Etla Rajendar
-
ఖర్చు లేకుండా సర్పంచ్‌లయ్యారు
సాక్షిప్రతినిధి, కరీంనగర్: ఎందరో ప్రభుత్వ ఉన్నతోద్యోగులు కూడా పదవీ విరమణ తర్వాత ప్రజాప్రతినిధి కావాలని కోరుకుంటున్నారని, అలాంటిది గ్రామాల స్పెషల్ ఆఫీసర్లకు రూపాయి ఖర్చు లేకుండా సర్పంచ్ పదవి వరించిందని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. సర్పంచులుగా వ్యవహరించే అధికారం రావడం అధికారులకు ఇది గొప్ప అవకాశమని, ఇలాంటి అవకాశాలు అందరికీ రాదని అన్నారు. గ్రామాల స్పెషల్ ఆఫీసర్ల బాధ్యత గొప్ప కర్తవ్యంగా భావించి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. మంగళవారం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో గ్రామాల స్పెషల్ ఆఫీసర్లు, పంచాయతీ కార్యదర్శులు, మెడికల్ ఆఫీసర్లతో మంత్రి రాజేందర్ పారిశుధ్యం–ప్రజారోగ్యంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో అన్ని గ్రామాలలో విషజ్వరాలు ప్రబలుతున్నాయని, వాటిని నియంత్రించేందుకు పకడ్బందీగా పారిశుధ్య చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వర్షాకాలంలో గ్రామాలలో డెంగ్యూ, మలేరియా విషజ్వరాలు, అంటువ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని నిధులకు కొరత లేదని గ్రామాలలో మొదటిగా సమస్యను గుర్తించి పరిష్కారానికి చర్యలు గైకొనాలని అన్నారు. గ్రామాల పారిశుధ్యం, అభివృద్ధి పనుల్లో ప్రజలను భాగస్వామ్యులను చేయాలని.. అప్పుడే అనుకున్న ఫలితాలు సాధ్యమవుతాయని పేర్కొన్నారు. గ్రామాలలో చదువుకున్న యువతను గుర్తించి వారి సెల్ నెంబర్లు సేకరించి సమస్యలపై రోజూ మాట్లాడాలని మంత్రి సూచించారు. పనుల నిర్వహణలో ప్రజల సలహాలు, సూచనలు తీసుకోవాలని.. సమస్యలను ధర్మబద్ధంగా పరిష్కరించాలని అన్నారు. ఏళ్లుగా పూర్తికాని ప్రాజెక్టులను ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండేళ్లలో పూర్తి చేసి అనుసంధానం చేసుకున్నామని అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం రూ.600 కోట్లు మంజూరు చేసిందని, ప్రతీ నియోజకవర్గానికి రూ.70–80 కోట్లు వచ్చాయని మంత్రి తెలిపారు. గ్రామాలలో ప్రజలు ఇబ్బందులు పడకుండా ఎన్ని నిధులైనా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. పెద్ద గ్రామాలకు, మండలాల్లో దోమల నివారణకు ఫాగింగ్ మిషన్లు కొనుగోలు చేసి అందజేస్తామని తెలిపారు. స్పెషల్ ఆఫీసర్లు బాధ్యతాయుతంగా పనులు నిర్వహించాలని అన్నారు. జిల్లా పంచాయతీ అధికారి ప్రతిరోజూ గ్రామాలలో పారిశుధ్య చర్యలను పర్యవేక్షించాలని అధికారులకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించాలి గ్రామాల స్పెషల్ ఆఫీసర్లు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ తుల ఉమ అన్నారు. ప్రజల భాగస్వామ్యంతో గ్రామాల అభివృద్ధికి ప్రజలతో కలిసి పనిచేయాలని అన్నారు. గ్రామాలలో పరిసరాల పరిశుభ్రతపై ప్రజలను చైతన్యవంతులను చేయాలని సూచించారు. జిల్లాలో అన్ని గ్రామ పంచాయతీల స్పెషల్ ఆఫీసర్లు సంబంధిత అధికారులతో కలిసి వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పనుల వివరాలను ఎప్పటికప్పుడు ఆ గ్రూప్‌లో షేర్ చేసుకోవాలని అన్నారు. యుద్ధప్రాతిదికన మరుగుదొడ్లు.. లీకేజీలను నివారించండి జిల్లాలో టాయిలెట్లు లేని అన్ని పాఠశాలలకు, అంగన్వాడీ కేంద్రాలకు కొత్తగా టాయిలెట్లను మంజూరు చేశామని వాటిని వెంటనే పూర్తి చేయించాలని కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ అధికారులను ఆదేశించారు. మరమ్మతులున్న టాయిలెట్లను గ్రామపంచాయతీ నిధులతో వెంటనే పూర్తి చేయించాలని ఆదేశించారు. శిథిలావస్థలో ఉన్న తరగతి గదులను, టాయిలెట్లను వెంటనే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల ద్వారా వారం రోజుల్లో పూడ్చివేయాలని ఆదేశించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని.. రోడ్లపై నీరు నిలువ ఉండకుండా చూడాలని ఆదేశించారు. క్లోరినేషన్ చేసిన తాగునీటినే సరఫరా చేయాలని, పైపులైన్ల లీకేజీలను అరికట్టాలని ఆదేశించారు. గ్రామాలలో అపరిశుభ్ర పరిసరాలతో అంటువ్యాధులు, జ్వరాలు సోకితే సంబంధిత గ్రామపంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు. ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు మాట్లాడుతూ.. గ్రామాల ప్రత్యేక అధికారులు చిత్తశుద్ధితో పనులు చేసి కరీంనగర్ జిల్లాను వ్యాధుల రహిత జిల్లాగా మార్చాలని అన్నారు. ప్రజల్లో పారిశుధ్యంపై, హరితహారంపై చైతన్యం తేవాలని సూచించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. 2010లో జిల్లాలో డెంగ్యూతో ఎక్కువ మంది చనిపోయారని పేర్కొన్నారు. గ్రామాలలో పారిశుధ్య కార్మికుల సమ్మెతో పరిశుభ్రత లోపించిందని తెలిపారు. అన్ని గ్రామాలకు వెంటనే మెడికల్ బృందాలను పంపించాలని కోరారు. కరీంనగర్ నియోజకవర్గంలో ఆరు గ్రామాలకు లేరని, ఆ గ్రామాలకు అధికారులను నియమించి పారిశుధ్య చర్యలు చేపట్టాలని కోరారు. చొప్పదండి ఎమ్మెల్యే బొడిగె శోభ మాట్లాడుతూ.. అన్ని గ్రామాలలో వెంటనే గ్రామ సభలు నిర్వహించి సమస్యలను తెలుసుకోవాలని అన్నారు. ప్రత్యేకాధికారుల బాధ్యతను భారంగా కాకుండా బాధ్యతగా భావించాలన్నారు. మానకొండూర్ ఎమ్మెల్యే, సాంస్కృతిక సారథి రసమయి బాలకిషన్ మాట్లాడుతూ.. స్పెషల్ ఆఫీసర్లు పాత సర్పంచుల సహకారంతో పనులు చేయాలని అన్నారు. సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి నారాయణరావు, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుజాత, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ వెంకటేశ్వర్రావు, రెవెన్యూ డివిజనల్ అధికారి రాజాగౌడ్, జిల్లా పరిషత్ శిక్షణా మేనేజర్ సురేందర్, మండల అభివృద్ధి అధికారులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మెడికల్ ఆఫీసర్లు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. -
హమాలీ చార్జీల పెంపు: ఈటల
సాక్షి, హైదరాబాద్ : పౌర సరఫరాల శాఖలో పని చేస్తున్న హమాలీలకు చార్జీలు పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. సమ్మె చేస్తున్న హమాలీ సంఘాలతో గురువారం మంత్రి ఈటల చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..హమాలీల చార్జీలను గతం కంటే రూ.3 అదనంగా పెంచుతున్నామన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం హమాలీ చార్జీలను క్వింటాలుకు రూ.8 నుంచి రూ.12కు, 2016లో రూ.15కు పెంచిం దని మంత్రి తెలిపారు. ప్రస్తుతం పెరిగిన చార్జీలతో గ్రామీణ ప్రాంతాల్లో క్వింటాలుకు రూ.18, పట్టణ ప్రాంతా ల్లో రూ.18.50 హమాలీలకు అందనుంది. దసరా బోనస్‌ను రూ.4వేల నుంచి 4,500కు, చనిపోయిన కార్మికుని దహన సంస్కారాలకు ఇచ్చే మొత్తాన్ని రూ.10వేల నుంచి రూ.20వేలకు పెంచుతూ మంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం పట్ల హమాలీ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. -
తమిళనాడుకు మన బియ్యం: ఈటల
సాక్షి, హైదరాబాద్: తమిళనాడు ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు మూడు లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని (బాయిల్డ్ రైస్) ఎగుమతి చేసేందుకు నిర్ణయించినట్లు మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. దీనివల్ల రాష్ట్ర పౌరసరఫరాల సంస్థతో పాటు రైతాంగానికి, మిల్లర్లకు ప్రయోజనం కలుగుతుందన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన జారీ చేశారు. 3 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేయడానికి ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అవసరమవుతుందని, ఈ ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు అదనంగా రూ.30 రైతులకు చెల్లించి కొనుగోలు చేయడానికి మిల్లర్లను ఒప్పించామని వెల్లడించారు. -
అభివృద్ధిలో గుణాత్మక మార్పు
సాక్షి, హైదరాబాద్: ‘కొత్త రాష్ట్రమైనా తెలంగాణ సొంతంగా నిలబడింది. అభివృద్ధిలో గుణాత్మక మార్పు సాధించింది’అని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. పేదల కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం ఎంత అవసరమైనా ఖర్చు చేస్తుందని, మార్వాడీ కొట్టులా ఆలోచించదని పేర్కొన్నారు. రజకులు, నాయిబ్రాహ్మణులు, విశ్వకర్మలు, ఇతర బీసీ, ఓబీసీ వర్గాల సంక్షేమం లక్ష్యంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు త్వరలోనే కొత్త పథకాలు ప్రకటిస్తారని వెల్లడించారు. బడ్జెట్‌పై చర్చలో భాగంగా శాసనసభలో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల హృదయాలను గెలుచుకుందని చెప్పారు. వ్యవసాయం, పరిశ్రమలు, విద్య, ఆరోగ్యం, రాష్ట్ర స్థూల ఉత్పత్తి సహా అన్ని రంగాల్లో రాష్ట్రం ప్రగతి సాధించిందని పేర్కొన్నారు. మానవతా విలువలతో పేద వాళ్ల కడుపును దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం పథకాలను అమలు చేస్తోందని చెప్పారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వమే అండగా నిలుస్తోందని, రూ.5 లక్షల బీమా అమలు చేస్తోందని చెప్పారు. ప్రమాదాల్లో మరణించే గొల్ల, కురుమలకు, ముదిరాజ్, బెస్తలకు, కల్లు గీత కార్మికులకు రూ.6 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నట్లు తెలిపారు. ‘కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు భరోసా ఇచ్చింది. నాది తెలంగాణ అని గల్లా ఎగరేసి చెబుతున్నాం. అభివృద్ధిలో గుణాత్మక మార్పు సాధించాం’అని పేర్కొన్నారు. కారం, చింతపండు ఎవరూ తీసుకోవట్లేదు తెల్ల రేషన్ కార్డుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. కేంద్రం అమలు చేస్తున్న ఆహారభద్రత చట్టంతో రాష్ట్రంలోని 1.91 కోట్ల మంది పేదలకు ఒకరికి 5 కిలోల చొప్పున రూ.3కు కిలో చొప్పున బియ్యం ఇస్తోందని చెప్పారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మరింత ముందడుగు వేసి 2.74 కోట్ల మంది పేదలకు రూపాయికి కిలో చొప్పున ఒకరికి 6 కిలోల బియ్యాన్ని ఇస్తోందని చెప్పారు. పసుపు, కారం, చింతపండును ఎవరూ తీసుకోవట్లేదని పేర్కొన్నారు. చక్కెర, వంటనూనెను కేంద్రం నిలిపేసిందని, స్థానికంగా కందుల లభ్యత ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం కంది పప్పు సరఫరాను ఆపేసిందని చెప్పారు. పారిశ్రామిక పురోగతి కరెంటు లేక కార్మికులు, పరిశ్రమల యజమానులు గతంలో ఇందిరాపార్కు వద్ద ధర్నా చేశారని గుర్తు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిరంతర కరెంటు సరఫరా, ప్రోత్సాహకాలు వంటి నిర్ణయాలతో పారిశ్రామిక రంగంలో అద్భుత పురోగతి నమోదవుతోందని చెప్పారు. పేద విద్యార్థుల కడుపు నిండా అన్నం పెట్టాలనే లక్ష్యంతో మెస్ చార్జీలను పెంచినట్లు చెప్పారు. లక్ష ఉద్యోగాల భర్తీ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు. ఇప్పటికే 27,588 పోస్టులను భర్తీ చేశామని, ఈ ఏడాదిలో మిగిలిన పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు. బడ్జెట్ పుస్తకాలు ముద్రించాక పిలిచారు రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం పురోగతి సాధ్యమవుతుందని ఈట ల అన్నారు. కేంద్ర బడ్జెట్ పుస్తకాల ము ద్రణ పూర్తయ్యాక కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశం నిర్వహించి, అభివృద్ధికి సూచనలు ఇవ్వాలని కోరారని చెప్పారు. రూ.40 వేల కోట్లతో తాగునీటిని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే కేంద్రం ఇవ్వాల్సిన రూ.10 వేల కోట్ల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధి నిధులను రూ.50 లక్షల నుంచి రూ.3 కోట్లకు పెంచిన సీఎం కేసీఆర్‌ను భోళాశంకరుడు అని జి.కిషన్‌రెడ్డి ప్రశంసిచినట్లు పేర్కొన్నారు. -
ప్రజల ముద్ర లేని బడ్జెట్: ఈటల
సాక్షి, హైదరాబాద్: కేంద్ర బడ్జెట్‌పై ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్లో ప్రజల ముద్ర లేదని ఆయన అభిప్రాయపడ్డారు. గురువారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ, బడ్జెట్లో తెలంగాణకు నిధులేమీ ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ, భగీరథకు దాదాపు రూ.40 వేల కోట్లివ్వాలని తాము అడిగామని, కానీ ఇచ్చిందేమీ లేదన్నారు. దేశంలో తెలంగాణ అంతర్భాగమే కదా అని ప్రశ్నించారు. ప్రగతిశీల నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్తున్న రాష్ట్రాలకు సాయం అందించాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉందని పేర్కొన్నారు. వ్యవసాయం, వైద్యం, విద్యపై కేంద్రం దృష్టి పెట్టినట్లు కనపించినా, ప్రజల హృదయాల్లో ముద్ర వేయలేకపోయిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న పథకాలకు బడ్జెట్ ఊతమిచ్చేలా ఉన్నప్పటికీ నిధుల కేటాయింపులో నిబద్ధత పాటించి ఉంటే బాగుండేదన్నారు. ఆరోగ్య బీమా పథకానికి అరకొర నిధులు కాకుండా సంపూర్ణంగా కేటాయింపులుండాలని అన్నారు. -
‘తెలుగు’ విందు.. భలే పసందు!
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం చేసిన భోజన ఏర్పాట్లు అతిథులను, ఆహ్వానితులను విశే షంగా ఆకట్టుకున్నాయి. 5 రోజుల పాటు జరిగే ఈ సభలకు పౌరసరఫరాల శాఖ భోజన ఏర్పాట్లు చేసింది. అతిథులకు ఏ ఇబ్బంది లేకుండా సమ యానికి భోజనాలను ఏర్పాటు చేసింది. శనివారం మహా సభలు జరిగిన ఎల్బీ స్టేడియం, రవీంద్రభారతి, తెలుగు విశ్వవిద్యాలయం, లలితా కళాతోరణంలో భోజన ఏర్పా ట్లను మంత్రి ఈటల రాజేందర్, సీఎస్ ఎస్పీ సింగ్, కమిషనర్ సీవీ ఆనంద్ స్వయంగా పర్యవేక్షించారు. అతిథులతో కలసి భోజనం చేశారు. వేదికలో ‘ఈరోజు భోజనం’ అంటూ పెద్ద అక్షరాలతో డిస్ప్లే బోర్డుపై ప్రత్యేకంగా ప్రదర్శించడంతో చాలామంది అతిథులు ఆ బోర్డు పక్కన సెల్ఫీలు దిగడం కనిపించింది. వంటకాలు ఇవీ.. వెజ్ బిర్యానీ, పట్టువడియాల పులుసు, వంకాయ బగారా, బెండకాయ ఫ్రై, పాలకూర పప్పు, చింతకాయ, పండుమిర్చి చట్నీ, దొండకాయ పచ్చడి, పచ్చిపులుసు, టమాటా రసం, చింతపండు పులిహోర, గాజర్ కా హల్వా, డ్రైఫ్రూట్ సలాడ్, పిండి వంటలు, స్పెషల్ పనీర్ బటర్ మసాలా శనివారం వడ్డించారు. -
బీసీలంతా మనవైపే చూస్తున్నారు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా బీసీల అభ్యున్నతి, సంక్షేమం కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలు, తీసుకోవాల్సిన నిర్ణయాలపై బీసీ ప్రజా ప్రతినిధులు రెండో రోజూ మేధోమథనం చేశారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు అసెంబ్లీ కమిటీ హాలులో ఈ సమావేశం జరిగింది. అనంతరం ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, మంత్రి జోగు రామన్న రెండో రోజు సమావేశ వివరాలను మీడియాకు వివరించారు. రాష్ట్ర జనాభాలో 52 శాతం మేరకు ఉన్న బీసీలంతా ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారోనని ఆశగా ఎదురు చూస్తున్నారని ఈటల రాజేందర్ అన్నారు. బీసీలకు ప్రత్యేక పారిశ్రామిక విధానం దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లు గడిచినా చాలా మంది బతుకులు సమస్యల్లో కునారిల్లుతున్నాయన్నారు. ఎవరి కాళ్ళ మీద వారు బతకడానికి విద్య ముఖ్యమని, అందుకే ఒక్కో విద్యార్థిపై రూ.1.20 లక్షలు ఖర్చు పెడుతూ 119 రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించామని ఈటల చెప్పారు. అలాగే సివిల్స్, గ్రూప్ 1 పరీక్షలు రాసే బీసీ అభ్యర్థులకోసం ప్రైవేట్ శిక్షణ సంస్థలకు దీటుగా శిక్షణ సంస్థను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించామని, బీసీ హాస్టళ్లను అన్ని వసతులతో తీర్చిదిద్దుతామని తెలిపారు. ఇక ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న స్కూళ్లు అన్నింటిలో ఇంటిగ్రేటెడ్ హాస్టళ్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. బీసీలకు ప్రత్యేకంగా పారిశ్రామిక విధానం కూడా తీసుకురావాలని ప్రతిపాదిస్తున్నామన్నారు. ప్రభుత్వ కాంట్రాక్టుల్లో వెనుకబడిన వర్గాలకు చేయూతనివ్వాలని, దళితులకు ఉన్న డిక్కీ మాదిరిగా బీసీలకు బిక్కీ పేరుతో పరిశ్రమలకు ప్రోత్సాహం అందించాలని నిర్ణయించామని అన్నారు. నాయీ బ్రాహ్మణ, రజక కులాల మాదిరిగా, ఎంబీసీ లకు ఆర్థిక పథకాలు రూపొందిస్తామని వెల్ల డించారు. తమ ప్రతిపాదనలపై మంగళ వారం ఉదయం 11 నుంచి 2 గంటల వరకు చర్చించి సీఎంకు నివేదిస్తామని ఈటల చెప్పారు. పార్టీలకు అతీతంగా బీసీల ప్రయోజనాలే లక్ష్యంగా పని చేస్తున్నామని, వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఒక రోజంతా బీసీలపై చర్చ జరుపుతామని ఆయన వెల్లడించారు. సీఎం కేసీఆర్ గొప్ప మనసున్న వ్యక్తి అని, ఆయన బీసీ వర్గాలకు దేవుడని మంత్రి జోగు రామన్న అన్నారు. పూర్తి స్వేచ్ఛనిచ్చి చర్చ చేయమని చెప్పారని అన్నారు. చట్ట సభల్లో రిజర్వేషన్ కోసం కూడా ప్రయత్నిస్తామని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జాతీయ స్థాయిలో వీపీ సింగ్ ఎలా ఆదర్శంగా నిలిచారో, సీఎం కేసీఆర్ కూడా అలా నిలిచిపోతారని ఎంపీ బూర నర్సయ్యగౌడ్ పేర్కొన్నారు. అర్థవంతమైన చర్చ లక్ష్మణ్, బీజేపీ ఎమ్మెల్యే బీసీ ప్రజాప్రతినిధుల సమావేశం పలు అంశాలపై అర్థవంతమైన చర్చ జరి పిందని, విద్య, ఉద్యోగాలతో పాటు రాజ కీయాల్లోనూ బీసీలకు తగిన అవకాశాలు దక్కాలన్న అభిప్రాయం వ్యక్తమైందని బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్ చెప్పారు. ర్యాంకు లతో సంబంధం లేకుండా ఫీజు రీయిం బర్స్మెంట్ ఇవ్వాలని, జనాభాకు అను గుణంగా రిజర్వేషన్లు పెరగాలన్నారు. వివిధ పాలక మండళ్లలో 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని సూచించారు. ఫెడరేషన్లపై చర్చించాం ఆర్.కృష్ణయ్య, టీడీపీ ఎమ్మెల్యే ఈ సమావేశంలో విద్యారంగం, వివిధ ఫెడరేషన్లపై చర్చించామని టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య చెప్పారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను బీసీలందరికీ వర్తింపజేయాలని కోరామన్నారు. రాష్ట్రం లో ఉన్న 12 ఫెడరేషన్లకు నిధుల కేటా యించాలని కోరామని చెప్పారు. కొత్తగా ఆరెకటిక, మున్నూరు కాపు సామాజిక వర్గాలకు ఫెడరేషన్ లేదా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నారు. -
‘క్లినికల్’ బాధితులు ఎందరో
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: పేదలు, అమాయకుల ఆర్థిక ఇబ్బందులను ఆసరాగా చేసుకుని విచ్చలవిడిగా జరిగిన ‘ఔషధ ప్రయోగం (క్లినికల్ ట్రయల్స్)’ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. నిబంధనలు, మార్గదర్శకాలను తుంగలో తొక్కి నిర్వహించిన ఔషధ ప్రయోగాల కారణంగా ఇప్పటికే ఇద్దరు మృతి చెందగా.. ఇద్దరు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. తాజాగా కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణానికి చెందిన మరో బాధితుడు యెర్ర దేవీప్రసాద్ వ్యథ వెలుగుచూసింది. హైదరాబాద్‌లోని పలు సంస్థల్లో ఔషధ ప్రయోగాలకు అంగీకరించిన ఆయన.. ఇప్పుడు మానసిక వ్యాధి బారిన పడ్డాడు. తనను ఓ ఏజెంట్ బాలానగర్‌లోని ఓ ల్యాబొరేటరీకి తీసుకెళ్లాడని.. అక్కడ కొన్ని నొప్పులకు సంబంధించిన గోలీల కోసం ప్రయోగం చేస్తామని వారు చెప్పినట్లు దేవీప్రసాద్ పేర్కొన్నాడు. ఇందుకు రూ.6 వేలు ఇస్తామన్నారని, శరీరానికి ఎలాంటి నష్టం ఉండదని చెప్పగా ఒప్పుకున్నట్లు వెల్లడించాడు. ఇలా క్లినికల్ ట్రయల్స్ ఉచ్చులో చిక్కిన దేవీప్రసాద్ హైదరాబాద్‌లోని మియాపూర్‌లోని ఓ రీసెర్చ్ కేంద్రంలో నాలుగేళ్లలో 10 సార్లు ప్రయోగాలకు వెళ్లాడు. గతంలో తార్నాకలోని ఓ ల్యాబ్‌లో ఆరుసార్లు ప్రయోగాలు చేశారని దేవీప్రసాద్ వెల్లడించాడు. చివరగా చర్లపల్లిలోని విమ్టా క్లినికల్ రీసెర్చ్ సెంటర్‌కు వెళ్లగా అక్కడ జరిపిన ఔషధ ప్రయోగాలతో ఆరోగ్యం క్షీణించిందని, మరో ప్రయోగానికి అర్హుడు కాదని తేల్చినట్టు తెలిపాడు. ఇంటికి వచ్చిన తర్వాత అనారోగ్యానికి గురవడంతో అతడిని తల్లిదండ్రులు వరంగల్‌లోని ఎంజీఎంకు తీసుకెళ్లారు. దేవీప్రసాద్ మానసిక వ్యాధికి గురయినట్లు వైద్యులు ధ్రువీకరించారని తల్లిదండ్రులు పేర్కొన్నారు. సమగ్ర విచారణకు ఆదేశం హద్దులు దాటిన ఔషధ ప్రయోగం ఘటనలపై ప్రభుత్వం స్పందించింది. మంత్రి ఈటల రాజేందర్ ఈ క్లినికల్ ట్రయల్స్‌పై సమగ్ర విచారణకు ఆదేశించారు. ఇప్పటివరకు వెలుగుచూసిన బాధితులంతా హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన వారే కావడంతో మంత్రి దీన్ని సీరియస్‌గా తీసుకున్నారు. దోషులను శిక్షించాల్సిందేనని ఆదేశించడంతో కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, పోలీసు కమిషనర్ వీబీ కమలాసన్ రెడ్డి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టాలని రెవెన్యూ, పోలీసు అధికారులను ఆదేశించారు. క్లినికల్ ట్రయల్స్‌తో మృతి చెందిన వంగర నాగరాజు, అశోక్‌కుమార్, బోగ సురేశ్‌లపై ఔషధ ప్రయోగం చేసిన లోటస్, విమ్టా తదితర సంస్థలపై పోలీసులు మూడు కేసులు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. -
ఔషధ ప్రయోగం’పై కదిలిన మంత్రి ఈటల
జమ్మికుంట రూరల్(హుజూరాబాద్): ఔషధ ప్రయోగంతో మతిస్థిమితం కోల్పోయిన కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం కొత్తపల్లికి చెందిన అశోక్‌కుమార్‌కు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి ఈటల రాజేందర్ ఆదేశించారు. ఔషధ ప్రయోగంతో తన కొడుకు మతిస్థిమితం కోల్పోయాడని తల్లి కమల పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ఆదేశాల మేరకు బుధవారం తహసీల్దార్ బావ్‌సింగ్ అశోక్ ఇంటికి వెళ్లి వివరాలు సేకరించారు. మంత్రి ఈటల తహసీల్దార్‌తో ఫోన్లో మాట్లాడి అశోక్‌కు మెరుగైన వైద్యం అందించేందుకు నగరంలోని నిమ్స్ కు తరలించాలని ఆదేశించారు. మరోవైపు అశోక్‌ను మొదట స్థానిక వైద్యుల వద్ద పరీక్షించి పరిస్థితిని బట్టి కోర్టు ద్వారా ఆస్పత్రికి తరలిస్తామని పోలీసులు వెల్లడించారు. నాగరాజు మృతిపై విచారణ వేగవంతం ఔషధ ప్రయోగంతో ఆరు నెలల క్రితం చనిపోయిన జమ్మికుంట మండలం బిజిగిరిషరీఫ్ పరిధి నాగంపేటకు చెందిన వంగర నాగరాజు కేసు విచారణను సైతం పోలీసులు వేగవంతం చేశారు. నాగరాజు మృతికి ముందు ఏయే ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకున్నాడనే కోణంలోనూ విచారణ చేపడుతున్నారు. మంగళవారం నాగరాజు కుమారుడితో కలిసి వరంగల్‌లోని పలు ఆస్పత్రుల్లో వివరాలు సేకరించినట్లు తెలిసింది. -
కోళ్ల పరిశ్రమకు భగీరథ నీళ్లు!
సాక్షి, హైదరాబాద్: మిషన్ భగీరథలో 10 శాతం నీటిని పరిశ్రమల కోసం తెలంగాణ ప్రభుత్వం కేటాయించిందని, ముఖ్యమంత్రి తో మాట్లాడి కోళ్ల పరిశ్రమకు కూడా అందేలా చూస్తానని ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేం దర్ హామీ ఇచ్చారు. పౌల్ట్రీ ఇండియా–2017 ప్రదర్శనను బుధవారం ఆయన హైటెక్స్‌లో ప్రారంభించారు. ఈ ప్రదర్శన 24వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ సందర్భంగా జరిగిన సభలో ఈటల మాట్లాడుతూ, కోళ్ల పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందన్నారు. చిన్న రాష్ట్రమే అయినా ఏడాదికి 110 కోట్ల గుడ్లను ప్రభుత్వపరంగా విద్యార్థులు, చిన్న పిల్లలకు, అంగన్వాడీలకు అందిస్తున్నామని తెలిపారు. త్వరలో మధ్యా హ్నం భోజనంలో చికెన్ పెట్టాలని సీఎం యోచిస్తున్నారని చెప్పారు. జీఎస్డీపీలో రూ.10 వేల కోట్లు కోళ్ల పరిశ్రమ నుంచే వస్తున్నట్లు పేర్కొన్నారు. గతంలో ఎండాకాలంలో ఒక్క రోజు కరెంటు పోతే లక్షలాది కోళ్లు చనిపోయేవని, ఇప్పుడు కేసీఆర్ ముందుచూపు వల్ల 24 గంటల విద్యుత్ అందిస్తున్నామని, దీంతో పరిశ్రమలకు ఉపశమ నం లభించింద న్నారు. పౌల్ట్రీని వ్యవసాయ పరిశ్రమ గా పరిగణించాలని కేంద్రాని కి లేఖ రాసిన తొలి రాష్ట్రం తెలం గాణనే అని తెలిపారు. కరెంట్ యూనిట్‌కి రూ.2 సబ్సిడీ ఇచ్చి రైతులకు సీఎం చేయుతని చ్చారన్నారు. నిరుద్యోగులకు ఉపాధి రాష్ట్రాన్ని నిరుద్యోగ సమస్య వేధిస్తున్నదని, చిన్న పరిశ్రమలు గ్రామస్థాయిలో పెట్టిం చడం ద్వారా గ్రామాల్లోని నిరుద్యోగులకు ఉపాధి కల్పించవచ్చని ఈటల అన్నారు. ఐటీ, పరిశ్రమల ద్వారా కేవలం 2–3 శాతం మాత్రమే ఉపాధి లభిస్తుందని, కోళ్ల పరిశ్రమ ద్వారా 1–2 శాతం ఉపాధి లభి స్తుందని చెప్పారు. గుడ్డు ధర పెరిగిందని, సామాన్యుడికి దూరమైందని అంటున్నారే కానీ.. ఈ పరిశ్రమతో అనుబంధం ఉన్న వారి సాధక బాధకాలు కూడా తెలుసు కోవాలని వ్యాఖ్యానించారు. గుడ్డు సాధా రణ ధర 2016–17లో రూ.3.43 ఉంటే, 2017–18లో రూ.3.23 ఉందని చెప్పారు. ఓ చాయ్ రూ.10, ఓ గుట్కా, ఓ సిగరెట్ రూ.10 ఉన్నాయని పేర్కొన్నారు. కోళ్ల పరిశ్రమ కోసం పెడుతున్న పెట్టుబడి, మానవ వనరులు, దాణా, మందుల ఖర్చు ఏ స్థాయిలో పెరిగిందో గుడ్డు ధర ఆ స్థాయిలో పెరగలేదని, కాబట్టి దీనికి ప్రభు త్వాల మద్దతు అవసరమని చెప్పారు. ఈ ప్రదర్శనలో 40 దేశాలకు చెందిన కోళ్ల పరిశ్రమ ప్రతినిధులు పాల్గొన్నారు. 305 స్టాళ్లు ఏర్పాటు చేశారని కోళ్ల సంఘం ప్రతినిధులు తెలిపారు. సేవ పోల్చమ్ లిమిటెడ్ కంపెనీ ‘ట్రాన్స్మూన్ ఐబీడీ’, ‘వెక్టార్మూన్ ఎన్డీ’ వ్యాక్సిన్లను ఆవిష్క రించింది. కార్యక్రమంలో పౌల్ట్రీ బ్రీడర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రంజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఏ పార్టీకైనా కార్యకర్తలే బలం: ఈటల
సాక్షి, హైదరాబాద్: ఏ పార్టీకైనా కింది స్థాయి నాయకులు, కార్యకర్తలే నిజమైన బలమని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో శుక్రవారం మంథని నియోజకవర్గం నుంచి కాంగ్రెస్, టీడీపీలకు చెందిన నాయకులు మంత్రి ఈటల సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. కాటారం జెడ్పీలో కాంగ్రెస్ పార్టీ నేత చల్లా నారాయణరెడ్డి ఆధ్వర్యంలో మాజీ జెడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులతోపాటు టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. వీరందరికి గులాబీ కండువాలు కప్పి మంత్రి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వారిని ఉద్దేశించి ప్రసంగించారు. మంథనిలో టీఆర్ఎస్ మరింత బలపడుతోందన్నారు. అనేక రంగాల్లో తెలంగాణ ముందంజలో ఉందని, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నాయకత్వంలో మూడేళ్లలోనే దేశంలో రాష్ట్రానికి ప్రత్యేక స్థానం దక్కిందన్నారు. పెద్ద పట్టణాలకే కాకుండా రాష్ట్రంలోని గిరిజన గూడాలకు కూడా మంచి నీరు ఇవ్వబోతున్నామని చెప్పారు. రాష్ట్రంలో వేగంగా ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతోందన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే కరెంట్ సమస్యను అధిగమించామని ఈటల చెప్పారు. -
2,500 కోట్ల రెవెన్యూ నష్టం
ఢిల్లీలో మీడియాతో మంత్రి ఈటల ► 35 వస్తువులపై పన్ను తగ్గించాలని కోరినా కేంద్రం స్పందించలేదు ►వ్యాపారుల నుంచి వచ్చే సమస్యలను కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్తాం ► జీఎస్టీ ప్రత్యేక పార్లమెంటు సమావేశాలకు అతిథిగా హాజరు సాక్షి, న్యూఢిల్లీ : వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వల్ల రాష్ట్రం సుమారు రూ. 2,500 కోట్ల మేర రెవెన్యూ కోల్పోనుందని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. తెలంగాణ నుంచి కేంద్రానికి రూ. 8,500 కోట్లు పన్ను రూపంలో వెళ్తే కేంద్రం వాటా నుంచి రాష్ట్రానికి కేవలం రూ. 6 వేల కోట్ల మేర మాత్రమే తిరిగి వస్తుందని, మిగిలిన మొత్తాన్ని కేంద్రం ఎలా భర్తీ చూస్తుందో చూడాల్సి ఉందన్నారు. శుక్రవారం ఢిల్లీలో జీఎస్టీ ప్రత్యేక పార్లమెంటు సమావేశాలకు అతిథిగా హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘అన్ని సమస్యలూ పరిష్కరించాకే జీఎస్టీ అమలు చేస్తే బావుంటుందని మేం ఇదివరకే పలుమార్లు కేంద్రానికి సూచించాం. ఇప్పటివరకు జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశాల్లో 145 వస్తువులపై పన్ను తగ్గించాలని పలు రాష్ట్రాల నుంచి విజ్ఞాపనలు అందాయి. 35 వస్తువులపై పన్ను తగ్గించాలని మేం కూడా కోరాం. అయినా కేంద్రం నుంచి స్పందన లేదు. మిషన్ భగీరథ వంటి సంక్షేమ పథకాలపై కూడా 18 శాతం పన్ను విధించడంపై అభ్యంతరం వ్యక్తం చేశాం. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ వంటి కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే ఉండే బీడీ పరిశ్రమపై సిగరెట్లతో సమానంగా పన్ను విధించడం వల్ల కార్మికుల ఉపాధిపై తీవ్ర ప్రభావం ఉంటుందని చెప్పాం. వస్త్ర, గ్రానైట్ పరిశ్రమలపై కొత్త పన్ను శ్లాబులు భారం కానున్నాయని కేంద్రం దృష్టికి తెచ్చాం. మా డిమాండ్లపై సానుకూల స్పందన రాలేదు. రానున్న రోజుల్లో జీఎస్టీ అమలు సందర్భంగా వ్యాపార వర్గాల నుంచి వచ్చే సమస్యలను కౌన్సిల్ దృష్టికి తెచ్చి పరిష్కారానికి కృషి చేస్తాం. జీఎస్టీ అమలుకు అవసరమైన సాఫ్ట్వేర్, అధికారులకు శిక్షణ, వ్యాపారులకు అవగాహన రావాలంటే 4 నెలలు వేచిచూస్తే బావుంటుందని సూచించాం. జీఎస్టీ అమలు నేపథ్యంలో మా పరిధిలో మేం వీలైనంత సిద్ధంగా ఉంటాం. సమస్యలు ఎదురైతే ఎక్కడికక్కడ ఎలా పరిష్కరించాలో సమీక్షిస్తున్నాం’’ అని ఈటల వివరించారు. కోవింద్‌కు ఈటల శుభాకాంక్షలు ఎన్డీయే తరఫు రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌ను మంత్రి ఈటల రాజేందర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్డీయే తరఫున బరిలో నిలిచినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా, కేంద్ర పౌర సరఫరాలశాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్‌తో సమావేశమైన ఈటల... రాష్ట్రానికి రావాల్సిన బకాయిలను విడుదల చేయాల్సిందిగా కోరారు. ఈ భేటీలో ఎంపీలు జితేందర్‌రెడ్డి, వినోద్ కుమార్, బి.బి.పాటిల్ తదితరులు పాల్గొన్నారు. -
రజక, నాయి బ్రాహ్మణుల ఉపాధి పథకాలకు..
► రూ.500 కోట్లు కేటాయింపు ► మంత్రులు ఈటల, జోగు రామన్న సాక్షి, హైదరాబాద్: రజకులు, నాయిబ్రాహ్మణుల ఉపాధి పథకాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది రూ.500 కోట్లు కేటాయించిందని ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న పేర్కొన్నారు. ఆదివారం సచివాలయంలో రజక, నాయి బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులతో వేరువేరుగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారి సమస్యలను అడిగి తెలుసుకున్న మంత్రులు... వచ్చే నెలలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రగతి భవన్లో ఉపాధి పథకాలను ప్రారంభిస్తామ న్నారు. కులవృత్తులపై ఆధారపడ్డ వర్గాలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటుందన్నారు. రాయితీ రుణ పథకాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఆయా సంఘాలకే అప్పగిస్తున్నట్లు మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఇందుకోసం ఒక్కో సంఘం నుంచి 10 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని, ఎలాంటి సమస్యలొచ్చినా సంఘాలే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.