40 నిమిషాల సమయం పడుతుంది.
స్కై స్క్రాపర్స్‌కు సంబంధించిన గ్లాస్ ఫేసాడ్‌లను శుభ్రం చేసే ‘జీ–బిటల్’ రోబోట్ కూడా మెగా హిట్ అయింది. ఇక ‘వెల్‌బోర్’ అనేది ఆయిల్ అండ్ గ్యాస్, కెమికల్ ఇండస్ట్రీలకు సంబంధించిన పెద్ద ట్యాంకులను శుభ్రపరుస్తుంది. ‘బ్యాండికూట్’తో మొదలైన జెన్ రోబోటిక్స్ ప్రయాణం హెల్త్‌కేర్, కెమికల్ ఇండస్ట్రీ, ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్... మొదలైన వాటికి విస్తరించింది. ‘శానిటేషన్‌కు సంబంధించి పరిష్కరించుకోవాల్సిన పెద్ద సమస్యలు ఎన్నో ఉన్నాయి. వాటిపై దృష్టి పెడుతున్నాం’ అంటున్నాడు కో–ఫౌండర్స్‌లో ఒకరైన విమల్. ‘మరి ఈ యంత్రాల వల్ల కార్మికుల ఉపాధి దెబ్బతింటుంది కదా?’ అనే సందేహం అందరికీ వస్తుంది.దీన్ని దృష్టిలో పెట్టుకొని కార్మికులు సులభంగా ఆపరేట్ చేసేలా ఈ యంత్రాలను రూపొందించారు. మూడు వేల మందికి పైగా కార్మికులు ఈ యంత్రాల ద్వారా ఉపాధి పొందుతున్నారు.
పారిశుద్ధ్య పనుల్లో మార్పు తీసుకురావడానికి సేఫ్టీ అండ్ డిగ్నిటీ నినాదంతో సాంకేతికతను ఉపయోగించుకుంటున్నాం. పారిశుద్ధ్య కార్మికులకు ఉపయోగపడే కొత్త ఆవిష్కరణలు చేయాలనుకుంటాం’ అంటున్నాడు ఫౌండర్స్‌లో ఒకరైన విమల్ గోవింద్. తిరువనంతపురం కేంద్రంగా మొదలైన ‘జెన్ రోబోటిక్స్’ పదిహేడు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పనిచేస్తోంది. బ్రిటన్, ఇండోనేషియ, మలేషియాలతో ఇటు ఆఫ్రికన్ దేశాలకు విస్తరించింది. ‘ఈ యువ బృందం ప్యాషన్, సామాజిక దృష్టి మమ్మల్ని ఆకట్టుకుంది’ అంటున్నాడు ‘జెన్ రోబోటిక్స్’ ఇన్వెస్టర్ ‘యూనికార్న్ ఇండియా వెంచర్స్’ ఫౌండర్, మెనేజింగ్ పాట్నర్ అనీల్ జోషి.
Comments
Please login to add a commentAdd a comment