revenew drpartment
-
పడిపోయిన భూగర్భజల మట్టం... అప్రమత్తత లేకుంటే ముప్పే
కైలాస్‌నగర్: జిల్లాలో భూగర్భజలాలు రోజురోజుకు అడుగంటుతున్నాయి. గతేడాదితో పోల్చితే నీటిమట్టం గణనీయంగా పడిపోయింది. నాలుగు నెలల వ్యవధిలో 9.93 మీటర్ల లోతుకు చేరడం ఆందోళనకు గురిచేస్తోంది. గతంతో పోలిస్తే ఈ ఏడాది ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటం, యాసంగి సాగుకు ఎక్కువ నీటిని వినియోగించడం, బోరుబావుల తవ్వకాలపై నియంత్రణ లేకపోవడం, జూన్ నెలాఖరుకు చేరినా వర్షాలు కురవకపోవడంతో జలమట్టం పాతాళానికి చేరువవుతోంది. నీటి వినియోగంపై అప్రమత్తత లేకుంటే ముప్పు తప్పదని అధికారులు హెచ్చరిస్తున్నారు. విచ్చలవిడిగా బోరుబావుల తవ్వకం జిల్లాలో బోరుబావుల తవ్వకాలు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. కొందరు వాల్టా నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘించేస్తున్నారు. నిబంధనల ప్రకారం బోరుబావి ఏర్పాటుకు రెవెన్యూ అధికారుల అనుమతి తప్పనిసరి. అలాగే బోరుకు బోరుకు మధ్య 250 మీటర్ల దూరం ఉండాల్సి ఉండాలి. అయితే జిల్లాలో ఈ నిబంధనలు ఏవీ అమలుకు నోచుకోవడం లేదు. కనీసం పది మీటర్ల దూరంలోనే రెండు, మూడేసి బోర్లు ఉండడం గమనార్హం. వీటిని నియంత్రించాల్సిన రెవెన్యూ యంత్రాంగం శ్రీమామూలుశ్రీగా వ్యవహరిస్తున్నాయనే ఆరోపణలున్నాయి. అలాగే ప్రభుత్వం 24గంటల ఉచిత విద్యుత్ అందిస్తుండటంతో వ్యవసాయ క్షేత్రాల్లో నీటి వినియోగం గణనీయంగా పెరిగింది. యాసంగిలో సాగు చేసిన పంటలకు బోరుబావులే ఆధారం కావడంతో జలాల వినియోగం అధికమై లోతుకు చేరడానికి ప్రధాన కారణమవుతుంది. ఇచ్చోడలో అట్టడుగుకు.. ఈ ఏడాది మే నెలలో నమోదైన అధికారిక నీటి మట్టం వివరాలు పరిశీలిస్తే.. ఇచ్చోడలో అత్యధికంగా 25.70 మీటర్లకు పడిపోయింది. అలాగే గుడిహత్నూర్‌లో 18.2 మీటర్లు, జైనథ్‌లో 14.85 మీటర్లు, నేరడిగొండలో 9.90 మీటర్ల లోతుకు చేరాయి. ఈ మండలాల్లో ఏప్రిల్‌లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఇచ్చోడలో ఏకంగా 37.60 మీటర్లకు చేరడం గమనార్హం. అయితే మేలో కురిసిన అకాల వర్షాలతో నీటి మట్టం స్వల్పంగా పెరిగింది. జిల్లాలోని మిగతా మండలాల్లోనూ ఏడు మీటర్ల లోతులో నీటి మట్టాలు ఉన్నాయి. అప్రమత్తత అవసరం నీటి వినియోగంలో ప్రజలు అప్రమత్తత పాటించకుంటే ముప్పు తప్పదని అధికారులు సూచిస్తున్నారు. నీటిని పొదుపుగా వాడుకోవాలి. వర్షపు నీటిని సంరక్షించేలా ఇంకుడుగుంతలు ఏర్పాటు చేసుకోవాలి. వ్యవసాయ క్షేత్రాల్లోనైతే నీటి కుంటలు నిర్మించుకోవాలి. చెక్ డ్యాంల నిర్మాణం ద్వారా కూడా నీటిని సంరక్షించుకున్న వారమవుతాము. ఎక్కువ నీటి వినియోగం ఉన్న పంటలను కాకుండా డ్రిప్, తుంపర్ల సేద్యం ద్వారా సాగయ్యే పంటలపై దృష్టిసారిస్తే నీటి సంరక్షణ సాధ్యమనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. నీటిని పొదుపుగా వాడుకోవాలి జిల్లాలో భూగర్భ జలమట్టం రోజురోజుకు పడిపోతున్నందున నీటిని పొదుపుగా వాడుకోవాలి. లేకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. బోరుబావుల తవ్వకాలు నిబంధనల మేరకు చేపట్టాలి. ముందుగా మీ సేవ ద్వారా రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకోవాలి. వారు పరిశీలించి అనుమతించాకే బోరు ఏర్పాటు చేసుకోవాలి. – ఏ.శ్రీవల్లి, భూగర్భ జలవనరుల శాఖ ఏడీ -
వీఆర్వోలకు కొత్త బాధ్యతలు..
సాక్షి, హైదరాబాద్ : గ్రామ రెవెన్యూ అధికారు (వీఆర్వో)లను రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో వార్డు ఆఫీసర్లుగా నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. కొత్త రెవెన్యూ చట్టం అమల్లో భాగంగా వీఆర్వోల వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న 5,348 మంది వీఆర్వోలు గత కొన్ని నెలలుగా పనిలేకుండా ఖాళీగా ఉంటున్నారు. అవసరాన్ని బట్టి వీఆర్వోలను ఇతర శాఖల్లో విలీనం చేస్తామని, అప్పటివరకు వారికి యథావిధిగా జీతాలు చెల్లిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు వీరిలో 40 శాతం మందిని పురపాలక శాఖలోకి తీసుకోనున్నారు.వార్డుకొకరు చొప్పున: జీహెచ్ఎంసీ మినహా రాష్ట్రంలోని 141 పురపాలికల్లో దాదాపు 2,200 వార్డు ఆఫీసర్ పోస్టులను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తొలుత ప్రత్యక్ష నియామకాల ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం భావించింది. ఈ మేరకు కొత్త పోస్టులు సృష్టించడానికి రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతి కోరుతూ పురపాలక శాఖ ఇటీవల ప్రతిపాదనలు సైతం పంపించింది. అయితే వీఆర్వోలను పురపాలక శాఖలో విలీనం చేసుకుని వార్డు ఆఫీసర్లుగా నియమించాలనే ఆలోచన రావడంతో ప్రత్యక్ష నియామకాల ప్రతిపాదనలను ప్రభుత్వం పక్కనబెట్టింది. వీఆర్వోలను ఇతర శాఖల్లో విలీనం చేసేందుకు అవసరమైన విధివిధానాలను ప్రభుత్వం రూపొందించాల్సి ఉంది. ప్రభుత్వ అవసరాలు, ఖాళీలను బట్టి వారికి నచ్చిన ప్రభుత్వ శాఖలో విలీనం కావడానికి వీఆర్వోల నుంచి ఆప్షన్లను స్వీకరిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఇతర శాఖల్లో వీఆర్వోలను విలీనం చేస్తే 5,348 మందిలో 40 శాతం మంది ఒక్క పురపాలక శాఖకే వస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కొత్త పుర చట్టం అమలుకే... పురపాలనలో సంస్కరణల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త మున్సిపల్ చట్టాన్ని తీసుకొచ్చింది. వార్డు/ డివిజన్ స్థాయిలో ఈ చట్టం అమలు బాధ్యతలను వార్డు ఆఫీసర్లకు అప్పగించబోతోంది. వార్డు కమిటీలతో సమావేశాలు నిర్వహించడం, వార్డు అభివృద్ధి పనుల్లో కౌన్సిలర్లు/ కార్పొరేటర్లతో సమన్వయం చేసుకోవడం, హరితహారం కింద మొక్కలు నాటడం, వాటిని పరిరక్షించడం, పారిశుద్ధ్య నిర్వహణను పర్యవేక్షించడం, అక్రమ నిర్మాణాలపై నిఘా వేయడం, ఆస్తి పన్ను వసూళ్లు తదితర బాధ్యతలను వార్డు ఆఫీసర్లకు ప్రభుత్వం అప్పగించనుంది. ఈ బాధ్యతల నిర్వహణలో నిర్లక్ష్యం వహించినా, లేక కొత్త మున్సిపల్ చట్టం ప్రకారం నాటిన వాటిలో 85 శాతం మొక్కలను పరిరక్షించడంలో విఫలమైనా వార్డు ఆఫీసర్లను బాధ్యులుగా చేయనున్నారు. -
ఇసుక అక్రమార్కులను తప్పక శిక్షిస్తాం
-
రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఓటు గల్లంతు
రాజేంద్రనగర్: పోస్టల్ బ్యాలెట్ ద్వారా తన ఓటును వినియోగించుకునేందుకు వచ్చిన ఓ రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఓటు గల్లంతవడంతో ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు.. రాజేంద్రనగర్ కృష్ణానగర్ హైదర్‌గూడ ప్రాంతానికి చెందిన రామకృష్ణ చేవెళ్ల తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఎన్నికల్లో భాగంగా ఆయనకు విధులను కేటాయించారు. ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న సిబ్బందికి బుధవారం నుంచి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేసింది. రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని కిషన్‌బాగ్ గురునానక్ స్కూల్లో బుధవారం సంబంధించిన కార్యక్రమం జరిగింది. రామకృష్ణ తన ఓటును వినియోగించుకునేందుకు ఓటర్ కార్డు డబ్ల్యూపీకే 2581933తో పోలింగ్ బూత్‌కు చేరుకున్నారు. అక్కడ ఉన్న సిబ్బంది లిస్టులో పరిశీలించి రామకృష్ణ ఓటు లేదని నిర్ధారించారు. దీంతో ఆశ్చర్యానికి గురైన రామకృష్ణ మరోసారి లిస్టు అంతా వెతికినా ఫలితం లేకుండా పోయింది. దీంతో చేసేది లేక వెనుతిరిగాడు. ఒక అధికారి పేరు ఓటర్ లిస్టులో లేకపోవడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది. -
బ్యాలెట్ బాక్సులను ఎడ్లబండ్లపై తరలించాము
దాదాపు 30 ఏళ్ల క్రితం చాలా గ్రామాలకు బ్యాలెట్ బాక్సులను ఎడ్ల బండ్లపై తరలించేవాళ్లం. పోలీసులు వాటివెంట నడుస్తూ రక్షణగా వచ్చేవారని రిటైర్డ్ తహసీల్దార్ చిన్నయ్య పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణ విషయంలో గతంలో ఎలాంటి పరిస్థితి ఉండేది.. నాటికి నేటికి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనే అంశాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. సుదీర్ఘకాలం పాటు రెవెన్యూ శాఖలో పనిచేసి నాలుగు పర్యాయాలు ఎన్నికల విధులు నిర్వహించిన ఆయన అనుభవాలు తన మాటల్లోనే.. సాక్షి,పరిగి: 1969లో రెవెన్యూ శాఖలో ఉద్యోగంలో చేరాను. నా మొదటి డూటీ ఎలక్షన్ ఎల్డీసీగా ప్రారంభించాను. అనంతరం తహసీల్దార్ హోదాలో అసిస్టెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా నాలుగు ఎన్నికల్లో పాలుపంచుకున్నాను. ఎన్నికల నిర్వహణ, సౌకర్యాలు, రవాణా తదితర అంశాల్లో అందే ఫిర్యాదులు ఇలా అనేక అంశాల్లో నాటితో పోలిస్తే నేడు చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. దాదాపు 30 ఏళ్ల క్రితం చాలా గ్రామాలకు జీపులాంటి వాహనాలు వెళ్లేందుకు రోడ్లు ఉండేవి కావు. దీంతో చాలా గ్రామాలకు బ్యాలెట్ బాక్సులను ఎడ్లబండ్లపై తరలించాల్సి వచ్చేది. పోలీసులు వాటికి కాపలాగా నడుచుకుంటూ వెనకాలే వచ్చేవారు. తడకలతో పోలింగ్ స్టేషన్లు .. చాలా గ్రామాల్లో పోలింగ్ బూతుల ఏర్పాటుకు గదులు కూడా ఉండేవి కాదు. స్కూల్ బిల్డింగుల్లో ఒకటో రెండో గదులు ఉండేవి. దీంతో తాత్కాలికంగా తడకలతో గదులను ఏర్పాటు చేసేవాళ్లం. రాత్రిళ్లు నిద్రించేందుకు కూడా సిబ్బందికి గదులు ఉండేవి కావు. ఇక మహిళా సిబ్బంది కష్టాలు అన్నీఇన్ని కావు. రాత్రంతా సిబ్బందికి జాగారమే.. ఇప్పుడు ఈవీఎంలు వచ్చాక పని విధానం చాలా సులభమైంది. వాటిని చెక్ చేసుకోవటానికి టెక్నికల్ పర్సన్లు కూడా ఉంటున్నారు. కాని అప్పట్లో ప్ర తి బ్యాలెట్ పేపర్‌ను చెక్ చేయాల్సి వచ్చేది. తప్పులు ఉన్న పేపర్లు ఏమైన ఉన్నా.. పేరు.. గుర్తులు ఏమైనా మారినా వాటిని ప్రత్యేకంగా లెక్క కట్టాల్సి వచ్చేది. వాటిపై ముందుగానే ముద్రలు వేసుకోవాల్సి వచ్చేది. దీంతో సిబ్బంది రాత్రిళ్లు నిద్ర కూడాపోయే వారు కాదు. మూడు రోజుల ముందే ఏర్పాట్లు అధికారులందరూ పోలింగ్‌కు మూడు రోజుల ముందే ఏర్పాట్ల కోసం గ్రామాల్లో శ్రమించాల్సి వచ్చేది. స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామాల్లోనే కౌంటింగ్ జరిగితే ఇంకా ఇబ్బందులు ఎదురయ్యేవి. ఓట్లు లెక్కింపునకు టేబుళ్లు కూడా దొరికేవి కాదు. ఒక్కోసారి టేబుళ్లు కూడా టౌన్ నుంచి తీసుకు వెళ్లాల్సి వచ్చేది. గ్రామాల్లో కుర్చీలు కూడా ఉండేవి కాదు. అప్పట్లో ఎన్నికల ఖర్చు బాగా తక్కువ అప్పట్లో ఎన్నికల నిర్వహణ ఖర్చు కూడా బాగా తక్కువగా ఉండేది. అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం రూ. 5–15 లక్షలలోపు ఉండేది. ఇప్పుడు రూ. 1–1.5 కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నారు. అప్పట్లో సిబ్బందికి ఇచ్చే టీఏ, డీఏలు కూడా బాగా తక్కువగా ఉండేది. ప్రలోభాలు లేవు ప్రస్తుతం ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే విషయంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. గతంలో డబ్బు, మద్యం పాత్ర చాలా తక్కువగా ఉండేది. డబ్బుల పంపిణీ, తరలింపు తదితర ఫిర్యాదులే వచ్చేవి కావు. గ్రామాల్లో కల్లు, అక్కడక్కడా గుడుంబా, సారా పంచుతున్నట్లు ఫిర్యాదులు వచ్చేవి. అప్పట్లో నాయకులు.. ఓట్లు వేయకుంటే మా పొలంలోంచి పశువులను వెళ్లనీయం. దారి మూసేస్తాం. టెనెన్సీ రద్దు చేయిస్తాం వంటి బెది రింపులకు పాల్పడేవాళ్లు. టెక్నాలజీ పెరగడంతో పని సులువు ప్రస్తుతం సాంకేతికత పెరగడంతో ఎన్నికల సిబ్బంది, ఉద్యోగులకు పని బాగా తగ్గింది. అప్పట్లో ఏది అవసరం ఉన్నా టైప్మిషన్పై క్లర్కులు రేసే కాగితాలపైనే ఆధారపడాల్సి వచ్చేది. రూట్ మ్యాప్‌లు కూడా గీసుకునే వాళ్లం. ఇప్పుడంతా కంప్యూటర్‌మయం. ప్రతి కార్యాలయంలో ప్రింటర్లు, జిరాక్స్ మిషన్లు అందుబాటులో ఉంటున్నాయని విశ్రాంత తహసీల్దార్ చిన్నయ్య ఎన్నికల నిర్వహణపై నాటి తన అనుభవాలను పంచుకున్నారు. -
ఖర్చు లేకుండా సర్పంచ్‌లయ్యారు
