పాఠశాల గదిలో ఏర్పాటు చేసిన తాటిపల్లి పంచాయతీ కార్యాలయం
స్వపరిపాలనలో గ్రామాలను ఎంతో అభివృద్ధి చేసుకుంటామని కలలుగన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పడటంతో గ్రామాలకు మరో స్వాతంత్య్రం వచ్చినట్లయింది. పంచాయతీ హోదాతో పాటు సమస్యలు నెరవేరుతాయని, సొంత భవనాల నిర్మాణం \జరుగుతుందని ఆశపడ్డారు. పంచాయతీ హోదావచ్చి ఏడాది కావస్తున్నా కనీస సౌకర్యాల కల్పనకు నోచుకోవడం లేదు. సమస్యలకు తోడు ఇన్‌చార్జి కార్యదర్శులతో పాలన అస్తవ్యస్తంగా మారింది.
రేగోడ్(మెదక్): మండలంలో గతంలో 12 పంచాయతీలు ఉండేవి. గతేడాది పెద్దతండా, సంగమేశ్వర తండా, తిమ్మాపూర్, వెంకటాపూర్, పోచారం, తాటిపల్లి గ్రామాలకు పంచాయతీలుగా హోదా దక్కడంతో మొత్తంగా పంచాయతీల సంఖ్య 18కి చేరింది. స్వరాష్ట్రంలో సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని భావించిన ప్రజలకు నిరాశే మిగులుతోంది. కనీస సౌకర్యాలు లేక ఇబ్బందుల పాలవుతున్నారు.
ఐదు వందల జనాభా కలిగిన గ్రామాలు, తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేసినా పంచాయతీలకు సొంత భవనాలు ఇప్పటి వరకూ నిర్మించలేదు. అంగన్‌వాడీ పాఠశాలల భవనాలు, ప్రభుత్వ పాఠశాలల భవనాల్లో పంచాయతీ కార్యాలయాలను కొనసాగిస్తున్నారు. నామమాత్ర ఫర్నిచర్‌ను ఏర్పాటు చేసినా సమావేశాలకు స్థలం సరిపోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. పంచాయతీలను ఏర్పాటు చేసి సుమారు ఏడాది కావస్తున్నా.. భవన నిర్మాణాలకు నిధులు మంజూరు చేయకపోవడం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ఇన్‌చార్జి కార్యదర్శులే దిక్కు..
పంచాయతీకి ఒక గ్రామ కార్యదర్శి ఉండాలి. కానీ ఇక్కడ 18 గ్రామ పంచాయతీలకు నలుగురు మాత్రమే కార్యదర్శులు పని చేస్తున్నారు. ఇద్దరు కార్యదర్శులకు ఐదు చొప్పున పంచాయతీలు, మరో ఇద్దరు కార్యదర్శులకు నాలుగు చొప్పున పంచాయతీలకు ఇన్‌చార్జిలుగా వ్యవహరిస్తున్నారు. ఇన్‌చార్జి బాధ్యతలతో కార్యదర్శులకు భారంగా మారింది. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో విఫలమవుతున్నారనే విమర్శలు ఉన్నాయి.
ఏ గ్రామ కార్యదర్శి ఏ గ్రామంలో ఉంటున్నారనే విషయం తెలియక అధికారులు, ప్రజలు సతమతమవుతున్నారు. దీంతో పారిశుధ్య నిర్వహణ గ్రామాల్లో అస్తవ్యస్తంగా మారింది. అపరిశుభ్రత కారణంగా ఇటీవల సంగమేశ్వర తండాలో ఇంటింటికీ జ్వరాలు వచ్చిన విషయం తెలిసిందే. గ్రామ పంచాయతీలకు లక్షలాది రూపాయల నిధులను ప్రభుత్వం మంజూరు చేస్తున్నా సమస్యల పరిష్కారం నోచుకోక, పారిశుధ్యం కానరక ప్రజలు అవస్థలు పడుతున్నారు. సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
నిధులు మంజూరు చేయాలి
మా తండాను మేమే పరిపాలించుకునే విధంగా సీఎం కేసీఆర్ కృషి చేయడం ఆనందంగా ఉంది. పంచాయతీ ఏర్పడినా సొంత పంచాయతీ భవనం నిర్మాణం కాలేదు. పంచాయతీలో సమస్యలు వెక్కిరిస్తున్నాయి. నిధులు మంజూరు చేసి సమస్యలను తొలగించాలి. –సంతోష్ చౌహాన్, సంగమేశ్వర తండా
వెంటనే బదిలీలు చేపట్టాలి
జిల్లాలో సుమారు పదేళ్లకు పైగా ఒకే మండలంలో పనిచేస్తున్న కార్యదర్శులు ఉన్నారు. వారందరికీ బదిలీలు చేయాలి. ఒక్కో కార్యదర్శికి ఐదారు పంచాయతీలు ఉండటంతో పని ఒత్తిడికి గురై మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతీ పంచాయతీకి కార్యదర్శులను నియమించి సమస్యలను పరిష్కరించాలి. –పంచాయతీ కార్యదర్శిల అసోసియేషన్ జిల్లా కోశాధికారి
Comments
Please login to add a commentAdd a comment