ఖర్చు లేకుండా సర్పంచ్‌లయ్యారు | Etela Rajender Comments On Gram Panchayat Sarpanch Karimnagar | Sakshi
Sakshi News home page

ఖర్చు లేకుండా సర్పంచ్‌లయ్యారు

Published Wed, Aug 22 2018 12:17 PM | Last Updated on Wed, Aug 22 2018 12:17 PM

Etela Rajender Comments On Gram Panchayat Sarpanch Karimnagar - Sakshi

సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి మహేందర్‌రెడ్డి.

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: ఎందరో ప్రభుత్వ ఉన్నతోద్యోగులు కూడా పదవీ విరమణ తర్వాత ప్రజాప్రతినిధి కావాలని కోరుకుంటున్నారని, అలాంటిది గ్రామాల స్పెషల్‌ ఆఫీసర్లకు రూపాయి ఖర్చు లేకుండా సర్పంచ్‌ పదవి వరించిందని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. సర్పంచులుగా వ్యవహరించే అధికారం రావడం అధికారులకు ఇది గొప్ప అవకాశమని, ఇలాంటి అవకాశాలు అందరికీ రాదని అన్నారు. గ్రామాల స్పెషల్‌ ఆఫీసర్ల బాధ్యత గొప్ప కర్తవ్యంగా భావించి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. మంగళవారం కరీంనగర్‌ కలెక్టరేట్‌ ఆడిటోరియంలో గ్రామాల స్పెషల్‌ ఆఫీసర్లు, పంచాయతీ కార్యదర్శులు, మెడికల్‌ ఆఫీసర్లతో మంత్రి రాజేందర్‌ పారిశుధ్యం–ప్రజారోగ్యంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో అన్ని గ్రామాలలో విషజ్వరాలు ప్రబలుతున్నాయని, వాటిని నియంత్రించేందుకు పకడ్బందీగా పారిశుధ్య చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

వర్షాకాలంలో గ్రామాలలో డెంగ్యూ, మలేరియా విషజ్వరాలు, అంటువ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని  నిధులకు కొరత లేదని గ్రామాలలో మొదటిగా సమస్యను గుర్తించి పరిష్కారానికి చర్యలు గైకొనాలని అన్నారు. గ్రామాల పారిశుధ్యం, అభివృద్ధి పనుల్లో ప్రజలను భాగస్వామ్యులను చేయాలని.. అప్పుడే అనుకున్న ఫలితాలు సాధ్యమవుతాయని పేర్కొన్నారు. గ్రామాలలో చదువుకున్న యువతను గుర్తించి వారి సెల్‌ నెంబర్లు సేకరించి సమస్యలపై రోజూ మాట్లాడాలని మంత్రి సూచించారు. పనుల నిర్వహణలో ప్రజల సలహాలు, సూచనలు తీసుకోవాలని.. సమస్యలను ధర్మబద్ధంగా పరిష్కరించాలని అన్నారు. ఏళ్లుగా పూర్తికాని ప్రాజెక్టులను ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో రెండేళ్లలో పూర్తి చేసి అనుసంధానం చేసుకున్నామని అన్నారు.

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం రూ.600 కోట్లు మంజూరు చేసిందని, ప్రతీ నియోజకవర్గానికి రూ.70–80 కోట్లు వచ్చాయని మంత్రి తెలిపారు. గ్రామాలలో ప్రజలు ఇబ్బందులు పడకుండా ఎన్ని నిధులైనా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. పెద్ద గ్రామాలకు, మండలాల్లో దోమల నివారణకు ఫాగింగ్‌ మిషన్లు కొనుగోలు చేసి అందజేస్తామని తెలిపారు. స్పెషల్‌ ఆఫీసర్లు బాధ్యతాయుతంగా పనులు నిర్వహించాలని అన్నారు. జిల్లా పంచాయతీ అధికారి ప్రతిరోజూ గ్రామాలలో పారిశుధ్య చర్యలను పర్యవేక్షించాలని అధికారులకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.

సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించాలి
గ్రామాల స్పెషల్‌ ఆఫీసర్లు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ తుల ఉమ అన్నారు. ప్రజల భాగస్వామ్యంతో గ్రామాల అభివృద్ధికి ప్రజలతో కలిసి పనిచేయాలని అన్నారు. గ్రామాలలో పరిసరాల పరిశుభ్రతపై ప్రజలను చైతన్యవంతులను చేయాలని సూచించారు. జిల్లాలో అన్ని గ్రామ పంచాయతీల స్పెషల్‌ ఆఫీసర్లు సంబంధిత అధికారులతో కలిసి వాట్సాప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పనుల వివరాలను ఎప్పటికప్పుడు ఆ గ్రూప్‌లో షేర్‌ చేసుకోవాలని అన్నారు.

 
యుద్ధప్రాతిదికన మరుగుదొడ్లు.. లీకేజీలను నివారించండి
జిల్లాలో టాయిలెట్లు లేని అన్ని పాఠశాలలకు, అంగన్‌వాడీ కేంద్రాలకు కొత్తగా టాయిలెట్‌లను మంజూరు చేశామని వాటిని వెంటనే పూర్తి చేయించాలని కలెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ అధికారులను ఆదేశించారు. మరమ్మతులున్న టాయిలెట్లను గ్రామపంచాయతీ నిధులతో వెంటనే పూర్తి చేయించాలని ఆదేశించారు. శిథిలావస్థలో ఉన్న తరగతి గదులను, టాయిలెట్లను వెంటనే స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీల ద్వారా వారం రోజుల్లో పూడ్చివేయాలని ఆదేశించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని.. రోడ్లపై నీరు నిలువ ఉండకుండా చూడాలని ఆదేశించారు. క్లోరినేషన్‌ చేసిన తాగునీటినే సరఫరా చేయాలని, పైపులైన్ల లీకేజీలను అరికట్టాలని ఆదేశించారు. గ్రామాలలో అపరిశుభ్ర పరిసరాలతో అంటువ్యాధులు, జ్వరాలు సోకితే సంబంధిత గ్రామపంచాయతీ కార్యదర్శిని సస్పెండ్‌ చేస్తామని కలెక్టర్‌ హెచ్చరించారు. ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు మాట్లాడుతూ.. గ్రామాల ప్రత్యేక అధికారులు చిత్తశుద్ధితో పనులు చేసి కరీంనగర్‌ జిల్లాను వ్యాధుల రహిత జిల్లాగా మార్చాలని అన్నారు.

ప్రజల్లో పారిశుధ్యంపై, హరితహారంపై చైతన్యం తేవాలని సూచించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ.. 2010లో జిల్లాలో డెంగ్యూతో ఎక్కువ మంది చనిపోయారని పేర్కొన్నారు. గ్రామాలలో పారిశుధ్య కార్మికుల సమ్మెతో పరిశుభ్రత లోపించిందని తెలిపారు. అన్ని గ్రామాలకు వెంటనే మెడికల్‌ బృందాలను పంపించాలని కోరారు. కరీంనగర్‌ నియోజకవర్గంలో ఆరు గ్రామాలకు లేరని, ఆ గ్రామాలకు అధికారులను నియమించి పారిశుధ్య చర్యలు చేపట్టాలని కోరారు. చొప్పదండి ఎమ్మెల్యే బొడిగె శోభ మాట్లాడుతూ.. అన్ని గ్రామాలలో వెంటనే గ్రామ సభలు నిర్వహించి సమస్యలను తెలుసుకోవాలని అన్నారు. ప్రత్యేకాధికారుల బాధ్యతను భారంగా కాకుండా బాధ్యతగా భావించాలన్నారు.

మానకొండూర్‌ ఎమ్మెల్యే, సాంస్కృతిక సారథి రసమయి బాలకిషన్‌ మాట్లాడుతూ.. స్పెషల్‌ ఆఫీసర్లు పాత సర్పంచుల సహకారంతో పనులు చేయాలని అన్నారు. సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి నారాయణరావు, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ సుజాత, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్‌ వెంకటేశ్వర్‌రావు, రెవెన్యూ డివిజనల్‌ అధికారి రాజాగౌడ్, జిల్లా పరిషత్‌ శిక్షణా మేనేజర్‌ సురేందర్, మండల అభివృద్ధి అధికారులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మెడికల్‌ ఆఫీసర్లు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

సమావేశానికి హాజరైన ప్రత్యేక అధికారులు, కార్యదర్శులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement