► రూ.500 కోట్లు కేటాయింపు
► మంత్రులు ఈటల, జోగు రామన్న
సాక్షి, హైదరాబాద్: రజకులు, నాయిబ్రాహ్మణుల ఉపాధి పథకాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది రూ.500 కోట్లు కేటాయించిందని ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న పేర్కొన్నారు. ఆదివారం సచివాలయంలో రజక, నాయి బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులతో వేరువేరుగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారి సమస్యలను అడిగి తెలుసుకున్న మంత్రులు... వచ్చే నెలలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రగతి భవన్లో ఉపాధి పథకాలను ప్రారంభిస్తామ న్నారు.
కులవృత్తులపై ఆధారపడ్డ వర్గాలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటుందన్నారు. రాయితీ రుణ పథకాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఆయా సంఘాలకే అప్పగిస్తున్నట్లు మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఇందుకోసం ఒక్కో సంఘం నుంచి 10 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని, ఎలాంటి సమస్యలొచ్చినా సంఘాలే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.