సాక్షిప్రతినిధి, కరీంనగర్: ఎందరో ప్రభుత్వ ఉన్నతోద్యోగులు కూడా పదవీ విరమణ తర్వాత ప్రజాప్రతినిధి కావాలని కోరుకుంటున్నారని, అలాంటిది గ్రామాల స్పెషల్ ఆఫీసర్లకు రూపాయి ఖర్చు లేకుండా సర్పంచ్ పదవి వరించిందని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. సర్పంచులుగా వ్యవహరించే అధికారం రావడం అధికారులకు ఇది గొప్ప అవకాశమని, ఇలాంటి అవకాశాలు అందరికీ రాదని అన్నారు. గ్రామాల స్పెషల్ ఆఫీసర్ల బాధ్యత గొప్ప కర్తవ్యంగా భావించి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. మంగళవారం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో గ్రామాల స్పెషల్ ఆఫీసర్లు, పంచాయతీ కార్యదర్శులు, మెడికల్ ఆఫీసర్లతో మంత్రి రాజేందర్ పారిశుధ్యం–ప్రజారోగ్యంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో అన్ని గ్రామాలలో విషజ్వరాలు ప్రబలుతున్నాయని, వాటిని నియంత్రించేందుకు పకడ్బందీగా పారిశుధ్య చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వర్షాకాలంలో గ్రామాలలో డెంగ్యూ, మలేరియా విషజ్వరాలు, అంటువ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని నిధులకు కొరత లేదని గ్రామాలలో మొదటిగా సమస్యను గుర్తించి పరిష్కారానికి చర్యలు గైకొనాలని అన్నారు. గ్రామాల పారిశుధ్యం, అభివృద్ధి పనుల్లో ప్రజలను భాగస్వామ్యులను చేయాలని.. అప్పుడే అనుకున్న ఫలితాలు సాధ్యమవుతాయని పేర్కొన్నారు. గ్రామాలలో చదువుకున్న యువతను గుర్తించి వారి సెల్ నెంబర్లు సేకరించి సమస్యలపై రోజూ మాట్లాడాలని మంత్రి సూచించారు. పనుల నిర్వహణలో ప్రజల సలహాలు, సూచనలు తీసుకోవాలని.. సమస్యలను ధర్మబద్ధంగా పరిష్కరించాలని అన్నారు. ఏళ్లుగా పూర్తికాని ప్రాజెక్టులను ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండేళ్లలో పూర్తి చేసి అనుసంధానం చేసుకున్నామని అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం రూ.600 కోట్లు మంజూరు చేసిందని, ప్రతీ నియోజకవర్గానికి రూ.70–80 కోట్లు వచ్చాయని మంత్రి తెలిపారు. గ్రామాలలో ప్రజలు ఇబ్బందులు పడకుండా ఎన్ని నిధులైనా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. పెద్ద గ్రామాలకు, మండలాల్లో దోమల నివారణకు ఫాగింగ్ మిషన్లు కొనుగోలు చేసి అందజేస్తామని తెలిపారు. స్పెషల్ ఆఫీసర్లు బాధ్యతాయుతంగా పనులు నిర్వహించాలని అన్నారు. జిల్లా పంచాయతీ అధికారి ప్రతిరోజూ గ్రామాలలో పారిశుధ్య చర్యలను పర్యవేక్షించాలని అధికారులకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించాలి గ్రామాల స్పెషల్ ఆఫీసర్లు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ తుల ఉమ అన్నారు. ప్రజల భాగస్వామ్యంతో గ్రామాల అభివృద్ధికి ప్రజలతో కలిసి పనిచేయాలని అన్నారు. గ్రామాలలో పరిసరాల పరిశుభ్రతపై ప్రజలను చైతన్యవంతులను చేయాలని సూచించారు. జిల్లాలో అన్ని గ్రామ పంచాయతీల స్పెషల్ ఆఫీసర్లు సంబంధిత అధికారులతో కలిసి వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పనుల వివరాలను ఎప్పటికప్పుడు ఆ గ్రూప్‌లో షేర్ చేసుకోవాలని అన్నారు. యుద్ధప్రాతిదికన మరుగుదొడ్లు.. లీకేజీలను నివారించండి జిల్లాలో టాయిలెట్లు లేని అన్ని పాఠశాలలకు, అంగన్వాడీ కేంద్రాలకు కొత్తగా టాయిలెట్లను మంజూరు చేశామని వాటిని వెంటనే పూర్తి చేయించాలని కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ అధికారులను ఆదేశించారు. మరమ్మతులున్న టాయిలెట్లను గ్రామపంచాయతీ నిధులతో వెంటనే పూర్తి చేయించాలని ఆదేశించారు. శిథిలావస్థలో ఉన్న తరగతి గదులను, టాయిలెట్లను వెంటనే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల ద్వారా వారం రోజుల్లో పూడ్చివేయాలని ఆదేశించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని.. రోడ్లపై నీరు నిలువ ఉండకుండా చూడాలని ఆదేశించారు. క్లోరినేషన్ చేసిన తాగునీటినే సరఫరా చేయాలని, పైపులైన్ల లీకేజీలను అరికట్టాలని ఆదేశించారు. గ్రామాలలో అపరిశుభ్ర పరిసరాలతో అంటువ్యాధులు, జ్వరాలు సోకితే సంబంధిత గ్రామపంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు. ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు మాట్లాడుతూ.. గ్రామాల ప్రత్యేక అధికారులు చిత్తశుద్ధితో పనులు చేసి కరీంనగర్ జిల్లాను వ్యాధుల రహిత జిల్లాగా మార్చాలని అన్నారు. ప్రజల్లో పారిశుధ్యంపై, హరితహారంపై చైతన్యం తేవాలని సూచించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. 2010లో జిల్లాలో డెంగ్యూతో ఎక్కువ మంది చనిపోయారని పేర్కొన్నారు. గ్రామాలలో పారిశుధ్య కార్మికుల సమ్మెతో పరిశుభ్రత లోపించిందని తెలిపారు. అన్ని గ్రామాలకు వెంటనే మెడికల్ బృందాలను పంపించాలని కోరారు. కరీంనగర్ నియోజకవర్గంలో ఆరు గ్రామాలకు లేరని, ఆ గ్రామాలకు అధికారులను నియమించి పారిశుధ్య చర్యలు చేపట్టాలని కోరారు. చొప్పదండి ఎమ్మెల్యే బొడిగె శోభ మాట్లాడుతూ.. అన్ని గ్రామాలలో వెంటనే గ్రామ సభలు నిర్వహించి సమస్యలను తెలుసుకోవాలని అన్నారు. ప్రత్యేకాధికారుల బాధ్యతను భారంగా కాకుండా బాధ్యతగా భావించాలన్నారు. మానకొండూర్ ఎమ్మెల్యే, సాంస్కృతిక సారథి రసమయి బాలకిషన్ మాట్లాడుతూ.. స్పెషల్ ఆఫీసర్లు పాత సర్పంచుల సహకారంతో పనులు చేయాలని అన్నారు. సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి నారాయణరావు, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుజాత, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ వెంకటేశ్వర్రావు, రెవెన్యూ డివిజనల్ అధికారి రాజాగౌడ్, జిల్లా పరిషత్ శిక్షణా మేనేజర్ సురేందర్, మండల అభివృద్ధి అధికారులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మెడికల్ ఆఫీసర్లు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రెవెన్యూ సంఘాల నిరసన
జగిత్యాల: నర్సంపేట జిల్లాలో ఎమ్మెల్యే మాధవరెడ్డి కలెక్టర్లు మస్కూరుల కంటే అధ్వానంగా పనిచేస్తున్నారని ఎద్దేవ చేస్తూ మాట్లాడడాన్ని నిరసిస్తూ తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం నాయకులు గురువారం కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. వారు మాట్లాడుతూ కలెక్టర్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జిల్లా ఎగ్జిక్యూటీవ్ మెజిస్ట్రేట్‌గా వ్యవహరిస్తున్న కలెక్టర్లపైనే అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని కోరారు. రెవెన్యూ ఉద్యోగుల సర్వీసుల సంఘం గౌరవ అధ్యక్షుడు హరి అశోక్‌కుమార్, ఎండీ.వకీల్, టీఎన్జీవోల అధ్యక్షుడు శశిధర్, కృష్ణ, మధుగౌడ్ పాల్గొన్నారు. -
రెవెన్యూలో అవినీతి కంపు
చేతులు తడిపితేనే పని కలకలం రేపుతున్న వరుస ఏసీబీ దాడులు హుజూరాబాద్ : రెవెన్యూశాఖలో అవినీతి కంపు కొడుతోంది. కొందరు అధికారులు ఆమ్యామ్యాల కోసం బరితెగిస్తున్నారు. చేతులు తడపనిదే రెవెన్యూశాఖలో ఫైళ్లు ముందుకు కదలడం లేదు. వేతనాలు ఊహించని స్థాయిలో ఉన్న అధికారుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఏ పని కావాలన్నా చేతులు తడిపితేనే చేస్తామని, లేకపోతే దిక్కున్న చోట చెప్పుకోండని బహిరంగంగానే అంటున్నారు. అధికారులు మితిమీరిన వ్యవహారంతో వేగలేక కొందరు ఏసీబీని ఆశ్రయిస్తున్నారు. మరికొందరు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఓ తహసీల్దార్‌తోపాటు మరో ఎనిమిది మందిపై కేసులు నమోదవడం, వరుస ఏసీబీ దాడులు కలకలం రేపుతున్నాయి. చేతులు తడపాల్సిందే ! రెవెన్యూశాఖలో ఏ పని కావాలన్నా చేతులు తడపాల్సిందేనని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక వేళ చెప్పినంత ఇవ్వకపోతే నెలలపాటు కార్యాలయాల చుట్టూ తిప్పించుకుంటున్నారు. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలిసినప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరించడం, బాధితులు చేసిన ఫిర్యాదును సదరు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారికే తిరిగి అప్పగించడం వంటి ఘటనలు చూస్తుంటే అవినీతిని ఉన్నతాధిరులే ప్రోత్సహిస్తున్నట్లుగా పలువురు అభిప్రాయపడుతున్నారు. హుజూరాబాద్ మండలం కందుగులకు చెందిన మండ సదయ్య తన 20 గుంటల వ్యవసాయ భూమిని మ్యుటేషన్ చేయాలని దరఖాస్తు చేసుకున్నాడు. ఈక్రమంలో వీఆర్వో రాజ్‌కుమార్, వీఆర్ఏ రవీందర్ రూ.8 వేలు లంచం డిమాండ్ చేశారు. ఈ విషయంలో సదయ్య సదరు ఇద్దరు అధికారులతో వాగ్వాదానికి దిగాడు. అయినా సదరు అధికారులు పని చేయలేదు. దీంతో సదయ్య మీసేవలో సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశాడు. వీఆర్వో, వీఆర్ఏలు డబ్బులు అడుగుతున్నారని తహసీల్దార్‌కు ఫిర్యాదు చేయగా.. రిజిస్టర్లో సదయ్య పేరును నమోదు చేయలేదు. ఈక్రమంలో ఏసీబీ అధికారులు తహసీల్దార్ తీరుపై సంజాయిషీ రాయించుకున్నారంటే పరిస్థిని అర్థం చేసుకోవచ్చు. సదయ్య తహసీల్దార్‌కు చేసిన ఫిర్యాదుపత్రం కూడా వీఆర్వో రాజ్‌కుమార్‌కు చేరింది. దీంతో డబ్బుల కోసం సదయ్యపై మరింత ఒత్తిడి పెరిగింది. దీంతో చేసేదేమిలేక ఏసీబీని ఆశ్రయించాడు. రూ.4 వేలు లంచం ఇస్తుండగా వల పన్ని వీఆర్వో రాజ్‌కుమార్, వీఆర్ఏ రవీందర్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కలకలం రేపుతున్న ఏసీబీ ఘటనలు హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలో ఏడాదిలో తొమ్మిది మందిపై కేసులు నమోదు కాగా, ఇటీవల వరుసగా ఏసీబీ దాడులు కలకలం రేపుతున్నాయి. – సెప్టెంబర్ 17, 2015లో కమలాపూర్ మండలం గుండేడు వీఆర్వో గుండా రమేశ్‌బాబు పహణీలో తప్పుగా ఉన్న పేర్ల సవరణ, పట్టాపాసు పుస్తకంలో భూమి వివరాల నమోదుకు రూ.13 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. – జూలై 21, 2016న జమ్మికుంట తహసీల్దార్‌గా పనిచేసిన మంకెన రజనీ, వీఆర్వో శ్రీనివాస్ పహణీలో పేరు మార్పు, ఓ రైతు తండ్రి భూమిని కుమారుడి పేరిట మార్చేందుకు డబ్బులు కోరడం, ఇసుక అక్రమ రవాణాదారుల నుంచి భారీగా లంచాలు తీసుకున్నారని ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు. అక్రమాలు జరిగినట్లు తేలడంతో కరీంనగర్లో అరెస్ట్ చేశారు. – జూలై 26, 2016న హుజూరాబాద్‌కు చెందిన చాయాదేవికి సంబంధించిన వ్యవసాయ భూమిని మరొకరిపై పేరు మార్పిడీ చేశారని పెద్దపాపయ్యపల్లి వీఆర్వో వేణు, మరికొందరిపై బాధితురాలు పోలీసులకు చేసిన ఫిర్యాదుతో విచారణలో తప్పు చేసినట్లు రుజువవడంతో వీఆర్వో వేణుతోపాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. – జూలై 30, 2016న హుజూరాబాద్ మండలంలోని కందుగులకు చెందిన మండ సదయ్య 20 గుంటల వ్యవసాయ భూమిని మ్యుటేషన్ చేయాలని దరఖాస్తు చేసుకున్నారు. వీఆర్వో రాజ్‌కుమార్, వీఆర్ఏ రవీందర్ రూ. 8వేలు లంచం డిమాండ్ చేశారు. అధికారుల తీరుతో విసుగుచెందిన సదయ్య ఏసీబీని ఆశ్రయించాడు. చివరకు రూ.4 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. అక్రమాస్తులపై ఏసీబీ ఆరా ఆదాయానికి మించి కొందరు ఉద్యోగులు ఆస్తులు కూడగట్టుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో ఏసీబీ అధికారులు అక్రమార్కుల ఆస్తులపై దృష్టిసారించినట్లు తెలిసింది. పలుశాఖల్లో పనిచేస్తోన్న కిందిస్థాయి ఉద్యోగులు సైతం రూ.కోట్లకు పడగలెత్తినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో వీరి ఆస్తులు, వాటి వివరాలను రాబట్టే దిశగా ఏసీబీ అధికారులు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా అవినీతికి మారుపేరుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రెవెన్యూ శాఖపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిసింది.