జమ్మికుంట రూరల్(హుజూరాబాద్): ఔషధ ప్రయోగంతో మతిస్థిమితం కోల్పోయిన కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం కొత్తపల్లికి చెందిన అశోక్‌కుమార్‌కు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి ఈటల రాజేందర్ ఆదేశించారు. ఔషధ ప్రయోగంతో తన కొడుకు మతిస్థిమితం కోల్పోయాడని తల్లి కమల పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ఆదేశాల మేరకు బుధవారం తహసీల్దార్ బావ్‌సింగ్ అశోక్ ఇంటికి వెళ్లి వివరాలు సేకరించారు. మంత్రి ఈటల తహసీల్దార్‌తో ఫోన్లో మాట్లాడి అశోక్‌కు మెరుగైన వైద్యం అందించేందుకు నగరంలోని నిమ్స్ కు తరలించాలని ఆదేశించారు. మరోవైపు అశోక్‌ను మొదట స్థానిక వైద్యుల వద్ద పరీక్షించి పరిస్థితిని బట్టి కోర్టు ద్వారా ఆస్పత్రికి తరలిస్తామని పోలీసులు వెల్లడించారు.
నాగరాజు మృతిపై విచారణ వేగవంతం
ఔషధ ప్రయోగంతో ఆరు నెలల క్రితం చనిపోయిన జమ్మికుంట మండలం బిజిగిరిషరీఫ్ పరిధి నాగంపేటకు చెందిన వంగర నాగరాజు కేసు విచారణను సైతం పోలీసులు వేగవంతం చేశారు. నాగరాజు మృతికి ముందు ఏయే ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకున్నాడనే కోణంలోనూ విచారణ చేపడుతున్నారు. మంగళవారం నాగరాజు కుమారుడితో కలిసి వరంగల్‌లోని పలు ఆస్పత్రుల్లో వివరాలు సేకరించినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment