2,500 కోట్ల రెవెన్యూ నష్టం | 2,500 crore revenue loss | Sakshi
Sakshi News home page

2,500 కోట్ల రెవెన్యూ నష్టం

Published Sat, Jul 1 2017 2:05 AM | Last Updated on Tue, Sep 5 2017 2:52 PM

2,500 కోట్ల రెవెన్యూ నష్టం

2,500 కోట్ల రెవెన్యూ నష్టం

ఢిల్లీలో మీడియాతో మంత్రి ఈటల
► 35 వస్తువులపై పన్ను తగ్గించాలని కోరినా కేంద్రం స్పందించలేదు
►వ్యాపారుల నుంచి వచ్చే సమస్యలను కౌన్సిల్‌ దృష్టికి తీసుకెళ్తాం
► జీఎస్టీ ప్రత్యేక పార్లమెంటు సమావేశాలకు అతిథిగా హాజరు  


సాక్షి, న్యూఢిల్లీ :  వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వల్ల రాష్ట్రం సుమారు రూ. 2,500 కోట్ల మేర రెవెన్యూ కోల్పోనుందని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. తెలంగాణ నుంచి కేంద్రానికి రూ. 8,500 కోట్లు పన్ను రూపంలో వెళ్తే కేంద్రం వాటా నుంచి రాష్ట్రానికి కేవలం రూ. 6 వేల కోట్ల మేర మాత్రమే తిరిగి వస్తుందని, మిగిలిన మొత్తాన్ని కేంద్రం ఎలా భర్తీ చూస్తుందో చూడాల్సి ఉందన్నారు. శుక్రవారం ఢిల్లీలో జీఎస్టీ ప్రత్యేక పార్లమెంటు సమావేశాలకు అతిథిగా హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘అన్ని సమస్యలూ పరిష్కరించాకే జీఎస్టీ అమలు చేస్తే బావుంటుందని మేం ఇదివరకే పలుమార్లు కేంద్రానికి సూచించాం.

ఇప్పటివరకు జరిగిన జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశాల్లో 145 వస్తువులపై పన్ను తగ్గించాలని పలు రాష్ట్రాల నుంచి విజ్ఞాపనలు అందాయి. 35 వస్తువులపై పన్ను తగ్గించాలని మేం కూడా కోరాం. అయినా కేంద్రం నుంచి స్పందన లేదు. మిషన్‌ భగీరథ వంటి సంక్షేమ పథకాలపై కూడా 18 శాతం పన్ను విధించడంపై అభ్యంతరం వ్యక్తం చేశాం. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ వంటి కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే ఉండే బీడీ పరిశ్రమపై సిగరెట్లతో సమానంగా పన్ను విధించడం వల్ల కార్మికుల ఉపాధిపై తీవ్ర ప్రభావం ఉంటుందని చెప్పాం. వస్త్ర, గ్రానైట్‌ పరిశ్రమలపై కొత్త పన్ను శ్లాబులు భారం కానున్నాయని కేంద్రం దృష్టికి తెచ్చాం. మా డిమాండ్లపై సానుకూల స్పందన రాలేదు.

రానున్న రోజుల్లో జీఎస్టీ అమలు సందర్భంగా వ్యాపార వర్గాల నుంచి వచ్చే సమస్యలను కౌన్సిల్‌ దృష్టికి తెచ్చి పరిష్కారానికి కృషి చేస్తాం. జీఎస్టీ అమలుకు అవసరమైన సాఫ్ట్‌వేర్, అధికారులకు శిక్షణ, వ్యాపారులకు అవగాహన రావాలంటే 4 నెలలు వేచిచూస్తే బావుంటుందని సూచించాం. జీఎస్టీ అమలు నేపథ్యంలో మా పరిధిలో మేం వీలైనంత సిద్ధంగా ఉంటాం. సమస్యలు ఎదురైతే ఎక్కడికక్కడ ఎలా పరిష్కరించాలో సమీక్షిస్తున్నాం’’ అని ఈటల వివరించారు.

కోవింద్‌కు ఈటల శుభాకాంక్షలు
ఎన్డీయే తరఫు రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌ను మంత్రి ఈటల రాజేందర్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్డీయే తరఫున బరిలో నిలిచినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా, కేంద్ర పౌర సరఫరాలశాఖ మంత్రి రాంవిలాస్‌ పాశ్వాన్‌తో సమావేశమైన ఈటల... రాష్ట్రానికి రావాల్సిన బకాయిలను విడుదల చేయాల్సిందిగా కోరారు. ఈ భేటీలో ఎంపీలు జితేందర్‌రెడ్డి, వినోద్‌ కుమార్, బి.బి.పాటిల్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement