బీసీలంతా మనవైపే చూస్తున్నారు | The second day meeting of the BC's public representatives ended | Sakshi
Sakshi News home page

బీసీలంతా మనవైపే చూస్తున్నారు

Published Tue, Dec 5 2017 2:54 AM | Last Updated on Tue, Dec 5 2017 2:54 AM

The second day meeting of the BC's public representatives ended - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా బీసీల అభ్యున్నతి, సంక్షేమం కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలు, తీసుకోవాల్సిన నిర్ణయాలపై బీసీ ప్రజా ప్రతినిధులు రెండో రోజూ మేధోమథనం చేశారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు అసెంబ్లీ కమిటీ హాలులో ఈ సమావేశం జరిగింది. అనంతరం ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, మంత్రి జోగు రామన్న రెండో రోజు సమావేశ వివరాలను మీడియాకు వివరించారు. రాష్ట్ర జనాభాలో 52 శాతం మేరకు ఉన్న బీసీలంతా ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారోనని ఆశగా ఎదురు చూస్తున్నారని ఈటల రాజేందర్‌ అన్నారు.

బీసీలకు ప్రత్యేక పారిశ్రామిక విధానం
దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లు గడిచినా చాలా మంది బతుకులు సమస్యల్లో కునారిల్లుతున్నాయన్నారు. ఎవరి కాళ్ళ మీద వారు బతకడానికి విద్య ముఖ్యమని, అందుకే ఒక్కో విద్యార్థిపై రూ.1.20 లక్షలు ఖర్చు పెడుతూ 119 రెసిడెన్షియల్‌ స్కూళ్లను ఏర్పాటు చేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించామని ఈటల చెప్పారు. అలాగే సివిల్స్, గ్రూప్‌ 1 పరీక్షలు రాసే బీసీ అభ్యర్థులకోసం ప్రైవేట్‌ శిక్షణ సంస్థలకు దీటుగా శిక్షణ సంస్థను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించామని, బీసీ హాస్టళ్లను అన్ని వసతులతో తీర్చిదిద్దుతామని తెలిపారు.

ఇక ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న స్కూళ్లు అన్నింటిలో ఇంటిగ్రేటెడ్‌ హాస్టళ్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. బీసీలకు ప్రత్యేకంగా పారిశ్రామిక విధానం కూడా తీసుకురావాలని ప్రతిపాదిస్తున్నామన్నారు. ప్రభుత్వ కాంట్రాక్టుల్లో వెనుకబడిన వర్గాలకు చేయూతనివ్వాలని, దళితులకు ఉన్న డిక్కీ మాదిరిగా బీసీలకు బిక్కీ పేరుతో పరిశ్రమలకు ప్రోత్సాహం అందించాలని నిర్ణయించామని అన్నారు. నాయీ బ్రాహ్మణ, రజక కులాల మాదిరిగా, ఎంబీసీ లకు ఆర్థిక పథకాలు రూపొందిస్తామని వెల్ల డించారు. తమ ప్రతిపాదనలపై మంగళ వారం ఉదయం 11 నుంచి 2 గంటల వరకు చర్చించి సీఎంకు నివేదిస్తామని ఈటల చెప్పారు.

పార్టీలకు అతీతంగా బీసీల ప్రయోజనాలే లక్ష్యంగా పని చేస్తున్నామని, వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఒక రోజంతా బీసీలపై చర్చ జరుపుతామని ఆయన వెల్లడించారు. సీఎం కేసీఆర్‌ గొప్ప మనసున్న వ్యక్తి అని, ఆయన బీసీ వర్గాలకు దేవుడని మంత్రి జోగు రామన్న అన్నారు. పూర్తి స్వేచ్ఛనిచ్చి చర్చ చేయమని చెప్పారని అన్నారు. చట్ట సభల్లో రిజర్వేషన్‌ కోసం కూడా ప్రయత్నిస్తామని ఎమ్మెల్యే శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. జాతీయ స్థాయిలో వీపీ సింగ్‌ ఎలా ఆదర్శంగా నిలిచారో, సీఎం కేసీఆర్‌ కూడా అలా నిలిచిపోతారని ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ పేర్కొన్నారు.


అర్థవంతమైన చర్చ
లక్ష్మణ్, బీజేపీ ఎమ్మెల్యే
బీసీ ప్రజాప్రతినిధుల సమావేశం పలు అంశాలపై అర్థవంతమైన చర్చ జరి పిందని, విద్య, ఉద్యోగాలతో పాటు రాజ కీయాల్లోనూ బీసీలకు తగిన అవకాశాలు దక్కాలన్న అభిప్రాయం వ్యక్తమైందని బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్‌ చెప్పారు. ర్యాంకు లతో సంబంధం లేకుండా ఫీజు రీయిం బర్స్‌మెంట్‌ ఇవ్వాలని, జనాభాకు అను గుణంగా రిజర్వేషన్లు పెరగాలన్నారు. వివిధ పాలక మండళ్లలో 50 శాతం రిజర్వేషన్‌ కల్పించాలని సూచించారు.

ఫెడరేషన్లపై చర్చించాం
ఆర్‌.కృష్ణయ్య, టీడీపీ ఎమ్మెల్యే
ఈ సమావేశంలో విద్యారంగం, వివిధ ఫెడరేషన్లపై చర్చించామని టీడీపీ ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య చెప్పారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను బీసీలందరికీ వర్తింపజేయాలని కోరామన్నారు. రాష్ట్రం లో ఉన్న 12 ఫెడరేషన్లకు నిధుల కేటా యించాలని కోరామని చెప్పారు. కొత్తగా ఆరెకటిక, మున్నూరు కాపు సామాజిక వర్గాలకు ఫెడరేషన్‌ లేదా కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement